ఉదయార్ద్రారుణ ప్రాగ్దిశా వదన దివ్యుండై తులుష్కాంధకా
రదకుస్రోజ్వల మూర్తియై యజన సంరక్షా త్మకుండైన ప
ద్మ దళాక్షుండు కిశోరమూర్తి రఘురామ శ్రీ ప్రభున్ బోలి దు
ష్ఠ దరా విక్రముడయ్యె అచ్యుత రఘు క్ష్మా పాల చంద్రుండటన్.
రఘునాథ ప్రభువు, ధన్య, ధన్య అని సంతోషంతో లేచి తన మెడలోని హారము తన పట్టపు యువరాఱి మెడలో వేశారు. రామభద్రాంబ లక్ష్మీదేవులు, అద్భుతము అని లేచి వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించారు. అప్పుడు సంతోషం మోముకు ఇంకా అందం వరమీయగా కళావతీదేవి పంచమరాగ మాలాపించి,
త్రిదశ కోటి ప్రశస్త త్రిబువనాభయ హస్త
త్రిపుర సంహారియౌ దేవుబోలి
కంబమ్ము పుట్టి కనక వశ్యపు జీల్చి
అసుర డింభకు బ్రోచు హరిని బోలి
నరకాసురు నణంచి సురనాధుక్షించు
పద్మాక్షు శ్రీకృష్ణ ప్రభుని బోలి
కాలకేయాది రాక్షస సంహారణ ధన్వి
దివ్య సుందరుడు కౌంతేయుబోటి
అచ్యుత రఘునాధ ప్రభువు యవనమూక
మక్కడంచి నాశమొనర్చి యోజనిల్చె
ఆంధ్ర సార్వభౌము సహాయమడిగి, జింజి
ప్రభుని చెరవీడ్చి లక్ష్మి నుద్వాహమయ్యె
రఘునాథ నాయకుడు కళావతీదేవి పద్యాలు ఎంతో మెచ్చుకొని తక్కినవి కూడా చదవమన్నాడు. ఆమె సిగ్గుపడి, ప్రభూ ! ఈ దినానికి నన్ను క్షమించండి. మళ్ళీ ఇంకోసారి, ఒక ఆశ్వాసమైనా కాగానే తమకూ మా చెల్లెళ్ళకూ వినిపిస్తాను, అన్నది.
ఆ వెనుక చెంగల్వకళాకవి శిష్యురాలు రామభద్రాంబ తాను రచించే రఘునాధాభ్యుదయ కావ్యంలో నుండి ఇంకా కొన్ని శ్లోకాలు.
శబ్దార్ధ యోర్మర్మ సమప్రధానం
దశం వదం యస్యవదంతి సర్వే
కృతీస ఏ వాత్ర కృతౌ సహాయో
నాధోమమ శ్రీ రఘునాధనేతా
తుండీర విభుడైన కృష్ణభూపతిని పెనుగొండలో చక్రవర్తి వేంకట పతిరాయలు కారాగారంలో ఉంచినారు. మధుర నాయకులకు సామంతుడైన పాండ్యడొకడు ఆంధ్ర చక్రవర్తికి కప్పంగట్టడం మాని వేసినాడు. అతనితో పాటు మధుర నాయకుడైన వీరప్ప నాయకుడు తిరుగుబాటు చేసినాడు. ఆ రాజద్రోహులకు జింజి కృష్ణమనాయకుడు సహాయం చేసినాడు. చక్రవర్తి వేంకటపతి రాయలుంవారు, తంజావూరు అచ్యుత రఘునాథ నాయనింవారు సైన్యంతో సహాయం రా, రాజద్రోహుల మీదకు సైన్యాలు తర్లించుకుపోయి వారినందరిని ఓడించినారు. మధుర వీరప్ప చక్రవర్తి పాదాలబడి క్షమార్పణ వేడినాడు. పాండ్యుడు నాశనమైనాడు. జింజి కృష్ణప్పను చక్రవర్తి చివాట్లు పెట్టివ పెద్ద మొత్తం అపరాధం చెల్లించుకొనమని వదలివేసిరి. జింజి కృష్ణప్ప నాయకుడు దుర్మార్గుడు. ఉషాదేవి తండ్రి బాణాసురునిలా, మాయా (రతి) తండ్రి శంబరాసురునిలా, ఆంధ్ర సామ్రాజ్య నాశనానికి కుట్రలు పన్నుతోనే వుండినాడు. చివరకు ఇంతకు పూర్వము ఒక్క సంవత్సరం క్రితం గోలుకొండ తురుష్కులతో కుట్రలు పన్నితే వేంకటపతి రాయులుంవారు సైన్యాలన్నీ సమకూర్చుకొని జింజి మీదకుపోయి, కృష్ణప్పనాయని ఓడించి ఆయన్ను బందిచేసి పెనుకొండలో రాజబంధు కారాగారమందు ఉంచినారు.
రఘునాథ ప్రభువు తురుష్కులను ఓడించి పెనుగొండకు వేంచేసినప్పుడు చక్రవర్తినికోరి జింజి ప్రభువును బంధ విముక్తుణ్ణి చేసినారు. ఆ విషయాన్ని రామభద్రాంబదేవి శ్లోకాలుగా రచించి గానం చేసినది. రఘునాధ నాయకులు తన రాణులిరువురు తుండీర రాకుమారికా వివాహం వర్ణించడం ఆ బాలిక హృదయం రంజించడానికనీ, ఆ వివాహం తమకెంతో ఆనందదాయకమని తెలియజేయడానికనీ గ్రహించి హృదయంలో కరిగిపోయినాడు.
రఘునాథుడు కళావతీదేవి వీణ అందుకొని, మేళము మార్చి శ్రుతి సరిచూచుకొన్నాడు. ఆ ప్రభువు కంఠము ఎంతో మధురమూ, గంభీరమూ, మందరస్థాయీ పూర్ణము. |