యశోవతి
శ్రీకృష్ణునకు పదమూడేండ్లున్నపుడు హస్తినను ధృతరాష్ట్రుడును మగధను జరాసంధుడును కాశ్మీరమును గొనందుడును పాలించుచుండిరి. యశోవతి మిథిలానాధుని కుమార్తె, గోనందుడు జరాసంధుని పక్షమువాడు. మిథిల కిరువైపులవారు కృష్ణ విరోధులు. మధ్యనున్న మిథిలాధిపతి తటస్థుడు అతనికిరువంకలవారును మిత్రులే. మిత్రుల శతృత్వమును స్వీకరింపని స్వయం నిర్ణయాధికారి.
గోనందుడు మధురకు పోవునప్పుడెల్ల మిథిలలో నాగెడివాడు. ఇచట నాగుల విశ్రాంతి కొరకుగాక యశోవతి కొరకుగూడ నాగెడివాడు. అతనికి యశోవతి యన్నచో తగని ముద్దు. ఆమె ముద్దుమాటలు కతడు పరవశించుచు వినుచుండును. గోనందుడు వచ్చినప్పుడెల్ల విదేహాధిపతి యశోవతిచేత నామె తండ్రి పరిచర్యలు చేయించెడివాడు. పరిచర్యలనగా ముద్దు పల్కులచే రాజును మరిపించుటయే. రాజ గృములలోని వారలకే పనులు చేయుట రాదు. మరియు నలయిదారేండ్ల పాపకు పరిచర్యలు చేయించుకొనుటయేగాని చేయుట యసలే రాదు. ఆ చిన్నపిల్ల పౌందర్యము వినయము బుద్ధి శాంత లక్షణములకు గోనందుడు ముచ్చటపడెడివాడు. అతడు యశోవతిని తన కోడలినిగ జేసికొనవెనని యోచించెను.
వేదాంతము మిథిలానగరమున మిక్కిలిగ నాదరింపబడెడిది. రాజు సౌధములోనుపనిషద్వాక్యములు గోడలకుకూడపట్టుబడినవి. కాశ్మీర రాజైన గోనందుడు శాక్తేయుడేగాని యుపనిషద్విరోధికాడు.
యశోవతి యారేండ్ల బాలికగా మన్నప్పటినుండి నూట ముప్పది యేండ్ల వృద్ధురాలగువరకు నామెలో వికసించిన మానసిక పరిణామము, జ్ఞానము భక్తి వయోభేదమునకు తగినట్లుగ నిరూపింపబడినది. బాల్యమున పిల్లలకుచితమైనట్లుగ కథలతో, నాటలతో గడిపినది. ఆ కథలు, ఆటలు కృష్ణ సంబంధములై నవేయగుట విశేషము. అయినప్పటికిని ఆ వయసులో నామెకున్న సునిశత బుద్ధిస్పూర్తి పెద్దలకాశ్చర్యజనకములుగ నుండెడివి. ఆరేండ్లకే షణ్మత సిద్ధాంతమందలి మూలపదార్ధము నాకళింపు చేసికొన్నది. శాక్తేయులకును తమకునుగల భేదమును గురించి గోనందునితో నిట్లు చెప్పినది. శాక్తేయులనగా శక్తిపూజ చేసేవారు. మేము వేదాంతులము ఉపనిషత్తులలోనున్న బ్రహ్మపదార్ధమును మేము విశ్వసింతుము కొందరు విష్ణువేయున్నాడు ఆయననే పరమదైవమందురు. కొందరు శివుడే పరదైవమందురు. వారు శైవులు ! అనినది. ఇట్టి మాటలీమె తెలివినేగాక మిథిలాధిపతి యింట జరిగెడి గోష్టుల స్వరూపముకూడ తెలుపుచున్నది. పెద్దల మాటలను విని త్వరగా మనసునకు పట్టించుకొందురు. వారు వినుచుండిరనిగాని వారి మనసులలోనా మాటలు హత్తుకొనుచుండెననిగాని పెద్దలకు తెలియదు. మరల చిలుకపలుకులవలె వానినుచ్చరించునప్పుడాశ్చర్యపోవుట పెద్దల వంతు.
