రఘునాథ నాయకుడు ఎప్పుడు నిష్ర్కమించినదీ ఎవ్వరూ గమనిచలేదు. పది నిముషములు అమాత్యులూ ప్రభువులూ ఒకరినొకరు, పోరాటమునకు సిద్ధమైన రెండు యాబోతులవలె బుసలు కొడుతూ చూచుకొన్నారు.
ఇంతలో చెమటలు గ్రక్కుచు ఒక భటుడు ప్రవేశించి, మిక్కిలి ఆందోళనగా, ప్రభూ ! రఘునాథ భూపాలురను ఎవరో బంధించి తీసికొని పోయినారు ప్రభువుల వారి చేతిలో చిన్న కైజారు తప్ప మరొక ఆయుధము లేదు. మేము పదిమందిమి మెరపుదాడి చేసినాము. కాని వారు పిడుగు శబ్దాలు చేసినారు. ఆ శబ్దాలగుండా ఇనుపగుండ్లు మంటలతో వర్షించుచున్నవి. మేము వెనుకకు రాకతప్పలేదు, అని మనవి చేసినాడు. మహారజు వెనుకకు విరుచుకొని పడిపోయినాడు. రాజవైద్యుడు హుటాహుటిగా వచ్చునంతో అచ్యుత నాయనిం వారికి స్పృహ వచ్చినది. వారి శోకము ఇంతింతనరానిది. గోవింద దీక్షిత మంత్రివంక దీనంగా చూచినారు.
అచ్యుత : గురుదేవా ! ఏమీ వైపరీత్యం !...నా రఘునాధుడు నా కనుల ముందు నిలవనిదే నా ప్రాణములు నిలువవు...ఈ కుట్రను తక్షణమే ఛేదించండి.
గోవింద : ప్రభూ ! తమ దుఃఖము చూస్తూ ఉంటే ఇది తమ పనికాదని నాకు అనిపిస్తోంది.
అచ్యుత : అమాత్యా ! ఏమిటి మీరనేది ! నా కనుల వెలుగుని....నాకలల పంటని...నేనే బంధించుకుంటానా !? ఈ మాటలు మీరేనా అంటున్నది !?
గోవింద : మహారాజా ! రాచరికపు తంత్రాలలో తండ్రీ కొడుకూ, అన్నా తమ్ముడూ, అభిమనము అనురాగము, వీటికి తావెక్కడ ? విలువెంత?
మహారాజు మరింత కుమిలిపోయినాడు.
అచ్యుత : మీరిలా మాట్లాడడంలో ఏదో విపరీతార్ధం తోస్తోంది. తండ్రీ కొడుకూలేడు సరే ! గురువూ శిష్యుడూ కూడా ఉండనక్కరలేదు కదా ! నా తండ్రిని మటుమాయం చేసి రాజ్యమేల గల యుక్తీ, శక్తీ, బుద్దీధైర్యమూ ఈ రాజ్యంలో ఎవరికున్నవి ?
రాజు కన్నులలో అనుమానం ప్రత్యక్షంగా గోచరిస్తూనే ఉన్నది. గోవింద దీక్షితులు సిగ్గుతో తలవంచుకున్నారు.
తమ తండ్రికీ తమకూ సేవచేసి, నాఊపిరి, నా ప్రాణము, నాజపము, తపము తమ రాజ్యశ్రేయస్సుకై మీదే గట్టినందులకు చక్కని బహుమానము లభించినది. తమరు ఇంతమాట అనడానికీ, నేను పడడానికీ ఇది తగిన సమయమే, అంటూ నిష్క్రమించినారు.
రాజ్యమంతా అల్లకల్లోలమైంది. యువరాజును ఎవరో బంధించారు. వారిని దేశాంతరాలకు తరిమివేశారో, కాళ్ళుచేతులు ఖండించారో, కనులు పీకించి రాజ్యం యేలుటకు పనికిరాని వానినిగా చేశారో, వధించారో ? అన్నీ జరిగినట్లూ తాము చూసినట్లే, ప్రజలు చెప్పుకోసాగారు. ఆ గాలివార్తలను ప్రోగు చేసుకొని వచ్చిన కొందరు గూఢచారులు రాజు చెవిలో ఊది క్షణక్షణము, కొద్ది కొద్దిగా వారి ప్రాణములను పీల్చివేయసాగారు. నాయనా ! రఘునాధా! ఇంత చక్కని పేరు పెట్టుకున్నందుకు నీవు నీ తండ్రీ చేతుల మీదుగా పట్టము గట్టించుకోవా తండ్రీ ! ఆ దశరధుడి లాగుననే నా అసువులు కూడా నీ కొరకు ఆక్రోశిస్తూనే వెళ్ళిపోతాయా కన్నతండ్రీ ! అయ్యో ! ఎలా జీవించేది ? తండ్రిగారు నాకిది చెడ్డకాలమని చెప్పినది నిజమైనదే, అని మహా దుఃఖములో క్రుంగిపోయినారు. ఇకను దేశ ప్రజల శోకము చెప్పనలవికాదు. అందరి కనులకూ రఘునాథుడు చిన్నికృష్ణయ్య వలె, రామయ్య తండ్రివలె అగుపడేవాడు. అందరికి అతడు కన్నబిడ్డే.
గోవిందామాత్యులు అత్యవసర సమావేశము నేర్పాటు చేసినారు. పైన్యాధ్యక్షులనూ గూఢచారులనూ రావించినారు. మహాబలాఢ్యుడున్నూ, బుద్ధి కుశలుడున్నూ, ప్రభుభక్తి పరాయణుడున్నూ, పరమ మహేశ్వరాచార్యుడున్నూ అయిన చంద్రశేఖర భట్టారకుని ప్రత్యేకముగా పిలిపించినారు.
గోవిందామాత్యులు :-
శత్రువులు పిన్న ప్రభువుల వారిని గొనిపోయి ఘడియపైనే అయింది. వారి యశ్వముల వేగము, అర ఘడియకు రెండు క్రోసుల దూరము మాత్రమే అని మురారి చెప్పినాడు. మురారి యూహ తప్పగుట నేను ఇంతవకు చూడలేదు. మనము అరఘడియకు నాలుకు క్రోశముల దూరము పరుగుదీయగల బాహ్లికాశ్వములపై వెడలవలయును. వారు నది కావలయున్న యరణ్యములగుండా పయనించి యుండవచ్చును. ఎందుకైన మంచిది, మనము మూడు మార్గములను వెదకవలయును.శత్రువుల సంఖ్య తక్కువే యున్నది. కాని, వారియొద్దనున్న అగ్ని గోళములకు మన భటులు భీతిచెందరాదు. నా భావము, రఘునాథుడు ఈసరికి శత్రువుల నుండి తప్పించుకొనియే యుండవచ్చునని. మనము వారిని ప్రయాణములో నుండగా ఎదుర్కొనరాదు. మొదట మజిలీలో, విశ్రాంతి తీసుకొనుటకు ఆయత్తమగుచు పరాకుగనున్న సమయమున ఒక్కుమ్మడిగ, ఆయుధములను వెలికితీయు సమయమును కూడ వారికీయనంత మెరుపు వేగమున మనుము దాడిచేయవలయును. |