దృజ్మనస్సంగ సంకల్పో జాగరః కృశతాంరతిః
హ్రీత్యాగోన్మాద మూర్చాంతా ఇత్యనంగ దశాదశ
అనినట్లుగ గిరిక భగవంతునికై దశవిధ మన్మధావస్థల ననుభవించి, మూర్ఛావస్థననుభవించినది.
ఇచట విశ్వనాథవారు గిరిక యొక్క అలంకారమును రంగస్థలిని, ఆమె నాట్యాభినయకౌశలముల భక్తి పారవశ్యమును అత్యద్భుతముగ వర్ణించి వారికిగల నృత్యకళాభిజ్ఞతను స్పష్టముచేసియున్నారు. హరప్పను సభానాయకునిగను ధర్మారావు శాస్త్రనిర్దిష్టగను నియమింపబడి నాయక మంత్రి లక్షణముచేత ఇంద్ర బృహస్పతులవలె రాణించిరి. శ్రీమంతుడు ధీమంతుడు వివేకి వితరణి గాన విద్యా రహస్యవేత్త సర్వజ్ఞుడు, కీర్తిశాలి హావభావాభిజ్ఞుడు, ఆచారశీలుడు, దయాశుడు హరప్ప. స్థిరభాషి. గుణవరుడు, భావజ్ఞుడు, గుణదోష భేద నిపుణుడు, శృంగార లీలావిదుడు, నయకోవిదుడు, సహృదయుడు, పండితుడు ధర్మారావు సభానాయకునికిని సభామంత్రికిని ఇంతటి సుగుణము లున్నవన్నచో నాటి నాట్యమెంత రమణీయమగునున్నదో వర్ణింపనసాధ్యము. గిరిక సమశిరస్కయు సమదృష్టియునై పతాక హస్తమును పట్టుట పొల పద్మహస్తమును ధరించుట మొదలైన పరిభాష రచయిత యొక్క నాట్య శాస్త్రజ్ఞతను తెలియజేయును. కర్తరీముఖమున గడకన్ను జోడించి తన భావమంతయు స్వామికి నివేదించుటలోనను, ధర్మారావు దక్షిణ వామహస్తములచేత నర్థ చంద్రహస్తములు బోర్లించి వామహస్తముపై దక్షిణ హస్తముంచి కూర్మహస్తాకృతి రెండు బొట్టనవ్రేళ్ళ నల్లలడించుటలో వీరి కళాభిజ్ఞానము బహిర్గతమగుచున్నది.
ధర్మారావు మరుసటి దినమునకు సంబంధించిన స్వామి యవతారమైన కూర్మాకృతిని తోపించు కూర్మహస్తమును పట్టగా గిరిక ప్రపంచమునకు వచ్చినది. మరల మంత్ర పునశ్చరణమును ప్రారంభించినది. నృత్యములు జరిగి నన్నినాళ్ళును గిరిక బాలగోపాల మంత్రము నత్యంత దీక్షాశ్రధ్దలతో జపించినది.
రెండవనాడు వేణుగోపాలుడు కూర్మావతారమునెత్తినాడు. ఆయనకు తగినట్లుగ గిరికకూడ కూర్మ కన్యయైనది. పతినిమ్మని గౌరీపతిని ప్రార్ధించినది. మదనుడు చేసిన చైదములన్నియును మువ్వగోపాలునకు మొరపెట్టుకొన్నాది. తాను విరహసముద్రమునపడి కొట్టుకొనిపోవుచునే ప్రేక్షకులను రససముద్రమున మునకలెత్తించినది. స్వామి కొరకు విలపించి, తపించి చివరకు వివశయైనది. పెద్దింటి స్త్రీలందరును గిరికను లక్ష్మీదేవిని సేవించినట్లుగ సేవించిరి.
గిరిక యొక్క నాట్యకౌశల్యము చూచిన హరప్ప మనస్సు విహంగమైనది. ఆమె యభినయము లక్ష్మీనారయణుల సంభోగశృంగారమువలెనున్నదని యతడు భావించెను. ధర్మారావున కామె సాధన సంపూర్ణముకాబోవుచున్ననట్లుగ తోపగా భోగప్ప సర్వశాస్త్రార్దమున కామె యుదాహరణమనుకొని ఆమెను స్వామి దరికి చేర్చుటకు మరింత కృషిచేయదలచి హాస్యోక్తులను చతురోక్తులను ప్రయోగించి గిరిక మనస్సును మరింత రాపెట్టెను. కళ్యాణోత్సవములు జరుగుచునేయున్నవి.
గిరికది నాట్యప్రదర్శనముకాదు. తన కళాతపస్సును పండించుకొనుట కనువైన స్థానము. వరాహావతార నృసింహావతారములుకూడ పరమౌచిత్యముగ నభినయింపబడి ముగిసినవి. గిరిక నాట్యము సమాప్తమైన తరువాత మరునాడు స్వామికట్టబోవు నవతారమునుగూర్చి జపించు చుండెడిది. ధర్మారావు రాబోవు నవతారసూచకముగ హస్తముద్ర నభినయించెడివాడు.
రామావతార ఘట్టము వచ్చినది. ముఖమంటపమంతట రామాయణ కథా సన్నివేశములనేకములు చిత్రింపబడి యలంకృతములైనవి. దేవదాసి ముఖమున ఆనాడొక చిత్రమైన ప్రశాంతిరేఖ ప్రస్ఫుటముగా నుండెను. ఆమె రామచంద్రునికి ప్రధమదర్శనమందే హృదయమునంకితము చేయుట నభినయించినది. చెలికెత్తె లాతడు ధనువును విరచునోలేదో మనసునెట్లర్పించితివి అని మేలమాడగా ధనుర్భంగకారి కాని వానిపై తనమనస్సు ప్రసరింపదనిపల్కినది. వివాహసమయమున వాద్యగాండ్రు శుభధ్వనిని గ్రుమ్మరించిరి దేవదాసి తన్మయాకృతియైనది. ఆనాటి నృత్యము సర్వజనులకు నాధ్యాత్మదృష్టియే కల్పించెను. మద్దెల మ్రోయించినట్లులేదు తాళములు వాయించినట్లేలేవు. వీణానినాదము కదలినట్టు లేదు. శ్రవణేంద్రియము నేత్రేంద్రియముతో లీనమైచూచిన రూపమునకు విన్న శబ్దమునకు భిన్నత్వములేక యవిరెండును మనస్సు ద్వారా యాత్మకుదగిలినవన్న విభేద జ్ఞానములేక సనాతనుని యనంత క్షీరసాగర మధ్యవీచీ శేషతల్పనిద్రిత నారాయణ డింభమూర్తి సమానోచ్ఛ్వాస నిశ్వాసములవలె సభయంతము నొక్కశ్వాసమీదనాడెను సభయంతము లక్ష్మీనారాయణుల దర్శనఫలమును పొందినంతగ తుష్టులై సంతృప్తులైరి. ప్రతిపురుషుడు తాను రాముడనని భావింపగా ప్రతి స్త్రీ తానే జానకినని భావించింది. గిరిక యొక్క నాట్యవైభవ ప్రయోజనమింత కన్న సంఘమునకు లభించుట దుస్సాధ్యము. ధర్మారావు కృష్ణావతారహస్తమును పట్టగా కుంభహారతీయబడినది.
|