ప్రేక్షకులు మహారసోదధిలో మునకలిడుచున్నారు. ఎత్తిన కళ్లెత్తినట్లే ఉన్నవి. శిరసులానందంతో ఊగుచున్నవి. వారి శ్రవణములకు, నేత్రములకు, హృదయములకు ఆనాడు కళా సంతర్పణము ! రసానందమా నాట్యములో అమృతమై వాగులు కట్టినది. మనసు దోసెలలో జుఱ్ఱకొన్నారు. జన్మమెత్తినందులకీ నాట్యము చూచుటతో ధన్యులమైనామని గుండెలపై చేయివేసికొనిరి. కవి, పండిత, గాయక, శాస్త్రజ్ఞులొకే విధముగ భళీ యని మెచ్చుకొన్నారు. ప్రేక్షకుల హృదయ గహ్వరాలలో ఇంకనూ మంజీర శింజిత నాదాలు ప్రతిధ్వనిస్తూ ఉండగా నాట్యము మాస్తమయిన ఎఱుక ఎవరికిన్నీ కలుగలేదు.
ముందుగా తేరుకొన్నదతడే. అతడెప్పుడామెముందు నిలిచాడో ఎవరూ గ్రహించలేదు. అప్రయత్నముగా చేతులు మెడలోని హారమును తీయబోయినవి. చిత్రము ! ఆ హారమంతకుముందే ఆమె మెడలో మెరయుచున్నది. హృదయయాజ్ఞాపింపక ముందు కరములా పనిని చేసినవా ? లేక హృద్గత భావము మనసుకున్న ముందు దేహేంద్రియమునకు ద్యోతకమయ్యెనా ?
అతని తడబాటునకామె కనులలో కొంటినవ్వు తొణికిసలాడినది. ఆ అభినేత్రి పెదవులను మరింత బిగించి దరహాసము నాపుకొనుటతో అ వెడద కన్నులలో చిలిపినవ్వు పరవళ్ళు తొక్కుతూ మిలమిలలాడిపోయినది.
ఇచ్చుటకు సాచిన చేతులను ముడుచుటకు మనసొప్పక తన కరాంగుళి నలంకరించిన వజ్రపుటుంగరము నాయమ దక్షిణహస్తమున కలంకరించినాడు. ఉంగరము వదులుగానున్నది. కాని రాధామాధవ పుష్ప గుచ్ఛమువలె కోమలముగనున్న ఆమె చేయి వజ్రకాంతులతో ప్రకాశించినది. నాట్యమెంత బాగున్నదో, అతడు పెదవి విప్పి పలుకలేదు. కనులతోనే సర్వభావములు వెల్లడికాగా చిరునగవుతో సింహకిశోరములా, మదగజములా, ధీమంతముగా నడిచిపోయినాడు. ఎదురుగా గురుదేవులు ! ప్రభు ! మీరా ! స్వామీ, తమరా ! ఇరువురి కన్నులూ ఒక్కమారు పలుకరించుకొన్నవి. వినయముగా నమస్కరించి వెడలిపోయినాడు.
సింధుజాతి తెల్లగుర్రమాతని ప్రమేయము లేకనే సహ్యజా నదీ తీరమున నున్న చంపక వనమునకు గొనిపోయినది. చెంగమలవల్లి అమ్మవారికి ఈ వనము నుండి నిత్యము బుట్టలతో పూవులు వెడతాయి. పాలకుని పేరుతో అమ్మకి తొలి అర్చన జరిగాకే రాజగోపాల స్వామివారికి ఏ సేవ అయినా జరుగుతుంది. త్రయోదశి చంద్రుడు తరిపి వెన్నెలను గుప్పించుచుండగా చంద్రశిలా వితిర్దికపై అలవోకగా ఆసీనుడైనాడు. లోకమంతా వెన్నెలలో మునిగి తేలుతూ చల్లబడినా అతని యెద యేలనో నేడు చిరువెచ్చని నిట్టూర్పులను విడుస్తూన్నది.
ఈ అనుభవమేదియో క్రొత్త. ఇంతకు మున్నెన్నడిట్టి యనిశ్చితి తనకు కలుగలేదు. ఏదియో తపన ఏదియో కోరిక ! తెలసీ తెలియని స్థితిలో, రూపుగట్టని ఆకారముతో తనను బాధించుచున్నది.
ఇంతలో చక్కని సుగంధపరిమళం ! వెనువెంటనే ఆకుల గలగల ! తలవిప్పి చూడగా రెండు బారల తెలివన్నె త్రాచు ! దేవతా సర్పము ! చరచర ప్రాకుతూ పోయినది. దానివెంట మరియొకటి ! రెండును నదీతీరమున ఇసుకలో పొరలాడునున్నవి. ఒకదాని నొకటి ఆప్యాయముగ చుట్టుకొనుచు విడుచుకొనుచు, ఒకదాని వెనుకనొకటి గిరగిర తిరుగుచున్నవి. పౌర్ణమివరకీ సయ్యాట తప్పదు.
ప్రతిదినము తానక్కడ కూర్చుని రామనామజపము చేసినొనెడివాడు. నేడు మనసు తారకమంత్రముపై నిలచుటలేదు. మనోభిరామంగానున్న నాట్య భంగిమలే మననమునకు వచ్చుచున్నవి. పోనీ, అష్టాక్షరినైనా ఒక దండ చేతమనుకొనినాడు. అష్టపది యాతనిని పట్టి విడుచుటలేదు. గీతము నాదాత్మకము, వాద్యము నాదాత్మకము. ఈ రెంటినీ అనుసరించి అభినయించిన నృత్యం నాదాత్మకము ఈ మూడు నాదములను ఏకము చేసి తనలో మహానాదమును పుట్టించినదా బాలిక ! లేచి నిలబడినాడు. కొలది సేపు అశోక పున్నాగ వృక్షచ్ఛాయల అటునిటు నడచి, మరల అశ్వము నధిరోహించినాడు.
|