రత్నవళి
దిండుక్రిందపోకచెక్క నవలలోని రత్నావళి, ప్రాణములు సంశయస్థితిలో పడినప్పుడు, వరదవెల్లువలో చిక్కుచకొని పోయిన తనను తన కుమారుఇన రక్షించిన శాకయ్య యనువానిచేతిలో శీలము కోల్పోయినది. శాకయ్యయను, రత్నావళి, ఆమెకుమారుడును వరద తగ్గిన తరువాత మరియొక దేశమునకుపోయి భార్య భర్త కుమారుడు అనునట్లుగ జీవింపసాగిరి. ఆదేశమువారికి వీరెవరో తలియనందున భార్యాభర్తలనియే నమ్ముట జరిగినది.
శాకయ్యయను నీ మోసగాడు తాను బుద్ధుని యొక్క అవతారమునని శాక్యసింహుడనని ప్రజలను ప్రతారించుచు స్త్రీలను వశపచుకొనుచుండును. ఇతడు స్త్రీలను నేర్చుగ మోసగింపగలడు. రత్నావళికూడ శాకయ్యవలన మోసపోయిన స్త్రీలలోనొకతె. కాగానీమె తన జీవితము వ్యర్ధమైనదనియు దోషభూయిష్టమయిన దనియు చింతించువారలలో నగ్రగణ్య.
రత్నావళి భర్త చనిపోగా గోస్వామియను కుమారుని కొరకు జీవితమునెట్లో గడుపుచున్నది. ఒకనాటి యర్ధరాత్రి రత్నావళి నివసించుయూరిని నదిపొంగి వచ్చి ముంచెత్తినది. తల్లికుమారులొక తెప్పపై నదీవేగమున పడికొట్టుకొనిపోసాగిరి. వారి జీవితము లేక్షణమునన్తెనను నదీగర్భమున కలిసిపోవునట్లుండెను. ఆసమయముననే నదీ మధ్యమున నొకశిలపై శాకయ్య కూడా చిక్కుకొని యుండెను. అతడాకలికాగలేక కొట్టుకొనిపోవును తెప్ప పైవచ్చువారి దగ్గరనేమైన యాహారముండునేమోయని భావించి తనదగ్గర కురప్పించుకొనినాడు. రత్నావళీ గోస్వాముల ప్రాణములు కూడ రక్షింపబడినవి లేకున్నచో నదీప్రవాహమున కొట్టుకొనిపోయి నదితోపాటుగ సముద్ర గర్భమున కలియ వలసినవారే. వీరు ప్రాణములరచేత బట్టుకొని కూర్చుండి యుండిరి. శాకయ్య యొక్క క్షుద్భాధ రత్నావళీ గోస్వాముల ప్రాణరక్షణమునకుపయోగపడినది.
శాకయ్య ఆకలి రత్నావళి దగ్గరనున్న రొట్టెలతో తీరినది. నదీ వేగము మరిరెండు రోజులట్లే యుండగా వారుమువ్వురునీ శిలపై నుండి పోయిరి. ప్రాణము రక్షించిన యధికారముతో శాకయ్య రత్నావళిని వశము చేసికొనినాడు. ఆమెకా సమయమున నతనికి లొంగిపోక తప్పని స్థితి తానొక్కతే యైనచో నదిలో దుమికెడిదే. కాని కుమారుని విడిచి పోవుటకామె సిద్ధపడక శాకయ్యతో జీవితమును పంచుకొనుటకు నిర్ఱయించుకొనినది. రెండు మూడు నెలకొక గ్రామమున రత్నావళి భర్తవలె నటించి తరువాత శాకయ్య తనదారి తాను చూచుకొనెను. శాకమయ్య వెడలిపోయిన ఒకటి రెండు సంవత్సరములు రత్నావళియు నామెకుమారుడును తిండిలేక కృశించిపోయిరి. గోస్వామి పన్నెండు సంవత్సరముల వయసు వాడై దేశాంతరముపోయి ధనము సంపాదించుకొని వత్తునని పయనమైనాడు. రత్నావళి కుమారునెడబాసి యుండలేక యిరువురము ఒకచోట జీవింతమని చెప్పినది. గోస్వామి కొన్ని గ్రామములు తిరిగి మదాలస అను గ్రామమున ఒక కుటుంబమునకు వంట చేయుటకు మనిషి యవసరమని తల్లిని తీసుకొని పోయెను.నాటినుండియు తల్లీ కుమారు లాయింటనే నివసింపసాగిరి.
