15
 


ప‌దునెనిమిదేండ్లు వ‌చ్చుస‌రికి గిరిక చూచియ జూడ‌దు. ప‌లికియ ప‌లుక‌ద‌న్న త‌న్మ‌యావ‌స్థ‌కు చేరుకొన్న‌ది. స‌ర్వ‌కాల స‌ర్వావ‌స్థ‌ల‌యందునా గోపిక‌యై తాదాత్మ్య‌ము పొంది అంత‌ర్దృష్టి నేర్ప‌ర‌చుకొన్న‌ది. ఆమె భావ‌ము వేరు ఆమె లోక‌ము వేరు కాగా నొక విచిత్రావ‌స్థ‌లో జీవించుట గిరికకు స‌హ‌జ‌స్థితియైన‌ది. మువ్వ‌గోపాలుని ప‌ద‌ములు పాడుచు రుక్మిణీదేవి నేనే శ్రీ‌కృష్ణుడు నీవే అని నాట్య‌మాడుచు స్వామి పొందు ల‌భించిన‌దానివ‌లె ల‌జ్జారేఖ‌మోమున భాసింప‌గా శృంగార‌మూర్తియైన‌ది గిరిక‌. గిరిక‌కు త‌న‌లోని భావావేశ‌మున‌కొక రూపుదిద్దిన‌ట్లుగ స్వ‌ప్న‌ములు రాదొడ‌గిన‌వి. ఫ్రాయిడ్ వంటి మ‌నోవిశ్లేష‌ణ శాస్త్ర‌జ్ఞులు స్వ‌ప్న‌ములు వ్య‌క్తి యొక్క వ్యక్తిత్వ‌మును ప్ర‌తిబింబించున‌నియు, అర్ధ‌వంత‌ములున‌నియు భావించిరి. హిందుత‌త్త్వ‌మును కూడ స్వ‌ప్న‌మున‌కు ప్రాముఖ్య‌మీయ‌బ‌డినది. నిద్ర‌, జాగృత్‌, స్వ‌ప్నావ‌స్థ‌ల‌కు స‌మ ప్రాధాన్య‌మీయ‌బ‌డిన‌ది. వ్య‌క్తి యొక్క చేత‌న‌నుమించి, మ‌న‌సు స్వ‌ప్నావ‌స్థ‌లో చ‌రింప‌గ‌ల్గుట గ‌మ‌నార్హ‌ము. వేదాంతులు మాత్ర‌ము క‌ల క‌ల్ల‌యందురు. వారికి ప్ర‌పంచ‌మే మిధ్య‌యైన‌పుడు క‌ల కూడ మ‌రింత మిధ్య య‌గుట‌లో నాశ్చ‌ర్య‌ములేదు. గిరిక యొక్క మాన‌సిక ప‌రిణామ‌ములు స్వ‌ప్న‌రూప‌మున వ‌ర్ణింప‌బడిన‌వి. ఈ క‌ల‌లోకూడ నొక క్ర‌మ‌ము పాటింప‌బ‌డుట‌చేత గిరిక యొక్క మాన‌సిక క్ర‌మ‌ప‌రిణామావ‌స్థ వెల్ల‌డించిన‌ట్ల‌యిన‌ది. ప్ర‌థ‌మమున స్వామి లీలామూర్తియైనాకు క్ష‌ణ‌కాల‌ముత్త‌రీయ‌ము మాత్ర‌ము గిరిక‌కు క‌నుపించెను. మ‌రియొక‌సారి గిరిక స్వామికి తాను క‌నుపించిన‌చో నాత‌డు మాయ‌మ‌గునేమోయ‌ని భావించి పొద‌ల‌మాటున దాగుండి కృష్ణ‌మూర్తిని క‌నులార గాంచిన‌ది. చివ‌ర‌కు స్వామి పొందునంద‌గ‌ల్గిన‌ది. గిరిక ఆల‌య‌మున నృత్య‌ము చేయు స‌మ‌య‌మున ఆమె అభిన‌య‌మున‌కు అరుంధ‌తివంటి ప్రేక్ష‌కుల‌చ్చెరువునందిరి. నిజ‌ముగ స్వామితో గూడి య‌నుభ‌వించిన‌దానివ‌లె య‌దుకుల తిల‌కుని వ‌శ‌ము చేసికొనిన దానివ‌లెను వారికి క‌నుపించిన‌ది. సంభోగ శృంగార‌మునంత యంద‌ముగ న‌భిన‌యింప‌గ‌ల కార‌ణ‌మామె వారికి చెప్పిన‌ది. రాతిరి జ‌రిగిన‌దిదే. ద‌ర్శ‌న‌ము మూడు విధ‌ములు. రాత్రి స్వ‌ప్న ద‌ర్శ‌న‌మైన‌ది అని ప‌లికి కృష్ణ‌లీల‌ల‌న్నియు న‌భినయించిన‌ది. దేవదాసి నృత్య‌రేఖాభిరామ‌యై ఆల‌య‌మంత‌టిని మెఱ‌పించిన‌ది. ప్రేక్ష‌కులు త‌న్నిర్గ‌త పీయూష‌ధారాస‌దృశ ర‌స‌వ‌ర్ష‌మున ఇబ్బ‌డి ముబ్బ‌డిగ త‌డియుచుండిరి. అభిన‌యావ‌సాన‌మున గిరిక స్వేద‌మ‌నోహ‌ర‌మూర్తియై నిల‌చిన‌ది. ఆ నిల‌చుట‌లో క‌డ‌చిన రాతిరి స్వ‌ప్న‌గ‌తుడైన స్వామితో నేక‌ళ‌య్యాగ‌త‌యై స్వామిచేత స‌ర్వ‌తః ప‌రిభుక్త స్వ‌యౌవ‌న వేళ నెట్లు ర‌త్యంత స్వేద మ‌నోహ‌ర‌మూర్తియై తానుండెనోయ‌ట్లు నిలిచిన‌ది. శోష పొందిన‌ది. స్వామి మ‌న్మ‌ధ‌డుకాగా తాను ర‌తియైన‌ది గిరిక‌.

