30
 


యం యం వాపిస్మ‌ర‌న్ భావం త్య‌జ‌త్య‌న్తే క‌ళేబ‌ర‌మ్‌

తం తేమ‌వైతి కొన్తేయ స‌దా త‌ద్భావ భావితః

జీవుడు దేనినిగూర్చి స్మ‌రించుచు శ‌రీర‌మును లాలించునో అద్దానినిగూర్చియే పున‌ర్జ‌న్మ‌మును పొందుచున్నాడ‌ని కృష్ణ‌భ‌గ‌వానుడు గీత‌లో ప్ర‌వ‌చించియున్నాడు. ఇట్లే జ‌డ‌భ‌ర‌తుడు యోగియైన‌ప్ప‌టికిని మ‌ర‌ణ స‌మ‌య‌మున ప్ర‌గాఢ‌ముగ‌నున్న మ‌మ‌కార‌ము వ‌ల‌న జింక‌నుగూర్చి యోచించుచు ప్రాణ‌ముల‌ను చాలించినందువ‌ల‌న మ‌రుజ‌న్మ‌మున జింక‌యై జ‌న్మించెను.


హ‌రిణంబుం ద‌న యాత్మ‌తో నిలిపి దేహంబంత‌టం బాసియా

హ‌ర‌ణీ గ‌ర్భ‌మున‌న్ జ‌నించి హ‌రిణంబై యొప్పె పూర్వ‌స్మృతిన్‌


అనునీ భాగ‌వ‌త ప‌ద్య‌మును బ‌ట్టి రెండు విష‌య‌ములు రూఢ‌ముల‌గుచున్న‌వి. మొద‌టిది అవ‌సాన‌కాల‌మున క‌లుగు కోరిక రెండ‌వ జ‌న్మ‌మున‌కు కార‌క‌మ‌గుట‌యు పూర్వ‌స్మృతి మ‌నుజుల‌కేగాక జంతు జాలాదుల‌కుకూడ క‌లుగున‌న్న‌ది రెండ‌వ విష‌య‌ము. జ‌డ‌భ‌ర‌తుడు హ‌రిణ జ‌న్మ‌మోత్తిన‌ప్ప‌టికిని పూర్వ‌స్మృతివ‌ల‌న యొప్పెన‌ట‌.