యశోవతి గోనందునకు వ్రేపల్లెలోని చిన్నికృష్ణుని కథలన్నియు చెప్పెడిది. ఆ రాజునకు కృష్ణునిపై ప్రేమయున్నను యశోవతి చెప్పు తీరునకు, నైపుణ్యతకును, అమాయకతకును మోహపడెడివాడు. యశోవతితో కొన్ని దినములు గడుపుట యతని రాచకార్యములలో నొక భావము. యశోవతి గోనందులు కథలు చెప్పుకొను సమయమున యశోవతి తల్లియును గోనందుడు కుమారుడును నగుచుండెడివారు.
ఈ మాట గోనందుని యాశ ద్విగుణీకృతము చేసినది. యశోవతి కృష్ణుడు గోవర్థన పర్వతమెత్తిన కథ చెప్పుచునామె గోవర్థన పర్వతము మీద పచ్చగడ్డి యత్తరు వాసన వేయునని చెప్పినది. గోనందుడు కాశ్మీరమున కూడ నట్టి పర్వతములున్నవి. ఆచట బోలెడన్ని రకముల పుష్పములు ఫలములునుండును చూచుటకు వత్తువా ? యనగా యశోవతి తాను వచ్చినచో కాశ్మీరము వచ్చి పర్వతములను చూతునుగాని గోవర్థనమును మాత్రము చూడనన్నది. గోవర్థనమును మనసుతో చూచితిని కాశ్మీరమును కనులతో చూతునన్నది. దానియందము వేరు దీని యందము వేరు రెంటిని కలుపకుమన్నది. ఇట్టి మాటలామె వయసునకు మించినవి.
గోనందుడు, తన పుత్రుడైన దామోదరుని తీసికొని భార్యాసమేతుడై ససైన్య పరివారముగా మిథిలకు వచ్చెను. యశోవతి తండ్రి యా జనమును చూచి యచ్చెరువునందెను. గోనందుడు యశోవతిని తను కోడలినిగ చేయమనలేదు. మిథిలాధిపతి తన కూతునిత్తుననలేదు. ఇట్లుండగా యశోవతి బాల్యచాపల్యమున గోనందుని ప్రశ్నించినది. మీ కుమారుని పెండ్లియటగదా ! అతడుకూడ మంచివాడేనాయని యడిగినది. మంచివాడైనచో చేసికొను బాలిక యదృష్టవంతురాలనినది. దామోదరుడుకూడ యశోవతిని చూచి మెచ్చెను. ఆమెను పెండ్లియడుటకిష్టపడెను. కాని యశోవతి కూడ తనను ప్రేమించుచున్నదో లేదో తెలిసికొనవలెనని పట్టుబట్టెను. యశోవతితో మాటలాడసాగెను. దామోదరునితో యశోవతి వయసును మించిన మాటలాడినది. లోకములో స్త్రీ పురుషులును వివాహమాడుదురు సంతానము కందురు. నేను స్త్రీని వేదములలో ప్రజాతంతువును భేదింప కూడదని యున్నదనెను.ఇట్టి మాటలౌచిత్య రహితములై పాత్ర పోషణకు లోపముగ దోచును. యశోవతి మాటలు వాచాలత్వమును సూచించు చుండును. ఇదియామెకు కొంతవయసు వచ్చు వరకే. తరువాతనామె యెంతటిపెద్ద మాటలైన నాడుటకు యర్హురాలైనది. ఇట్టి పిల్లలు ప్రపంచమున నుండరనరాదు. వయసును మించి మాటాడు పిల్లలను ఆరిందా పిల్లలనుట కద్దు. దామోదరుని పెండ్లియాడుటకు కారణము గౌతముడను పురోహితునిచే మంత్రోపదేశమును పొందవలెనన్న కోరికచేతనన్నది. పెండ్లియాడినగాని మంత్రమును పొందుటకర్హురాలు కాదు. మంత్రమెందులకని దామోదరుడు ప్రశ్నించెను. ఒకటి ప్రాతివ్రత్యమును పొందుటకును ఎన్ని కష్టములై ననుభవించుటకు. సీతాదేవి యందే రెండు గుణములుండెనో ఆరెండు గుణములు మేము మిథిలారాజవంశ సంజాతలము కావున మాయందుండవలెను.
