గణకారికయన్నది. లక్ష్మీదేవికి పర్యాయనామము. గణకారికయన్న పేరు ప్రజలనాల్కపై నలిగి గణాచారిగ రూపాంతర మందియుండవచ్చును. జంభినీ జృంభిణీ జృంభకారిణీ గణకారికా సుబ్రహ్మణ్యుడు వ్యాఖ్యానము చేయుచుండుటచే గణాచారికిని లక్ష్మికిని సంబంధమేమనరాదు. సూక్ష్మముగ చూచినచో పరదేవతాస్వరూపమొక్కటిగ మత్రమే కన్పట్టును తరువాత కాలమున గణాచారియన్నది క్షుద్రదేవతకు పర్యాయముగ కొన్ని గ్రామములలో వాడుకయున్నది. ఈ గణాచారికి పూనకములు వచ్చును. అనగా నీమెను గ్రామదేవత యావేశించి మేకలను కోళ్ళను బలియడుగును.ప్రజలీమెకు మ్రొక్కులు తీర్చుట ప్రభలు కట్టుట జరుగును. వీరిలో నిజమైన యుపాసకులకన్న మోసగత్తె లెక్కువగుటచే గణాచారులన్న నొకానొక తూష్ణీంభావము ప్రజలలో నేర్పడినది. ప్రస్తుతకాలమున దేవుని పేర ననేకములగు నన్యాయ్యములు జరుగుటచే శక్తిసామర్థ్యములున్న వారిని సహితము అనుమానించు దుర్దశ ప్రజలకు పట్టినది. ఇట్లే లోకమున దొంగస్వాములవార్లధికముగటచే నిజమైన స్వాములను సహితము వారి సరసనే జేర్చుటకు అవకాశము కల్గుచున్నది. ప్రజలలోనున్న బలహీనతను గ్రహించి తెలివిగలవారు కొందరు సొమ్ముచేసికొనుట జరుగుచున్నది. ప్రశ్నలు చెప్పుట, భవిష్యత్తు చెప్పుట, చిలక జోస్యము, సోది, మొదలైనవారు చేయు మోసములకంతములేదు. వీరికి ఎదుటివారుమాట్లాడు మాటలను బట్టి, అడుగుప్రశ్నలనుబట్టి వారి ముఖకవళికలను, భావసంచలనుమును గ్రహించి నిజములను సేకరింపగల నేర్పుండును. గద్దించి కూడ నిజములను సేకరించగల నేర్పుండును. గద్దించి ఎదుటివారికి అనుకూలముగ జోస్యముచెప్పి ధనమును దండుకొనెదరు. వీరు కొన్ని విద్యలను నేర్చుకొని వానిని ప్రయోగింతురు. కనికట్టు, వశీకరణవంటి విద్యలయందారితేరుదురు. ప్రపంచమునందిట్టి కుహనా గణాచారులు వ్యాపారము చేయుచున్నందున నిజమైన గణాచారులకు కూడ విలువలు సన్నగిల్లినవి. అన్ని సంప్రదాయముల వలెనే గణాచారి భవిష్యముకూడా క్షీణించుదశకు చేరుకొనినది.
వేయిపడగలు లోని గణాచారి యీ కోవకు చెందినదికాదు. భారత భూగర్భమున యోగినులకుగాని, ఋషులకుగాని పరోపకార పరాయణులకు గాని త్యాగమూర్తుకుగాని లోటన్నదిలేదు. విశ్వనాథ వారిట్టి పాత్రను సృజించుటలో నస్వాభావికతలేదు. ప్రజలయొక్క నైతికబలము ఆధ్యాత్మిక చింతనము పాపభీతి మొదలైన సద్గుణములు పాశ్చాత్య నాగరికతా ప్రభావమున హేతువాదచ్ఛాయలలో హేళనకు గుఱియగుట గణాచారి కనులారా గాంచినది. విగ్రహరూపమున నున్న స్వామియుగాంచుచునేయున్నాడు. కావుననే ధర్మఫణములు తమంతట తాము ముడుచుకొని పోవుట జరిగినది.
పూర్వము గణాచారి జనించు కాపునింట నొకయాడ శిశువుగల్గుటయు నామె గణాచారి యగుటయు సంప్రదాయముగనుండెడిది. కాని నాల్గువందల సంవత్సరముల తరువాత నదే సుబ్బన్నపేటలో ప్రజలు గణాచారిని చూచి హేళన చేయదొడగిరి. గణాచారి లేదు గిణాచారి లేదు. ఇదియొక యాట వయసులోనున్న యాడది సిగ్గులేక యిట్లూరివెంట గంతులు వేయుట ప్రజలు దైవాంశను గుర్తింపలేని యంధకార దశలోనున్నట్లీ మాటలవలన తెలియుచున్నది.