జాన‌కికి మ‌ర‌ణ‌కాల‌మున పాతివ్ర‌త్య‌ము మీద‌ను, ఏకాగ్ర భ‌ర్తృ భావ‌మునందును మ‌నసుండుట‌వ‌ల‌న మ‌ర‌ల న‌త‌నికి భార్య‌యై జ‌నించిన‌ది. అత‌నినే భ‌ర్త‌గ వ‌రించి వ్ర‌త సంపూర్తి గావించుట‌కు ఆమెకు పూర్వ రూప‌ము, పూర్వ‌స్మృతులునుండుట య‌న‌వ‌స‌ర‌ము. మ‌ర‌ల రామ‌క్క‌గ నీల‌కంఠ‌శాస్త్రిని పెండ్లియాడ‌వ‌చ్చును. విధాత ఆమె మొద‌టి జ‌న్మ‌లోని భ‌ర్త‌నే ఈ జ‌న్మ‌లో భ‌ర్త‌గ న‌నుగ్ర‌హించెను. ఆమె త‌న‌కు పూర్వ‌జ‌న్మ స్మృతియుండుట‌కు మ‌రియొక కార‌ణ‌ము చెప్పిన‌ది. నాకు పూర్వ‌జ‌న్మ జ్ఞానం ఉన్న‌ది. ఇది అధ‌మ‌యోగి ల‌క్ష‌ణం. కాని యోగంకాక‌పోలేదు.. నేను మ‌హాప‌తివ్ర‌త‌ను. జాన‌కి అధ‌మ‌యోగ‌ల‌క్ష‌ణ‌మ‌న్న‌ది కావున పాతివ్ర‌త్య‌మే య‌ధ‌మ‌యోగ‌మ‌న‌రాదు. పాతివ్ర‌త్య‌ము హృద‌య‌సంబంధి. స‌తీఅన‌సూయ త్రిమూర్తుల‌ను ప‌సివార‌ల‌నుగ చూడ‌గ‌ల్గిన‌ది. అన‌గా నామెకు భ‌ర్త‌త‌ప్ప పురుషులంద‌రును క‌న్న కొడుకుల‌తో స‌మాన‌మ‌ని సూచ‌న‌. ఆమెలోని ఏకాగ్ర‌త భావ‌ము యొక్క మ‌హిమ‌య‌ది. అధ‌మ‌యోగ‌మ‌న‌గా మోక్ష‌మార్గ‌మున నెక్కువ ప్ర‌యోజ‌న‌కారి కాకపోవుట‌యే. పూర్వ‌జ‌న్మ జ్ఞాన‌ము వ‌ల‌న జీవున‌కుగ‌ల లాభ‌ము స్వ‌ల్ప‌మ‌ని ర‌చ‌యిత య‌భిప్రాయ‌ము. జాన‌కి యాచ‌రించిన వ్ర‌త విధాన‌మునంద‌లి కొంత లోప‌మువ‌ల‌న‌నే య‌ధ‌మ‌యోగ‌మైన‌ది. అది యేమ‌న‌గా నామె త‌న‌కు భ‌ర్త‌పై భ‌క్తిపై సిద్ధిపై భ‌క్తియా అనున‌ది తేల్చుకొన‌లేక‌పోవుట‌చే ద్వైధీభావ‌మేర్ప‌డి ఏకాగ్ర‌త కొకింత లొసుగేర్ప‌డియుండ‌వ‌చ్చును. పూర్ణార్ప‌ణ‌ము కాక‌పోవుట‌చేనీ య‌వ‌యోగ‌ము ప్రాప్తించియుండ‌వ‌చ్చును. గ‌త స్మృతుల‌వ‌ల‌న జానకికి క‌ల్గిన లాభ‌మేమియునులేదు. వ్ర‌త‌సంపూర్ణ‌మును గావించుకొనుట‌కు పూర్వ‌జ‌న్మ‌స్మృతుల వ‌ల‌న యొరిగిన‌దిలేదు. కాని పున‌ర్జ‌న్మ‌ముండున‌నియు కొంద‌రికి గ‌త‌జీవిత‌ములోని స్మృతులుకూడ నుండున‌నియు తెలియ‌జేయుట‌కొర‌కు సృష్టింప‌బ‌డిన‌దీ జాన‌కి పాత్ర‌. మ‌హామ‌హితాత్ముడైన వివేకానందుడు స‌హిత‌మీవాద‌న‌మున‌కు ప్రోద్భ‌ల‌ముగ‌నట్టి భావ‌న‌ను వెలిబుచ్చెను అనెను. స్వామీ వివేకానంద జ‌ర్మ‌న్ పండితుడైన మాక్సుముల్ల‌ర్‌ను పూర్వ‌జ‌న్మ‌లో ఋగ్వేద‌ప్ర‌యోక్త‌యైన సాయ‌నాచార్యునిగా భావించెను. చివ‌రికాత‌నిని చూచిన త‌రువాత త‌న యూహ య‌ధార్ధ‌మ‌ని విశ్వ‌సించెను. మాక్సుముల్ల‌ర్ సాయ‌న కాక‌పోయిన‌చో మ‌రియొక‌రు ఋగ్వేద‌మును స‌భాష్య‌ముగ ప్ర‌చురించుట‌కు కృషి చేయ‌లేర‌నెను.

పున‌ర్జ‌న్మ సిధ్ధాంత‌మున ప్ర‌పంచ‌ములో దాదాపు అన్ని మ‌త‌ముల వారికిని న‌మ్మ‌క‌మున్న‌ది. చీనా వాజ్మ‌య ప్ర‌పంచ‌మున చాల‌మంది మ‌హామ‌హులు త‌మ గ‌త జ‌న్మ వైభ‌వ‌ముల‌ను చెప్ప‌గ‌లిగియుండుట చూచుచున్నాము. సూ టుంగ్ పో య‌ను చీనా పండితుడు తాను పూర్వ‌జ‌న్మ‌మున హాంగ్ ఛోవో అను ప‌ట్ట‌ణ‌మున నివ‌సించితిన‌ని చెప్పెడివాడు. ఈ విష‌య‌మును రూఢిప‌రుచుచు ప‌ద్య‌రూప‌మున తెలియ‌జేసెను. కావున టుంగ్ పోవంటి మేధావి య‌స‌త్య‌ముల‌ను, భ్ర‌మ‌ల‌ను వ్రాసెన‌న‌రాదు. ఇక సాహిత్య ప్ర‌పంచ‌మున కాళిదాస మ‌హాక‌వి అభిజ్ఞాన శాకుంత‌ల‌మున‌