ఆయింటి యజమానిపేరు ధూర్జటి. రత్నావళి తనమంచి మనసుతో వారియింటిలోని మనిషివలెనైనది. ధూర్జటికి తనసొంత అక్కవలె నుండెను. ధూర్జటికి ఒక అక్క చనిపోయినది. ఆమెయే రత్నావళి రూపమున బ్రతికి వచ్చినదని భావింపసాగిరి. అతని భార్యరేవతి లేవలేని మనిషి. రేవతికిని ధూర్జటికిని గోస్వామియన్నచో నధికమైన ప్రేమ. తమ కుమారుడు మేధాపసువునకంటె వారికిగోస్వామియేలొయెక్కువ. రత్నావళికి గోస్వామిపైన కన్న మేధావనువు మీద అభిమానము మెండు.
ధూర్జటి గోస్వామికి చదువు చెప్పించెను. మేధావసువునకు చదువు రాలేదు. గోస్వామి పండితుడయ్యెను. ఉపనిషత్సారమంతయు హృద్గతము గావించుకొనినాడు. వ్యాకరణమున నెదురులేని పండితుడు. అతని కీర్తిని సమీపగ్రామములను దాటి రాజధాని వరకు వ్యాపించినది.
రత్నావళి శారీరక యాత్రనిరాటంకముగ నిరాబాధముగ జరిగిపోవుచుండగా మనస్సు మాత్రము నిత్యము క్షోభననుభవించు చుండెను. ఆమె క్షోభకు కారణభూతుడు శాకయ్య. భగవంతుడు తనకింతటి మంచిజీవితమును వ్రాసిపెట్టి తొలుత దుఃఖమును వ్రాసినడుమ శీలమునట్లు భంగపరుపనేల ? తనను భ్రష్టురాలిని చేయనేల ? అని జీవితములో తనకు జరిగిన యన్యాయమునకు నిత్యశోక సంతప్తురాలైనది. భర్తమరణించి నందువలన కలిగిన దుఃఖము పోయినదిగాని శాకయ్యకల్గించిన శోకమునకంతములేదు. భర్త మరణించుట యనునది దైవికము అపరిహార్యము గావున భర్త గుర్తుకు వచ్చినచో నయ్యో యనిపిపంచేయును. గాని యీ భ్రష్టుత్వమును తలచికొని రత్నావళి వ్యథచెందెడిది. కొడకు తనను గురించి యేమనికొనుచుండునోయని రత్నావళి మరింత దుఃఖించెడిది. మరల తనకుతానే కొడుకునకు చిన్న తనమున జరిగిన విషయము కనుక మరచిపోయెనని సర్దుకొనెడిది.
రత్నావళిపరిస్థితి యట్లుండగా గోస్వామిస్థితి కూడనట్లేయున్నది. అతనికి తల్లికి కల్గిన దుర్దశకుయేమి చేయవలెనన్న యోచనకల్గెడిది. శాకయ్య ఎచ్చటనున్నను సరే వెదకి పట్టుకొని తల్లినట్లేల భ్రష్టురాలిని చేసెనో కనుగొనవలెనని భావించుచుండెడివాడు. ఒకనాడు గిరివ్రజపురమునకు వెళ్ళవలెనని తలచి రేవతిననుజ్ఞవేడెను. ఆసమయమున గోస్వామి రేవతితోనిట్లనెను. అమ్మా నాకు నిజముగ తల్లినీవు. రత్నావళికాదు. ఆమె యూరకే నన్ను కడుపునగన్నది. ఇంకను చాలయున్నవి. నీతో చెప్పుటకు నాకిష్టములేదు. ఈ మాటలు రత్నావళివిన్నది.
ఇంతయేగాని గోస్వామి తల్లినెన్నడను కించపరచలేదు. ప్రతిదినము నిదురలేవగనే తల్లి పాదములకు నమస్కరించిన తరువాతనే ధూర్జటిపాదములకు నమస్కరించెడివాడు. దేవతవంటి తల్లికి జరిగిన యన్యాయము రూపుమాపుట యెట్లన్న యోచనతో గోస్వామికాలము గడుపుచుండెను.