జాతి జీవనమున ననేకములైన నాగరికతలు వచ్చి కలియుచుండుట కాలవశమున జరుగుచుండును. సామాన్య ప్రజలా నాగరికతలోనున్న మంచి లక్షణములకంటె చెడు లక్షణముల కెక్కువ యాకర్షితులగుచుందురు. మంచిని చెప్పబోవువారిని చులకనగ చూచుట ఘనకార్యముగ భావింతురు.
ప్రస్తుత గణాచారి పరిస్థితి యిట్లేయున్నది. ఆమెశక్తి సామర్థ్యములను మహామహిమను గుర్తించినవారు ధర్మారావు వంటి కొద్దిమంది తప్ప మిలిగినవార లామెను గణనలోనికి తీసికొనలేదు. పిచ్చిదానిని చూచినట్లు చూడసాగిరి.
గణాచారి ప్రజలకేమైన విశేషములను తెలియజేయవలసి వచ్చినగాని గ్రామ సంచారముచేయదు. గ్రామమునకంతకు సంబంధించిన వార్త యైనచో తల విరియబోసికొని వేపబండపుచ్చుకొని తిరుగును. ఒకవ్యక్తికి మాత్రమే సంబంధించినట్లయిన కురులు ముడివైచికొని రావిమండ పుచ్చుకొని బయలు దేరును. శుభమైనచో నెఱ్ఱని చీర మామిడిమండ ధరించును. ఆశుభమైనచో తెల్లచీర ధరించును. ఈమె పేరు నాగమ్మ. కాని గణాచారియనియే నందురు చెప్పుకొందురు.
గణాచారి దినచర్య నియమనిష్ఠలతోనుండును. స్నానము చేసి భోజనమగువరకు జపము చేసికొనుచుండును. సాయంవేళ సుబ్రహ్మణ్యస్వామి కభిముఖముగ నిలచి ధ్యానించును. జరుగబోవు విషయములామెకు స్వప్నమున ప్రకాశించును.
ఒకనాడు గణాచారి తెల్లనిచీర గట్టుకొని రావిమండ పుచ్చుకొని వచ్చి కోటముందు నిలబడినది. ఆమెవచ్చి ఏ యింటి ముందు నిలుచునో ఆ యింటి యిలాలు వచ్చి గణాచారి యాగమనమునకు కారణమడుగుట యాచారము. కాని కోటముందు గణాచారి గంటల తరబడి నిలబడినను గణాచారినేమని యడిగినవారు లేరు. రాణియగు సరోజిని కీమోయాగమన వార్త రాణివాసపు పరిచారికలందీయలేదనగా వారలకీమెయందు విశ్వాసము లేదన్నట్లుగ తెలియుచున్నది. తుదకు సరోజినికి తెలిసి గణాచారికై పిలువనంపినది. గణాచారి రాణి మరణించునని దుఃఖించినది. గణాచారి నిలుచున్నది నిలుచున్నట్లు కంపించిపోయి బిగ్గరగ నేడ్వనారంభించెను. ఆమె గంతులు వేయుచు అయ్యో రాణి చచ్చిపొవును. చచ్చిపొవును అని శోకించుచు రావిమండ సగము త్రుంచి గుమ్మముదగ్గర పడవైచి పరుగెత్తుకొనిపోయినది. గణాచారి ప్రజల కష్టసుఖముల సూచనను చేయునేగాని యా భావముల ననుభవింపని నిర్లిప్తురాలు. కాని రాణి చనిపోవునని సామాన్య స్త్రీవలె రోదించి దుఃఖమునకతీతురాలు కాలేకపోయినది. ఇది స్థూలదృష్టి. యదార్థము వేఱుగనున్నది. ఈ పోవుచున్న రాణితోపాటుగ రాజ్ఞీత్వమే నశించిపోవుచున్నది. ఈ సంప్రదాయమున కీమె తుదిరూపు. రాజునకు రాణి బహిఃప్రాణము. రాజు, తాను (గణాచారి) స్వామి, బ్రాహ్మణుడు, కలసి యేర్పడిన నాలుగు స్తంభముల ధర్మమంటపములో నొక స్తంభము బీటవారబోవుచున్నది. ఇందులకు గణాచారి శోకము, నాల్గుస్తంభములలోనే యొక్కటి క్షీణించినను మంటపము బలహీనమయితీరును. గణాచారి జనించినది ధర్మసంరక్షణమునకై నప్పుడా ధర్మమంటపము యొక్క వినాశదశ ప్రారంభమును చూడవలసివచ్చుటచేత వివశురాలైనదని చెప్పవలెను. గణాచారితో నీ గణాచారి సంప్రదాయము నశించిపోవుటకూడ నిచట సూచనగనున్నది. త్రిగుణాతీతురాలగు గణాచారి దుఃఖము ననుభవించుటతో నామెలోని మహత్మ్యముకూడ క్షీణదశకు వచ్చుచున్నదనుటయే
|