యశోవతి యొక్క తపోజీవితము మరియొక దివ్యపరీవాహము. రాజకీయముగనెంత యున్నతస్థాయికి చేరుకొనినదో అంతకన్న నత్యుత్తమ స్థాయికి తపోమార్గమునకూడ చేరుకొనినది.
చిన్నతనమునుండి యశోవతికి మతములలోని మర్మములు వేదము పరమార్ధములును ఉపనిషత్సారమను కరతలామలకములు. బాల్యక్రీడలు సహితము వేదాంత జ్ఞాన పరిపూరకముగా నుండెడివి. చిన్నతనమున కాశ్మీరాధిపతితో నాడుకొను సమయమున యశోవతి యొకతొట్టిచూసి యందేమున్నదని యడిగినది. గోనందుడేమియు లేదనెను. యశోవతి యామాటకు మిథ్యయను నర్థమును తీసి మీరు వేదాంతులు అన్నది. శాక్తేయులని వింటినే యనినది. గజేంద్రుని మొసలిని బొమ్మలనా తొట్టేలోవేసి గజేంద్రుని రక్షించుటకు కృష్ణుడు వచ్చునన్నది. చిన్నతనమున కృష్ణలీలలను వినుట, విన్నవానిని మనసాయనుభవించుచు నితరులకు చెప్పుట యశోవతికి తపస్సు.
వివాహమునుకూడ తపస్సు చేయుటకే జేసికొనినది. వివాహమాడిన తరువాతగాని మంత్రదీక్షనీయరాదని గౌతముడు చెప్పినందున మంత్ర స్వీకరణార్హతను పొందుటకే వివాహమాడినది. మంత్ర ప్రభావమున కష్టములు సహింపగలయోర్పు లభించుచున్నది. కష్టములు భరించుటేల రాకుండ జేసికొనరాదాయనిన దామోదరునితో జీవితమే దుఃఖప్రాయమైనదనినది.
వివాహమైన తరువాత తన స్నేహితురాలిని ఆమెమరదిని బంధించిరనివిని తీవ్రముగ మంత్రపునశ్చరముణ చేసినది. జపాంతమైన తరువాతనా మెవచ్చుచుండగ నామెకనులలోని తీవ్రతను చూచిన పరిచారిక స్పృహతప్పి పడిపోయినది. తరువాత యశోవతి అత్తగారు కూడ నాతీవ్రతవంటిదే మరియొకనాడు చూచిపడిపోలేదుగాని కొలది దినముల తరువాత భర్తను పోగొట్టుకొనినది. యశోవతియందేదో మహత్తుకలదని యామోకనుగొనినది. యశోవతి యందేదో మహత్తు కలదు. ఆమెమనస్సు కష్టపడినచో నూరకేపోదు. తానామెమనస్సును కష్టపెట్టెను. రెండునెలలు తిరుగకమున్నె తనభర్త చనిపోయెను అని అత్తగారు భావించినది. దామోదరునికి భార్యయన్నచో చెప్పలేనంత గౌరవము. ఆమె మాటలు చేతలు విలక్షణముగానుండుట, పలువిషయములామె చెప్పినట్లు జరుగుటకారణము. యశోవతిని జపాంనంతరమున చూచిన పరిచారిక స్పృహతప్పినప్పుడామెకొక పళ్ళెము వంటి యాయుధము గుడూచియను మరియొక పరిచారికయొక్క తలను నఱికినట్లగుపించెను. ఆ పళ్ళెము సుదర్శనాయుధము. ఆరాత్రిదామోదరునకు కూడ సుదర్శన దర్శనమైనది. ఈ సంఘటనము ముప్పది యేండ్ల తరువాత దామోదరుని తలనఱుకుటతో నిజముకాగా గుడూచి బదులు శిశుపాలుని తల ఛేదింపబడినది.
యశోవతి జపములో నొక్కక్కప్పుడొక్కొక్క విశేషావస్థ ననుభవించుట జరిగెడిది. ఇదిక్రమముగా నభివృద్ధిగాంచినది. జపములో నేకాగ్రత లభించుకొలది యశోవతి యలవాట్లు, ఆచారములు మార్పునొంద దొడగినవి. పూర్వము జపముచేసి లేచెడిది. అపుడు జపమునకు కూర్చున్నపుడు ఎట్లుండెనో లేచినుంచున్నప్పుడట్లే యుండెడిది. ఇప్పుడు జపాంతమునందు తొలుతటి యుత్సాహముండదు. ఉద్వేగముండదు ఒక మాంద్యము ఒక శాంతి యామె కనులయందు భాసించుచుండును. యశోవతి జపములో లీనమగుట యలసిపోవుట వలననిట్లు జరుగుచుండెననవలెను. ప్రశాంతి చిక్కుటవలన యాందోళనలేక శాంతముగనుండును. యశోవతి జపముచేసిన తదుపరి యెవరిని పరకాయించి చూచిన వారికేదైన నొక విశేషము జరుగుచుండెడిది. అవిశేషము సుఖదాయకము గాని దుఃఖదాయకముగాని యగుట మరియొక విశేషము. రాజభవనములోనంతఃపురములో యశోవతియన్నచో గౌరవము ప్రబలముగ నుండెను. దుర్గాధిపతులకు గౌరవమర్యాదలు భయభక్తులు పెంపొందినవి. ఆమె యోగినియో సిద్ధురాలోయని ప్రజలు భావింపసాగిరి.