రత్నావళి దుఃఖమధికమైనది. తనమూలముగా కుమురుడెంత వేదన ననుభవించుచుండెనోయని పరితపించినది. ఆమెకుజీవితముపై విరక్తికల్గినది. తానులేకున్నచో కుమారునకు దుఃఖము పోవుననుకొనినది. ఇదిరత్నావళిలోని పుత్రప్రేమను తెలుపుచున్నది. తన భ్రష్టత్వమునకు దురదృష్టమునకు తాను దుఃఖింపవచ్చును. దుఃఖించుచునేయున్నది. కాని కొడుకు దుఃఖించుటయన్న విషయము నూహింపజాలకున్నది. కుమారుని దుఃఖ నివృత్తి కొరకు ప్రాణత్యాగమునకు సంసిద్దురాలయినది. తానిన్నాళ్ళు బ్రతికినది తనబిడ్డ కొరకుగదా. ఆబిడ్డను గూర్చితనకిప్పుడు భయములేదుకదా తానెట్లైననేమి బ్రతికినన్నాళ్ళు తన బిడ్డకు తనయునికి మనశ్శల్యము కావున తనయునికి వలన కుమారునికిగల్గిన మనశ్శల్యమును తాను నిష్క్రమించి తొలగింపదలచి నదిరత్నావళి. వృత్రాసురుని చంపిన బ్రహ్మ హత్యా పాతకమును ఇంద్రుడు స్త్రీలకు వృక్షములకు నదులకు నెట్లుపంచి పెట్టగలిగెనో అట్లేశాకయ్య చేసిన పాపము తల్లికంటకుండ శాకయ్యయే సర్వపాపమును స్వీకిరంచునట్లొక యజ్ఞ విధానమునొక మునివర్యుని దగ్గర గోస్వామి నేర్చుకొనెను. శాకయ్యతనపాపమును రత్నావళి పాపముకూడ తానే భరింతునని యంగీకరించెను.
ఆమెను నీవు పాపములోనికి దించితివి. ఆమెయా పాపము పరిత్యజింప దలచుకొన్నది. ఒక గడ్డుసమస్యలో కృతజ్ఞతాభావముచేత ఆమె మనస్సు దమ్ముకొనియుండగా నీవు స్త్రీ శరీర గత సంధులు కళాస్థానములు తెలిసినవాడగుటచేత నామె యంగీకారము లేకుండా... శీల భంగమును గావించితివి అని శాకయ్యతో పలికి శాకయ్యను పాపస్వీకారహోమమున కంగీకరింపజేసెను. తల్లియేగాక మరి పదిమంది స్త్రీలు శాకయ్యవలన చెడిపోయినందున వారందరి విలాసములను పట్టకొని వారందరు గోస్వామి హోమసమయమున కచ్చటికి వచ్చునట్లు యేర్పాటుచేసెను.
గోస్వామికి శాస్త్రము తెలియనేగాని యనుభవములేదు. రత్నావళి తాను పాపము చేయుటలో శాకయ్యకుకొంత బాధ్యత ఉన్నప్పటికిని తను కూడ కొంత బాధ్యతలేదన రాదనినది. తనపాపమును తానేయనుభవింతును గాని శాకయ్యకు ధారపోయనని చెప్పినది. తల్లియొక్క నిజాయితికి గోస్వామి యచ్చెరువునంది మిగిలిన స్త్రీలపాపములను శాకయ్యస్వీకరించునట్లు చేసినాడు. వారందరు శాకయ్యదే పాపమనిరి. రత్నావళి తానుపాపము చేసినది. కుమారుని కొరకు నన్నది. ఆ పాపము చేయుట నిన్ను బ్రతికించుటకే అన్నది. దానియనుభూతి (పాపము) నాకు భవిష్యజ్జన్మలలో లేకుండా నీజన్మలోననే నేను దగ్ధమైపోవునట్లు చేయము అని ధృఢముగ పలికినది.
