రత్నావళి సున్నితమైన దనియు ఎటుల చెప్పిన నటులే ప్రవర్తించుయబల యనియు సీతారామయ్య సోదరియైన సరస్వతి భావించినది. రత్నావళి మనస్సు మైనపుముద్దవంటిది. ఎటువంటి బొమ్మచేయవలెనన్న అటువంటి బొమ్మనుగా నామెనుమలచవచ్చును. సర్వసాధారణముగ ప్రవృత్తియైనను తల్లిదండ్రులయొక్కయు గురవుల యొక్కయు చదివిన సాహిత్యము యొక్కయు పరిసర సంఘము యొక్కయు ప్రభావమునుండి తప్పించుకొన జాలదు. తన యంతరంగము చలింపని స్థితిలో నున్నను పైవాని ఛాయలు పడకుండ తప్పించుకొనుట దుర్లభము.
సరస్వతి రత్నావళిని ఆడకత్తెరలో పెట్టినట్లుగ పనులు చేయించి సంప్రదాయ ధర్మములను నూరిపోసినది. మనసుకోతివంటిది. దానిని ఆహరహము కార్యనిమగ్నము చేయని యెడల దురూహలు పుట్టవచ్చునని సరస్వతి గ్రహించినది. సరస్వతి బోధనవలన రత్నావళి హృదయమునుండి రంగడు కొంతవరకు తెరమరగు కాజొచ్చెను. ఆమెకొంతవరకు యూరటజెంది ప్రసన్న మనస్కురాలు కాబోవు తరిని విధి కల్లోలమును సృష్టించినది. రత్నావళి సంసారము ఛిన్నాభిన్నమగుటలో విధినిర్వహించిని పాత్ర ప్రముఖమైనది.
సీతారామయ్యకు మొదటి భార్యయందు కలిగిన కుమారుడు మరణించెను. అతడు దుఃఖ సముద్రమున ములిగియుండి రత్నావళియందు కల్గిన మార్పును తనయందామెకు కల్గిన సముఖత్వమును గ్రహింపలేదు. రత్నావళి పొడయే తనకు తగల రాదన్నట్లుగ సీతారామయ్య ప్రవర్తించెను. రత్నావళియెడల వైమనస్యము, నిరాసక్తము, ఉదాసీనత ప్రకటింపసాగెను. సీతారామయ్యను తిరిగి యల్లుకొందమన్న మనోలత అతని నిరాసక్తతతో తిరిగి రంగారావునకై ఎగబ్రాక తొడగెను. రత్నావళి మనస్సుమిక్కిలి చంచలము. రంగారావుతోనామె వెడలిపోవుటలో సీతారామయ్య నిరాకరించుచుండగా రంగారావాకర్షించుచుండెను. ఇట్లీయిరువురి మధ్యన బడిన రత్నావళి రంగారావు వైపునకు మ్రొగ్గకతప్పలేదు.
స్త్రీకి వ్యవస్థ కల్పించినంత సౌఖ్యము స్వేచ్ఛవలనకలుగనది రత్నావళికి ముందుగ తెలియలేదు. సంస్కారములో సంప్రదాయములోనున్న భద్రతలేదు. రత్నావళి తన మనస్సునకు నచ్చినరంగారావు తోడనైనను సుఖింపలేక యుభయ భ్రష్టత్వమునందినది. క్రొత్తయనుభవములకై దవ్వులకు పరువెత్తి యచటలేని నూతననత్వమును తెలిసికొనినది. మద్రాసునందున్న సముద్రము ప్రతిష్ఠాపురమునందున్న సముద్రముకన్న శోభావహముగ లేదని గ్రహించినది. అనుభవించినగాని యందున్న సుఖదుఃఖములు తెలిసిరావు. పుటము పెట్టినగాని బంగారము శుద్ధికాదు. తానుచేసినపని తప్పన్న జ్ఞానము కల్గినప్పటి నుండి తన్ని వారణమునకై యన్వేషణమును ప్రారంభించినది.
