నేను ధరణినంతా గెలచి ధనం సంపాదించడంవల్ల నాకు దనంజయుడు అనే పేరు వచ్చింది. ఎవరితో పోరాడినా నాకు జయం తప్పదు కనుక విజయుడు అనే పేరు వచ్చింది. నేను ఎప్పుడూ రధానికి తెల్ల గుర్రాలనే ఉపయోగిస్తాను కనుక నాకు శ్వేతవాహనుడు అనే నామధేయం కలిగింది. ఇంద్రడు నాకు ఇచ్చిన కిరీటం సూర్య బింబంలాగ నా తల మీద ప్రకాశిస్తూ ఉంటుంది కనుక నన్ను కిరీటి అంటూ వచ్చారు. మహా వీరులకు కూడా భీభత్సమైన పనులు ఎటువంటి యుద్ధాల్లోనైనా తడబడక చేయగలను కనుక భీభత్సుడు అన్నారు. యుద్ధాలలో కుడ ఎడమ విభేదాలు లేకుండా రెండు చేతుల్తో ఏ చేతితో బడితే ఆ చేతితో గాండీవం పుచ్చుకొని ప్రచండంగా బాణలు వేయగలను కనుక సవ్యసాచి అనే పేరు కలిగింది. నా శరీరచ్చాయ లాంటి తెలుపు ఛాయ లోకంలో ఎవరికీ లేకపోవడం చేత నన్ను అర్జునుడు అన్నారు. నా జన్మ నక్షత్రం ఉత్తర.
ఫల్గునీ నక్షత్రం అవడం చేత నన్ను ఫల్గునుడు అంటున్నారు. యుద్ధాల్లో దేవతలను కూడా జయించాను కనుక జిష్ణుడు అనే పేరొచ్చింది. మా అమ్మ కుంతీదేవికి పృధ అనే పేరు కూడా ఉంది. నేను పృధా పుత్రుణ్ణి కనుక పార్థుడు అనే పేరు కలిగింది. ఈ పది పేర్లు ఈ ప్రకారంగా వచ్చాయి.
దేవతలంతా అడ్డం వచ్చినప్పటికీ, కృష్ణుడి సాయంతో నేను ఖాండవ వనం కాల్చినప్పుడు బ్రహ్మ, ఈశ్వరుడు నా వద్దకు వేంచేశారు. పెన్నిధిగన్న పేదవాడిలాగ నేను ఆనందంలో మునిగి ఉంటే, వారు నాకు అసమానమైన ఆయుధాలు బహూకరించారు. అప్పుడే ఇంద్రుడు మున్నగు పెద్దలు వివిధాలైన దివ్యాస్త్రాలు ఇచ్చారు.
తరువాత, దేవతలకు కూడా అసాధ్యులైన నివాతకవచులనే రాక్షస సంతతిని, మూడుకోట్ల మందిని, మాతలిని సారధిగా చేసుకొని ఇంద్రుడి రథంలో నేనొక్కడ్నే వెళ్లి సమూలం నాశనం చేశాను కాదా ? హిరణ్యపురంలో నివసించే అరవై వేలమంది రాక్షసుల్ని సముద్ర తీరాన చంపినప్పుడే దేవేంద్రుడు నాకు కిరీటం ఇచ్చాడు.
దేవతలు ఆ శంకం ఇచ్చారు. దేవతలు ఇచ్చిన శంఖం కనుకనే దానికి దేవదత్తం అనే పేరు వచ్చింది. దుర్యోధనుణ్ణి గంధర్వరాజు పట్టుకొన్నప్పుడు పధ్నాలుగువేల మంది గంధర్వ రాజులను జయించి అతణ్ణి విడిపించాను ? నువ్వెందుకు భయపడతావు ? ఈ యావత్తు కురుసైన్యాన్ని గెలిచి, భీష్మ. ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ, దుర్యోధనాదుల కళ్ల ఎదుటనే ఆలమందలను మళ్లించి తీసుకొస్తాను, చూడు ! అని ఏ కరువు పెట్టాడర్జునుడు.
