బాపిరాజుకు హస్తసాముద్రికం జ్యోతిష్యం తెలుసు. హాబీ. ఆయన తన జాతకాన్ని స్వయంగా చూసుకున్నారు. ఇతరుల చేత వ్రాయించుకొన్నారు. కాని ఎప్పటికప్పుడు, ఏదోవిధంగా సర్ది చెప్పుకుని, సరిపెట్టకోడం తప్ప, ఏ ఒక్కటీ ఎన్నడూ జరగలేదు. కాలగమనాన్ని యే గడియారమూ సరిగా చూపెట్టదు. టైమ్ మెజరమెంటుకు, జ్యోతిష్కులకు గడియారాల మీద ఆధారపడవలసిన తప్పనిసరి పరిస్థితి. కాగా జ్యోతిష్య గ్రంథాలు పాతవి పైగా వీరికి కాస్మాస్‌ను గురించిన విజ్ఞానం చాలా తక్కువ. ఇట్టి పరిస్థితుల్లో గ్రహచారాల్ని బేరీజు వేసి చెప్పె ఫలితాలు తప్పక తప్పదు. ప్రిడిక్ట్ ఎస్ట్రాలజీ ప్రజల్ని తప్పు త్రోవపట్టిస్తుంది.
బాపిరాజు జాతకం తిరిగి గుణించి, రాశి, అంశాల్లోని గ్రహాన్ని సరిదిద్ది భూతకాలనికి అన్వయించడం తమాషాగానే ఉంటుంది. కాని, ఈ అన్వయంలో కూడ అభిప్రాయ భేదానికి తావుంది. రెండు గడియారాలు ఏకీభవించవు. ఇద్దరు జ్యోతిష్కులూ ఏకీభవించరు. అదృష్టవశాత్తూ ఆయన అరచేతి ముద్రలేదు రేఖలలో పాతకాలాన్ని చదివే బాధలేదు.
అయితే బాపిరాజు 1935లో జోస్యం ఒకటి ఢంకా బజాయించిమరీ చెప్పారు.
గణపతిదేశం, రాయలసీమ
కళింగ రాజ్యం, కాకతిభూమి
ఆంధ్రులందరూ ఒకటౌతారని
ఏక కంఠమున పాటనిండునని.
తెలుగు గానమూ, తెలుగు నాట్యమూ
తెలుగు రంగులూ, తెలుగు తేనెలూ
ఆరిపోవనీ అందం విడవని
రూపం చెడవని రుచులు తగ్గవని
బాపిరాజు జోస్యం విశాలాంధ్ర ప్రదేశ్‌కి ఆంధ్రజాతికి, ఆంధ్ర ఐక్యతకు, ఆంధ్ర సంస్కృతికి సంబంధించినది. ఇది ఆయన గ్రహచారాలను గుణించిగాక, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల ప్రజ్ఞ బేరీజు వేసి చెప్పిన జోస్యం. ఈ జోస్యం నిజంకాకపోతే, అది బాపిరాజు తప్పు కాదు. ఆరుకోట్ల ఆంధ్రుల తప్పు అవుతుంది.
బాపిరాజు భారతదేశం నాలుగు చెరుగులా చాలాసార్లు సంచరించారు. కళలకు ఆలవాలములైన గుళ్లు, గోపురాలు, గుహలు, కుడ్యాలు, శిలలు, శిధిలాలు, మ్యూజియంలు, జూ లు, కోటలు, భవంతులు ఎన్నో ఎన్నో దర్శించారు. నదులలో, సరస్సులలో, స్నానాలాడారు. గోదావరిని, కృష్ణవేణిని అభిమానించారు. అనేక అంశాల మీద చిత్రాలు వేశారు. గీతలు వ్రాశారు. అనేక అంశాలు వ్యాసాల్లోకి, కధల్లోకి నవల్లోకి ఎక్కించారు. వేదికలెక్కి ఉద్ఘోషించారు.
గురువులు - ఉపదేశాలు, బాబాలు - భజనలు పీఠాలు - పాదపూజలు, మంత్రాలు - తంత్రాలు, శిరఃస్నానాలు - శిరో భారాలు. ఈ లోకంలోని వారు మాత్రమే ఆస్తికులైతే, బాపిరాజు పరమనాస్తికుడు. ఆయన సాహిత్యమూ కళల ఉపాసకుడు, భక్తుడు, పూజారి, తన జీవితాన్ని అంకిత మిచ్చినవాడు. నారాయణరావు నవల ప్రూవులు దిద్దుతూ సాహిత్యానికి అసువులు ఇచ్చినవాడు. అంచేత నిజమైన ఆస్తికుడు.