ర‌మ్యాణివీక్ష్య మ‌ధురాంశ్చ‌నిశ‌మ్య శ‌బ్దాన్‌

ప‌ర్యుత్సుకో భ‌వ‌తి య‌త్సుఖితోపిజంతుః

త‌చ్చేత‌సా స్మ‌ర‌తి నూన మ‌బోధ పూర్వం

భావ‌స్థిరాణి జ‌న‌నాంత‌ర సౌహృదాని


అని వ్రాసెను. సుంద‌ర‌మైన వ‌స్తువుల‌ను చూచిన‌ప్పుడు మాత్ర‌మేగాక మ‌నోహ‌ర‌మైన ధ్వ‌నుల‌ను విను స‌మ‌య‌మున స‌హిత‌ము త‌త్సుభానుభూతికి నిశ్చేష్ట‌మై ఏదియో తెలియ‌ని, యూహాశ‌క్తికంద‌ని ర‌హ‌స్య విశేష‌మును తెలిసికొన నిచ్ఛ క‌లుగుచుండును. ఇట్టి య‌వ‌స్థ జంతువుల‌కు స‌హిత‌ము నిట్లేయుండును. ఇట్టి పూర్వ‌జ‌న్మ విష‌య‌ముల‌ను వెంట‌నే గ్ర‌హించుట‌కు ఈ జ‌న్మ‌లో శ‌క్తి చాల‌క త‌న తాత్కాలిక మాన‌సిక‌శ‌క్తితో హృద‌య‌మునందు స్థిర‌భావ‌మును జ‌న్మాంత‌ర స్నేహ స‌ద్భావ‌ముల‌ను స్మ‌రించును. అని కాళిదాసు జ‌న‌నాంత‌ర సౌహృద‌మును గూర్చి ర‌మ్య‌ముగ వ్రాసియుండెను. కుమార సంభ‌వ‌మున పార్వ‌తీదేవి విద్యాభ్యాస మ‌ప్ర‌య‌త్న‌ముగ ప‌రిపూర్తియైన‌ది. ఎందుచేత‌న‌న‌గా పార్వ‌తీదేవికిగ‌ల జ‌న్మాంత‌ర సంస్కార ప్రాబ‌ల్య‌మువ‌ల‌న పూర్వ‌జ‌న్మ‌లో కేర్చుకొనిన విద్య‌ల‌న్నియు న‌ప్ర‌య‌త్న‌ముగ వ‌శ‌మ‌యిన‌వి. ప్ర‌పేదిరే ప్రాక్త‌న జ‌న్మ‌విద్యా మొద‌ల‌గు కుమార సంభ‌వ‌ములోని శ్లోక‌ముగూడ మ‌న ప్రాచీనుల పూర్వ‌జ‌న్మ విశ్వాస‌మును పూర్వ‌జ‌న్మ సంస్కార ప్రాబ‌ల్య‌ముల‌ను వ్య‌క్త‌ము చేయుచున్న‌విఇట్లు స‌తీదేవిగ ద‌గ్ధ‌మై, పార్వ‌తీదేవిగ పుట్టి మ‌ర‌ల ప‌ర‌మ‌శివునే పెండ్లి యాడిన యాదిశ‌క్తివ‌లె జాన‌కి కూడ నీల‌కంఠ‌శాస్త్రిని పెండ్లియాడుట‌కు జ‌న్మ‌మెత్తిన‌ది. పాతివ్ర‌త్య‌మ‌న్న‌ది ప్ర‌పంచ‌మునంద‌న్ని తావుల‌నున్నప్ప‌టికిని హిందువ‌లుయంద‌ది ప‌రాంకోటి నందుకొన్న‌ది. పురాణేతిహాస‌ముల‌లోనీ విష‌య‌ము పెక్కు తావులయందుద‌హ‌రింప‌బ‌డిన‌ది. రాక్ష‌స‌రాజుల భార్య‌ల‌లోకూడ మ‌హాప‌తివ్ర‌త‌లున్న‌ట్లు పురాణ‌ములు చెప్పుచున్న‌వి. హిర‌ణ్య‌క‌శిపుని భార్య లీలావ‌తియు, రావ‌ణాసురుని భార్య మండోద‌రియునిందుల‌కుదాహ‌ర‌ణ‌ముగ పేర్కొన‌వ‌చ్చును. భార‌త‌దేశ‌మున స్త్రీకి పురుషునితో స‌మాన ప్రాతినిధ్య‌మునిచ్చిరి. అనాది నుండియు స్త్రీలిచ‌ట గౌర‌వింప‌బ‌డుట‌యు జ‌రుగుచున్న‌ది. దాంప‌త్య ధ‌ర్మ‌మిచ‌ట వ‌ర్ధిల్లిన‌ట్లిత‌ర దేశ‌ములందు వ‌ర్ధిల్ల‌లేదు. స్త్రీ పురుషుని య‌ర్ధాంగిగ‌నుండి య‌త‌డు చేయు స‌త్క‌ర్మ‌లంద‌న్నిట భాగ‌స్వామ్య‌మును వ‌హించుచున్న‌ది. హిందువులు స్త్రీని గృహ‌ల‌క్ష్మిగ చూచెద‌రు అనియు ప‌ర‌మార్థ‌సాధ‌న‌కుకూడ వీరికి అవ‌కాశ‌ముడెన‌ని పాశ్చాత్య‌పండితుడైన స‌ర్ ఉడ్‌ర‌ఫ్ అనున‌త‌డు ప్ర‌వ‌చించెను. శ‌రీర, మ‌న‌, ఆత్మ‌ల సంయ‌మ‌నం భార‌తీయులు చేసిన‌ట్లు ఏ మ‌తం చేయ‌లేదు.