ఉత్తరుడు అద్భుతం, ఆనందం పట్టలేకపోయాడు. చెట్టు మీదునుంచి గభీమని నేలకు ఉరికి అతనికి సాష్టాంగ దండ ప్రణాయం చేశాడు. చేతులు జోడించి నిలబడ్డాడు.
మామయ్యా ! నువ్విలాగ నాకు కనబడడం ఎంత అదృష్టం ! ఎంత భాగ్యం ! మామయ్యా ! నిన్ను గుర్తుపట్టలేక నేను ఏమన్నాఅని ఉంటే నన్ను క్షమించి, మరిచిపో అన్నాడు.
అర్జునుడు రధం మీద నుంచి నేలకు ఉరికి ఉత్తరుణ్ణి గాఢంగా కౌగలించుకొన్నాడు. అతని కన్నులు ఆనంద బాష్పాలు రాల్చినవి. ఉత్తరుడు ధైర్యవంతుడైనాడు.
మామయ్యా ! నా భయం తీరిపోయింది. రథం ఎక్కు. నీ గొప్ప భుజశక్తి ప్రావున రథసారథ్యంలో నైపుణ్యం చూపిస్తాను. కౌరవులను ఓడిద్దాం ! గోవులను మరల్పుదాం ! నీ రధం నడపాలనే చిరకాల వాంఛ ఈనాడు ఈ విధంగా అతిచిత్రంగా తీరింది అన్నాడాతడు తేరుకున్న హృదయంతో.
నువ్వంటే నాకెంతో ప్రీతి. నీకే భయం రానీయను. నిన్ను గట్టిగా గాలైనాశోకకుండా చూస్తాను. శత్రువులను లెక్క చేయకు అత్యాదరంతో అన్నాడర్జునుడు.
నువ్వు అర్జునుడిని తెలిసీ తెలియడంతోటే నా పిరికితనంమంతా పటాపంచలైంది. అయితే, నువ్విలాగ నపుంసకుడవెందుకయ్యావో వినాలని ఉంది సవినయంగా అడిగాడు ఉత్తరుడు.
మా అన్న ఆదేశానుసారం బ్రహ్మచర్య వ్రతం ఆచరించడానికి, శాపంవల్ల కలిగిన రూపం ధరించి ఒక్క సంవత్సరం సమాప్తిచేశాను. అది లోకులకు పేడితనంగా కనిపించింది. ఇక మీదట అది ఉండదు.
ఇలాగ అన్నీ నాకు తెలియజెప్పడం నీకు నా మీదగల ప్రేమ చేతనే కదా ! ఇంక దేవతలకు కూడా జడవను. నువ్వుంటే నాకేం భయం ? ఏమి చేయమంటావో చెప్పు.
నా గాంఢీవమూ, వాని రెండు బాణాల పొదుగులున్నాయి, అవీ, నా కవచమూ, కత్తీ, ఇవన్నీ తీసుకొని, మిగిలిన వాటిని ఎప్పటిలాగ కట్టిపెట్టిరా, వెళ్లు చెట్టెక్కు.
ఉత్తరుడు తిరిగి జమ్మి చెట్టెక్కి ఆయుధాల కట్టలోంచి అర్జునుడి సామాగ్రి, కిరీటము, కుండలాలు, పతాకలతో సహా క్రిందికి దించాడు. అర్జునుడు ఇష్ట దేవతలకు మ్రొక్కాడు. బారెడు తల వెంట్రుకలు ముడుచుకొనిపోయినవి. పేడి రూపు పోయింది.
