8
 

చంద్ర‌శేఖ‌ర భ‌ట్టాచార్యుడు : అమాత్య శేఖ‌రా ! ప్ర‌భువువారి అశ్వ‌ములు తూర్పు తీర‌ముల‌కు ప‌రుగుదీసిన‌వి. నేను నా ద‌ళ‌ముతో తూర్పు వైపున‌కు వెళ్ళుట‌కు అనుజ్ఞ‌నీయ‌వలె.

గోవింద : అది మంచి ప‌ని.

రాత్రి మూడు జాముల‌వుతున్న‌ది. చంద్ర‌శేఖ‌రుడు కొంత‌మందిని బందీలుగ ప‌ట్టుకొని తీసుకొని వ‌చ్చినాడు. వారిలో కొంద‌రు ప‌ర‌దేశ‌స్థులు, కొంద‌రు బందిపోటు దొంగ‌లు, కొంద‌రు మ‌ధుర సైనికులు. చంద్ర‌శేఖ‌రుడు ర‌ఘునాథుని క్షేమ‌మును గూర్చి చెప్పున‌ని అమాత్యులు అత్ర‌ముగ చూచుచున్నాడు.

చంద్ర : గురువర్యా ! నేను వీరిని రెండు క్రోసుల దూర‌ము నుండి అనుస‌రించాను. విశ్రామ స‌మ‌యంలో మెరుపువ‌లె నా సైనికుల‌తో చుట్టు ముట్టి స్వ‌ల్ప యుద్ధ‌ములో అంద‌రినీ బంధించ‌గ‌లిగాను, కానీ వీరిలో మ‌ర రాజావారు లేరు. వీరినెంత బ‌ల‌వంత‌ము చేసిన‌ప్ప‌టికీ ఒక్క‌టే మాట చెప్పుచున్నారు, యువ‌రాజు త‌ప్పించుకుపోయినాడు, అని.

గోవింద దీక్షితుల‌వారు మ‌ధుర సైనికుని నిగ్గ‌దీసి ప్ర‌శ్నించారు. మీరెందుకు మా రాజ‌కుమారుని బంధింప‌వ‌ల‌సి వ‌చ్చింది ? దీనిలో ఈ విదేశీయుల కెంత పాత్ర యున్న‌ది ? ఇందువ‌ల్ల మీకు క‌లుగు లాభ‌మేమిటి ? అంతా స‌విస్త‌రంగా నిజ‌మే చెప్పిన‌ట్ల‌యితే ఒక మాస‌ము కారాగార‌ము విధించి వ‌ద‌లివేస్తాము. మీరు యేమాత్ర‌ము అస‌త్యము చెప్పిన‌ట్లు మాకు యేకొంచెము అనుమానము క‌లిగినా...మిమ్మ‌ల్ని నిలువునా చీల్చ‌వేస్తాం ఒక్క‌మారుగ హ‌త‌మార్చ‌ము. చిత్ర‌విచిత్ర‌ములుగా హింసించి వినోదించ‌గ‌ల క్రూర‌సైనికుల‌కు మిమ్మ‌ల్ని అప్ప‌గిస్తాము. ముందు మా ప్ర‌భువు క్షేమ‌వార్త తెలుపండి. అన్నారు.

ప్ర‌భువులు క్షేమ‌మే. వారిని మేము పొలిమేర‌ల వ‌రకైనా తీసికొని పోలేక‌పోయాము. వారు చాక‌చ‌క్యంగా త‌ప్పించుకొన్నారు. వారు మా నుండి త‌ప్పించుకొన్న వెంట‌నే మేము అగ్ని గుండ్ల వ‌ర్షం కురిపించాము. కాని, వారు మాక‌నులు గ‌ప్పి, మా ఊహ‌కైనా అంద‌ని విధాన, మాకు క‌నుమ‌రుగైనారు అన్నారు.

గోవింద‌మంత్రి తీవ్రాలోచ‌న‌లో మునిగిపోయినారు. ర‌ఘునాథ నాయ‌కులేమైన‌ట్లు ? వారి జాడ తెలియ‌క‌పోయిన‌చో మహారాజు ప్రాణ‌ములు నిలుచునన్న మాట క‌ల్ల‌. విప్ల‌వ‌ము ! క‌ల్లోలాగ్ని ! తంజ‌పుర రాజ్య‌ల‌క్ష్మి పీఠ‌స్థాన‌ము గిర‌గిర తిరుగుచున్న‌ట్లుగా గోవింద దీక్షితుల‌వారి మ‌న‌స్సున‌కు తోచి, భ‌య‌భ్రాంతులై స్థాణువువ‌లె నిల‌చిపోయినారు.

