శ్రీరామ మహాసౌధము ముందు అశ్వమును దిగినాడు. వెంటనే ఒక సేవకుడు అశ్వమును ప్రక్కకు తీసికొని పోయినాడు. అభ్యంతర మందిరములో సుదీర్ఘమగు చర్చ జరుగుచున్నట్లున్నది. అమాత్యులు కూడా అక్కడే ఉన్నారు. సైన్యాధ్యక్షులు, రాజపురోహితులు, జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఆసీనులై యున్నారు.
మహారాజు శ్రీ అచ్యుతప్ప నాయనిం వారికి కొమరుని చూస్తూ ఉంటే మండు వేసవిలో చందన గంధములందుకొన్నంత హాయిగా ఉంటుంది. వారి పుత్ర ప్రేమ ఇంతింతనరానిది. ఆ దశరధునకా రామచంద్రుడెట్లో, తనకీ రఘునాధుడట్లే అని అనుకొంటారు. ఆ రామచంద్రుని పట్టాభిషేకమట్లయినది. కాని గోవింద దీక్షితులవారు నిర్ణయించిన పరమ శుభవేళలో చిట్టి తండ్రి సింహాసన మధిరోహించక తప్పదు.
రఘునాథుడు వినయముగా నమస్కరించి అచ్యుత నాయనింవారి వామ భాగమున కొంత దిగువుగా నున్న ఉన్నతాసనము పై కూర్చుండెను. అతని కనులు అగంతకుని పైబడి ప్రశ్నార్ధకములైనవి. తన రాకతో నిశ్శబ్దమైన సభను చూచి,
నాయనగారూ, రాజ్యములో ఏ కల్లోలమున్నూ లేదు. ప్రజలు శాంతచిత్తులై సరస సంగీత సాహిత్యాది సత్కాలక్షేపములతో ఆనందముగా నున్నారు. సరిహద్దులు కూడా సర్వతోభద్రముగనున్నవి. నేడీ యత్యవసర సమావేశమునకు కారణమేమిటో ? అనినాడు.
రఘునాధుని మాటలకు మహారాజులున్నూ అమాత్యులున్నూ ఆనంద భరితులైరి. రాజ్యములోని పరిస్థితుల నెప్పటికప్పుడు చిన్నినాయన అవగాహన చేసుకుంటూనే ఉన్నాడని తృప్తి పడిరి.
అచ్యుత : తండ్రీ ! మన తంజపురీ రాజ్యలక్ష్మి సుభద్రముగనున్నది. ఇదిగో వీరు తరిగొప్పుల మల్లన్నగారినీ శ్రీ దత్తాత్రేయ అవధూతలవారి ప్రియశిష్యులు. మన సార్వభౌములైన శ్రీశ్రీశ్రీ ఇమ్మడి వెంకటపతిరాయల వారికి ఆత్మీయులు. తామరాకుపై నీటిబొట్టు వలెనుండు వీరికి రాజ్యములోని సమస్యలు పట్టవు. కాని రాయలవారు అతి రహస్యమైన వార్తను వీరి చేత మనకి పంపించినారు.
గోవింద : సులతానులు భేదోపాయముచేత ఒక్కొక్క సామంతరాజ్యాన్నీ వేరు పరచి గెలిచి తువకు సర్వభారతాన్నీ చేజిక్కించుకొనే యుక్తిని పన్నారు. ఆ యుక్తిలో భాగంగా వారు ప్రస్తుతము పెనుగొండ మీదికి దండయాత్రకి రాబోవుచున్నారు. సామంత రాజులమైన మనకు సార్వభౌముల కండదండగా ఉండవలసిన బాధ్యత ఉన్నది కదా !
రఘు : మధుద పాండ్యరాజులు కూడ సార్వభౌముల పక్షములన నిలువక పోవచ్చును వారిలో స్వాతంత్ర్యాభిలాష హెచ్చుగా ఉండి తిరుగుబాటు
చేయవలెనన్న వ్యూహముతో నున్నారని నాకు వార్తలు వచ్చినవి. అవి నిజములేనా ప్రభూ !
తరిగొప్పల మల్లన్న కల్పించుకొని, రఘునాథులవారు చెప్పినవి నూటికి నూరుపాళ్ళు నిజము. తంజావూరు, చెంజి, మధుల, పాండ్య రాజ్యాలలో తంజావూరు మాత్రమే తమ ఆత్మ గౌరవమును నిలుపగల సంస్థానమని రాయలవారి యభిప్రాయము. గోల్కొండ యుద్ధములో తండ్రి వెంటనంటి నిలిచి శత్రుమారణహొమాన్ని రఘునాథుల వారెంత చాకచక్యంగా నిర్వహించారోనని నిండు సభలో రాయలవారు పలుమార్లు మెచ్చుకుంటూ ఉంటారు, అన్నాడు.
రఘు : రాయలవారి ఆత్మీయత అంతటి ఘనమైనది.
గోవింద : మల్లన్నగారిపుడు మనలను సైన్యముతో పెనుగొండకు రావలసినదిగా వార్త తెచ్చారు. అచ్యుత నాయనింవారు అతివృద్ధులు కాకపోయినా మనసును దైవచింతనలో లీనం చేయగలిగిన భాగ్యశాలి. ఈ స్థితిలో అచ్యుతప్ప నాయనింవారు కవచశిరస్త్రాణాదులు ధరించి, విల్లమ్ములు కత్తులు కఠారులుపూని యుద్ధభూమిలో శత్రువధను చేయ నిచ్చగింతురాయన్నది అందరిని వేధించుచున్న సంశయము. తండ్రిగారు తాము యుద్ధమునకు పోనిచ్చగించుటలేదు సరిగదా, భీమ పరాక్రములైన తమను పంపుటకైనా వారి మనస్సంగీకరించుట లేదు.
|