దేహము దేవాలయమువంటిది. జీవుడు దేవునివంటివాడని యార్ష వాక్యము. దేవదాసి యభినయము, నృత్యము, నర్తకియొక్క ఆహ మనెడి భావమును నశింపజేసి దాసోహమనెడి భావమునుద్దీపింపజేసెడిదిగ నుండెడిది. ప్రారంభమున దేవనర్తకి యారాధనా నృత్యము భగవత్కైంకర్యముగ దేవాలయములో దేవుని యెదుటనే గర్భగుడియందు జరిగెడిది. దైవముతో పాటుగ భక్తులనుకూడ నానందపరచెడి యుద్దేశముతో కాలక్రమమున నర్తకి గర్భగుడిని వీడి ఆలయప్రాకారము లోపల నిర్మింపబడిన నాట్యమంటపమునకు వచ్చినది. దేవనర్తకియొక్క నాట్యము చూడవలెనన్నచో సార్వభౌముడైన కూడ ఆలయమునకు వచ్చి చూడవలసినదేగాని దేవదాసి దేవాలయ సింహద్వారమును దాటి బయట రాజప్రాసాదముననైనను గజ్జ కట్టదు.
ఇట్టి కఠిన నియమము లీ సంప్రదాయమును పరిరక్షించెడివి. దేవదాసి యనగా సాక్షాద్భగవంతుని ప్రేయసి యనెడి గౌరవాదరములు, ప్రేమ ఆమెయందు ప్రజలకుండెడివి. కాలక్రమమున దేవనర్తకీమణులలో ధనాశ ప్రబలి భక్తి క్షీణించి, ఆంగికమైన అభినయమేగాని ఆత్మార్పణము శూన్యమైనది.
వారు రాజా స్థానములలో రాజునకు ప్రీతి కల్గునట్లు నాట్యము చేసి భోగములనుభవించుటకు అలవాటుపడుట జరిగినది. ధనముగలవారికి ఈమెపై నధికారము కల్గియుండుట పరిపాటియగుచుండుటనుబట్టి రాజా స్థానములనుండి కూడ దేవదాసి యొక్క స్థానము మరింత దిగజారి చీకటిండ్లపాలైనది. తదుపరి పేరునకు దేవదాసులు నిజమునకు ధనదాసులై వేశ్యావృత్తి ని చేపట్టి దేవనర్తకి అన్న పేరునకు అపవాదు తెచ్చిరి. జన ప్రవాదమున దేవదాసియనగా వారాంగన యసెడి యభిప్రాయము రూఢికాగా దేవదాసిని హేయముగ చూచుటకలవడిరి. వారాంగనలను భోగము వారిని వేరుగ గ్రహింపవలయును. భోగమువారనగా భగవంతుని కుత్సవములు చేయుటలో నుపకరించువారను నర్థమున్నది. భోగమువారు వేరు. వారాంగనలు వేరు. భోగమువారు భగవంతుని సన్నిధానమున నృత్య గానములు చేయుటకేర్పడినవారు. వారాంగనలు వారిలో కులము చెడినవారు ఇట్లు దేవదాసులు భగవత్సేవ కంకితము గావింపబడినట్టివారేగాని దుర్మార్గమున నడువరాదు. వారికి సుఖజీవనమునకై ప్రభువు లొసంగిన భూములను భోగము లని యందురు.
గిరికను అందరును దేవదాసియని పిలిచెడివారు కాని యామెయన్న గారైన ధర్మారావు మాత్రము గిరికమని పిలిచెడివాడు. వేయి పడగలు నవలలో కథానాయకుడైన ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రికిని రత్నగిరియను భోగాంగనకును గిరిక జన్మించినది. సుబ్బన్న పేటలో వేంచేసియున్న వేణుగోపాలస్వామి ఆలయమున నృత్యములు చేయుచు ధర్మారావు యొక్క బోధనలచేత భక్తి మార్గమున పయనించి వేణుగోపాలునికి రాధయై మధుర ప్రేమమూర్తియై మధురభక్తిలో పరాకాష్టదశయైన మోక్షము నందుకొన్న ధన్యురాలు గిరిక. గిరిక యొక్క భక్తౌన్నత్యమును విజ్ఞానమునుగూర్చి చెప్పుటకు ముందు ఆమె స్వరూపణము చేయవలసిన యవసరమున్నది. ఎందులకనగా వంశపారంపర్యముగ కొన్ని సుగుణములు తల్లిదండ్రులనుండి గిరికకు సంక్రమించినవి. రామేశ్వరశాస్త్రి శ్రుతిస్మృతులను చక్కగా చదివినవాడు. కర్మిష్టి. ఆహితాగ్ని, బ్రహ్మ క్షత్రియ శూద్ర కన్యలను వివాహమాడి నల్గురియందును సంతానము పొందెను. రత్నగిరియన్న భోగాంగనవలన రామేశ్వరశాస్త్రి గరికకు జన్మనిచ్చెను. వారాంగనకును దేవదాసికిని భేద మిచ్చట నిరూపింపబడినది. మానవమాత్రుడైన రామేశ్వరశాస్త్రితో సంబంధము