బాపిరాజు వ్రాసిన చిత్రాలు వాడవాడలా, దేశ దేశాలా, ఆయనకూ ఆంధ్రులకూ కీర్తి ప్రతిష్టలను ఆర్జించిపెట్టాయి. ఆయన ఏ చిత్రాన్ని వేయడానికైనా ఎంతో లోతుగా, కూలంకషంగా అధ్యయనం చేసి, శోధించి, మధించి, తనభావనా బలాన్ని జోడించి మరీ వేశారు.
బాపిరాజు తిక్కన చిత్ర రచనకు పూర్వం, తిక్కన గురించి ఎన్నో వివరాలు, విశేషాలు సమగ్రంగా సేకరించారు. ఈ కృషిని వేరొకచోట ఉటంకించాను.
చెట్టు క్రింద ధేనువు వధువులా నిలబడి ఉన్నది. ఆ ప్రక్కన రైతు కన్యాప్రదాతలా నిలిచి ఉన్నాడు. కైలాసగిరి వంటి రెండు ఆబోతులు, కొమ్ములు కొమ్ములు కలిపి, కనుగుడ్లెర్రజేసి మొమరించి ఉన్నాయి. ఇది అపురూప స్వయంవరం ఈ చిత్రం రాధావసంతవద్ద ఉంది. ఇది నీటి రంగుల చిత్రం.
ఆమెది కళా వెలుగులు చిమ్ముతున్న లావణ్యం. ఆమె వదనం సాహిత్య వెన్నెలలను కొల్లలుగా వెదజల్లుతున్న శశి. ఆమె మూర్తికట్టిన సాహిత్య చిత్రకళ. అందుకే ఆమె శశికళ. సాహిత్యానికీ కళలకూ ప్రతీక. ఈ రెంటిలో బాపిరాజు స్రష్ట. కనుకనే ఆమె ఆయన హృదయ పీఠం పై అధివసించి ఉన్న ఆరాధ్య దేవి. ఈ రహస్యం ఎరగని జడులు, మూడమతులు కొందరు శశికళ ను గురించి గుజగుజలు పోయారు. వికవికలాడారు, చూడాలని తహ తహ లాడారు, తప్పుడుకూతలున్నూ కూసారు.
బాపిరాజు వేసిన చిత్రాలను అర్ధం చేసుకుని, విశ్లేషించ ప్రతిభగల కళాకారుడు ఇంతవరకు బయటపడలేదు. అసూయ, అజ్ఞానం, హ్రస్వదృష్టి ఇప్పటికే సాహిత్యానికి, కళలకు, జాతికి తీరనిహాని కలిగించాయి. ఈ స్థితి బాగుపడాలి.
శశికళ జలవర్ణ చిత్రం దాధావసంత వద్ద ఉంది.
గులాం మహమ్మద్ కలకత్తావాలా, తన తెలుగు మీజాన్ దినపత్రికకు సంపాదకుడుగా ఉండడానికి బాపిరాజును హైదరాబాదుకు ఆహ్వానించారు. తెలుగు మీజాన్ సర్వవిధాల స్వతంత్రంగా వ్యవహరించే షరతుపైన బాపిరాజు ఆ ఆహ్వానాన్ని అంగీకరించారు తెలుగు మీజాన్ ఇంగ్లీషు ఉర్దూ మీజాన్లకు తర్జుమా కాదు. వాటితో ఎలాటి సంబంధమున్నూ లేదు. వార్తలు, వ్యాఖ్యలు, వ్యాసాలు, సంపాదకీయాలు ఏవైనా బాపిరాజు ఇచ్చవచ్చివని ప్రచురించవచ్చు. 1943-47 సంవత్సరాల్లో బాపిరాజు మీజాన్ ఎడిటర్‌గా పనిచేసారు. అ పత్రికా ముఖంగా నవలలు, కధలు, గేయాలు, శీర్షికలు, స్కెచ్చిలు ఎన్నో వెలువరించారు.
బాపిరాజు తన నవలలను కొన్నింటిని మీజాన్‌లో ధారావాహికంగా వెలువరించారు. ఆయన ఏ రోజుది ఆ రోజున అప్పటికప్పుడు వ్రాసేవారు. ఫోర్మన్ వచ్చి వ్రాసిన కాగితాన్ని ప్రెస్‌కు పట్టుకుపోయి, మళ్ళీ కాగితం కోసం వస్తూండేవాడు. శేషం ఆ మర్నాడు వ్రాసినా కొన్నళ్ళకు వ్రాసినా క్రిందటి భాగం చవక్కర్లేక పోయేదాయనకు. సాహిత్యానికి గాని, కళలకుగాని సంబంధించిన ఏ విషయంలోనైనా ఆయన జ్ఞాపకశక్తి మహా గట్టిది.
