అమాత్యుల ప్రతిమాటా అనేకార్ధాలను ధ్వనిస్తూ ఉంటుంది. వారి ధీవిశేషం ఇంతింతనరానిది. దిగంతాలను ఛేధించుకొంటూ భవిష్యద్ధర్శనం చేయగల మహాభావుకులువారు. గోవిందమఖి దివ్యవాణిని మరి మరి మననం చేసికొని సేదదీరినాడు యువప్రభువు.
ఆ దినాన యువరాజు కళావతీ దేవి మందిరానకు దేవతార్చనకు వేంచేస్తామని వార్తనంపించి ఉన్నారు. భోజనాత్పూర్వము రాజగోపాల సేవకై మన్నారు దేవళానికిన్నీ దయచేస్తామని తెలియజేసి ఉన్నారు.
ముదనగోపాలమందిరాన, గోపకిశోరుని దివ్యమంగళ స్వర్ణవిగ్రహం చెంత అమ్మవారు చెంగమలవల్లి బంగరుతల్లి వజ్రవైఢూర్య మరకత మాణీక్యాది రత్నదీదితులతో నేత్రపర్వంగా శోభిస్తూ ఉన్నది. అమ్మవారి నీలంపు జడకుచ్చులు స్వామివారి హృదయానకు హత్తుకోడానికి ఉవ్విళ్ళూరుతున్నట్లుగా అమరి ఉండెను. ఆమె పెదవులలోని రక్తిమమును ప్రస్ఫుటించు కెంపులున్నూ, నీలికలువలను జయించు కనులకాటుక రేఖలమాటుగా విభుని చూచుచు పరవశించు తారకోజ్వల కాంతులీను ఇంద్రమణులున్నూ తళుకుమనుచున్నవి. స్వామి మరింత కొంటెవాడు కాడా ! ప్రక్కనున్న దేవేరిని చిలిపి చూపుల చూస్తూ కనులతోనే పూలబాణాలను గుప్పిస్తూ ఉన్నాడు. అంగజ గురునకు రానక్రీడ వేరొకరు నేర్పవలెనా ?
ఆయనకొక్క చోట కాలు నిలువదు. ఆ పాదపద్మములు కందిపోతూన్నవి. మరి పదహారువేల గడపలను దీవించిరావలయునుగదా ! ఆ పాద సంవాహనం చేసి ముకులుకండి ! ఆ పదపంకజరజో శోభిత శిరస్కులుకండి ! అని భక్తులకుప దేశించినారు. ఆచార్యులు.
వల్లాండు వల్లాండు పల్లాయి రత్తాండు
పలవోడీ నూరాయిరం
మల్లాండ తిండోళ్ మఱ్ఱివణ్ణాఉన్
శేవడి శెవ్వి తిరుక్కాప్పు...
లలాటాన పవిత్రసూర్య తేజతప్తమైన దివ్యమృత్తికను ఊర్ధ్వ త్రిపుండ్రములుగా ధరించి, యోగవిద్యాశాలి ఉపనిషద్వేది శతముఖి శ్రీశ్రీశ్రీ తాతయ రామానుజ దేశికుల వారు తిరుప్పల్లాండు మంత్ర పఠనానంతరం ద్రావిడ వేదాన్ని శిష్యసమేతంగా శ్రవణపేయంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. శ్రీచక్రశంఖ తిరుముద్రాంకితులై వైష్ణవమత సాంప్రదాయములను త్రికరణ శుద్ధిగ ఆచరించుచు పామరులకు ఉద్బోధ చేయడానికి అవతరించిన దివ్యపురుషుడైన రామానుజాచార్యుల మోము వైష్ఱవ తేజంతో విరాజిల్లుతూ ఉన్నది.
కళావతీదేవీ సమేతుడై రఘునాథ ప్రభువులు విచ్చేసినారు. తిరుమణిని ధరించి, ద్వాదశ పుండ్రములను దిద్ది, అష్టాక్షరిని స్మరిస్తూ పరమ భక్తాగ్రగణ్యుడై గోపాలదేవుని ముంగిట సాష్టాంగ దండప్రణామాలనాచరించినారు. భాగవత రామాయాణాది దివ్య గ్రంథాలలోని కొన్ని మంత్రముల వంటి శ్లోకములను విని చిత్తశాంతిని పొందినారు. పట్టపు యువరాణివారి భోజన గృహాన రామభద్ర లక్ష్మీదేవుల చమత్కార వాక్చంద్రికలలో తేలియాడినారు.
మదనగోపాల విలాస భవనాన రామభద్రాదేవి రహస్యముగా చెవిలో చెప్పిన మాటలే రఘునాథుని హృదయంలో నినదిస్తున్నవి.
ప్రభూ ! రాధాదేవి అమాయిక. ప్రియునికోసం యుగయుగాలు విరహంతో నిరీక్షించగలదు. విన్నపాలు వినయంగా చేసుకొంటుందేగాని మనసచోరుని రవంతైనా నిందించదు. కానీ, ఈ చెంచులక్ష్మీదేవీ మహాజాణ ! త్రిలోకాధిపతి అయిన నరసింహదేవుని తనవెంట తిరిగేలా చేసికొన్న గడుసరి ! ఎంతైనా చేతికి అందిన రాధకంటె అందక మురిపించిన చెంచులక్ష్మిదేవే అయ్యవారికి హితవై నట్లున్నదికారూ ! అన్నది. దేవీ ! నీవు అన్న మాటలలో అసత్యం ఏమిన్నీలేదు ! అనినాడాతము. చెవిలో రామభద్ర చేసిన చెంచులక్ష్మి స్మరణతో రఘునాథుల హృదయాన్ని చెంచులక్ష్మి ....శుకవాణి ఝుమ్మని కదలించి వేసింది. మువ్వురు రాణులతో సరస సల్లాపాలతో భోజనాదికములను ముగించవలనని తాను చేసిన తలంపును రామభద్ర పలుకులు కొంత కుదుటపరచినవి. |