బాపిరాజుగారు స‌హ‌జంగా సంభాష‌ణ ప్రియులగుట‌చే యింద‌లి క‌థా గ‌తిని చాలా వ‌ర‌కు నాట‌కీయ ధోర‌ణిలో న‌డిపించారు. పాత్ర‌ల‌న్నీ, భావోద్వేగ తీవ్ర‌త‌ల‌కు అనువ‌గు ప‌ద‌జాలంతో సంభాషించుకుంటూ చైత‌న్య స్ర‌వంతుల‌వలె కాన‌వ‌స్తాయి. అట్టి పాత్ర‌ల‌న్నీ, ర‌చ‌యిత యొక్క సృజ‌నాత్మ‌క‌శ‌క్తికి నిర్వ‌హణ సామార్థ్యానికి సంస్క‌ర‌ణాభిలాష‌కు ప‌త‌నం చెంద‌కుండా ఎత్తిన శాశ్వ‌త ప‌తాకాల వ‌లె నిత్య చైత‌న్య మూర్తుల‌తో ఆధునిక సాహితీ వియ‌త్ప‌థంలో రెప‌రెప‌లాడుతున్నాయి. అట్టి సంభాష‌ణ‌ల‌లో అవ‌గాహ‌న శ‌క్తికి భావ‌తీవ్ర‌త‌కు పాత్రౌచిత్యానికి పెట‌గోనియ‌స్ హిజ్‌హైనెస్ పోర్ట్ ఆఫ్ వాడ్స్‌, ఇన్‌స్టింక్ట్‌, త‌లందాను, మిరాసీ, బ‌ద‌స్తూలు మొద‌ల‌గు ప‌ర‌భాషా ప‌దాల‌ను కూడ ప్ర‌యోగించారు. నారాయ‌ణ‌రావు మిత్రుల‌లో ఒక‌డైన ఆలం మాట‌ల‌లో త‌మిళ నుడికారాన్ని రంగ‌రించి, సంభాష‌ణ ధోర‌ణుల‌ను స‌మ‌యోచిత స‌హ‌జ‌సుంద‌ర రీతుల‌లో న‌డిపి, త‌మ న‌వ‌ల‌ను నూత్న రేఖ‌ల‌తో తీర్చి దిద్దారు.

సంప‌న్న‌తా గౌర‌వం :-

బాపిరాజుగారికి సంప‌న్న కుటుంబాల‌పై, సంస్కార స‌ముపేత స‌మాజ‌ముపై మోజు క‌లిగి, అట్టి వారితో బాంధ‌వ్యాలు నెర‌ప‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. ఈ ర‌చయిత వ్య‌క్తిత్వానికి ఒక ర‌స‌వ‌త్ప్ర‌తీక‌యైన నారాయ‌ణ‌రావు, జ‌మీందారు ప్ర‌సాద‌రావుగారిని అభిమానించి ఆయ‌న కుమార్తెయైన శార‌ద‌ను వివాహ మాడుట‌, మొ.న‌వి ఈ విష‌యానికి త‌గిన నిమ‌ర్శ‌నాలు.

స్త్రీ వ్య‌క్తిత్వ ప‌రిపోష‌ణ :-

స్త్రీ యొక్క వ్య‌క్తిత్వాన్ని నిల‌బెట్టాల‌నే త‌ప‌న ఈ ర‌చ‌యిత‌ను తీవ్రంగా ఉండేది. క‌నుక‌నే ఈ న‌వ‌లలోని స్త్రీ పాత్ర‌లు చాలా వ‌ర‌కు అట్టి వ్య‌క్తిత్వ విల‌సితాలే ! పురుషుల‌తోపాటు స్త్రీల‌కు కూడా స్వేచ్ఛా సాంఘిక గౌర‌వాలు ఉండాల‌నే సంస్కార భావాలుగ‌ల ర‌చయిత యీయ‌న క‌నుక‌నే యిట్టి స‌ర‌స సంస్కార పాత్ర‌ల రూపాల‌లో ఈ న‌వ‌లా విశాల వేదిక‌పై తాండ‌విస్తుంటాయి.