ధర్మశాస్త్రముల ఉపనిషత్తుల వేదాంతమును హృద్గతము గావించుకొన్నది. తెలసి చేసినను తెలియకచేసినను పాపము పాపమే. పుణ్యసాహాయ్యమున పాపమును పరిమార్చుకొనుట యసాధ్యమనియు దేని కదియే ప్రత్యేక విభాగమనియు రత్నావళి గ్రహించుకొన్నది. అప్పటికి నాకు ప్రపంచము తెలియదు. తెలిసెడి వేళకు దెలిసియు ప్రయోజనము లేదు. అని తెలియక చేసిన దానికి చింతించినది. ఎంత చదివినను జ్ఞానవంతురాలైనను తన పతనమునకు కారణము రంగడే యను నభిప్రాయములో నుండెడిది. ఒకటి రెండు తావులందు మాత్రము తనదోషమునంగీకరించినది. రంగారావు మిత్రుడైన ముకుందరావు రత్నావళికి గురుతుల్యుడు అతడు రత్నావళి యొక్క పతనమును గూర్చియామె తప్పులేనట్లుగ మాటాడుచు. నీవిట్లేల వచ్చితివో యదియు మంచికేనేమో అని రత్నావళితోననెను. వాజ్ఞ్మయాకాశమున ధృవతారలవంటి వాల్మీకి వేమన వంటి మహాపురుషులు ప్రారంభమున నీతి బాహ్యమైన జీవితమును గడిపినను వారి దుర్నీతి పరాకాష్టదశకు చేరుకొనిన తరువాత వారికి జ్ఞానోదయమగుటయు లోకమున కుద్గ్రంధముల నందించుటయు జరిగినది.
ఒక సాంప్రరాయమును ఒక కట్టుబాటును త్రెంచుకొని స్వేచ్ఛా సంచారము స్త్రీ యొక్క ఆవస్థ యెట్లుండునో తెలుపుటకు మాత్రమే సృష్టింపబడిన పాత్ర రత్నావళి. రత్నావళి లోకమును వెరవలేదు ప్రతిష్టకైప్రాకులాడలేదు. కాని యంతరంగమునకు సంప్రదాయమునకు వెరచినది. రంగనికి పక్షపాతము వచ్చినపుడు చాలా వ్యధ చెందినది. తాను తీక్షణముగ మాటాడినందులకతని మనస్సు వ్యగ్రతనొందినదని తెలిసికొన్నది. జబ్బుతగ్గిన తరువాత కొంత కాలము ప్రశాంతముగ గడచినది.
ముకుందరావు సమయమునకు వచ్చి యామెలోని పశ్చాత్తాపమును గ్రహించి చదువుతో బాటు జ్ఞానమును ధర్మమును బోధించినాడు. సదాసద్విమర్శనా వైఖరిని యేవిషయమునైన కూలంకషముగ చర్చించుటయును నేర్పెను.
రత్నావళి రంగారావునకు సీతారమయ్యకును గల భేదమును అనుక్షణము గుర్తించుచునే యుండెడిది. ప్రతిష్టాపురమునందు లభించిన సుఖమును మద్రాసునందనుభవించిన సౌఖ్యమును కూడ బేరీజు చేయుచునేయుండెడిది. కడకు సీతారామయ్యయందే రత్నవళి మనస్సు మ్రొగ్గు చూపెడిది.