ఇహ‌మును ప‌ర‌మును స‌మంగా స‌మ‌న్వ‌యించింది హిందూ మ‌తమే. హిందువులు స్త్రీని గృహ‌ల‌క్ష్మిగా చూస్తారు. ఆమె అర్ధాంగి. స‌ర్ ఉడ్ ర‌ఫ్ హిందూమ‌త‌ముయొక్క సిద్ధాంత‌ముల‌న్నిటిని కూలంక‌ష‌ముగ ప‌రిశీలించి హృద్గ‌త‌ము గావించుకొనిన‌వాడు..

స్త్రీ అగ్నిసాక్షిగ వివాహ‌మాడిన పురుషున‌కు మ‌నోవాక్కుయ క‌ర్మ‌ల చేత లోబ‌డియుండుట అతనికి సుఖ‌సంతోష‌ముల‌ను క‌లుగ‌చేయుట‌య‌న్న‌వి పాతివ్ర‌త్య‌మున‌కు ముఖ్య ల‌క్ష‌ణ‌ములు. ఇట్టి వ‌నిత‌ను ప‌తివ్ర‌త‌య‌నుట కంటె ధ‌ర్మ‌ప‌త్ని య‌నుట స‌మంజ‌స‌ము. భ‌ర్త యెటువంటివాడైన‌ను తృప్తిప‌డి మ‌ర‌ణించువ‌ర‌కు న‌త‌నిక‌డ‌నుండుట‌యే శ్రేయ‌మ‌ని భావించుట పారంప‌ర్య‌ముగ వ‌చ్చుచున్న పద్ధ‌తి.


