వారు పట్టణపు పొలిమేరలలోకి వచ్చినారు. భేరీ మృదంగ కాహళాది వాద్యధ్వనులు వినవచ్చినవి. కొంత వడికి ఒక నల్లని కాటుక కొండవంటి ఏనుగు, ముత్యాలు, రత్నాలు, వజ్రవైఢూర్యాలతో చక్కగా అలంకరింపబడి మెత్తని జరీ అంచుపట్టు దిండ్లను అమర్చిన అంబారీతో వచ్చి వారి ముందు ఆగినది. ఏనుగు వెంట రథములు అశ్వములు వచ్చినవి కొందరు సైనికులు వేంటకపతి ఎవ్వరని తెలుసుకొని, వానికి పూలమాలలు వేసి, అతనిని గజమునారోహించమని కోరినారు. వేంకటపతి, అన్నమరాజు ఆశ్చర్యముతో మారాడలేకపోయినారు. ఇదంతయు ఆ సైనికుని పనే ! అతడింత చేయగలిగినాడా ! అని సంభ్రమానందాలలో కొట్టుకొని పోయినారు. చిన్నపిల్లలు అంతగా అలంకరించిన రధాలను చూచి కేరింతలు కొట్టినారు.
అన్నమరాజు చక్కని తెల్లమచ్చలు ఉన్న బాహ్లికాశ్వము నెక్కినాడు. అతని గుండె వింత సందడి చేసినది.
వేంకటపతి గజారోహణ చేయునప్పుడు భేరీకాహళ దుందుభి మృదంగ వాద్వములొక్కసారిగా బోరుమని మ్రెగినవి సైనికులు, వందిమాగధులు జయజయ ధ్వానములు చేసినారు. సామానుల బండ్లను స్త్రీల రధములను ఒక చక్కని భవంతికి తరలించి, మిలిగిన వారిని ఊరేగింపుగా పట్టణవీధులగుండా రాచనగరులో ప్రవేశపెట్టిరి. వేంకటపతిపై స్త్రీలు మేడలపై నుండి పుష్పములను, పెద్ద ముత్తయిదువలు అక్షతలను జల్లినారు.
అన్యూహమైన ఈ రాచమర్యాదలకు వేంకటపతి ఉక్కిరి బిక్కిరైపోయినాడు. సభా ప్రాంగణమునకు రాగానే చెలికత్తెలు పచ్చల హారతులిచ్చినారు. ప్రక్కనున్న సైనికుడు. ఆ భవలనమును శ్రీరామసౌధమందురనీ, శ్రీవారప్పుడు కొలువుదీర్చి ఉన్నారనీ తన రాకకై ఎదురు చూస్తున్నారనీ తెలిపినాడు. ఏమి సైనికా ! మరీ ఇంత అట్టహాసమా ! మాట మాత్రమైనా చెప్పినావు కాదేమి ! అందుకు నీ పని పట్టవలెనుగాదా ! అనుకొనినాడు, వేంకటపతి.
వేంకటపతి నాహ్వానించుటకై ఇరువైపులా ఆశీనులైయున్న కవి, పండిత అధికారవర్గము వారందరును లేచి నిలబడినారు. ఎదురుగా సింహసనము సై రాజు, ఒక ప్రక్కన అమాత్యులు ఆశీనులై యున్నారు. ఇటు ప్రక్కన యౌవరాజ్య సింహాసనము నధిరోహించిన వానిని చూచినాడు. వేంకటపతి. సైనికుడు ! అతని గుండె స్పందించుట రెండు క్షణాలు ఆగిపోయినది. మిత్రమా ! సైనికా ! యువరాజా ! అని తనలో తాను గొణగుకొనుచు, పిచ్చివానివలె బిత్తరిచూపులు చూచుచూ తత్తరపడినాడు. తనకు దేవాలయమున శ్రీనివాసుడనుగ్రహము గావించిన దివ్యస్వరూపమిదే ! తానిన్ని దినాల నుండి సంతతాన్వేషణ చేస్తూ అనంత సంచారము చేస్తున్నదీ యభినవ భోజరాజు కొరకే గదా ! రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ,
తరుణీ మన్మధయాశ్రిత
భరణ గుణాభరణ శౌర్యబహురాజ్య దురం
ధర సత్యాది మ చక్రే
శ్వర యభినవ భోజరాజ వరబిరుదాంకా
అని, నిండు గొంతుతో రఘునాథయువరాజుల వారిని అనేక విధముల శ్లాఘించి సాష్టాంగముగా నమస్కరించిన తరువాతనే మహారాజు అచ్యుత దేవరాయల వారికి నమస్కరించినాడు. వేంకటపతి ముందుగా యువరాజునకు నమస్కరించి రాచమర్యాదను అతిక్రమించిన దెవ్వరును గమనింపలేదు.
రఘునాథయువరాజు సింహాసనము నుండి దిగివచ్చి, మిత్రమా ! భయమేల ! నీవు కవిరాజువి, నేను రాజకవిని. ఇదిగొ ఇచ్చట నీ స్థానము అని ఆస్థాన కవులు కూర్చుండు ఆసనమును చూపినాడు. పురోహితులు వచ్చి మంత్రములు వేదాశీర్వచనములు పఠించుచుండగా రత్నములు ముత్యములు పొదిగిన తెలిపట్టు ఉష్టీవమును అచ్యుతదేవనాయనింనారు వేంకటపతి శిరముపై నలంకరించినారు. రఘునాథుడు అన్నమరాజును తన సైన్యమున దళవాయిగా చేర్చుకొగుటయేగాక, ఒక చిన్న విభాగమునకు ముఖ్యునిగా కూడ చేసినాడు. అతనికి ఖడ్గమును, సైనికోచితమైన ఉష్ణీవమును దయచేసినారు. జయజయధ్వానాలతో సభ ముగిసినది.
వేంకటపతి కొరకు స్యందనము వచ్చినది. దాన నధిరోహించి సైనికులు దారిచూపగా. ఒక విశాలమైన భవంతిముందాగినాడు. ఇక నుండి తానా భవంతికి యజమాని ! చెట్ల నీడను కాలక్షేపము చేసిన సామాన్య కవికి మహా భవంతి ! కులహీనునకు గజారోహణ మహాగౌరవము ! లోనుండి ఎవ్వరో వెన్నుదట్టినారు. నేటి నుండి ఇట్టి న్యూనత నీకు తగదు. |