గోస్వామి శాకయ్యచే హోమము చేయించునప్పుడు, ఒక్కొక్క హోమము చేయునప్పడు శాకయ్యదొక్కొక్క యవయవము రూపుమాసి పోవుచుండెను. చివరికి వాక్కుమిగిలినది. కడపటి హోమమునకదికూడ మిగులలేదు. ఒక వికారస్వరూపము గాలిలోనికి లేచి పిశాచాకృతియై నిష్ర్ర్కమించినది. రత్నావళీ పాపనిష్కృతికై హోమము జరిపినరోజుననే రత్నావళి మదాలస గ్రామమున మరణించినది. రత్నావళి శరీరమునల్లగా మాడిపోయి కాష్ఠమువలెనైనది. ఈ నవలలో వెల్లడించిన పాపస్వీకార హోమమొక ప్రతీకాత్మక చర్యయనియు మానసిక వ్యాపారమనియు భావింపవలెనేగాని యధార్ధవ్యవహారముగ తలంపరాదు. రత్నావళి పశ్చాత్తాపముతో కుమిలి పోయినది. శాకయ్యపాపములను తీసికొనిపోయి శాకయ్యకు ఇమ్మని రత్నావళి కొడుకునకు చెప్పినది. అనగా తనబాధను కుమారునితో చెప్పగా వాగ్రూపమున కొంత బహిర్గతమైనది. తనవేదన కుమారునితో చెప్పుకొన్నంతనే సగము బాధతీరిన భావన రత్నావళిలో కల్గినది.
శాకయ్య చేసిన వన్నియును పాపకృత్యములే. ఆరుగురుపిల్లలతో నున్న యిల్లాలిని నిరాధముగజేసి తనదారిని తానులేచివచ్చెను. ఆయిలాలు తనపాపమునెత్తి చూపుచున్నట్లుగా యెదుట నిలబడినది. పెద్దవాడైన కుమారునితో సహా వచ్చి శాకయ్యను నిగ్గదీసినది. మరియు నతడు చేసినపాపములన్నియు మానవాకృతులై వచ్చినట్లుగా తానువంచించిన స్త్రీలందరు జట్లు జట్లుగా వచ్చి నిగ్గదీసియడిగిరి. శాకయ్య అవమానభారముతో తలవంచుకొనినాడు దీనికిసహాయ పడునట్లుగానున్నది. గోస్వామి యజ్ఞతంతు అతడు జుహోమి స్వాహాయనుటతో స్వీకరోమి యనుచు బెదరి పోయెను. ఆపాపములన్నియును వచ్చి తనచుట్టును పిశాచాకృతితో నృత్యము చేసినట్లు శాకయ్యభావించి యుండవచ్చును. వానిలోకల్గినపాపభీతియే వానిని మాడ్చివేసినది.
రత్నావళి కూడ పాపభీతి చేతకాక కుమారునకు తనయెడలనున్న భావమునకు హతాశురాలైనదే. బ్రతికి చేయవలసినది. లేదనుకొనియామె మరణించినది. రత్నావళి యొక్క పశ్చాత్తాపగాథ దిండు క్రింద పోకచెక్క నవలలోని ముఖ్యాంశము.
రత్నావళి
విశ్వనాథవారు చెలియకట్ట యను నవల వ్రాయుటకు వలయు ప్రేరణనాటి సమాజము నుండియే లభించినది. వారికాలము సంధికాలమని చెప్పవలయును. ఆర్షధర్మాచరణమును వీడియు వీడక ఆధునిక సంస్కారము నాదరించియు నాదరింపక కొట్టుమిట్టాడుకాలమది. సామాన్యులుయేది యాచరణీయమో యేది యనాచారమో తెలియక జీవితము నాశనము చేసికొనుటకు కారణమైన స్వేచ్ఛాప్రణయ సిద్ధాంతమను నినాదమునకు ప్రభావితులగుటయు జరుగుచుండెడిది.
ఆధునిక సంస్కారము పేరిట స్త్రీ పురుషులు స్వేచ్ఛా సంచారమును జరిపి దానికి ఫలితముగ స్త్రీలు అన్యాయమై పోవుటచూచిరి. స్త్రీల యొక్క అమాయకతను ఆసరాగా తీసికొని పురుషులు కూహనా శరణాలయములు నడుపుచు వారి సన్యాయము చేయుట చూచిరి. విడి ప్రేమసంఘములు యేర్పడినవి. సనాతనముగ నున్న వివాహ వ్యవస్థ కుంటుపడుట, స్వేచ్ఛా ప్రణయ సిద్ధాంతము మాటున వ్యభిచారములుచేయుట తద్వారా సంఘము క్రుళ్ళిపోవుట చూచి స్తబ్ధులై యుండజాలక చెలియలికట్ట యను నవలను ప్రజలముందుంచిరి. చెలియలికట్ట హద్దును సూచించు చున్నది. సముద్రుడు భూమిపైకిరాకుండ నొక హద్దును ప్రకృతి యేర్పరచినది. మనసునకు కళ్ళెమువేసి స్వేచ్ఛా విహారమునరికట్టవలయుననుట యీనవల యుద్దేశమగుటతో చెలియలికట్టయనుటలో సార్థకనామధేయమైనది.