ఇష్ట‌ములేని భ‌ర్త‌ల‌ను వ‌స్త్ర‌ముల‌వ‌లె త్యజించి వేరొక‌ని చేప‌ట్టుట విడాకులిచ్చి మ‌రియొక‌నిని వివాహ‌మాడుట‌య‌న్న‌ది పాశ్చాత్య‌నాగ‌రిక‌తా ప్ర‌భావ‌మున సంక్ర‌మించిన భావ‌సాంక‌ర్య‌మ‌న‌వ‌చ్చును. ఒక‌సారొక కార‌ణ‌మున స్త్రీ భ‌ర్త‌ను మార్చుటకు సిద్ధ‌ప‌డిన‌ట్ల‌యిన మ‌రికొన్ని నాళ్ళ‌కా భ‌ర్త‌ను కూడ మార్పుచేయ‌ద‌నుట విశ్వ‌సింప‌దిగిన విష‌య‌ముగాదు. అట్లు భ‌ర్త‌ల‌ను మార్చుకొనుచుపోయిన స్త్రీ జీవిత‌ము కుక్క‌లు చింపిన విస్త‌రివ‌లెనై పోవును. సంతాన‌ము నానాసంక‌ర ర‌క్త‌జ‌నిత‌మై దోష‌భూయిష్ట‌మై నిర్వీర్య‌మ‌గును. అట్లుగాక స్త్రీ ఒక‌ని యందే బ‌ద్ధ‌మ‌న‌స్క‌య‌గుట నామె కుటుంబ‌మున‌కు, సంఘ‌మున‌కూడ శ్రేయ‌స్క‌ర‌ము. ఆమెలో క‌లుగు విరుద్ధ‌భావ‌ములు సంతాన‌మునందెక్కువ ప్ర‌తిఫ‌లించును. గాన సంఘ శ్రేయ‌ము దృష్ట్యా పృధ్వీస్థాన‌మవ‌లంబించు స్త్రీ కే నియ‌మములెక్కువ విధించుట‌కు కార‌ణ‌ములివియే. ప‌తియందు బ‌ద్ధానురాగ‌యైన స్త్రీ మ‌రియొక మెట్టు పై కెక్కి యాత‌నిలో దైవ‌మును చూచుట పతివ్ర‌తా ల‌క్ష‌ణ‌ముల‌లో మొద‌టిది. ఆ దైవ‌మునేకాగ్ర‌చిత్త‌ముతో సేవించి త‌రించుట ముఖ్య ల‌క్ష‌ణ‌ము. ప‌తిని ప్ర‌త్య‌క్ష దైవ‌ముగ భావించు ఈ వ్ర‌త‌ము యొక్క ప‌ర‌మార్ధ‌ముకూడ జీవ‌న్ముక్తియే. ఆ ప‌తి దుష్టుడైన‌ను నీచుడైన‌ను ఆమె వ్ర‌త‌మున‌కెట్టి యాటంక‌మునుండ‌దుగాని సాధ‌న‌మునందున్న లోప‌ముచేత నామెలోని యేకాగ్ర‌త క్షీణించుట క‌వ‌కాశ‌మున్న‌ది. వ్ర‌త‌మ‌న‌గ నియ‌మ‌నిష్ఠ‌ల‌తో నాచ‌రించున‌ది. దీని ఫ‌ల‌ము జ‌న్మ‌రాహిత్య‌మే. నీచుడైన భ‌ర్త దైవ‌మెట్ల‌గున‌న్న సంశ‌య‌ము క‌లుగును. కాని విశ్వాస‌మిచ‌ట ప్ర‌ధాన‌ము. ఆల‌య‌మున‌నున్న విగ్ర‌హ‌మును రాయి అని త‌ల‌చుచు పూజించిన ఫ‌లిత‌మేమియునుండ‌దు. దైవ‌మ‌ని త‌ల‌చి భ‌క్తితో, నార్తితో పూజించిన‌చో ఫ‌లిత‌ముండును. ఛాందోగ్య‌మున య‌ద్భావం త‌ద్భ‌వ‌తి య‌ని చెప్ప‌బ‌డిన‌ది. మ‌న‌సేవిధ‌ముగ త‌ల‌చిన ఫ‌లిత‌మా విధ‌ముగ నుండున‌ని దీని భావ‌ము. దీనిని భ్ర‌మ‌య‌నరాదు. భ‌క్తి యొక్క యారంభ‌ద‌శ య‌న‌వ‌చ్చును. చెట్ల‌కు, రాళ్ళ‌కు, పాముల‌కు మ్రొక్కుట యిట్టిదే. ప‌తిని దైవ‌ము అనుట అతిధిని విష్ణువ‌నుట గురువును బ్ర‌హ్మ‌, వైద్యుని నారాయ‌ణుడ‌నుట చివ‌ర‌కు గాంధీమ‌హాత్ముడు ద‌రిద్ర‌నారాయ‌ణుల‌నియు హ‌రిజ‌నుల‌ను పిలుచుట మొద‌ల‌గున‌వ‌న్నియును ప్ర‌జ‌ల‌లో భ‌య‌భ‌క్తుల‌ను విశ్వాస‌మును నాటుట‌కుద్దేశింప‌బ‌డిన‌వి. ప్ర‌తి జీవునిలోను ప‌ర‌మాత్మ ప్రాణ‌రూప‌మైన చైత‌న్య స్వ‌రూప‌మున నుండియే యున్నాడు. భ‌క్తిప్ర‌ప‌త్తులు చూప‌వ‌ల‌సిన దాచైతన్య‌రూప‌మున‌నున్న భ‌గ‌వంతునికేగాని బాహ్య‌శ‌రీర‌మునకుగాదు. ఈశ్వ‌రుడు స‌ర్వాంత‌ర్యామియ‌నియు నీశ్వ‌రుని చూచిన‌దొక్క హిందూమ‌త‌మేయ‌ని జాన్ ఉడ్‌ర‌ఫ్ వంటి తత్త్వ‌వేత్త‌లు నుడివియున్నారు.