నేర్పరచుకొన్న స్త్రీ రత్నగిరికాగా మధుసూదనునితో భక్తియోగమును సంధింపగల్గినది దేవదాసియైన గిరిక. ధర్మశాస్త్రము ప్రకారము రామేశ్వరశాస్త్రి యొక్క వివాహములు దూష్యములుకావు. పురుషుడు ప్రధానంగా స్వకులస్థురాలినే పెండ్లి చేసికొనవలెను మిగిలిన క్రింది కులములలోనుంచి ద్వితీయ భార్యలను గ్రహించవచ్చును. ఇది యాజ్ఞవవల్క్యుడి మతం ఆర్షధర్మము ప్రకారము తనకన్న నితర కులస్థులైన క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీలను పెండ్లియాడిన రామేశ్వరశాస్త్రి యొక్క భోగాంగనతోడి సంబంధమును నిరసించుచు కొందరతనిని కాముకుడనిరి. ధర్మారావు భార్యయైన అరుంధతి తన మామగారి వివాహములకు నవ్వుచు హాస్యమాడగా ధర్మారావు కుపితుడై మా తండ్రి యేమనుకొంటివి ఆయన లోకసామాన్యుడుగాడు. ఆయన గొప్పతనము దౌర్భాగ్యులకెట్లు తెలియును అనెను. మరియు ధర్మారావునకు తండ్రియనగా సుబ్రహ్మణ్యస్వామి కపరాంశమనిన నమ్మకము. గిరిక, త్రయీవిద్యకొక వ్యాఖ్యానము. భారతాత్మ వర్ణాశ్రమ ధర్మములన్నియు ముద్దకట్టినమూర్తి, తేజఃపుంజము, దాతయైన రామేశ్వరశాస్త్రికి జనించుటతో నామెకు హృదయ సంస్కారము, ఇహభోగ నైరాశ్యములు కలిగినవి. తండ్రి యిట్టి సద్గుణ సంపన్నుడు కాగా తల్లియగు రత్నగిరి భరతవిద్యాప్రవీణ, అభినయకుశల, రామేశ్వరశాపస్త్రినే దైవముగా నమ్ముకొన్న పతివ్రత. భక్తురాలు, తల్లిదండ్రుల గుణములన్నియు తనకు వలసినంతగ పుణికిపుచ్చుకొన్నది గిరిక. సౌందర్యములో క్షీరసాగర కన్యకు దీటు ! ఈ లక్షణము ఆమె ప్రియుడైన వేణుగోపాలుని వశమొనర్చుకొనుటకు తెచ్చుకొన్నట్టిది. అన్నయైన ధర్మారావీమె భక్తి మార్గమునకొక ప్రణాళిక నేర్పాటుచేసి ఆమెలో క్రమపరిణామ వికాసము కలుగుటకు తోడ్పడెను. గిరికలో భక్తి ఒక్కసారిగ పతాకస్థాయి నందుకొనలేదు. నిచ్చెన మెట్లెక్కవలెనన్న నొక్కొక్క మెట్టెక్కవలయునో అట్టి క్రమక్రమారోహణముతో ఆమె భక్తి వికాసము పరిణామమందినది. గిరిక యొక్క పాత్ర చిత్రణము సజీవముగా నున్నదనుటకీ యొక్క గుణమైన చాలును.
ప్రారంభమున జననీజనకుల సదాశయములు సత్సంప్రదాయ పాలనము పూర్వజన్మ సుకృతము. గురువైన ధర్మారావు శిక్షణము, తల్లినుండి సంప్రాప్తమైన భరత విద్య, గిరికను సర్వసంపూర్ణమైన భక్తిశృంగార మూర్తినిగ తీర్చిదిద్దుటకర్హమైన పరికరములైనవి. ఆమెలో కృష్ణభక్తి బీజరూపమైయుండి మొలకెత్తి మొక్కయై, మ్రానై, పుష్పించి, ఫలించి అమృతఫలమైన ముక్తిని ప్రసాదించినది. గిరికలో నిట్టి క్రమపరిణామమును ప్రతిభావంతముగ శ్రీ విశ్వనాథ చిత్రించిరి.
పన్నెండు సంవత్సరముల వయస్సులో నున్నప్పుడు గిరిక భక్తి మార్గము మంచిదా ? జ్ఞానమార్గము మంచిదాయన్న సందిగ్ధ స్థితిలోపడినది. అప్పటికామెలో సౌందర్యము తన స్థానమును వెదకికొనుచున్నది. ఆమె పలువరుస సుదర్శనాయుధపుటంచులవలెను, చెవులు శ్రీకారములై పాంచజన్యములవలెనుచ కన్నులు కమలములవలెను, నాసిక కౌమోదకివలెను, భ్రూయుగము శార్జయుద్విధావిభక్తమైనట్లు సర్వాంగములు విష్ణుచిహ్నములైనవి. వర్ణనలో ఆమె దేవతగ శ్రీ విష్ణుదేవుని పంచాయుధ సన్నివేశం దానికధిష్టాతఅయిన మహావిష్ణు వైభవం వికుంఠమనోజ్ఞత ఆమెవ్యక్తిలోనిక్షేపించబడింది. ఈ సమయమున గిరిక యొక్క బాహ్యసౌందర్యవర్ణన ఆమె అంత స్సౌందర్యముతో నేకీకృతముకాగా సర్వము విష్ణుమయమైనది.
|