విరాట పర్వం - నాలుగవ ఆశ్వాసం
గోగ్రహణం - దాని పూర్వాపరాలు
వైశంపాయనుడు చెప్పసాగాడు.
తెల్లవారింది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఆదిగాగల యోధులతో కూడిన దుర్యోధన సైన్యం కదలి నడిచింది. మత్స్యనగరానికి అనతిదూరంలో ఉన్న విరాటరాజు పశుగణాన్ని పట్టుకొన్నది. గొల్లవాళ్ళు వారిని ఎదిర్చ ప్రయత్నించారుగాని, సైనికుల బాణపరంపరకు తాళలేక పోయారు. తను గోవులను పట్టుకొన్నది కౌరవసేన అని తెలిసే సరికి భయపడ్డారు. పెద్దగొల్లడు పెద్దపెట్టున బొబ్బలిడుతూ పురాభిముఖంగా పరుగెత్తారు. హడావుడిగా రాజమందిరంలోకి పోయేసరికి ఉత్తరుడు అగుపించాడాతనికి అంతఃపురంలో.
బాబూ ! కౌరవసైన్యాలు మన గోవుల్ని పట్టుకొన్నాయి. త్వరగా వచ్చి విడిపించాలి. రథం తెప్పించు. మీ నాన్న పదివేల మందిలో ఎప్పుడూ మెచ్చుకొనే నీ బాహుబలం, శౌర్యం, నైపుణ్యం ఇప్పడు చూపించాలి అన్నాడాతడు సంభ్రమంతో.
అనేకమంది ఆడవాళ్ళు ఎదుట తన శౌర్యాన్ని మెచ్చుకొనేసరికి ఉత్తరుడు ఉబ్బిపోయాడు.
కౌరవులందరిని ఇట్టే జయిస్తాను. మన ఆవులను క్షణంలో విడిపించి తీసుకువస్తాను. కాని నాకు రథసారథి లేకపోవడంవల్ల ఏమి చేయడానికి పాలుపోక చింతిస్తున్నాను. నేను రథం నడపగలను అని ఈ క్లిష్టకాలంలో ముందుకు రాగలగిన వాడు మన పట్టణంలో ఎవడున్నాడు ? నాకు తగిన రథసారథి దొరుకుతే శత్రువులను చెండాడం ఎంత పని ? గోవుల మందలను వాళ్ళు ఏపాటి దూరమన్నా తీసుకుపోగలరా ? తగిన సారథి ఎక్కడన్నా దొరుకుతడేమో వెదకండి. నేను యుద్ధం చేస్తుంటే, నన్ను చూచి దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, ద్రోణుడు మున్నగు ముఖ్యులు యావన్మందీ అర్జునుడేమో అని భ్రమపడేట్లా యుద్ధం చేసి పశువులను మళ్ళించి తీసుకురాకపోతే స్నేహితులు చుట్టాలు నవ్వరా ? అన్నాడు ఉత్తరుడు.
ఉత్తరుడి ప్రగల్బాలు ద్రౌపది విన్నది. ఆమెకు నవ్వు వచ్చింది. నెమ్మదిగా పోయి అర్జునిడితో చెప్పింది.
|