బ‌హు త‌పస్సులు చేసిన‌గాని ఋషుల‌కు స్వామి ద‌ర్శ‌న‌ము ల‌భింప‌లేదు. గిరిక చేసిన‌ది క‌ళాత‌పస్సు. ఈ త‌ప‌స్సున‌కు ధ్యాన‌ము రాగ‌ము, జ‌ప‌ము తాళ‌ము, స్నాన‌ము నృత్య‌ము ఆమె ప‌తాక‌హ‌స్త‌మును ప‌ట్టుతీరు చూచిన ధ‌ర్మారావు ప‌ద్మినీ జాతి స్త్రీ ల‌క్ష‌ణ‌మామెలో సంపూర్ణ‌ముగ నున్న‌ద‌ని త‌ల‌చెను. తండ్రి త‌మ‌యందెన్నియో ఆశ‌లు పెట్టుకొనెనుగాని గిరిక యందే సంపూర్ణ మ‌నోర‌ధుడ‌ని ధ‌ర్మారావు భావించెను.


గ్రామ‌ములోని ప్ర‌జ‌ల‌కు గిరిక‌య‌న్న‌చో గౌర‌వ‌ము పెర‌గ‌సాగిన‌ది. ఆ యూరిలో పొల్లు మాట‌లాడ‌ని దొక్క గిరిక‌ను గుఱించియే. రాణీ రుక్మిణ‌మ్మారావున‌కు, స‌రోజినీదేవికినికూడ గిరిక వేణుగోపాలుని యిష్ట స‌ఖియ‌ను త‌లంపు వ‌చ్చిన‌ది. ఆల‌య‌ములో పూజారి పాదుక‌ల‌ను ముందు గిరిక‌కు ప్ర‌సాదించిన త‌రువాత‌నే రాణి కిచ్చెడివాడు.  ఏకాద‌శుల‌యందును, పర్వ‌దిన‌ములందునుగాక మిగిలిన దిన‌ముల కూడ ఆమె కొర‌కాల‌య‌మును తెర‌చియుండెడివాడు.

