43
 

భోజ‌నం చేసి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌రిచారిక‌ల‌తో త‌న నాట్య వేషాలంకారాలు దుకూల వ‌స్త్రాలు, బంగారు గ‌జ్జెల స‌రి చూపించుకొన్న‌ది. త‌న పెత్త‌ల్లి కూతురు న‌గ‌రాజ‌కుమారిని స‌రియైన అలంకారాదులు స‌రి చూడ‌డానికి ర‌మ్మ‌న‌మ‌ని న‌గ‌రాజ‌కుమారి దేవిడీకి శిబిక పంపిన‌ది. రెండు ఘ‌డియ‌ల‌లో ఆ బాలిక ప‌రుగిడి వ‌చ్చిన‌ది.

చెంచుల‌క్ష్మి : న‌వ్వు ద‌గ్గిరే ఉండాలి సుమా !

న‌గ‌రాజ‌కుమారి : నేను ఉండ‌టం బాగుండ‌దు. యువ‌రాజుల‌వార‌యితే మాత్రం నువ్వు సిగ్గుప‌డాలి.

నువ్వానా ద‌గ్గ‌ర ఉంటే వేయిమంది ఎదుట‌నైనా నాట్యం చేయ‌గ‌ల‌ను.

నేను దగ్గ‌ర ఉన్నా యువ‌రాజుగారి ఎదుట నాట్యం చేయ‌గ‌ల‌వుటే ?

ఆ !

ఏమో నాకు అనుమాన‌మే !

ఎందుక‌మ్మా ఆ అనుమానం ?

నీకు తెలుసును. .. నీ హృద‌యానికి తెలుసును !

నీకు తెలియ‌కుండా ఈ ముక్క‌లెలా అన‌గ‌లిగావు ?

నాకు పూర్తిగా తెలుస్తే నీకు చెప్ప‌నా అంట ?

స‌గం తెలిసిందా ? నీ అనుమానం నాకు తెలియ‌ప‌ర్చ‌కూడ‌ద‌టే ?

అనుమానాలు ఎవ్వ‌రికీ చెప్ప‌కూడ‌దు. అందులో తాను చెప్ప‌ద‌ల‌చుకున్న వారి విష‌యంలో అనుమాన‌మైతే మ‌రీ చెప్ప‌గూడ‌దు.

ఇద్ద‌రూ ప‌క‌ప‌క న‌వ్వుకున్నారు. ప‌రిచారిక‌ల‌కు వీరిద్ద‌రూ ఎందుకుగాను న‌వ్వుకుంటున్నారో అర్ధం కాలేదు.

చెంచుల‌క్ష్మి గాన‌స‌భావేషం పూర్తిగా వేసుకొని అద్దంలో చూసుకొని సిగ్గుప‌డి వేషం జాగ్ర‌త్త చేయించిన‌ది. సాయంకాల‌ము ఎప్పుడ‌గునో, దీపాలు పెట్ట‌గ‌నే సాయంకాల‌పు పూజ‌పూర్తి చేసుకొని, స్యంద‌న‌మెక్కి గురువుగారి న‌గరికి పోవాలి అని అనుకున్న‌ది. న‌గ‌రాజ‌కుమారి చెంచుల‌క్ష్మిని వేళాకోళాం చేస్తూ, ఏవో గ‌మ్మ‌త్తు మాట‌లు చెపుతూ, దేశంలో అనేక మందిని అనుక‌రిస్తూ ఆమెకు న‌వ్వు తెప్పించింది. ఎంతో ఉత్సాహం క‌లుగ‌జేసింది. కాలం నెమ్మ‌దిగా లిప్త‌లు, విఘ‌డియ‌లు, ఘ‌డియ‌లు, ఘ‌టిక‌లుగా ఒక‌టి రెండు మూడుగా న‌డున‌స్తున్న‌ది. సాయంకాలం ప‌ద్దెనిమిది ఘ‌టిక‌లైన‌ది. పందొమ్మిది ఘ‌టిక‌లైన‌ది. ఇర‌వై. ఇర‌వై ఒక‌టి, ఇర‌వై అయిదు, ముప్ప‌ది ఘ‌టిక‌ల‌యిన‌వి. సూర్యుడు స‌హ్య మ‌ల‌యార‌ణ్య భూముల‌లోనికి దిగిపోయినాడు. దీపాలు వెలిగించారు. మ‌ర‌క‌త‌వ‌ల్లి న‌గ‌రులో వేల‌కొల‌ది మైన‌పువ‌త్తులు దీపాలు వెలిగించినారు.

ర‌ఘునాథ‌ప్ర‌భువు త‌మ మ‌హాన‌గ‌రు చేర‌గానే చెంచుల‌క్ష్మి నాట్యాదులు తాము చూడ‌డానికి అనువైన స‌మ‌యం చూచి త‌మ‌కు వ‌ర్త‌మానం చేయ‌మ‌ని చెప్ప‌డం వ‌ల్ల‌, గోవింద దీక్షితుల‌వారు పంచాంగం చూచి రాత్రి ప్ర‌ధ‌మ యామ‌మ‌ధ్య‌మందు మూహూర్తం నిశ్చ‌యించినాము, అవి యువ‌రాజుల‌వార‌పి వార్త పంపినారు.

సాయంకాలం చెంచుల‌క్ష్మిని మార్జ‌నిక‌లు ప‌రీమ‌ళ జ‌లాల‌కంఠ‌స్నానం చేయించి దుకూల వ‌స్త్రాల‌తో గోమేధిక మౌక్తికాల భూష‌ణాలు అలంక‌రించి స‌ముచిత వేషం వేసినారు. సంగీతస‌భ‌కాగానే నాట్యానికి త‌గిన వేష వ‌స్త్రాలు భూష‌లు పేటిక‌ల‌లో స‌ర్దినారు.
గుర‌వుగారి న‌గ‌రికి పోయేముందు చెంచుల‌క్ష్మి చంద్రిక‌లా, జ‌గ‌న్మోహినిలా, ల‌లితాదేవిలా త‌ల్లిదండ్రుల‌క‌డ‌కు వెళ్ళి, వారివురి పాదాల‌కు న‌మ‌స్క‌రించింది. మూర్తెప్ప‌నాయ‌నిం వారి క‌న్నులు చెమ‌రించిన‌వి. తల్లి దృష్టి తీయించిన‌ది.

తాను రాజ‌దృష్టి అని భ‌య‌ప‌డిన‌ది. శ్రీ మ‌హామంత్రి చిరున‌వ్వు న‌వ్వి మ‌ర‌క‌త‌వ‌ల్లీ ! నీ కొమ‌రిత సంత‌త రాజ‌దృష్ట్యా ప్లావిత కావ‌ల‌సి వ‌స్తుందేమో ! అన్నారా దినాన‌.

మొద‌టి సారికదా అని భ‌య‌ప‌డినాను, గుర‌దేవా ! అని తాను స‌మాధానం చెప్పుకొన్న‌ది. మ‌న‌స్సు మాత్రం ఆనంద డోలిక‌ల‌లో ఊగిపోయింది. గుర‌వాక్య‌ము వ‌ర‌ప్ర‌సాద‌ము కాబోలు అని స్యంద‌న‌మెక్క‌బోవు కొమ‌రిత‌ను చుస్తూ అనుకొన్న‌ది.