ఈ మాటలవలన యశోవతికి రాబోవు కష్టపరంపర సూచంపబడుచున్నది. అసలు కష్టములు లేకుండ యుండుట యసంభవమనినది. తమ వంశములోనున్న ప్రఖ్యాత పురుషుల యొక్క స్త్రీల యొక్క ప్రఖ్యాత లక్షణములు తమకు నుండవలయునని ఆ వంశములోనివారు కోరుచుందురు. యశోవతి మైథిలి గావున సీతాదేవి నాదర్శముగ గొనినది.
యశోవతి యౌవనవతియైన తరువాత రామోదరునితో శృంగార పయెధిని తేలియాడినది. భక్తి, శృంగారములయందు వేదాంతమందు మాత్రమేగాక రాజనీతి యందుకూడ యశోపతి విశారదయే ఈచాతురియోమెకవసరమును బట్టి జనించినట్టిది. తనపుట్టినింటి నుండి వచ్చిన చిన్ననాటి చెలిమికత్తె సాగరికయను వ్రజయువతిని, ఆమె మరిదినివారు యశోవతిని చూచుటకంతః పురమునకువచ్చినపుడు అంతఃపుర మర్యాదలను పాటింపక పోవుటచే రక్షక భటులు చెరసాలలోనుంచిరి. సాగరిక బంధింపబడుట యెఱిగిన యశోవతి హృదయము క్షోభించినది. అంతవరకీమె రాజకీయమునకు దూరముగనున్నది. తండ్రిరాజైనప్పటికిని పాలమ్ముకొని జీవించెడి వారి పిల్లలతోకూడ స్వచ్ఛమైన స్నేహము చేసిన అచ్చమైన పూవువంటిదీమె హృదయము. సాగరిక తన పాదములంటి నమస్కరింపనందులకు బంధించిరని విని విడిపించుటకు ప్రయత్నము చేసినది. ఆరాత్రాంతయునామె నిద్దురపోక మహాజపము చేసినది. జపాంతరము నామెకు వాకిలిలోనికి పొమ్మన్నమాట స్పురించి యంతఃపురము దాటి బయటకువచ్చినది. అచటికంతఃపుర కాంతలు రారాదు. ఆమెయచటికి వచ్చుసరికి భర్తయును మరియొక భటుడును నిలచియుండిరి. ఆ భటుడు భర్తయాజ్ఞ పాటింపక నిలచియుండెను. అచటికికొలది దూరమునుండి యొకశబ్దము వచ్చుచుండగా దామోదరుడా శబ్దమేమియో కనుగొనిరమ్మని యాభటునాజ్ఞాపించెను. ఆ భటుడు తాను తన పరిధిని దాటిరారాదనెను. ఆభటుడు తన విధ్యుక్త ధర్మము నాచరించినప్పటికిని యువరాజునకేదైన నాపద వచ్చినప్పుడుకూడ నట్లేయొక పరిధిలో నిలుచుండి చూచుచుండును. ఆరక్షకుడు రాజాజ్ఞాబద్దుడే గాని యువరాజుమాట పాటించడు.
