24
 


రావిమండ‌లోని మిగిలిన స‌గ‌భాగ‌ము దేవాల‌య‌ము బ‌య‌ల వ‌ద‌లి రాణి స‌రోజిని ప‌తిని దైవ‌ముగ నెంచి పూజించుచున్న‌ది. అందుచేత నామె మ‌ర‌ణ‌సూచ‌క‌మగు రావిమండ‌ను దేవాల‌య ద్వార‌ము ద‌గ్గ‌ర వ‌ద‌లిన‌ది. పెద్ద రాణి రుక్మిణ‌మ్మారావు త‌న పాతివ్ర‌త్య‌మును భ‌గ‌వంతుని యందే ఫ‌లింప‌జేసిక‌నిన‌ది. ఆమె న‌డువ‌లేదు. ఆల‌య‌మున‌కు వెళ్ళ‌లేదు. అందుచేత నామె మ‌ర‌ణ‌సూచ‌క‌మ‌గు రావిమండ‌ను కోట‌ద్వార‌మున వ‌ద‌లిన‌ది. ఈ మండ‌లు కోట‌కును దేవాల‌య‌మున‌కుకూడ దుర్ద‌శ‌ను సూచించుచున్న‌వి. రాజుతోపాటు స్వామికి కూడా ప‌రిగ‌ణ‌న‌ము త‌గ్గున‌ని వ్యాఖ్యాన‌ము. ఇరువురు రాణులొక్క‌మారు మ‌ర‌ణించ‌గా రాజ్ఞీత్వ‌మే న‌శించున‌ని సూచింప‌బ‌డిన‌ది.

కాల‌క్ర‌మ‌మున సుబ్బ‌న్న పేట గ్రామ‌ము పట్ట‌ణ‌మైన‌ది. ప‌ట్ట‌ణ‌మున‌కు కావ‌ల‌సిన ల‌క్ష‌ణ‌ముల‌న్నియు నేర్ప‌డిన‌వి. పుర‌పాల‌క‌శాఖ‌కు మ‌హాసౌధ‌ము నిర్మింప‌బ‌డిన‌ది. నిర్మాణ‌ము పూర్తియైన త‌రుప‌రి త‌త్సౌధ‌ప్ర‌వేశ మ‌హోత్స‌వ‌మున కాహ్వానితుడై గ‌వ‌ర్న‌రు విచ్చేసెను. ఆ స‌మ‌య‌మున గ‌ణాచారి వేప‌మండ‌ల‌తో వెడ‌లి యా సౌధ‌ముయొక్క ముంద‌రి భాగ‌మున నొక మండ‌ను వైచిన‌ది. గ‌ణాచారి వ‌చ్చుట యెవ్వ‌రి కంట‌నుబ‌డ‌లేదు. పుర‌పాల‌క సంఘ అధ్య‌క్షుడైన చంద్రారెడ్డి గ‌ణాచారిని చూచి క‌ల‌త‌ప‌డెను. అతడా వేప‌మండ‌ను కాలితో ప్ర‌క్క‌కు త్రోచివైచెను. అట్లు త్రోయుట‌లో నేదియో యాత‌ని కాలిలో గ్రుచ్చుకొనిన‌ట్ల‌యిన‌ది. త‌రువాత‌న‌ది మోపుచేసి చంద్రారెడ్డి మంచుముమీదినుండి లేక‌వ‌లేపోయెను. అయిద‌వ‌నాటి యుద‌య‌మున గ‌ణాచారి యెండిన వేప‌మండ‌కు మ‌ఱియొక రావిమండ‌ను జ‌త‌చేసి క‌ట్టి చంద్రారెడ్డి యింటిముంగిట వైచిన‌ది. చంద్రారెడ్డి గ‌ణాచారిని యింటిలోనికి రమ్మ‌ని యాహ్వానించెను. కాని యామె ఆల‌య‌ము, ఇల్లు త‌ప్ప మ‌రియొక‌రి గ‌డ‌ప త్రొక్కి యెరుగ‌దు. అందుచేత నామె చంద్రారెడ్డి యింటిలోనికి పోక త‌న యింటికే పోయెను. ఆనాటి సాయంత్ర‌ము న‌కే చంద్రారెడ్డి కాలు నెమ్మ‌దించెను.

