76
 

మిత్రుడా, నీ బుద్ధి మహా నిశిత‌మైన‌ది. నీ వంటి వానిని మెప్పించిన నేను ధ‌న్యుణ్ణి, ఇన్ని దినాల‌నుండి నీ స్నేహ‌వాక్కుల‌ను విని నేను పొందిన ఆనందాన్నీ, నేడు నాకు నువ్వు నీ స‌ద్విమ‌ర్శ‌తో క‌ల్గించిన సంతోషాన్నీ త్రాసులో పెట్టి తూచిన‌ట్ల‌యితే ఈనాటి మోద‌ము వైపు మూడింత‌లుగా మ్రొగ్గుతుంది. ఈ శుభ‌సంద‌ర్భంలో నాదొక చిన్న కానుక ! అని త‌మ్ముని చెవిలో ఏదో చెప్పినాడు.

ఏమ‌టి సోద‌రులు నా మీద ఏదో ప‌న్నుగ‌డ ప‌న్నుతున్న‌ట్లున్న‌ది ? సైనికుని మాట‌ల‌కు స‌మాధ‌న‌ముగ చిరునవ్వు న‌వ్వినాడు. వేంక‌ట‌ప‌తి.

ఈ నా సారంగ‌ధ‌ర చ‌రిత్ర కావ్య‌మును చ‌తురాశ్వాస ప‌ర్యంత మైన దానిని నా ప్రియ‌మిత్రున‌కు ఆత్మీయున‌కు సోద‌ర‌తుల్యున‌కు తంజ‌పురీ రాజ్య సైనికున‌కు స‌హృద‌యున‌కు అంకిత‌ము గావిస్తున్నాను, అవి, ఆ అశ్వ‌త్ధ వృక్ష‌చ్ఛాయ‌ను గ్రుంకుతున్న చంద్రారుణ జ్యోత్న్న‌ల మాటున‌, శుక‌పిక శారికాది ప‌క్షుల శ్రావ్య‌గాన సుశృతి మ‌ధ్యాన ప‌ద్య‌ముల‌ను అశువుగా చదువుతూ సైనికున‌కు స‌మ‌ర్పించినాడు, వేంక‌ట‌ప‌తి. సైనికుడు ఆనంద‌ముతో పుల‌క‌రించిపోయినాడు. ప్రేమ‌గా క‌విని ఆలింగ‌న‌ము చేసి,

మిత్ర‌మా ! సామాన్య సైనికున‌కు కావ్య‌మంకిత‌ము నీవు చేయ‌డ‌మూ నేను పుచ్చుకొన‌డ‌మూ కూడ బాగుగాలేదు. ఎంద‌చేత‌నంటే ఏ రాజున‌కో, మంత్రికో, ముఖ్యాధికారితో ఇస్తే నీకు చిర‌కీర్తీ, సంప‌దా, ప‌ద‌వీ, ప్ర‌యోజ‌న‌మూ ఉండ‌వ‌చ్చును. నేను నీకు ఏమీ చేయ‌లేనుక‌దా ! ఇప్ప‌టికైనా మించిపోయిన‌ది లేదు, దీనిని స‌గౌర‌ముగ శ్రీ రఘునాథుల‌కో , శ్రీ అచ్యుత‌నాయ‌నం వారికో, గోవిందుల‌కే ఈయ‌వ‌చ్చును వారు నీకు స‌క‌ల సౌభాగ్య‌ములు క‌లిగేలా చూడ‌గ‌ల‌రు అన్నాడు.

సైనికుని మాట‌ల‌కు వేంక‌ట‌ప‌తి క్రుద్ద‌డైనాడు. నేను త‌ల‌చిన‌ది ఆచ‌రిస్తాను ఇంకొక విధ‌ముగ ఇది జ‌రుగ‌రాదు, అని స్థిరంగా ప‌లికినాడు.

ప‌ర‌మానంద‌ముగ నేన‌ను సారంగ‌ధ‌ర చ‌రిత్ర‌మును స్వీక‌రిస్తున్నాను. నేను నీకు కానుక‌గా, ఇదిగో ఈ బంగార‌పు కెంపుల పిడిగ‌ల బాకును, పూజ్యులైన శ్రీ అచ్యుత నాయ‌నింవారిచ్చిన దానిని, నాకు ప‌ర‌మ‌ప్రియ‌మైన దానిని నీకిస్తున్నాను. ఇంత‌క‌న్న ప్ర‌స్తుత‌ము నా ద‌గ్గ‌ర విలువైన‌ది లేదు అని, సైనికుడు ఒక అమూల్య‌మైన బాకును వేంక‌ట‌ప‌తికి కానుక చేసినాడు.

