అమ్మాయి కంఠం చూడండి !
మూర్తప్పనాయనింవారు, సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు మోమున వెన్నెలలు కాయ తలవాల్చి బంగారు పళ్లెరాన భోజనం చేసే కొమరితను చూచినారు. ఆమె కంఠాన ఒక పురుష మౌక్తికాహారం మెరుములీని పోవుచున్నది. ఆ హారమును మూర్తెప్పనాయక ప్రభువు ఎరుగును. తాను మేనల్లునికి ఉపసేనాపతిగా ఆంధ్ర సార్వభౌమునికి సహాయంగా వెళ్ళి ఉన్నాడు. తురుష్కులను ఓడించి పెనుగొండ నగర సంరక్షకుడైనప్పుడు చక్రవర్తి వారికి వెలలేని హారాలను బహుమానాలుగా ఇచ్చినారు. తన మెడలోని నాయక మౌక్తిక హారాన్ని చక్రవర్తి వేంకటపతిరాయ సార్వభౌములు రఘునాధ ప్రభువు మెడలో అలంకరించినారు. ఆ హారమే ప్రభువు తన కొమరితకు బహుమానమిచ్చినారు. మూర్తెప్పనాయనింవారి హృదయంమెందుకో ఉప్పొంగిపోయినది.
ఓహొ ! అది చక్రవర్తి కంఠాన నాయక మౌక్తిక మహాహారం ! అది రఘునాథప్రభుని కంఠాన చక్రవర్తులు స్వయంగా అలంకరించారు !
రఘునాధ నాయనింవారు స్వయంగా అమ్మాయి మెడలో వేసినారట !
స్వయంగానే !
తమ గురువు మహామంత్రి సమ్ముఖంలో ఈ పరీక్ష జరిగినదట. ఆ వెంటనే ఈ హారం బహుమాన మిచ్చినారట.
ఆయనకెంతో ఆనందం కలిగి ఉండాలి. లేకపోతే నాయకహారం ఎవరు ఇస్తారు.
అదీగాక ఈ సాయంకాలం యువరాజులంవారు అమ్మాయి సంగీతమూ, నాట్యమూ తామే పరీక్షిస్తారట.
అలాగా ! ఈ సాయంకాలమూ శుభకాలమే ! ఈ దినం అమ్మాయికి శుభతార సరీగా కుదరడమూ అదృష్టమే !
ఆ విషయం మహామంత్రుల వారికి తెలియును, ప్రభూ !
తప్పక ! ఆ ఆగతానాగత వేదిసర్వవిషయాలూ అద్భుతంగా గ్రహిస్తారు.
భోజనాలు కాగానే తాంబూల సభలో తన ప్రాణప్రియ మరకతవల్లి అందిచ్చు తాంబూలం వేసుకుంటూ, కొమరిత చెంచులక్ష్మిని తన కడకు రమ్మని పరిచారిక నొకర్తెను పంపినాడుమూర్తెప్ప ప్రభువు. అక్కడకు చెంచులక్ష్మి మహావేగంతో పరుగిడి వచ్చింది.
నాన్నగారూ ! ఎందుకు రమ్మన్నారు ?
ఈలారా, తల్లీ !
మూర్తెప్ప నాయనింవారు కొమరితను తన చెంత కూర్చుండబెట్టుకొన్నాడు. ఆమె ముంగురులు దువ్వుతూ, అమ్మడూ ! ప్రభువు తన నాయకహారాన్ని స్వయంగా నీకు మెళ్లో వేశారటనే ! దాని పరమార్థం ఎదుగుదువా ?
నేను -
చెప్పు తల్లీ, సిగ్గుపడతావేమిటి? అని మరకతవల్లి కొమరితకు ధైర్యమిచ్చింది.
పోనీలే, దేవీ ! నా హృదయం మన కన్నతల్లి గ్రహించింది ఈ సాయంకాలం పరీక్షల్లో ఏమీ భయపడక, ఔచిత్యం మీరక, నీ ప్రతిభ అంతా మహొత్తమంగా చూపించు అని మూరెప్ప నాయనింవారు కొమరితను హృదయానికి అదుముకొని, ఆమె నుదురు బుగ్గలు ముద్దులుగొని పంపివేసినాడు.
చెంచులక్ష్మి హృదయంలో తన తండ్రి భగవంతుని అవతారమనే ఎప్పుడూ పూజించుకుంటుంది. ఉద్వాహమైన భార్యకు పుట్టిన బిడ్డలపై తండ్రులు చూపే ప్రేమకన్న మూర్తెప్ప నాయనికి చెంచులక్ష్మి అంటే అవదిలేని ప్రేమ, తన కులదైవమైన నరసింహదేవుని ప్రియురాలు చెంచీత. ఆ దేవినే తన హృదయానకు ఆభరణం చేసుకొన్నాడా అడవులస్వామి.
మరకతవల్లి అందము అపురూపము. వారి వంశంలో ఈలాంటి విదుషీమణులూ, ఈలాంటి శృంగార రసాధి దేవతలు లేనేలేరు. ఆమెకు తన సర్వస్వము నివేదన అర్పించి, తన కులంలో తన తోటి ప్రభువుల బాలికలలో భార్యను ఎన్నుకోక, మూర్తెప్ప నాయకుడు మరకతవల్లిని తన ప్రేమ మహా సముద్రంలో లయం చేసుకొన్నాడు. ఆనాటి నుండి ఇతర బాలలను కన్నెత్తి చూడలేద కులాచారంగా మూర్తెప్ప ప్రభువు మరకతవల్లిని ప్రాణిగ్రహణ మహోత్సవం జరిపి, పరిగ్రహించాడు. |