గ‌ణాచారి పుర‌పాల‌క సంఘ భ‌వ‌న నాశ‌న‌మును సూచించుచు వ‌ద‌లిన వేప‌మండ‌ను చంద్రారెడ్డి తిర‌స్కార సూచ‌క‌ముగ కాలితో త్రోయుట‌చే న‌త‌డ‌యిదు రోజులు బాధ‌న‌నుభ‌వింప‌వ‌ల‌సివ‌చ్చిన‌ది. అతని క‌ప‌కార‌ము జ‌రుగ‌కుండ మ‌ర‌ల శుభ‌సూచ‌క‌మగు రావిమండ‌నుకూడ జోడించి యింటిముంగిట వైచి దాక్షిణ్య‌మును చూపిన‌ది. చంద్రారెడ్డి పైకి తిర‌స్కార పూర్వ‌క‌ముగ మాట‌లాడిన‌ను లోప‌ల గ‌ణాచారియ‌న్న భీతి లేక‌పోలేదు. చంద్రారెడ్డి హృద‌య‌ము న‌వ‌గ‌త‌ము చేసికొన‌గ‌ల్గుశ‌క్తి గ‌ణాచారికున్న‌ది. కావున‌నే చంద్రారెడ్డి కొల‌దిమాత్ర‌పు శాస్తిచేసి గ‌ర్వ‌మ‌ణ‌చిన‌ది.

 

గ‌ణాచారికి నెదుటివారి హృద్గ‌త భావ‌ముల‌ను గ్ర‌హింప‌గ‌ల నేర్పుక‌ల‌ద‌ని మ‌రియొక సంఘ‌ట‌న‌మువ‌ల‌న తెలియుచున్న‌ది. ఒక‌నాడు ధ‌ర్మారావును కిరీటియ‌ను ధ‌ర్మారావు మిత్రుడును క‌లిసి సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌రాల‌య ప్ర‌వేశ‌మును చేసిరి. ఆ స‌మ‌య‌మున గ‌ణాచారి ఆల‌య‌మునందే యున్న‌ది. ఆల‌య‌ములోని విగ్ర‌హ‌ము ద్విఫ‌ణియై కిరీటికి ద‌ర్శ‌న‌మిచ్చెను. త‌రువాత ధ‌ర్మారావును కిరీటియును వెలుప‌లికి పోవుచుండ‌గా గ‌ణాచారి వెనుక‌నుండి కిరీటి నాశీర్వ‌దించిన‌ది. ఆమె త‌న‌వంక చూడ‌కుండ బోవుచున్న కిరీటివంకకు జేతెలెత్తి యాశీర్వ‌దించెను. అన‌గా సుబ్ర‌హ్మ‌ణ్యుడు స‌ర్ప‌రూప‌మున కిరీటికి ద‌ర్శ‌న‌మిచ్చిన‌ట్లుగ గ‌ణాచారికి తెలియుట య‌న‌గా నామెలో మ‌హ‌త్వ‌మున్న‌టులే. కిరీటి గొప్ప భ‌క్తుడుకూడ‌కాడు కాని య‌త‌ని భార్య దేవీయుపాస‌న‌జేసి య‌త‌నిని భ‌ర్త‌గ పొందిన‌ది. అతాడామెకై కృశించెను. వారిరువురిది యాద‌ర్శ దాంప‌త్య‌ము. కిరీటికి స్వామి రెండు ప‌డ‌గ‌లవాడై ద‌ర్శ‌న‌మీయ‌నేల గ‌ణాచారి దీవింప‌నేల య‌నిన‌చో స‌మాధాన‌మిదియే. స్వామి రెండు ప‌డ‌గ‌లును దాంప‌త్య జీవ‌న శోభ‌ను జాటు విశేష‌ములు. కిరీటి శ‌శిరేఖ‌ల‌ది అపురూప‌మైన బంధ‌ము. వీరి మ‌ధ్య‌నున్న య‌నురాగ‌మ‌తి దృఢ‌ముగ ముడివైచికొని గాఢ‌ముగ‌నైన‌ది. అందువ‌ల‌న‌నే దాంప‌త్య ధ‌ర్మము జాతియొక్క ధ‌ర్మ‌వృక్ష‌మున‌కు మూల‌కంద‌ము. వృక్ష‌ము తాత్కాలిక‌ముగ నెండిపోయిన‌ను మూల‌మ‌గు వేఱు మిగిలియున్న నేనాటికైన చిగురింప‌క‌మాన‌దు. తొమ్మ‌ది వంద‌ల తొంబ‌ది యెనిమిది ప‌డ‌గ‌లు న‌శించిన‌ను రెండు ప‌డ‌గ‌లు మాత్ర‌మే నిల‌చియున్న‌వి. అవియ‌టుల నిల‌చియే యుండ‌వ‌ల‌యును. దాంప‌త్య ధ‌ర్మ‌ర‌క్ష‌కుల‌గు కిరీటివంటివాన‌కి స్వామి ద‌ర్శ‌న మొస‌గుట‌, గ‌ణాచారి యాశీర్వ‌దించుట యన్న‌ది మిక్కిలి యుచిత‌ము. గ‌ణాచారికి తానుకూడ నిష్క్ర‌మ‌ణ‌ము చేయ‌వ‌లెన‌ని తెలిసిన‌ను కిరీటివంటి వానికి చ‌ల్ల‌ని యాశీస్సుల‌నంద‌జేసి దైవ‌త్వ‌మును ప్ర‌స్ఫుట మొన‌ర్చిన‌ది.