యశోవతికి జరుగబోవు విషయము జపమున భాసించెడిది ఒకనాడు దామోదరుడొక విషయమును చెప్పగోరి జపమును భగ్నము చేసెను. ఆపనికి తొందరపడరాదని యామె తెలిపినది. మరియు దూరప్రదేశములందు జరుగువిషయములుకూడ నామెకు తోచుచుండును. ముఖ్యముగా కృష్ణునకు సంబంధములున్న కార్యము లన్నియు నామె కవగతములగుచుండెడివి. ద్రౌపదీ వస్త్రాపహరణ విషయమామె ముందుగనే భర్తతో ప్రస్తావించినది. పతివ్రతల కవమానము జరుగుట మరణ సదృశమన్నది స్త్రీకిట్టి యవమానము ప్రాప్తించెనో రెండే రక్షాహేతువులు. ఒకటి శరీర త్యాగము. రెండవది తదవమానము నిష్టరించగల భర్తయుండుట. ఈయవమానము భర్తది అనినది. యశోవతి భావము స్త్రీ యవమానమును పొందినచో జీవింపరాదనియే. పిలచినచో భగవంతుడు పలుకగల్గినంత దృఢభక్తియుండవలయును. స్త్రీకి భక్తిగూడ పాతివ్రత్యమును రక్షణ మొనర్చుటకుపయుక్తము గావలెనన్నది.
యశోవతీ దామోదరులు స్త్రీల శీల రక్షణమును గురించి చర్చించిన యనంతరము నీలకంఠుడను వార్తాహరుడు హస్తినాపురమున ద్రౌపదీ వస్త్రాపహరణము జరిగినట్లు వార్త తెచ్చెను. ఆ జరుగుట యశోవతి పాతివ్రత్యమును గురించి చర్చించిన నాడే జరిగెను. అది దామోదరునికి యశోవతిపైగల గౌరవమును మరింత పెరుగునట్లుచేసెను.
ఒకనాడు యశోవతి జపముననుండగా మిథిలనుండి తండ్రిమరణవార్తను తీసికొని వచ్చెను. దామోదరుడామె కశౌచమనియు జపము మాన్పింపదలచెను. ఇంతలో నామెయే కనులు తెరచి మిథిలనుండి వార్త వచ్చినదాయనియడిగినది. వార్తాహరుడు రాకముందు కనీసము నాలుగైదు రోజులు ముందుగనే యశోవతికి జపముననీ విషయము భాసింపవలెను. హస్తినను జరిగిన విషయము ముందెట్లు తెలిసినట్లు మిథిలలో తండ్రి మరణించిన సమయముననే నీమెకు తెలియవలసినది. జపతపములు లేని వారికి సహితము ఆత్మీయుల మరణ సమయముననేదియో చెప్పరాని బాధయో వేదనయో కలుగుచుండును. వార్త తెలిసిన తరువాత వీరికి విషయము రూఢమగుచుండును. ఇట్టి యనుభూతికి దూరము దగ్గరయన్న ప్రసక్తి యుండదు. కావున యశోవతికీ విషయము తండ్రి మరణ సమయమున తెలియవలెనేగాని కొండలు గుట్టలు అరణ్యములు దాటివచ్చిన వార్తాహారుని రాకకు తరువాత తెలియుట యుచితముకాదు.
తండ్రి మరణమునకు చింతింపక శరీరము నశించునదని భర్తకు వేదాంతమును గరపినది యశోవతి. ఆమె దుఃఖింపకుండుట చూచిన దామోదరుడు తండ్రి మరణమునకు దుఃఖింపని యశోవతి తను మరణించిన మాత్రము దుఃఖించునాయని భావించెను.
కృష్ణుడు ద్రౌపది కక్షయపాత్రనిచ్చి దుర్వాసమునినుండి శపింపబడకుండుట భర్తకు తెలిపినది యశోవతి. భగవంతుడు భక్తులయందు అధికమైన కటాక్షమును చూపినచో ఒక్కయన్నపు మెతుకే భాండము నిండునని చెప్పినది. ఈ విషయము ద్రౌపది విషయమున జరిగినట్లు తరువాత తెలిసినది. ఇట్లు యశోవతియొక్క యంతర్దృష్టి కృష్ణుని చుట్టును కృష్ణభక్తుల చుట్టును పరిభ్రమించుచుండెడిది.
భర్త మరణించిన దుఃఖసమయమున పసివాడైన గోనందుని రాజును కానీయకుండ చేయవలెనని కుట్రపన్ను సమయమున శ్రీకృష్ణుడు వచ్చి సమస్యను పరిష్కరించి వెళ్ళెను. పిలచినచో భగవంతుడు పలికెడివాడుగా నుండవలయునన్న యశోవతి మాట తనపట్లనీసమయమున ఋజువైనది. కృష్ణుని వెనుక యశోవతి జ్యోతి రూపముననున్నట్లు స్వయంప్రభగాంచగల్గినది. యశోవతి యాత్మ కృష్ణునియనుసరించి చరించుచున్నదని ధ్వని.
