మ్రోయు తుమ్మెదలోని నాయకుడైన నారాయణరావుగారు గానము చేయుచుండగా మొదటిసారి వినిన విశ్వనాథ సత్యనరాయణగారిట్లనిరట, మీరు పాడుతున్నంతసేపూ మీ ముఖం చూస్తుంటే పురుషుడి ముఖం చూచినట్టుగా అనిపించటంలేదు స్త్రీ ముఖం చూచినట్లుగావుంది..అది వారి ప్రధమ సమావేశం. నారాయణరావుగారి కామాట విన్నంతనే సంతోషము కలిగి ఈ మాట నాతో ఎవరంటారా అని ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నాను అన్నారు అని శ్రీ జువ్వాడి గౌతమరావుగారు వ్రాసిరి. ఇటువంటి విషయమే నాయన యని పిలువబడు గణపతిముని యెడల జరిగినది. నాయనను మొదటసారి చూచినప్పుడు శ్రీ అరవిందయోగి నాయననుగూర్చి యాతని శిష్యునిట్లడిగెను. కావ్యకంఠుడు గణపతి యుపాసకుడా అని. ఇట్లే గిరిక యొక్క కృష్ణోపాలనా ఫలితముగనామె కృష్ణ చిహ్నాలంకృతమైనట్లుగ భాసించినది. ఆమె యొక్క యుపాసనా తీవ్రత్వముకూడ నీవిశేషములు రూఢమును గావించుచున్నవి. నీచుడైన రామేశము గిరికపై వాంఛా దృష్టలు ప్రసరింపజేసినంతనే యతని కామె కన్నులలో సుదర్శన చక్రము గిరగిర తిరిగినట్లుగ తోచినది. సుదర్శన చక్రము శిక్షకు చిహ్నము. రామేశము శిక్షార్హుడగుట ఇట ధ్వని.
గిరిక భక్తి, నాట్యయోగములలో నిష్ణాతయైననాటినుండియు నామె స్వామి ఎప్పుడు తనను స్వీకరించునా ఎప్పుడు కళ్యాణోత్సవములు జరుగునా స్వామి చేతుల తన చేతులతో నెప్పుడు పెనవేసికొనునా యని కన్నులలో వత్తులు వైచికొని యెదురు తెన్నులు చూచుట మొదలిడినది. ఉపవాసములు - ఏకభుక్తములు నధికమయ్యెను. ఏకాదశులలో భజనలతో రత్నగిరి గృహము వైకుంఠమునుతలపింప జేయుచుండెను.
ఆమె మనస్థితి యొక దశకు చేరుకొన్న తరువాత స్వామి కలలోనైనా కనబడుట మానెను. ఆమెలో విరహము భరింపశక్యము కానంతగ పెరిగి ఆత్మహత్య చేసికొందమన్నంత తీవ్రముగనైనది. ఎంత తపస్సు జేసిన నెంత వ్యధ జెందినను స్వామి రాడేమి. తనపై స్వామికిష్టములేదేమో అని శంకితయైనది. శరీరముపై విముఖత్వము కలుగుట భగవంతునికై యార్తిచెందుట గిరిక యొక్క మధురభక్తి పరాకాష్ఠ దశకు చేరుకొనుట సూచించుచున్నది. ఇది యామె చేసికొన్న పూర్వజన్మ సంస్కారము. రుక్మిణమ్మారావుగారు గిరికను రక్షించినట్లే తననుగూడ రక్షింపుమని ధర్మారావును కోరినది. ధర్మారావు గిరిక యొక్క ఉత్కృష్టదశకు తాను కారణమును కానని చెప్పెను. తల్లీ అది నా చేతిలోనున్నచో నన్ను నేను రక్షించుకోనా. ఎవరి పూర్వజన్మ సంస్కారమెట్టిదో వారికట్టి మార్గము నడుచును అనెను. ఆమెదేవదాసీత్వమంతయు గూడుకట్టిన మూర్తి యనియు వందల యేండ్లుగ మన దేశముననున్న యీ సంస్థ నశించి పోవు రోజులలో తన మహాత్మ్యమంతయు జూపుటకు వెలసిన మూర్తియనియు ధర్మారావు చెప్పెను.