సామాజిక స్పృహ :-

మానవుడు సంఘ‌జీవి, అన్న సిద్ధాంతాన్ని బాగా గుర్తించిన విజ్ఞులైన బాపిరాజుగారు మాన‌వ‌తా వాదిగా స‌మ‌కాలిక సాంఘిక రంగాల‌లో అనేక విధాలుగా కృషిచేసి ఉండ‌టంవ‌ల్ల ఆయ‌న ర‌చ‌న‌ల్లో సామాజిక స్పృహ అధికంగా క‌నిపిస్తుంది. మ‌రియు ఈ నారాయ‌ణ‌రావు న‌వ‌ల సాంఘికేతి

వృతంతో త‌ద‌నుకూల వాతావ‌ర‌ణంలో స‌ముత్ప‌న్న‌మైన‌ది.క‌నుక అట్టి స్పృహ సామాజిక స్థాయిలో క‌నిపిస్తుంది. ఇంద‌లి పాత్ర‌ల‌న్నీ నాటి సామాజిక ప‌రిస్థితుల‌కు, ర‌చ‌యిత యొక్క సంస్కార స‌మ‌చితాద‌ర్శ భావాల‌కూ, చ‌ల‌త్ప్ర‌తీక‌లు, అప్ప‌టి బ్రాహ్మ‌ణ‌, కుటుంబాల స్థితిగ‌తులు, యువ‌తీ యువ‌కుల ప్ర‌ణ‌య లీల‌లు, క‌ర్ష‌క కృషి విశేషాలు, పాడిపంట‌లు, తోట‌లు, దొడ్లు, సంగీత సాహిత్యాది, క‌ళా విన్యాసాలు, ప్ర‌యాణ సాధ‌నాలు, విద్యావిధానం, వైవాహిక ప‌ద్ధ‌తులు, న్యాయ‌రీతి, కుటుంబ వ్య‌వ‌స్థ‌లో జ‌మీందారుల‌కు, సామాన్యుల‌కు మ‌ధ్య‌గ‌ల అంత‌రాలు, సంప్ర‌దాయాల విలువ‌లూ, ప్రాచీనాధునిక నాగ‌రిక‌తా సంఘ‌ర్ష‌ణ ప‌రిణామాలు మొ.వాటికి ఈ న‌వ‌ల చ‌క్క‌గా అద్దం ప‌ట్టింది.

జాతీయ‌వాదం - స‌క‌ల మ‌త సంప్ర‌దాయ స‌మ్మేళ‌నం :-

స్వార్థ సంకుచిత భావాలేలేని నిజ‌మైన జాతీయ వాది బాపిరాజుగారు. భారతీయులు స‌మైక్యంగా వ్య‌వ‌స్థ‌పై విశ్వాస‌ము మెండుగా క‌లిగిన గాంధేయ‌వాది. స్వాతంత్రోద్య‌మంలో పాల్గొని, జైలు శిక్ష‌నుకూడ అనుభ‌వించిన వ్య‌క్తి. ఇట్టి త‌న రాజ‌కీయ చైత‌న్యానికి స్పంద‌నాత్మ‌క ప్ర‌తిక‌గా అత్యంతాభిమాన‌ముతో ఎన్నుకొన్న పాత్ర‌యే నారాయ‌ణ‌రావు, నారాయ‌ణ‌రావు రాజేశ్వ‌ర‌రావు, ప‌ర‌మేశ్వ‌రుడు, ఆలం మొ.వారు మ‌న‌సులు క‌ల‌సిన మిత్రులై, అర‌మ‌రిక‌లు లేకుండా క‌ష్ట‌సుఖాల‌లో పాలుపంచుకోవ‌డం ర‌చ‌యిత ఆశించిన కుల మ‌తాతీత సాంఘిక వ్య‌వ‌స్థ‌కు ఒక నిద‌ర్శ‌న‌ము.

