నిర్మాణములోనున్న నాటకశాలకడ ఆగి అశ్వము దిగి పరికించినాడు. నాటకశాల నిర్మాణము ఇంచుమించుగా పూర్తి అయినట్లే ! రంగస్థలము అర్థచంద్రాకృతిలో నుండగా, ప్రదర్శనము వేయిమందికి దృశ్యమాన మగునట్లు రెండువైపులా సమానంగాచ సుఖాసనములు అర్ధ వర్తులాకార ములోనున్నవి చిత్ర విచిత్ర కాంతులీనుటకు మణిమయ దీపగుచ్ఛములను వ్రేలాడదీయించినాడు. వాయుచలనమునకు ఆగుచ్ఛములు అటునిటు కదిలిరంగులీను వింతకాంతులను ప్రసరింపచేయునట్లు అమర్పించినాడు. రాణివాసపు స్త్రీలకు ప్రత్యేకమైన యమరిక ! రాబోవు దేవీనవరాత్రులలో ప్రదర్శనము ప్రారంభించుటకు గురుదేవులు గోవింద దీక్షితుల వారు సుముహూర్తము నిశ్చయించినారు. కుడ్యభాగమున చిత్రకారులు రామాయణ, భారత, భాగవత గాధలను సువర్ణరేఖలతో రూపుట్టించుచున్నారు.
మరల నాయువకునాశ్వేతాశ్వము మన్నారు కోవెలకు గొవిపోయినది. ఆలయ గోపురాగ్రమున నున్న సుదర్శన చక్రముమీద మెరిసిన శశికళా కాంతులు పొన్నచెట్టు నీడన కూర్చుని ఉన్న ఆ యువకుని కన్నులలో ప్రతిబింబించినది. ఆలయము దాటి వచ్చుచున్నపుడాతనిని మువ్వురు సేవకులు సంభ్రమముతో చుట్టుముట్టి, జయము, జయము, అచ్యుతేంద్ర రఘునాధనాయకులవారికి అని ముక్త కంఠంతో పలికి, ప్రక్కకు తిరిగి నిలిచిరాయెను. అతడు వారివైపు ప్రశ్నార్ధకముగ చూచినాడు.
సేవకుడు : ప్రభూ ! తమ కొఱకు రెండు ఘడియలనుండి చూచుచున్నాము. ఉద్యానవనంలోనూ, సరస్వతీ నిలయంలోనూ వెదికాము. బృహదీశ్వరాలయములో తమరు కన్పించినారని తెలిసి అక్కడకు వెళ్ళాము. ఇప్పుడు మేము నాట్యశాలకు పోతూ ఉండగా తమ దర్శనమైనది.
రఘునాథుడు : చాలా శ్రమపడినట్లున్నారు. ఇంతకూ నన్నెందుకు వెదుకుతున్నారో ?
సేవ : మహారాజు, శ్రీశ్రీశ్రీ చిన చెవ్వయాచ్యుత నాయనిం వారున్నూ, అమాత్యులు శ్రీ గోవింద దీక్షితుల వారున్నూ తమను ఉన్నపాటున తోడ్కొని రమ్మని సెలవిచ్చినారు. మేమేకాదు, మరి నల్గురు భటులు కూడా తమరి నన్వేషిస్తూ వెళ్ళినారు ప్రభూ !
రఘునాధుడు నొచ్చుకున్నాడు. దోషమంతా నాదే. తండ్రిగారికి నేను ఎక్కడికి వెడుతున్నదీ చెప్పకుండానే వచ్చాను. అక్కడేదో సంరంభంగా ఉంటే చూచిపోదామని బృహదీశ్వరాలయంలోకి వెళ్ళాను. ఈనాడొక మహత్తరమైన దినం.
సేవ : చిత్తం, గురువుగారు కూడా అలాగే సెలవిచ్చారు. రఘునాధ నాయకుడు తన అశ్వాన్ని నగర వీధులగుండా రాజప్రాసాదానికి దౌడు తీయించినాడు.
రఘునాధునకు గోవిందామాత్యులిటీవల తనను హెచ్చరిస్తూ అన్నమాటలు గుర్తునకు వచ్చినవి.
నాయకమణీ ! భగవదేచ్చవల్ల మీకు సంగీత, సాహిత్య, నాట్య విద్యలలోని రహస్యములన్నింటినీ నేర్పించినాను. లలిత కళలలో ఏలిన వారిని మించినవారు లేరని పండితులూ, ప్రజలూ తమను అనేక విధాలుగా కీర్తిస్తూ ఉన్నారు. మీ గురువునై నందుకుగాను నాకున్నూ ఆనందంగానే ఉన్నది. కానీ...
రఘు : సంశయింపక ఆజ్ఞాపించండి, గురుదేవా :
గోవింద : బాబూ ! నీవు ఎన్నో విద్యలను అగ్రశ్రేణిలో ఆకళింపు చేసుకున్నావు. మహామహీభారము వహించుటకు నీ భుజముల సర్వసమర్ధములైనాయి. అశ్వ యుద్ధము గజయుద్ధములందు, వ్యూహములను పన్నుటలోనూ నిన్ను మించినవారు లేరు. శతఘ్నులను ప్రయోగించుటలో నీవు అతి ప్రవీణుడవు.
రఘు : చిత్తం !
గోవింద : సముద్రతరణ సమయమున నీది మహామీన వేగము, ఎంతటి భయంకర యుద్ధములోనై నను తలపూవు వాడకుండ, ఒడలు కసిగందకుండ శత్రు విమర్దనము చేసి రాగల సమర్దుడవు. ఇలాగ కేవలము నీ సుగుణాలను పొగడడానికి చెప్పటలేదు రాజకుమారా ! నీవు మాత్రము నీ రాజసమును విస్మరించి అటు నాట్యశాలలోనో, ఇటు సంగీత సభలలోనో, సాహిత్య గోష్ఠులలోనో శిష్యులకు పాఠాలు చెప్పుటలోనో నిమగ్నమవుతూ ఉన్నావని, మహారాజు శ్రీ అచ్యుతనాయనింవారు చింతించుచున్నారు.
రఘునాధుడు కలకల నవ్వినాడు. గురుదేవా ! రాజ్యము పరమ ప్రశాంతముగా నున్నప్పుడు మాత్రమే కళాదేవి ఉచ్ఛస్థితినందగలదనీ ఆ మహాదేవీ మహొన్నత స్థానమున పునరాసీనను గావించుట మర నాయక రాజుల వలననే కావలెననీ మీరె చెప్పారుగాదా తండ్రీ !
గోవింద : అవునవును. అది నేను కాదనటంలేదున. మహారాజులు వృద్దులగుచున్నారు. వారి భుజస్కంధములపై నున్న ధర్మాధిపత్య, రాజ్యాధిపత్య బాధ్యతను నీవు స్వీకరించవలసిన తరుణము వచ్చుచున్నది కదా, నాయనా !
రఘునాథుడు లజ్జపడినాడు. నిన్న గురుదేవులు మందలించినారు, నేడు మరల తానేమి చేసినాడు ? బృహదీశ్వరాలయమున నాట్యము చూచుచుమై మరిచినాడు. మరల నా బాలిక స్మృత్యంతరమున మెరిసినది. ఆమె యెవ్వరో గురుదేవులకు తెలియకుండా నుండదు.
****
|