ఈ నవలయందు ముఖ్యపాత్ర రత్నావళి. రత్నావళిమరిదియైతి రంగారావుతో వెడిలిపోయినది. ఉన్నవ లక్ష్మీనారాయణగారు తమ మాలపల్లి లోకూడ నిట్టిపాత్రను చిత్రించియున్నారు. భర్తను ఒక బిడ్డను వదలి వెళ్ళిన ఆ స్త్రీని ఉన్నవ వారు భగవంతునిచే శిక్షింపజేసిరి. రత్నావళి తన తప్పిదమునకు తనకు తానే శిక్ష విధించుకొనినది. ఆత్మవిమర్శలవలన ప్రేమయననేమి ? కామమననేమి ? వ్యవస్థ శ్రేష్టమయినదియా ? సంస్కారము శ్రేష్టమా యన్న జిజ్ఞాసతో సత్యము నవగతము చేసికొనినది. ఉన్నవారి పాత్ర చిత్రణ నైపుణికిని, విశ్వనాథ యొక్క నైపుణికిని గలమార్పునిచట గ్రహింపవచ్చును.
భార్యభర్తలు ప్రేమలేదను కారణమున ఒండొరులను వీడరాదను భావమే నవలకు మూలాధారము. ప్రేమకారణము నాధారముగ చేసికొని యుద్భవించునేగాని నిష్కారణముగ జనింపదని విశ్వనాథవారి వాదము. ఒకని నొక కారణమున వీడిన స్త్రీ యాతనిని మాత్రము ఇంకొక కారణము చేత వదలకుండునా యన్నది ప్రశ్న. పురుషులనుమార్చుచు సంతానమును ఒడయుచు స్వేచ్ఛావిహారిణియైన స్త్రీ వలన సంఘక్షేమమునకు హానికల్గును.
రత్నావళి సీతారామయ్యను రెండవ భార్యకథ ప్రారంభమగు సమయమునకు రత్నావళి పదునైదేండ్లు. సీతారామయ్యకు నలుబదేండ్లు. మొదటి భార్య యందొక కుమార్తెయు కుమారుడనుగలరు. వివాహమైన తదుపరి రెండు సంవత్సరములు సీతారామయ్యను రత్నావళియును సక్రమముగ కాపురముచేసిరి. రత్నావళికి భర్తపై కోపతాపములుగాని భేదభావముగాని లేవు. అతడు సమర్ధుడా యసమర్ధుడా ? అన్నయాలోచనగాని సుఖపడుచుంటినా లేదాయన్న విచికిత్స గానిలేవు. ఈ సమయమున సీతారామయ్య తమ్ముడగు రంగారావు పట్నములో చదువుకొనుచు సెలవులకు ప్రతిష్టాపురమువచ్చెను. అతడు వయసు ముదిరిన యన్నగారి ప్రక్కన లేతవయస్సులోనున్న వదినగారినిచూచి యావేదనను చెందెను. సీతారామయ్యయామెకు తగడనియు ఆమె మేనమామ ఆమె గొంతుకోసెననియు విచారించుచుండెను. ఆమెకన్యాయము జరిగినదన్న చింతయేగాని యామెయందాతని కెట్టిదురుద్దేశములేదు. తనదురవస్థకు కూడ యామె గ్రహింపజాలకున్నదని జాలిపడెడివాడు. ఆమెయెట్టిస్థితిలో నున్నదో తెలియదలచినాడు ఒకనాడు రాత్రిసమయమున రంగారావు దొంగవలె గోడదూకి ఆమె గదిలోనికి ప్రవేశించెను. మరదినిచూచి రత్నావళి భయపడినది. తాను కొన్ని మాటలను చెప్పుటకు వచ్చితిననియు భయములేదనియు చెప్పెను. అతడు చెప్పినదేమనగా నీవుచదువుకున్నదానవు మా అన్నయ్యకేమీ చదువురాదు. నీవు అందగత్తెవు. ఆయన అందగాడుకాడు. పైగా వట్టిపల్లెటూరివాడు అని చెప్పెను. తరువాత వయసులోనున్న స్త్రీలను ముసలికవాళ్ళు సుఖపెట్టలేరని చెప్పి వెడలిపోయెను. రంగారావు రత్నావళిలోనొక యహంభావమును రేకెత్తించి వెడలిపోయినాడు.