తలగుడ్డ చుట్టుకొన్నాడు. కుండలాలు, కిరీటము, కవచము ధరించాడు. రథంపై ఉత్తరుడ సింహ పతాక తీసివేసి జమ్మిచెట్టు పై పెట్టి తన కసి ధ్వజం ఎత్తాడు. చిరునవ్వుతో రథం అధిరోహించి గాండీవం ఎక్కుపెట్టి గుణధ్వని చేశాడు. తక్కిన అయుధాలను రథంలో పదిలపర్చాడు.
ఈలోగా ఉత్తరుడు రథము ఎక్కి గుర్రాల కళ్లమొలు చేత బుచ్చుకొని సారధ్యం చేయడానికి సిద్దంగా ఉన్నాడు. అర్జునుడు తన దేవదత్తం పూరించాడు. ఆ మహా ధ్వనికి ఆ గుర్రాలు చాపకట్టలాగ నేలను పడ్డాయి. ఉత్తరుడు హఠాత్తుగా చచ్చివాడు పడినట్లు అచ్చటనే కూలబడి మూర్ఛపోయాడు. అర్జునుడు గుర్రాలను లేవనెత్తాడు. వీపు నిమరాడు. ఉత్తరుడి వికృత్తాకారాన్ని చక్కబరిచి, మూర్ఛతేర్చాడు. గౌరవంతో కౌగలించుకొన్నాడు.
నాయానా ! శంఖారావాలు, భేరీ నినాదాలు, ఏనుగుల ఘీంకారాలు ఎప్పుడూ వినలేదా ? వీటిలో వింత ఏమున్నది ? ఈ పాటిదానికి ఇలాగ అయావేం ? అన్నాడు, ఆప్యాయంతో.
అబ్బే ! అన్నీ విన్నాను గానీ ఈ శంఖారావం మహానినదం ! భరించలేకపోయాను. ఇలాంటి ధ్వని మున్నెన్నడూ వినలేదు. అబ్బ ! చెవులు బ్రద్దలయాయి ! కళ్లు గిర్రున తిరిగాయి ! చిత్తం నీరయింది ! మహోగ్రమైన ఈ కసిధ్వజం చూస్తే కళ్లు చీకట్లు కమ్ముతున్నాయి. ఆత్మ వివశత్వం అవుతోంది. విహ్వలుణ్ణవుతున్నాను. ఎలాగ ? అంటూ బిత్తరపోయాడాతడు.
తగు మాటలు చెప్పి అర్జునుడాతనికి ధైర్యం నూరిపోశాడు. క్రమక్రమంగా అతని భయం పోగొట్టి మరొకసారి శంఖం పూరించాడు. ఉత్తరుడు సారధ్యం చేయగా, కురు సైన్యం వైపు పోసాగాడు.
అక్కడ కౌరవ సైన్య యోధుల్లో కలకలం బయలుదేరింది.
అది గాంఢీవ గుణ ధ్వని ! ఆ శంఖారావం దేవదత్తానిదే ! గగన భాగం కమ్ముకొన్న ఆ కాంతులు కపిధ్వజానివి ! మిరుగొట్లు గొలిపే ఆ వెలుగు అతని కిరీటకాంతి ! సమరోత్సాహంతో అర్జునుడే వస్తున్నాడు ! ఇక్కడ మనం ఊరికే వింతడవాదాలు చేసుకుంటూ కూర్చుంటే ఫలం లేదు. పోరాటానికి ఏర్పాట్లు చేయాలి. ముందు దుర్యోధనుడు సైన్యంతో నడుస్తాడు. గోవుల మందలు బెదరికల ద్రొక్కకుండా అతడు కాపాడుతూ ఉంటాడు. అతని వెనుక మనం ఒకరి వెనుక ఒకరు సైన్యంతో నుడుస్తాము. అలాగయితే, అర్జునుడు ఎప్పుడు దగ్గరకు వస్తే అప్పుడు యుద్ధం చేయడానికి అనువుగా ఉంటుంది. అయినా జయం అనుమానం ! అపశకునాలు కనిపిస్తున్నాయి ! అని ద్రోణుడు అభిప్రాయం వెలిబుచ్చాడు.
|