ఎంతో కాలముగ గ్రామ ప్రజలందరు నెదురు చూచుచున్న వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవములు వచ్చినవి. కేవలమందుకొరకే జనించిన హరప్పకా యుత్సవములు కేవలము వేడుకలు కావనిపించెను. అష్టమినాడు కళ్యాణోత్సవములు ప్రారంభింపబడినవి. వేణుగోపాలస్వామి యాలయాలంకారములు వైకుంఠభ్రాంతి జనకలములైనవి. అష్టమీ చంద్రజ్యోత్స్నలు సభా ప్రాంగణమంతయు తమ కరములను జూచి యావరించి పాల్కడలిని తోపించుచుండెను. ఆనాడు స్వామి ప్రధమాతవారమైన మత్స్య వేషముతో మత్స్యావతారియైనాడు. అలంకరణమంతయు తత్కఘానుగుణముగ సాగినది. దేవదాసి తల్లియైన రత్నగిరి మంచి ధ్వనినిచ్చు వెండి మువ్వలను ప్రత్యేకముగ నేరి దేవనర్తకీమణులకు సంప్రదాయమైనట్లుగ నల్లని పట్టుతాడుకా వెండి మువ్వలను గ్రుచ్చినది. వాని చిరుసవ్వడి కర్ణానందముగనుండెను. దేవదాసి యా మువ్వలను ధరించి సర్వాలంకార భూషితయైనది.
వేణుగోపాలుని మత్స్యాకృతికి తగినట్లుగ మత్స్యకుటుంబినివలె గిరిక యలంకరించుకొన్నది. అర్ధ చంద్రాకృతిగ బంగరు రేకును పాపటను ధరించినది. కనులు సహజముగ మీనాకృతులగుటచే మీనభ్రాంతి కల్గింపనవసరములేకున్నను స్ఫుటభావన కొరకు కనుగొలకుల నామముతో మూడు గీతలు గీచి సాక్షాన్మీనములేయన్నట్లు చేసినది. మెడక్రింద మూడు ఏన్గుదంతముల సలాకలనమర్చినది.మత్స్య కన్యయై భోగప్పయను కూచిపూడి నాట్య కళారాధకుడు నటుడై నిలువగ వేణు వీణా మృదంగ వాద్యములతోడను సంగీతముతోడను నాట్యమునారంభించినది గిరిక. అపుడాలయములోని ప్రభువు దేవదాసిని చూచుచున్నట్లుండెను. ఆమె సౌందర్య దీధితులు దుర్నిరీక్ష్యములు కాగా ప్రజలందరును తమకు తాము ధన్యులమైనట్లు భావించిరి. ఆమె మహాసభకు నమస్కరించి మహాభిసారికా నృత్యమారంభించినది. ఆమె భగవంతునియందు నిత్యాభిసారికయైనట్లుగ పాదవిన్యాసము చేసినది. తొలుత వర్ణాభిసారికయై పిదప జ్యోత్నాభిసారికయైనది. ఆమె భక్తకి మువ్వగోపాల పదములు రాపిడిపెట్టి మరింత జ్వలించునట్లుగ తోడ్పడి మధుర భక్తిని గావించినవి. మ్రొక్కేర మువ్వగోపాల యనుచు ప్రౌఢాభిసారికయైనది. కాలము గడచుకొలది ప్రేక్షకులు తన్మయులైరి. హరప్పయందు నిశ్చలత్వము ధర్మారావునందు నిశ్చైతన్యము సభ్యులలోని స్తబ్దత గోచరించినది. అది మత్స్యమూర్తి నీటిలో త్రవ్వుకొనిపోవునప్పటి ధ్వనివలె మృదంగతాళ వేణువీణాదుల ధ్వనియంతయుగలసి మహాశ్రుతియందు లగ్నమైన యాలయ ముఖగిరికయొక్క నాట్యము వేదక్రతువు సమాచరింపబడినట్లు, అగ్నిష్టోమము పూర్తియైనట్లుగ దోపింపజేసినది. ప్రేక్షకులు నాల్గువేదములొక్కసారిగ రూపుదాల్చినట్లు భావించిరి. అంత గిరిక తన్మయావస్థనంది స్మృతిని గోల్పోయినది.
|