ఎక్కడన్నా యజ్ఞాలు చేస్తున్నారేమో కనుగొని అక్కడకు పోయి భోజనాలు చేస్తూండు ! నువ్వు యుద్ధం చేయవద్దులే. అనవసరంగా బెంబేలు పడక ఇంటికెళ్లు. నేను విల్లందుకొంటే ఈరేడు భువనాలు వడవడ వడకుతాయి. నా బాహుబలాన్ని విస్మరించి మాట్లాడుతున్నావు. అర్జునుడనగా ఎంత ? ఒక్క రధికుణ్ణి గురించి ఇంత రభస ఎందుకు ? అంటూ కర్ణుడు కృపాచార్యుణ్ణి ఆక్షేపించాడు.
ఇంతవరకూ భీష్ముడు మౌనంగా వింటూ ఉన్నాడు. ఇంక తాఉ పలుకాడవలసిన సమయం ఆసన్నమైదనుకున్నాడు.
ద్రోణాచార్యులు, అశ్వత్థామ, కృపాచార్యులు నీతి పథానికి ఉచితమైన తీరుగా చెప్పారు. గౌరవనీయుడైన కర్ణుడు రణోత్సాహం కనబరుస్తే మంచిదే కావచ్చుగాని మాన్యులను అవమానించడం కూడదు. దేశకాలాలను బట్టి సమర ప్రయత్నాలు చేస్తే చేయవచ్చు. అంతేగాని తగు వారికి కర్ణ కఠోరమైన అవమానకరమైన మాటలు మాట్లాడడం తప్పు.
బలం, శౌర్యం గల వైరులు పైబడే చిక్కువచ్చినప్పుడు ఓరిమితో దూరాలోచన చేయడం తెలివైన పని కదా ? మహాత్ములు యుద్ధంలో తమ సామర్థ్యం చూపిస్తూనే శత్రువు సుగుణాలు కూడా మెచ్చుకొంటారు.
ఇతనికి, పెడసరంగా మాట్లాడడం తప్ప తుదమొదలు తెలియదు. ఆచార్యులైనవారు పూజావాక్యాలకు అర్హులుగాని, నిందా వాక్యాలను కాదు అంటూ కృప, అశ్వత్థామల చేతులు పట్టుకొన్నాడు. చాలినంత పని ఉంది. అర్జునుడు వస్తున్నాడు. ఇది వివాదాలకు, విరోధాలకు సమయం కాదు. మనమంతా కలిసి యుద్ధం చేద్దాం. కష్టకాలంలో కలిసిమెలిసి ఉండాలిగాని భేదబుద్ధి కూడదని పెద్దలు చెపుతారు కదా ! ఒకప్రక్క వేదాల్లోను, ఒక ప్రక్క ధనుర్వేదంలోనూ అసమాన పాండిత్యం గల మాబోంట్లు ఎక్కడన్నా ఉన్నారా ? ఈ కురుసైన్యంలో ఏది ఉద్భవించినా మీరు ప్రసిద్దులవడంచేత అది మా తలపైనే పడుతుంది. క్షమించండి, తెలియక ఏమో అన్నంత మాత్రాన, కటకటపడిపోయి,రాచకార్యాన్ని రాజు చిత్తాన్ని దూరం చేయడం పాడిగాదు అని భీష్ముడు, కృప, అశ్వత్థామలను బ్రతిమాలుకొన్నాడు.
.
ఎవరు క్షమించాలి ? రాచకార్యానికి మేమెవరము ? ద్రోణాచార్యుల వారి చిత్తం శాంతిస్తే మా గుండెలు తేలికపడినట్లే, మాబోటి వాళ్లకు ఇంతగా చెప్పనక్కర్లేదు అన్నారు వారు.
భీష్ముణ్ణి, కర్ణుణ్ణి దగ్గర ఉంచుకొని దుర్యోధనుడు, ద్రోణ, కృప, అశ్వత్థామలను క్షమాభిక్షవేడాడు. ద్రోణుడు ప్రసన్నమదనుడయాడు.
కోపం భీష్మునిమాటలకే పోయింది. ఇప్పుడు మిగతా కార్యక్రమం నడిపించాలి. దుస్సాహసం వల్ల దుర్యోధనుడికీ కీడురాకుండా జాగ్రత్తపడాలి. అర్జునుడు మహోక్రోషంతో ఉన్నాడు. మనలనెవరినీ కించిత్తు కూడా విడువడు, మనసంతా, ఒక్కుమ్మడిగా ముసరాలి. అది సరే ! దుర్యోధనుడు అప్పుడు ఒడంబడిక కాలాన్ని గురించి ప్రస్తావించిన విషయం ఒకటి ఉన్నది. దానిని సరిచూసి ఉన్న సంగతి తేల్చగల అర్హత భీష్ముడిది అన్నాడు ద్రోణుడు.
రెండో యేడు ఒక అధిక మాసం. ఇట్లా వచ్చిన నెలలన్నీ కలుపుకుంటే పదమూడేళ్లు సరిగా నిన్నటితో నిండాయి. ఇది తెలిసి ఉండబట్టే తమ శపథం నెరవేర్పాంగదా అనే ధీమాతో అర్జునుడు ఈనాడు మనకు అగపడుతున్నాడు. పాండవులు ధర్మపరులు, ధర్మరాజు ఆజ్ఞను తమ్ముళ్లు మీరరు. వారు ధర్మపథం తప్పరు.