సంప్ర‌దాయ‌వాది :-

ప్రాచీన భార‌తీయ వివాహ వ్య‌వ‌స్థ‌ను అనుస‌రించి వైవాహిక ప‌ద్ధ‌తులు న‌డుపుట‌, కుల‌గోత్రాదుల ప్ర‌స్తావ‌న‌లు చేయుట‌. సతాంహి సందేహ ప‌దేషు వ‌స్తువు, ప్రమాణ‌యంతః క‌ర‌ణ ప్ర‌వృత్త‌యః అని కాళిదాసు అభిజ్ఞాన శాకుంత‌లంలో అన్న‌ట్లు జ‌మీందారు ప్రసాద‌రావుగారు నారాయ‌ణ‌రావును మొద‌ట చూచిన వెంట‌నే అత‌నికి వివాహాము కాలేద‌ని భావించి, త‌న కుమార్తె శార‌ద‌కు అత‌డు త‌గిన వ‌రుడ‌ని నిశ్చ‌యించుకొనుట‌, త‌మ స‌ర్వ‌స్వ‌ము భ‌ర్త‌ల‌కే ధార‌పోయు హిందూ వ‌నితా మ‌ణులు భ‌ర్త‌ల‌కు పూజింప ద‌గిన‌వారు (పుట‌, 18 ) అని అనుకూల స‌తీమ‌ణుల‌ను ప్ర‌సంసించుట‌, స‌నాత‌న మ‌త విశ్వాసాలు, నారాయ‌ణ‌రావు త‌న మిత్రుల‌తో, త‌దిత‌రుల‌తోనూ చేసిన వాదోప‌వాదాలుమున్న‌గున‌వి ర‌చ‌యిత యొక్క బ‌లీయ సంప్ర‌దాయ వాదానికి ఆట‌ప‌ట్టులు.

ప్రాంతీయ పేర్ల‌లో ప్రాంతీయ స్పంద‌న - పార‌మార్థిక దృష్టి

ర‌చ‌యిత ఈ న‌వ‌ల‌లోని కొన్ని ముఖ్య‌పాత్ర‌ల‌కు పెట్టిన పేర్ల‌లో ప్రాంతీయ స్పంద‌న కాన‌వస్తుంది. ల‌క్ష్మీప‌తి, నారాయ‌ణ‌రావు, ప్ర‌సాద‌రావు, శార‌ద‌, రుక్మిణి మొ|| పాత్రనామాలు గోదావ‌రి ప్రాంతీయ వ్యవ‌హార నామాల‌ను స్ఫురింప‌చేస్తూ ఉంటాయి. ఉదాత్త‌భావాలు,ఉత్త‌మాశ‌యాలు, స‌చ్చీల‌సంప‌త్తి క‌లిగియున్న పాత్ర‌ల‌కు ప‌విత్ర దైవ‌నామాలు పెట్ట‌డంలోర‌చ‌యిత యొక్క పార‌మార్థిక దృక్ప‌థ‌ము ప్ర‌స్ఫుట‌మ‌వుతుంది. మ‌రియు, నారాయ‌ణ‌రావు ఇంటిపేరు త‌ట‌ప‌ర్తి వారు అని చెప్పుట‌లో భీమ‌వ‌రంలో ఈ ర‌చ‌యిత‌కు సుప‌రిచితులైన సంప‌న్న వైశ్య కుటుంబీకుల‌లోని త‌ట‌ప‌ర్తివారు స్ఫురిస్తున్నారు. వేదాంత చ‌ర్చ‌లు వ‌చ్చిన‌పుడు నారాయ‌ణ‌రావు ఆత్మ విశ్వాసంతో వ్య‌క్తీక‌రించిన తాత్విక విశేషాలు ర‌చ‌యిత యొక్క పార‌మార్థిక దృక్ప‌ధానికి నిద‌ర్శ‌నాలు. మ‌రియు న‌వీన విజ్ఞాన శాస్త్రీయ విష‌యాల‌ను సంద‌ర్భానుసారంగా స్పృశిస్తూ ఆధునిక సిద్ధాంతాల‌ను మేశ‌వించి, త‌న ప్రాచీన వేదాంత ప‌రిజ్ఞాన పాటావాన్ని నారాయ‌ణ‌రావు, రాజారావుల గంభీర సంభాష‌ణ‌ల ద్వారా ప్ర‌ద‌ర్శించారు.