సాహిత్య కళల విషయాల ముందు ఎంతటి ముఖ్య విషయమైనా మరచిపోయే వారు. బాపిరాజు, మద్రాసు మోదవాకం వీధిలో ఉన్నప్పుడు, ఓ నిశరాత్రి ప్రేమకుమారికి తీవ్రజ్వరం వచ్చింది. ఆయన ఆందోళన పడ్డారు. ఇంట్లోఉన్న మందేదో వేశారు. బెజవాడ, గూడూరి నమశ్శివాయ మృత్యుంజయ ఫార్మశీ కోసం, మృత్యుంజయుడు చిత్రం వేశారు బాపిరాజు. కమలంలో కూర్చుని, రెండు చేతులలని కలశాలతో అమృతాన్ని తలమీద పోసుకుంటున్న శివుడు, మృత్యుంజయుడు ఈ చిత్రప్రతి కృతిని ప్రేమకుమారి తలక్రింద ఉంచి, మృత్యుంజయ స్తవం చేస్తూ కూర్చున్నారు. తెల్లవారింది. డాక్టరు దగ్గరనుంచి మందు తెస్తానంటూ బయలుదేరారు. పావుగంటలో తిరిగి రావలసినవారు గంటన్నర అయినా జాడలేదు. ఆయనను వెతుక్కుంటూ నేను బయలుదేరాను. దారిలో చిత్రపు నరసింహారావు ఇంట్లో కనిపించారు. మీరాబాయిలోని వైష్ణవాలయం నుఅమితోత్పాహంలో విశదీకరిస్తున్నారు. గొప్ప కళాఖండ చర్చ ఉత్సాహంలో కన్న కూతురు జ్వరం తెచ్చిన కలవరం విస్మరించారు.
హైదరాబాదు నిజాం రాజ్యంలో రాజకీయాలు అస్తవ్యస్తం అయాయి. రజాకార్ల అకృత్యాలు పెచ్చుపెరిగాయి. వాళ్ళ చేతుల్లో నిజాం బందీయే అయాడు. నవాబుకు అనుకూలంగానూ, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ తెలుగు మీజాన్‌ను మార్చమని బాపిరాజును వత్తిడి చేశారు. బాపిరాజు నిరాకరించి, రాజీనామా చేసి, మద్రాసు వెళ్ళిపోయారు. కలకత్తావాలా విసిగి, రోసి, బొంబాయి వెళ్ళిపోయారు. సాహిత్య కళల చక్రవర్తి బాపిరాజు, ఐశ్వర్యమంతుడు కలకత్తావాలా మంచి మిత్రులు, ఒకరిపట్ల ఒకరు గౌరవాభిమానాలు కలవారు. ఆంధ్రేతరుడైన కలకత్తావాలా, ఆంధ్రుడైన అడవి బాపిరాజుకు తెలుగు మీజాన్ సంపాదకత్వం ఇచ్చి ఆంధ్రభాషకు, ఆంధ్రజాతికి ఎనలేని మేలు చేశారు.
బాపిరాజును అరెస్టుచేసి, డిటెన్షన్‌లో ఉంచి హైదరాబాదుకు పంపమని భారత ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వానికి తాఖీదు పంపింది. మద్రాసు ప్రభుత్వం హోంమినిష్టరు బెజవాడ గోపాలరెడ్డి ఆ తాఖీదును చూసి విస్తుపోయాడు. బాపిరాజును పిలిచి, తాఖీదు చూపిచాడు ఇద్దరూ నవ్వుకున్నారు.
బెజవాడ గోపాలకృష్ణ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రుకు, కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేలుకు అర్జంటు డెమీ అఫీషియల్ లెటర్స్ వ్రాశారు. బాపిరాజు అంతకుముందు, చాలా నెలల క్రితమే తెలుగు మీజాన్ సంపాదక పదవికి రాజీనాయా చేసి, హైదరాబాదు విడిచి మద్రాసు వెళ్ళిపోయారనీ, రాజీనామా విషయం విస్మరించి, మీజాన్‌లో బాపిరాజు పేరును ఎడిటర్‌గా కంటిన్యూచేస్తున్నారనీ, మీజాన్‌తో బాపిరాజు ఎలాటి సంబంధమున్నూలేదనీ, అందులోని భారత ప్రభుత్వవ్యతిరేక వ్రాతలకుగాని, మరెట్టి వ్రాతలకు గాని బాపిరాజు భాద్యత యెంత మాత్రము లేదని. బాపిరాజు జాతీయవాది, గాంధేయవాది, సత్యాగ్రహం చేసి ఖైదువెళ్లాడనీ, ఇవన్నీ తనకు స్వయంగా తెలుసనీ, కాబట్టి బాపిరాజును గురించి పంపిన తాఖీదు భారత ప్రభుత్వం రద్దు చేయాలనీ, బెజవాడ గోపాలరెడ్డి ఆ లెటర్స్‌లో వ్రాశారు. తాఖీదు రద్దయింది. హైదరాబాదు గవర్నరుగా వ్యవహరిస్తున్న జనరల్ చౌదరి మూడు మీజాన్లలు మూయించారు.
|