3

శ‌త్రువులు చుట్టుముట్టి హఠాత్తుగా త‌న ముఖ‌ముపై వ‌స్త్ర‌మువేసి బిగించి క‌త్తి తీయుట‌కుగాని పెనుగులాడుట‌కుగాని వీలుగాకుండ చేతులు వెనుక‌కుక‌ట్టి అశ్వ‌ముపై కెక్కించినారు. ర‌ఘునాథ నాయ‌కుల‌వారిని, పలువురు స‌లిపిన ఆక‌స్మిక‌దాడికి, ఆ ముహూర్త‌మున‌గ‌ల‌న అత‌ని మాన‌సిక‌స్థితిలో అత‌డు వారికి ఆధీనుడు కాక త‌ప్ప‌లేదు.

ర‌ఘునాథుడు మహారాజు మ‌హామంత్రుల మ‌ధ్య త‌న కార‌ణంగా యేర్ప‌డిన భేదాభిప్రాయ‌ముల‌కు మిక్కిలి వ‌గ‌చు చున్నందువ‌ల‌న‌, అన్య‌మ‌న‌స్కుడై అప్ర‌మ‌త్తుడై యుండుట‌వ‌ల‌న బందీయైనాడు. అంతియ‌కాని, అత‌డు నూరుమంది వీరుల‌ను యావ‌ల నిల‌బెట్ట‌గ‌ల భుజ‌ప‌రాక్ర‌మ‌శాలి. అత‌డు క‌త్తి పూనిన‌చో నా మెరుపు వేగ‌మున‌కు, నాయావృత‌ముల‌కు, క‌త్తి క‌డ‌యంచుల నుండి కొట్టు సూర్య ప్ర‌భాదీధితుల‌కు శ‌త్రు సేన‌ల‌క‌నులు మిరుమిట్లు గొలిపి యంధ‌ప్రాయ‌ములు కావ‌ల‌సిన‌దే. కాని విధి నేడు అత‌నికి ప్ర‌తికూల‌ముగ నున్న‌ది. కాల మ‌హాత్మ్య‌ము నెరుగ మ‌హాత్ముల‌కు కూడ శ‌క్య‌ము కాదు.

ర‌ఘునాథుడు అశ్వ‌ములేవైపు నుండి పోవుచున్నావో గ్ర‌హించుట‌కు ప్ర‌య‌త్నించుచున్నాడు. గుఱ్ఱ‌ములు అర్ధ‌క్రోశ‌ము మిక్కిలి వేగ‌ముగ దౌడు తీసిన‌వి త‌రువాత మెల్ల‌గా న‌డుచుట మొద‌లిడిన‌వి. అడుగులు భార‌ముగ తీయుచున్న‌ట్లు నిపించుచున్న‌ది. నేల కొంచెము మెత్త‌గ నున్న‌ట్లున్న‌ది. ఇది ఇసుక‌దారియై యుండవ‌చ్చును...బ‌హుశా...ఈ మార్గ‌ము...ఆ...? త‌న కొన‌నాసిక‌పై చిత్త‌మునేకాగ్ర‌ము చేసినాడు ఊపిరి గాఢ‌ముగా పీల్చినాడు. అశ్వ‌ము న‌డుచుచున్న‌ప్పుడు దాని గిట్ట‌ల‌క్రింద నీటి అల‌లు గ‌ల‌గ‌ల‌మంటున్న‌వి...స‌హ్య‌జాన‌ది తూర్పు - ద‌క్షిణ‌ముల‌గా సాగి, పిల్ల‌యేరై ఇక్క‌డ కొండ‌ల‌ను చుట్టుకుంటుంది...నీటి క్రింద‌ మెత్త‌గ‌లేదు, ఇసుక‌లేద‌న్న‌మాట‌.. గుఱ్ఱ‌పు గిట్ట‌లు త‌డ‌బ‌డుచున్న‌వి...పెద్ద‌వి...రాళ్లున్న‌ట్లుగ‌...జారుచున్న‌ట్లుగ‌...అనిశ్చిత‌ముగ న‌డ‌చుచున్న‌ది అత‌ని ముక్కుపుటాలు పెద్ద‌వైన‌వి.