కాగా, అన్ని పాట్లుపడిన వాళ్లు, తమకేహాని కలిగేటంత తెలివితక్కువతనంతో, తీరా శపథకాలం తీరిపోయే సమయాన దుస్సాహసం చేయరు. బైటపడేటంత మూర్కంగా ప్రవర్తించరు. ఇంతకాలమూ ఎలాగో ధర్మానికి కట్టుబడి వేచివున్నారు. ఇంక వారి పరాక్రమం కొంత చూపించక మానరు. సమరానికి వస్తే దానికి తగ్గట్టుగానే మనమూ పోరాడాలి. ఇపుడు వచ్చిన వాడు అర్జునుడు. అవశ్యం గెలుస్తాం అని చెప్పలేము. రాజ్యలక్ష్మి కోసం పెనగులాడిన రెండు పక్షాలూ గెలుస్తాయా ? అనవసరమైన కష్టనష్టాలకు గురికాకుండా, పోరువదలిపొందైన పద్ధితిని పోరుకొనసాగించాలి అని భీష్ముడు వాక్రుచ్చాడు.
దుర్యోధనుడు చిరునగవు నవ్వాడు.
మనకూ పాండవులకూ ఎలాగ పొందు కలుగుతుంది ! నేను రాజ్యభాగం ఇవ్వను. రణవ్రతం ఆచరించడం నిశ్చయం దుర్యోధనుడు నిష్కరష్కగా చెప్పివేశాడు.
ఆ ఇద్దరి మాటలు శ్రధ్దగా విన్నాడు ద్రోణుడు.
కార్యగతి, కయ్యం విధానం రాజుకంటే ఎక్కువ తెలిసినవాడెవరూ లేరు. అయినా నాకు తెలిసిన మార్గం వివరిస్తాను. ఈ సైన్యంలో నాలుగోవంతు తీసుకొని రాజు వడివడిగా ముందు వెళ్లాలి. తదనంతరం అంతే సైన్యం గోవులను రక్షించుకొంటూ నడవాలి. మిగిలిన సైన్యం తోమనం నిలబడి వ్యూహం పన్నుకొని అల్లనల్లన వెడుతూండాలి. అర్జునుడు ఎక్కడ ముట్టడిస్తే అక్కడ తలపడాలి. ఇలాగైతే రాజు సురక్షితంగా అలజడి లేకుండా నడుస్తాడు. ఆవులు ఈ చోటు వదల గలుగుతాయి. మనం అర్జునుణ్ణి నిలవేయగలుగుతాము అన్నాడు, ద్రోణుడు.
ద్రోణుడు చెప్పిన దానికి భీష్ముడు సమ్మతించాడు. దుర్యోధనుడికీ నాలుగవ వంతు సేవ పంచి ఇచ్చి పంపాడు. పశువులకు తోడు కావలసిన భాగం పంచాడు. మిగిలిన చతురంగ బలాలతో, నడుమను ద్రోణుడు, వలపట కృపుడు, దాపట అశ్వత్థామ, ముందట కర్ణుడు, అక్కడక్కడ వికర్ణ, దుశ్శాసన, శకుని, సైంధవ, సోమదత్త, బాహ్లిక, భూరిశ్రవ ఆదిగా గల యోధులు కలయ నిలుచునట్లుగా మోహరించారు. ధ్వజమెత్తి వెనుక నడచినాడు.
ఈ ప్రకారం కదలి వెడుతూన్న కౌరవ సైన్యానికి క్రోసెడు దూరంలో నిలబడి తలయెత్తి పారచూస్తున్నాడర్జునుడు.
ఇది ఒక పెద్ద గట్టిసైన్యం ! ఈ సైన్యం ముందర గోగణంతో అదుగో ఒక అల్పసైన్యం. దానికి అవతల వేరొక కొంతసేన, అల్లదుగో విడిగా నడుస్తోంది. ఈ సేనల్లో ఆ ధురభిమాని, కౌరవ రాజు ఎక్కడున్నాడో ! చూదాంగాని ఈ మెహరానికి దాపలితట్టున రథం పోనియ్యి. ఎవరు ఎలా అడ్డపడినా అతని పైకి ఉరుకుతాను. అతడు చిక్కాడా, సైన్యమంతా విచ్చిపోతుంది. అలాగయితే అతి సులువుగా ఆలమందల్ని మళ్లించవచ్చు. దాంతో అన్ని తీరతాయి. ఈ సేనలో అతడు లేకపోయినా వీరిని ఓడించి గోవుల్ని కొనిపోవచ్చు. పశువులు తప్పిపోకుండా పట్టడం మొట్టమొదట చేయవలసినది. అది చక్కబెడితే అప్పుడే కనిపిస్తాడు దాయాది అన్నాడాతడు ఉత్తరునితో.
ఉత్తరుడు ఆ సైన్యానికి దాపరితట్టుకు రథంతోలినాడు. తాము ఆ సేనను సమీపించడంతో, విప్పారిన నయనాలతో దానిని కలయజూచినాడర్జునుడు. ఆ సేన మధ్యభాగంలోనూ, నలు దెసల్లోనూ ఎవరెవరు నడుస్తున్నారో సారధికి బోధపర్చాడు.
వారిలో దుర్యోధనుడు లేడు. అతడు ఆవులను తీసుకొని పోతున్నాడు. కాబోలు. మనకు కావలసిన ఆహారం ఈ సేనలో లేదు కనుక దీనితో మనకు పోరాడవలసిన పనిలేదు. వీళ్లు అడ్డుపడడానికి వీలుచిక్కనంత తొందరగా ముట్టడించి, పశువులను పట్టుకొని, రాజును కూడా పోనీయకుండా పట్టాలి. అంటూ వార దెపకు రథం పోనిచ్చి, ద్రోణ, భీష్మ, కృపులపాదాల ముందర పడేట్లు, రెండేసి బాణాలు, చెవులను దూసుకుపోయేట్లు రెండేసి బాణాలు వేసాడు. |