రత్నావళి మనసులో పురుగు దొలవ మొదలిడినది. తనయందము నద్దములో చూచుకొనుచు సీతారామయ్య. యొక్క వికార స్వరూపమును పరికించుచు నిత్యముచేయు గృహకృత్యములను మానివైచినది. నిర్లక్ష్యముగ నుండుట మొదలిడెను. సమయము దొరికినెప్పుడెల్ల రత్నావళి యు రంగారావును ఒకరినొకరు చూచుకొనుచుండిరి.
రంగారావు మొదటిసారి గోడమీదినుండి అన్నగారిగదిలోనికి దిగిన తరువాత మూడురోజులకు రత్నావళిని మరల గలిసెను. ఈ మారుకూడ రంగారావు గోడదూకియే రత్నావళి గదిలోనికి ప్రవేశించుట జరిగినది. రత్నావళి అతని కొరకు చూచుచు నిద్రనభినయించు చుండెను. రంగారామెకు కొన్ని నీతులను బోదించెను. మగవారిని చూచియాడవారు సిగ్గుపడరాదు. ఇరువురును సమానమే. వంట ఆడవారే యెందులకు చేయవలెను. మొగుడుకొట్టిన నామెయు తిరిగి కొట్టవచ్చును. ఇంటిలోని వారందరివిని ప్రాతయూహలు పాత్రయాచారములును తమ యిరువురును కలిసిన కొంత వరకు బాగుచేయవచ్చుననెను. ఇట్లుచెప్పుచు రత్నవాళి చేయిపట్టుకొని కదలించెను. ఆమె మొదట సంశయించినను చేయినట్లేయుంచినది. ఇది సోదర, సోదరీ భావము. మనలో మను భేదము లేదనుచు రత్నావళిని రంగడు కౌగలించెను. రత్నావళీ రంగారావులనై తికపతన మింతటితో పూర్తియైనది. ఇరువురి యందును వికృత భావములులేకున్నను, యేకాంతసమయమునందు స్త్రీ పురుషులు సన్నిహితముగనుండుటలో నేమిజరుగునో చెప్పుటసాధ్యపడదు.
రత్నావళీ రంగారావుల నైతిక పతనమునకు కారకుడు రంగారావేయని నిస్సంశయముగ ననలేము. వదినగారు దుస్థ్సితిలో నున్నదనెడియొకానొక యపోహలో నుండి దానికి నివారణోపాయమేదియని యాలోచింపక యర్ధరాత్రి బోధనలుచేసెను. తానొకమహోన్నతమైన సిద్ధాంతమును ప్రభోధించునట్లు తలపోసెను.
రత్నావళియను గుంభనముగ సంసారము చేసికొనుచుండెను. పదునైదేండ్లబాలిక. ఇంటిలోని పని పాటలు చేసికొనుచున్నయమాయక రంగారావు సాంఘిక దురాచారములనుచు స్త్రీ స్వేచ్ఛయనుచు ప్రేమయనుచు ప్రేరేపించినవాడు. మరిదినివారించుటకు తగినవయస్సుకాని, తాముచేయునది తప్పనిగాని తెలిసికొన లేకపోయినది. ఆమెమనసునకు రంగారావు చెప్పినది నిజమేయనిపించినది. ఇరువురిలోను పాపపుటూహాలు లేకున్నను వారు కలిసి మాట్లాడుకొన్న సమయము, ఏకాంతము, దుర్విధి, వారిని ఊబిలో కూరకొనునట్లు చేసినది. ఇంద్రియ నిగ్రహము అందరకు సాద్యము కాదని రచయిత ఇట చెప్పదలంచిరి. నిగ్రహమను నది సాధనా విషయము. సిద్ధాంత విషయముకాదు...సాధన జీవిత విషయము అని సిద్ధాంతమునకు ఆచరణమునకు గల భేదమును చెప్పిరి. రంగడు తాను చెప్పదలచుకొనిన మాటలు నిర్భీతిగ తల్లియెదుటనో, అక్కగారి యెదుటనో చెప్పినచో పరిస్థితి చేయిజారకుండెడిది. అతడు వదినకు చెప్పదలచిన విషయము నిష్కల్మషమైయున్న యెడల అందరి యెదుటనే చెప్పియుండెడి వాడు. వదినగారిపై వాంఛయతనికి తెలియ కుండగానే అంతరాంతరముల యందు నిగూఢమై యుండియుండ వచ్చును. రంగడు నిర్దోషి యైనయెడల అతని కసలు తనవదినను అన్నాగారు శారీరకముగ సుఖపెట్ట చుండెనా లేదాయను నూహయే పొడమదు. వదిన తల్లివంటిదను నమల భావమతునికి లేదు. పరిస్థితి విషమించిన తరువాత రంగడు భిన్నుడయ్యెను. అవమానము లజ్జయును నతనికి కలిగెను. కాని యిదియు పైపై భావమే యనుట కాస్కారమున్నది. అతనికి తెలియకుండగానే అతని మనస్సులోనొక సంతోషరేఖ దోచెను. రంగడు ఖిన్నుడయ్యెను సంతోషరేఖ తెలియకుండ దోచినది. కాని రత్నావళి యంతరంగముననైన భిన్నురాలు కాలేదు. విలాసముగ నున్నది. ఆమెలోనొక యుత్సాహదీప్తి లజ్జయు కనుపించెను. ఇందువలన జరిగిన పతనము యొక్క లోతు రత్నావళికి అందకపోగా సంతసించు చుండెను అని తెలియుచున్నది.