మ‌ర‌నాడు బ‌య‌లుదేర‌మ‌ని చెప్పి సైనికుడు సోద‌రులిద్ద‌రిని ఆలింగ‌నము చేసికొని వీడ్కోలు పుచ్చుకొనినాడు. నేటి నుండి మీరు నాకు క‌వితా క‌న్య‌విచ్చిన మామ‌లు, మిమ్ముల‌ను త‌గు మ‌ర్యాద చేయ‌వ‌ల‌సిన బాధ్య‌త‌ను నాకు క‌లిగించినారు. ఏమి చేయ‌గ‌ల‌నో ! అని న‌వ్వుకొనుచు మెరుపు వేగ‌మున సాగిపోయినాడు.

వేంక‌ట‌ప‌తి ఒక దిన‌మంతా ప్ర‌యాణంచేసి సాయంత్ర‌మున‌కు ఒక చోట బండ్ల‌నాపించినాడు. అత‌ని త‌మ్ములు శివ‌న్న‌, అప్ప‌న్న, నార‌య‌ణుడు దూరాన తంజావూరు ప‌ట్ట‌ణ‌మున వెలిగే ర‌త‌నాల దివ్వెల‌ను చూచి ఆనందముగ చ‌ప్ప‌ట్లు చ‌రుస్తూ గంతులు వేసినారు. చిన్న‌వాడైన గోపాలుడు త‌ల్లి ఒడిలో నిదుర‌పోయినాడు. కురంగ‌న‌య‌న‌కు నాడేదో క్రొత్త‌గా ఆనంద‌ముగా ఉన్న‌ట్లు తోచిన‌ది. భ‌ర్త చ‌నిపోయిన‌దాది ఆమె మ‌ట ప‌లుకులేక ఒకానొక వేద‌న‌తో కాల‌ము గడుపుతున్న‌ది తంజావూరులో క‌వుల‌కు గొప్ప ఆద‌ర‌ణ ఉంటుంద‌నీ, అందునా వేంక‌ట‌ప‌తి వంటి వారిని క‌న్నుల క‌ద్దుకుంటార‌నీ సైనికుడు చెప్పిన మాట‌లు అన్న‌మ‌రాజు త‌ల్లుల ద‌గ్గ‌ర చెపుతూ ఉంటాడు. ఈ నాటికైనా వేంక‌ట‌రాజు కొక‌నీడ దోర‌కుతున్న‌ది. అంతేచాలు ! చిన్ని నాయ‌న కుల‌హీనుడ‌న‌ని ఎంత బాధ‌ప‌డ‌తాడు, ఎన్ని క‌ష్టాల‌న‌నుభ‌వించాడు, ఎన్ని అవ‌మానాల పాల‌యినాడు. ఇదంతా త‌న‌వ‌ల్ల‌క‌దా ! భోగినీ కుల‌స్త్రీ అయి ఉండిన్నీ పిల్ల‌ల‌నుక‌ని వ‌ర్ణ‌సాంక‌ర్యం చేయ‌కుండా ఉండ‌వ‌ల‌సింది అని బాధ‌ప‌డుతుంది. వేంక‌ట‌రాజుకు త‌ల్లిమీద‌కంటె పెదత‌ల్లి మీదే ప్రేమ యెక్కువ అనిన్నీ గ్ర‌హీంచుకొన్న‌ది. పిచ్చివాడు ! కులానికి ఎందుకో అంతగా ప్రాకులాడుతాడు. ఇంకా చిన్న‌వాడు క‌దా ! కొన్నాళ్ళు పోతే త‌నే తెలిసికొంటాడు అనుకుంటుంది.

కురంగ‌న‌య‌న‌. నాయాన ! వేంక‌ట‌రాజూ ! రేపు తంజ‌పురికి వెళ్ళ‌గానే ఎక్క‌డ బ‌స చేస్తామురా ! ఈ అడ‌వుల్లో అయిఏ చెట్టుక్రిందో, ఏ చేయ‌క్రిందో కాల‌క్షేపం చేస్తున్నాము. ప‌ట్ట‌ణాల‌లో అలాకాదుగ‌దా ! మీ సైనికుడు ఎక్క‌డ‌కు ర‌మ్మ‌ని చెప్పాడు ? అని ప్ర‌శ్నించింది.

ఎక్క‌డ దిగాలో అత‌డు చెప్ప‌లేదమ్మా! అయినా అత‌ని మాట‌ల‌లో తెలుసు కొన్నాను. ప‌ట్ట‌ణంలో స‌త్ర‌వులు చాలా ఉన్నాయ‌ట ఎక్క‌డో ఒక‌చోట దిగుదాములే ముక్త‌స‌రిగా స‌మాధానం ఇచ్చినాడు, వేంక‌ట‌ప‌తి.

అంద‌రూ .ఆ మ‌ర్నాడు ఎలాగ ఉంటుందా ? అని ఆలోచిస్తూ నిద్ర‌పోయినారు.