శ్రీ వైదేహీ యురోజ పూర్ణకలశీ శృంగంబులం బల్లవ
శ్రీ విన్యాసము జూపు హస్తములచే బ్రేమం బ్రకామంబుగా
శ్రీ విద్యల్ నత్‌కోటి కాన్చువల రాజీ వాక్షు డిక్ష్యాకు వం
శా విర్భూత మనర్ఘ రత్నము మదదీయభీష్టముల్ సేయుతన్.
చెప్పగవలె కప్పురములు
గుప్పలుగా బోసినట్లు గుంకుమ పైపై
గుప్పిన క్రియ విరిపుటమును
విప్పినగతి మున్మునం గవిత్వము సుబులన్
ఈరెండు పద్యాలు రఘునాథ ప్రభువు తన చిన్నవాడు, పదహారవ యేట, రచించినవి.
రఘునాథ ప్రభువు తాను చిన్నవాడు రచించిన పద్యాలు విని తన రాణులు ఆనందపూర్ణ హృదయాలై వికసించి మోములతో తనకడకు వచ్చిపాదాలకు నమస్కరించడం చూచి ముగ్గురినీ తన ప్రక్కనే కూర్చుండబెట్టుకొన్నారు.
మీరు ముగ్గురూ వినండి ! ఆ ఈడుకి మించిన కవిత్వమే అది. కాని అది చిన్నవాటి కవిత్వమే ! అని రఘునాథ ప్రభువు చిరునవ్వుతో పలికినారు. ఆ ముగ్గురు బాలికలకు ఆనందము వర్ణనాతీతమైనది. లక్ష్మి తన భాగ్యము శ్రీమన్నారాయణుని హృదయం అలంకరించిన లక్ష్మి భాగ్యంకన్నమిన్న అనుకుంది.
రఘునాథ నాయకుడు లక్ష్మిని చూచి, దేవీ ! నీ వంతు వచ్చినది. ఒక గీతమో, పద్యమో గానంచేయి. నీగొంతును బట్టి నేను శ్రుతిని పెట్టుతాను ఏ రాగం ఆలపిస్తావు ? అని మందహాస వదనంతో అన్నాడు.
లక్ష్మిదేవి తల వంచుకొనే, తోడిరాగంలో పాడుతాను ప్రభూ ! అన్నది.
రామభద్రాదేవీ ! తోడిరాగానికి మేళం సవరించు అని రఘునాధుడు ఆమె భుజంపె చేయివైచి ఆడిస్తూ తోడిరాగాననే పలికినాడు.
రామభద్రాంబ వెంటనే లేచి వీణ ఉన్న పీఠంకడకు పోయి , తోడి రాగానికి సరిపోయే మేశం సరిచేసి వచ్చి, ఇంకో పీఠంపై కూర్చున్నది.
రామభద్రా ! నువ్వు మేళం సవరించడంలో నైపుణ్యం బాగా చూపిస్తావు. ఇంత త్వరగా ఎలా సవరిస్తావు, దేవీ ! అయినా ఇకమీదట రాగానికీ రాగానికీ మేళం మార్చకుండా ఉండేలాగున ఒక కొత్త వీణను సృష్టించడానికి ప్రయత్నము చేస్తున్నాను.
నిజమా, ప్రభూ ! ఎంత మంచివార్త ! ఆ వీణవెలుగులోనికెప్పడు వస్తుంది ? అని అడిగినది కళావతీదేవి.
అతి త్వరలో ! వేంకటమఖి తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఊ ! లక్ష్మి ! నీవు మొదలుపెట్టవచ్చు - చిరునవ్వుతో అన్నాడు.
లక్ష్మి సిగ్గుతో, చిరునవ్వుతో, భర్తకడమంచి లేచి వెళ్ళి వీణ ఉన్న పీఠ మంచముమీద కూర్చుండి, వీణాతుంభీ ఫలము వామాంభోరువుపై అమరించి, దీర్ఘ నీల పక్ష్మాంచలాలు కొంచెం కొంచెం ఎత్తి, నాధుని సపత్నులను గమనిస్తూ శ్రుతి సరిచేసుకొన్నది. అస్పష్టంగా, తనకే వినబడనట్లుగా,
ఎంతిటివాడే రఘువరుడూ
కైకకు పంతము తీరగ వెడలెనడవికీ ఎంతటివాడే...
వీడెను రతనపు తొడవులు
వీడెదుకూలాంబరములు
చేడియసీతయు, తమ్ముడు
కూడినడువ దండకాభి ముఖుడాయె ఎంతటివాడే...
జడలను తాల్చిరి వారలు
నడకల ఎండకు వానకు
గొడుగులు లేకే సాగిరి ఎంతటివాడే...
పాట సాగినకొలదీ కంఠము దృడత్వము పొంది మాధుర్యం వాకలు కట్టి పతనాల, సుడుల, వడుల రఘునాధప్రభునీ లక్ష్మి సపత్నులనూ ముంచెత్తింది, ఆ మువ్వురకూ కలిగిన ఆనందము ఆ గాంధర్వ ఝురితో కలిసి ప్రయాగ అయిపోయింది. రఘునాథుడు లేచి తన మెడలోని పచ్చలహారం ఆమె మెళ్ళో వేశాడు. కళావతీదేవి ముత్యాలహారమూ, రామభద్రాంబ నవరత్న హారమూ బహుమతులు పొందే ఉన్నారు. ఆ నులువూరు పరమరసా నంద మత్తతతో పదిలిప్తల కాలం మాటాడక అలా ఉండిపోయినారు. |