గిరిక మ‌రికొంత కాల‌మున‌కు యోగ‌విద్య‌లోకూడ నారి తేరి ప‌ద్మాస‌న‌స్థ‌యై ప్రాణాయ‌మముప‌ట్టి దృష్టిని భ్రూయుగ మ‌ధ్య‌మున బిగింప‌గ‌ల్గి యుండెను. యోగ‌మ‌న‌గా క‌ల‌యిక‌. నాట్య‌యోగ‌మున ఆల‌య‌మున‌నున్న కృష్ణ‌దేవుని ప‌ర‌మాత్మ‌గ భావించి తానా ప‌ర‌మాత్మ‌తో లీన‌మైన‌ట్లు భావ‌న చెందిన‌ది. ఇచ‌ల గిరిక యేకాగ్ర‌త‌యే, యోగ‌ము, ప‌ద్మాస‌న‌వ‌స్థ‌యై యోగావ‌స్థ‌లో ర‌మించుట వ్య‌క్తియొక్క అంత‌రంగ గ‌మ‌న‌మును సూచించును. ఇచ‌ట గిరిక వాంఛ‌లు రేకెత్తించుచు మ‌నుసు వ‌శ‌మై హృద‌య ప‌ద్మ‌మున‌నున్న ప‌ర‌మాత్మ‌ను చేరుకొనుట‌కుగ‌ల య‌ర్హ‌త‌ను సంపాదించుకొనిన‌ద‌న‌వ‌లెను. ఇప్ప‌ట్ల‌నీమె ఆంగిక ప్ర‌ధాన‌మైన నాట్య‌మును చేయ‌వ‌ల‌సిన య‌వ‌స‌ర‌ములేదు. కాని త‌ర‌త‌ర‌ముల‌నుండి వ‌చ్చు దేవదాసీ తత్త్వ‌మునంత‌యు త‌న‌లోనిముడ్చుకొని లోక‌మున‌కా సంప్ర‌దాయ‌ములోనున్న దివ్యానుభూతిని సంప్ర‌ద‌త్త‌ము చేయుట‌కై కార‌ణ‌జ‌న్మ మెత్తినందువ‌ల‌న క‌డ‌వర‌కు నాట్య యోగ‌మునే య‌వ‌లంబించిన‌ది. నాట్య స‌మ‌య‌మున మోహినీ దేవ‌త‌వ‌లె త‌ను వెల్ల సింగారించుకొని, స‌ర్వాలంకార‌శోభిత‌యై స‌ర్వాంగ‌ముల‌యందునా ప‌రిపూర్ణ శోభాశ్రీ విరాజిల్లి నిర్గుణ‌డు, స‌గుణుడున‌యిన భ‌గ‌వంతుని కిష్ట‌స‌ఖివ‌లె భాసించిన‌ది.

వ‌య‌సుతోగూడి మ‌న‌సు, మ‌న‌సుతోగూడి భ‌క్తియు, భ‌క్తితోగూడి నాట్య‌మును, నాట్య‌ముతోగూడి శృంగార‌మును ఒక‌దానితో మ‌రియొక‌టి పెన‌వేసికొని గిరిక చిత్ర‌ముగ నొక్క రూప‌మంది స్వామికి ప్రియ స‌తియైన‌ది.

తెల్ల‌ని చీర ధ‌రించి క్షీర‌సాగ‌ర క‌న్య‌వ‌లె ప్ర‌కాశించుచు వేణుగోపాలుని ప‌ద‌ప‌ద్మ‌ముల‌పై దృష్టిని కేంద్రీక‌రించి అర‌మోడ్పు క‌న్నుల‌తో స్వామి న‌ఖ‌శిఖ ప‌ర్యంత‌ము ప్ర‌కాశించు నీల‌కాంతుల‌ను త‌న లోనాళ‌ము లోనికి ప్ర‌స‌రింప‌చేసికొనిన‌ది. ఇచ‌ట గిరిక‌యొక్క భావ‌నాబ‌ల‌ము వ్య‌క్త‌మ‌గుచున్న‌ది. ఆమెకు మ‌న‌సా కృష్ణునితో నైక్య‌ము కాగ‌ల యేకాగ్ర‌త సిద్ధించిన‌ద‌న‌వ‌చ్చును. ఏల‌న‌న‌గా గిరిక‌ను చూడ‌గానే స‌రోజినీదేవికి దేవ‌దాసి కంఠ‌ము, శంఖ‌ముగ‌ను, న‌డుము చ‌క్ర‌ముగ‌ను, క‌నులు ప‌ద్మ‌ములుగ‌ను క‌నుపించిన‌వి. శ‌శిరేఖ కామెలో క‌న్నుల‌నుండి వెద‌జ‌ల్ల‌బ‌డిన దివ్య‌రోచిస్సులు ద్యోత‌క‌ము కాగా, హ‌ర‌ప్ప‌కు గిరిక‌లో సాక్షాద్భ‌గ‌వంతుడే కానుపించెను. ఇచ‌ట గిరిక‌కు కృష్ణునితో న‌భేద‌ము వ‌ర్ణింప‌బ‌డిన‌ది. ఈ విష‌య‌ము ఉపాస‌కుల‌లో య‌ధార్ధ‌మ‌గుట‌కూడ జ‌రుగుచుండును.