యశోవతి తన చెలికత్తె చేతనాశబ్దము వచ్చుగది తలుపు తీయింపగా నచట సాగరిక మరది బంధితుడై యుండెను. దామోదరుడు యశోపతి తెల్లవారులు జపము చేసినదీ తుముదారు విడుదలకేనని తెలిసి యాగ్రహించి మరల నతని నచటనే బంధింపజేసెను. యశోపతిపై కోపమునా తుముదారు మీద చూపెను.
గోనందుడు యశోపతి పక్షమవలంబించి యువరాజు సౌధమందున్న సైనికులపైనధికారి యువరాజేగాని మహారాజు కాడనెను. యశోవతి సాగరికను రహస్యముగ విడిపించి అత్తగారికి తెలియకుండ పంపివైచినది. అసలామెను బంధింపనేలేదు. తానే పొరపాటు పడితినన్నది. వందమంది సైనికులను సమావేశ పరచి కర్తవ్యమును బోధించినది. మొదటిది భగవద్భక్తి రెండవది రాజభక్తి యన్నది. ఎవడు విధినిర్వహణము నందప్రమత్తతతో నుండునో వానికి బహుమానము లభించు నన్నది. రాజునకు, ఆజ్ఞకును భేదముండదనినది. అందరికిని కానుక లీయగా వీరందరునామె రాజనీతికి పరమానంద మనుభవించిరి.
గోనందుడు జరాసంధునితో కూడి మధురకు యుద్ధమునకు వెళ్ళుచుండగా యశోవతి వారించినది. గిరివ్రజ పాలకులు వామాచారాసక్తులు కాశ్మీరమునందు పాలకులు శాక్తేయులు కావునవారితో తమకు సంబంధము లేదన్నది. గోనందుడు వినక యుద్ధమునకు వెళ్ళి యచట మరణించెను.
మహారాణియైన తదుపరికూడ యశోవతి యధికారమును అత్తగారి యందే యుంచినదిగాని తాను రాజ్ఞీత్వమును నెఱపలేదు. అత్తగారియనుజ్ఞ లేకయేపనియు జరుగుటకు వీలులేదు. తాను తీర్థయాత్రలకు వెళ్ళి అంతఃపుర పాలనమత్తగారికి వదలినది. యశోవతికధికార వ్యామోహము లేకుండుట దీనిని బట్టి తెలియుచున్నది. అత్తగారికి క్రమముగ యశోవతిపై కోపము తీరినది. దామోదరుడు యశోవతితో చర్చింపకుండ నేరాచకార్యమును చేయడు. సాగరిక విషయమున నామె చూపిన ప్రజ్ఞనతడు ప్రశంసించెను. తండ్రి మరణమునకు ప్రతీకామరు చేయుటకై మధుర మీదికి యుద్ధమునకు సిద్ధపడుచుండగా యశోవతి జరాసంధుడెట్లు చెప్పిన నట్లు చేయుమన్నది.
మధురలోనున్న కృష్ణుడు చిన్నతనము నుండి యశోవతి హృదయమున తిష్ఠవేసికొని కూర్చుండెను. దామోదరుడతనిపై యుద్ధమునకు వెళ్ళినచో భర్తకే నష్టమని యశోవతి తలచినది. జరాసంధుడు నీ పగ నేనే తీర్తు నని దామోదరునకు వార్తనంపెను. ఇట్లు యశోవతి దామోదరుని వారించినది. సాగరిక మరిదియైన తుముదారు నీలకంఠమను వానిని సేనానాయకుని చేసినది. ఇతడు వార్తా సేకరణమున దిట్ట. రాజ్యమును కొన్నినాళ్ళు యశోవతి యధికారమున నుంచి దామోదారుడు గాంధారదేశమునకు వెళ్ళెను. గాంధారరాజు దామోదరుని మేనమామ. స్వయంప్రభ గాంధార రాజకుమార్తె. ఆమె కృష్ణభక్తురాలు. స్వయంప్రభ స్వయంవరము ప్రకటించిన దామోదరుడు కృష్ణున కాహ్వానము పంపలేదు. కృష్ణుడు దామోదరుని తనసుదర్శనాయుధముతో కంఠము నుత్తరించెను.