రత్నావళీ రంగారావుల యీచర్యలో నెక్కువ భాగము రత్నావళిదే యనవలయును. ఎందుచేతననగా రత్నావళి వివాహిత. ఆంగ్లవిద్య నభ్యసింపలేదు. స్త్రీ స్వాతంత్ర్యము స్వేచ్ఛాప్రణయ సిద్ధాంతము వంటివామె యెరుగదు. ఆమె యానాఘ్రాత పుష్పముకాదు..లోకమునందలి బహుసిద్ధాంతరాద్ధంతము లామె యెరుగక పోవచ్చును. లోకము నందలి సౌఖ్యము యొక్క పరమావధి యామె మనోవధిగానుండక పోయినను శరీరావధిగా నుండెను. జన్మించినదారి సంప్రదాయమునను సరించియేజీవించుచుండెను. రంగారావు అన్యాయమైపోతివని చెప్పినప్పుడు తాను సుఖముగా నుంటినని యామె చెప్పలేక పోయినది. సీతారామయ్య యొక్క మంచితనముగాని కుటుంబము యొక్క పరువు ప్రతిష్టలుగాని సరకు జేయక మరదితో కలసి జీవించు తెగింపు రత్నావళీగలదు. సీతారామయ్యవానితో లేచిపోవుట యిష్టమేనా యని యడుగగా రత్నావళి నిర్భయముగ తన యంగీకృతిని తెలిపినది. ఇచ్చట రత్నావళి శారీరక సౌఖ్యమునకు ప్రాధాన్యమిచ్చిన దనుటలోన సత్యములేదు.
పంకమున పదము పెట్టినదాది రత్నావళికి హేతువాద దృష్టియు విమర్శనా శక్తియు కలిగినది. రత్నావళి బహుగ్రంధపఠనము చేసినది. పుస్తకములను చదివికొలది యామెలో సహజముగనున్న జ్ఞానము మరింత దీప్తిమంతమయినది. పురుషులు పెత్తనం చేయ్యటం యేమి ఆడవాళ్ళింట్లో బానిసవలె చాకిరీ చెయ్యటమేమి అని భావించుట మెదలిడినది. కుంతి పతివ్రతా ? ద్రౌపది పతివ్రతా ? ఈ పతివ్రత అన్నమాట ఆడవాళ్ళ గొంతుక కోసెందుకు మగవాళ్ళు కల్పించారు అని తలచినది. మానసికముగ నొకవిధమైన తిరుగుబాటు రత్నావళి సూచించినప్పటికిని శారీరకముగ నామె నీతి బాహ్యురాలు అయినప్పటికిని చివరకు రత్నావళిని విజ్ఞానగను ధర్మజ్ఞురాలిగను చిత్రించుటలో రచయిత చూపిన ప్రతిభ అనన్యసాధ్యము. స్వస్థానము నుండి భ్రంశమైన యతివ తిరిగి నిలద్రొక్కుకొనలేక మరింత హైన్యస్థితికి చేరుకొనుట సాధారణముగ జరుగువిషయముకాని ప్రవాహమున కెదురేగి తాను చేసిన పాపప్రక్షాళనమును చేసికొనవలెనన్న తపనరత్నావళి యనుభవించినది.
|