యశోవతి కృష్ణగాఢాభిమానియే గాని కృష్ణ భక్తురాలిగ నగపడదు. కృష్ణుడు భగవంతుడు కాడని దామోదరుడనగ నేనన్నానా యని ప్రశ్నించినది. మామగారు శివాంశ సంభూతుడు కానివాడు కాశ్మీరరాజు కాలేడని పల్కి యశోవతి పార్వతీదేవి యొక్క యంశనుండి పుట్టినదని పలికెను. దామోదరుడు శివుని యంశ యశోవతి మహేశ్వరి యంశ కాగా కృష్ణుడు శ్రీమన్నారాయణావతారము. సుదర్శనధారి. యశోపతి మనసులో శివకేశవ భేదము లేదనుటకులేదు. కాని కృష్ణలీలలకు పరవశించు హృదయమున్నది. కృష్ణదేవుని పదహారువేల గోపికాస్త్రీలతోడి శృంగారమునకు నాత్మపరముగ నర్ధముచెప్పగల్గినది. జపములోనెట్లు నిమగ్నము కాగల్గినదో నట్లే రాజకీయమున మునిగి లౌక్యము నవలంబింపగలదు.
యశోవతికున్నట్టి ద్వంద్వవైఖరి దామోదరునకులేదు. అతడు శివకేశ వైక్యస్వరూపమును భావింపగల్గెను. కావుననే సుదర్శన దర్శనమై మోక్షమునందెను. యశోవతి యొక్క తీవ్రజపతపాదులవలన నామెకు కలిగిన లాభమేదియు లేదు. కృష్ణమూర్తి తన యెదుటకువచ్చి నిలచిన సమయమునకూడ నలౌకికానందమనుభవింపలేకపోయినది. కృష్ణుడు వచ్చెను. వెళ్ళెను. యశోవతి చలింపలేదు. కాగా యశోవతి చిన్నతనముననే కోరినట్లుగ మంత్రపునశ్చరణమువలన నామెకు కష్టములకు చలింపని నిబ్బరము లభించినది. తండ్రివలె యభిమానించు మామగారు చిన్న వయసుననే గతించెను. మరల మధ్యవయసు రాకముందే భర్త మరణము పనివాని బాధ్యత రాజ్యభారము, తరువాత కుమారుడు అనేక వివాహములు చేసికొనినను కోడలి దుర్మార్గమునకు చలింపక ప్రతి విషయమునకు తటస్థముగనుండి సాక్షీభూతురాలుగ నుండగలిగినది. తరువాత కుమారుడైన గోనందుడు కృష్ణ ద్వేషియై పరీక్షిత్తు పాలించు హస్తినమీదకు దాడి వెళ్ళగా యశోవతియు కోడలైన సుధాలహరియును అజ్ఞాతమునలోనికి వెళ్ళి కాలము గడుపవలసివచ్చినది. అచ్చట కుమారుడు మరణించెను. సుధాలహరి యిట్లు జరుగునని తనకు చెప్పలేదేమని ప్రశ్నింపగ కృష్ణుడట్లు సంకల్పించినది. లోకమున వ్యక్తి ప్రతిభను మన్నించినంత వ్యక్తిని మన్నింపరన్నది. అనగా కృష్ణలీలలు తనకు ప్రియమైనంతగ కృష్ణుడు యశోవతి పుట్టినది మిథిలలో తాను మైథిలినన్న భావము. మెట్టినది కాశ్మీరమున. పార్వతినను నిశ్చయము. కాని కృష్ణునిలో శివకేశవుల కభేదాత్మకమును సంతరించుకొనలేకపోయినది. ఆమె భావమాతని గాథలవరకే సంచరింపగల్గినది. కావుననే నాతని లీలలు యశోవతికి లీలగ దోచినవి. భగవంతుడు మానవాకృతితో నవతరించు సమయమున మానవుని భావములెట్లుండును ? ఎంతటి జ్ఞానికూడ భాగవత్స్వరూపమునెట్లు గమనింపక ఊయలవలె ముందునకు వెళ్ళి మరల యధాస్థానమునకు వచ్చునట్లుగ స్థిరమస్కుడుగ నుండలేదో తెలియజేయుట ఈ నవల యొక్క ప్రధానాంశము. యశోవతికి సీతయు ఆమె తండ్రికి జనకుడును ఆదర్శముగ జేసికొనిరి. సీత రామ వియోగము ననుభవించినది. యశోవతికి దామోదరుని వియోగము ననుభవించక తటస్థురాలైనది.కాలేదనుట నిట స్పష్టము. లోకములో నొక మహాపురుషుని ప్రతిభను మన్నింతురు. ఆ వ్యక్తిని మన్నింపరు. నీ మామగారట్లు చేసిరి. నేనునట్లే చేసితిని స్వామికందుచేత కోపము అనినది. |