తండ్రి మరణించుసరికి యశోవతి కుమారుడైన గొనందునకొక్క సంవత్సరము వయస్సు. కుమారుని పేరుమీద తానేరాజ్యము చేయదలచినది. కాని మంత్రులు సేనానాయకులు స్త్రీ పాలనలో నుండుట కంగీకరింపదలచలేదు. నాయకులందరిని యశోవతి సభకాహ్వానించి కాశ్మీర దేశము యొక్క దివ్యత్వము గోనందవంశ ప్రావస్త్యమును విపులముగా చెప్పినది. పసివానిని రాజుగానంగీకరింపుమని కోరినది. మీరందరు సంశయ గ్రస్తులుగ కన్పించుచున్నారు. కుర్రవాడు రాజ్యము చేయలేడు గదా అతని తల్లి స్త్రీ పాలించగలదా యనిమీకు సంశయమున్నచో, నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాను. దామోదర మహారాజు యశోవతినడుగకుండనేమియు చేయలేదు అనినది. రాజవంశములోనివాడు రాజు కాకున్నచో ప్రతివానికి తానే రాజునేల కారాదను యాశ పొడమి రాజ్యమల్లకల్లోలమగును. మారణహోమము జరుగునని వంశపారంపర్యమైన రాచరికమును సమర్ధించినది. దూరపుదుర్గాధిపు లందరు నామె వశముననున్నారు. నమ్మకముగలవారిని రావించే సేనాధిపతులు మంత్రులు కలసి కుట్రపన్నకుండ చూచినది. వారిలో వారికి పొరపొచ్చములు కలుగునట్లు భేదాభిప్రాయలను పుట్టించినది. అందుచేత వారిలో నేభావము దృఢముగ నిలువలేదు. తాత్కాలికముగ తమలో నొక్కరిని రాజుజేసి గోనందునకు వయస్సువచ్చిన తరువాత నతనికి పట్టముగట్టుమని నాయకులనిరి. యశోవతి యందుల కంగీకరింపలేదు. పదునెనిమిది సంవత్సరములు రాజుగానున్న వ్యక్తికి సింహాసనము దిగవలె నన్నచో కష్టము.
పదునెనిమిది సంవత్సరములు రాజుగానున్న వ్యక్తికి సింహాసనము దిగవలె నన్నచో కష్టము. రాజ్యమతనిచేతులో నుండును. అధికారమతని చేతిలోనుండును. గోనందుడు రాజైకూడనేమి చేయలేని స్థితిలో నుండనన్నది. ఇట్లు రాజ్యము క్లిష్టదశలో నున్న సమయమున నొక దివ్యపురుషుడు రథముదిగి సభకేతెంచెను. అతడు నీలమేఘచ్ఛాయవాడు. కనకోష్ణీషమువాడు. విశాల వక్షస్కుడు. వృషస్కందుడు అయిన శ్రీకృష్ణదేవుడువచ్చి గోనందుని సింహాసనమున కూర్చుండబెట్టి యభిషేకింపుమనియు మహారాణి రాజ్యపాలనాదక్షురాలనియు చెప్పి వెడలిపోయెను. ఇట్లు యశోవతి క్లిష్టదశను తప్పించుకొనినది. గోనందునకు పదునెనిమిదేండ్లు వచ్చువరకు రాజ్యమును మహాసమర్ధవంతముగా పాలించినది. కొందరిలో దురూహలు పుట్టకుండుటకై స్వయంప్రభాదేవి చేత మధురసంగీతమును అధికారులకు ప్రజలకు వినిపించి వారిదుర్భావములను పోగొట్టించినది. దివ్యసంగీతమును సహితము రాజకీయకార్యములకు పయోగించిన గొప్పరాజనీతిజ్ఞురాలు యశోవతి.
|