42
 

ప‌దునైదేండ్ల ముగ్ధ‌, సౌంద‌ర్య పుంజ‌ము, కోటిమ‌ల్లె మందారాల ప్రోవై త‌న అంక‌మందు శృంగార భావ పారిభద్రపుష్ప‌మై ఒదిగిపోయినప్పుడు, మూర్తెప్ప త‌న త‌ప‌స్సు ఫ‌ల‌ము ఏ దివ్యఋషికి సంభ‌వించిన‌ది అని అనుకొన్నాడు. ఆ బాలిక‌ను చ‌దువుల అభ్యాస‌ము మాన్పింప‌లేదు. ఒక్క నిమేషము వ‌దిలి ఉండ‌లేదు. అత‌డు యుద్ధ‌యాత్ర‌ల‌కు బావ‌గార‌యిన అచ్యుత నాయనింవారితో వెళ్ళ‌వ‌ల‌సి వ‌చ్చినప్పుడు త‌న ఆత్మేశ్వ‌రి మ‌ర‌క‌త‌వ‌ల్లి కూడా రావ‌ల‌ప‌సిన‌దే.

భ‌ర్త‌భార్య‌ను ఎట్లు ప్రేమించి వివాహం చేసుకొన్నాడో అలాగే మూర్తెప్ప నాయ‌నింవారిని మ‌ర‌క‌త‌వ‌ల్లీ ప్రేమించింది. రాజ‌వేశ్యా కుటుంబాల‌లోని వేశ్య‌లు ఒక భ‌ర్త‌పోయిన ఇంకొక భ‌ర్త‌నుగాని, ఒకే స‌మ‌యంలో ఇరువురు మువ్వురు పురుషుల‌తో సంబంధ‌ముగాని, అంగీక‌రించ‌రు. వారిలో అట్టి ఆచార‌ము లేదు. కుల‌ము వేశ్యా కుల‌ముగాని ఆచారాల‌న్నీ రాజ‌కులాచారాలే. వారు కుల‌స్త్రీల‌లా వైధ‌వ్య‌మ‌న్నా అనుభ‌విస్తారు లేక స‌మ‌గ‌మ‌న‌మ‌న్నా చేస్తారు. ప్రేమించి వారి ఆచారం ప్ర‌కారం పెళ్ళి చేసుకుంటారు. లేదూ, రాజ‌వ్య‌వ‌హారాల‌తో వారు పెళ్ళికి అంగీక‌రిస్తారు. ఏదైనా, ఉత్త‌మ కుల స్త్రీల ఆచారాలేవారి అచారాలున్నూ. ఉత్త‌మ రాజ‌కుటుంబ స్త్రీల‌కు జ‌రిగే మ‌ర్యాద‌లూ వారికీ జ‌రుగుతాయి.

మ‌ర‌క‌త‌వ‌ల్లి త‌న భ‌ర‌త‌నాత్య ప్ర‌జ్ఞ భ‌ర్త‌కు మాత్ర‌మే ప్ర‌ద‌ర్శిస్తుంది. భ‌ర్త‌కై ఆమె దివ్య గాంధ‌ర్వ‌బాణి, భ‌ర్త‌కై ఆమె కావ్య‌ర‌చ‌నా ప్ర‌తిభా. ఆమె మూర్తెప్ప నాయనింవారిని వివాహ‌మైన రెండేండ్ల‌కు చెంచుల‌క్ష్మి క‌డుపున ప‌డింది. మూర్తెప్ప నాయ‌కుడు చేయించిన గాజులు తొడిగించువేడుక‌, పూవులు ముడిపించు ఉత్స‌వ‌ము, కిరీటాలు ధ‌రించిన రాజుల భార్య‌ల‌కే జ‌రుగ‌లేదు.

చెంచుల‌క్ష్మి ఉద్భ‌వించేలోపుల‌న మ‌ర‌క‌త‌వ‌ల్లికి ఎన్నియోసారులు జ‌బ్బులు చేసిన‌వి. పురుడు అతిక‌ష్ట‌మౌన‌ట్లుంది. ద‌క్షిణ‌ప‌ధంలోని ప్ర‌సిద్ధ వైద్యులంద‌రూ మూర్తెప్ప నాయ‌నింవారి ప్రాపాదాల‌లో విడిదిచేసి ఉండిరి.

మ‌ల‌బారు వైద్య ప్ర‌సిద్ధ అయిన ఒక నాయ‌రు వృద్ధ ప్ర‌సిద్ధికెక్కిన ఒక థార్వాడు కుటుంబ‌పు పెద్ద‌, రోహిణీ తిరునాళ్ళు వ‌చ్చి దివ్య ఔష‌దులు సేవింప‌జేసి. అమృత తైలాల‌తో లేప‌నం చేయించి, వైద్యం చేసింది. మ‌ర‌త‌క‌వ‌ల్లికి మంత్రించిన‌ట్లు, శాప‌ము తీరిన‌ట్లు, ఆ గ‌ర్భ‌దోషరోగ‌ము మాయ‌మైన‌ది. ప‌ది దినాల‌లో అమితారోగ్య‌ము పొంది, ప‌ద‌వ‌నెల వ‌చ్చిన ప‌దునొకండ‌వ దినాన శుభ‌ల‌గ్న‌మందు మ‌ర‌క‌త‌వ‌ల్లి బాలిక‌ను క‌న్న‌ది. మూర్తెప్ప నాయ‌నింవారు చోళ‌రాజ్యం అంతా ఉత్స‌వాలు చేయించినారు. త‌న కుల‌దైవ‌ము న‌ర‌సింహుని ప్రియురాలు చెంచుల‌క్ష్మి పేరు ఆమెకు పెట్టుకొన్నారు.

****

శుక‌వాణి త‌న విద్యామందిరంలోనికిపోయి స‌ర్వ‌దేవ‌త‌ల‌నూ ప్రార్ధించుకొన్న‌ది.
గురువుగారి మ‌హాస‌ద‌నం నుండి రాగానే కాళ్ళు క‌డుగుకొనివ‌చ్చి, త‌న వీణ‌కు పూజ చేసుకొని, అప్ప‌టిక‌ప్పుడు అశువుగా,
వీణామ తల్లికా !
సామ‌
గానామృత వ‌ల్లికా !
అంజ‌లిడి గొల్తునా
అంక‌మున దాల్తునా!
వీణామ తల్లికా !
సామ
గాన‌మృత వ‌ల్లికా !
మెట్లు స‌వ‌రించ‌ప‌గా
మేళ‌దేవ‌లె తోచె
మీట‌ల స్పృసింప‌గా
మేలు శృతి ఉద‌యించె
వీణామ తల్లికా !
సామ‌
గానామృత వ‌ల్లికా !
దేవి నీ వాణిలో
పూవు తేనెలు కురిసె
కావ‌వే నా వాణి
కాక‌లీ స్వ‌ర‌కంఠి
వీణామ తల్లికా !
సామ‌
గాన‌మృత వ‌ల్లికా ! అని పాడుకున్న‌ది.