క్రొత్త మోజు తీరిన తరువాత రత్నావళి మనస్సు రంగారావునుండి దూరము కాసాగెను. రంగని పూర్తిగ నామె ప్రేమింపలేదు. ఆమె మనస్సు నుండి సీతారమయ్యయును అతని సుగుణములును తొలగిపోలేదు. భర్త యందారోపించుటకు అతడామెకు చేసిన లగ్గులేదు కేవలము రంరారావుపై మెరుగులు చూచియు తాను దురవస్థలో నుంటినన్న తన మీద తనకే జాలికలుగుట చేతను సీతారామయ్య కన్న రంగారావుయొద్ద మిగుల సుఖదాయకముగ నుండిననియు నాశచే యిల్లువీడి వచ్చినది. భ్రమ క్రొత్త మోజు తీరినంతనే తొలగినది. రంగారావు మొదటి నుండియు తానమెను ప్రేమించుట లేదనియే చెప్పెను. తన మిత్రులనందరను చూచిన తరువాత నామెకు నచ్చిన వానిని పెండ్లియాడుమనియు, అంతవరకు తన కతిధిగ నుండమనెను. ఆమెకీ సంగతి రుచింపలేదు. అతిధులను ముద్దు పెట్టుకొనవచ్చును...షికార్లు తీసికొని పోవచ్చును....సంసారముచేయవచ్చును. ఆ ప్రేమ ఎటువంటిది ? దానికి గుర్తేమిటి అని ప్రశ్నించినది. తనను ప్రేమించుట లేదన్న రంగనికి కారణాంతరములచే శరీర మర్పించినది. కాని మనసు నర్పింప లేకపోయినది.
ధనాభావముచే కల్గిన యిక్కట్లు సగము కన్నులు తెరిపించినవి. రంగడు బోధించిన సంస్కరణమామెకు ఆచరణమున కన్పింపలేదు. మగవారి విషయ లౌల్యమునకామె నవ్వుకొన్నది. నీలమోహనుడను రంగని మిత్రుని సోదరునిగ చూడగల్గినది. నిన్ను చెడగొట్టదగినంత సామర్ధ్యము నావద్దనున్నది. కాని ఇరువురిని బాగుచెయ్యగల సామర్ధ్యముగూడ నావద్దనే యున్నది. అని నీలమోహనునితో నన్నది. ఈ వాక్యమును తరచిచూడ రచయిత యభిప్రాయ మిట్లున్ని దనిపించును. స్త్రీ పురుషుల దుర్నీతికి స్త్రీ పురుషు లిర్వురకును సమానమైన బాధ్యత యుండుననుటమే రత్నావళి పురుషుల నెందరినైనను కనుచూపుతో నాటలాడించు నేర్పుగలదై నప్పటికిని తనువైచిన తప్పటడుగును గుర్తింపగల బుద్ధి నైశిత్యమామె కల్గియుండుట చేతనను తాను రక్షించుకొనుటయేగాక నీలమోహనుడు ముకుందరావు మొదలైనవారిని సన్మార్గమున పెట్ట కల్గినది.
ప్రేమయననేమో ర్నతావళి కూలంకషముగ చర్చించుకొని తెలిసికొన గల్గినది. కారణము లేనిది ప్రేమ జనింపదు. ఆకారణమెట్టిదైనగావచ్చును. అందముగాని గుణముగాని ధనముగాని సామర్ధ్యమును గాని చూచి స్త్రీ పురుషులొండొరుల ప్రేమించుకొనుట సాధారణము. ఇటులనే భర్తయందు తననొక గుణమునచ్చక నేరొకని నెన్నుకొన్నచో అతనియందామె యాశించిన గుణము కాలవశమున నశింపవచ్చును. రత్నావళి యందిదియే సంభవించినది.
సీతారాముని ప్రేమించుటకు కూడ నొకకారమున్నది. రాముడు గొప్పవీరుడు శివధనస్సును విరచెను. దొడ్డవాడుతనకీడైన వాడు. అందుకని ప్రేమించెను అనెను. ఇటజన్మాంతర బంధ కారణము విడువబడినది. కావున కారణమును బట్టియేర్పడిన ప్రేమశాశ్వతముకాదు. ధనమున్నదని యొకనిని ప్రేమించిన యువతికి అంతకన్న ధనమున్నవాడు లభ్యమైనపుడు మొదటి వ్యక్తి యందుగల ప్రేమ నశించుట కవకాశమున్నది. కేవలము వివాహము అను పవిత్రబంధము మాత్రము స్త్రీ పురుషులనొక హద్దున నలిపియుంచును. ఈ బంధమున కట్టిశక్తి గలదనియే విశ్వనాథవారి యభిప్రాయము.
ఒకమారు భర్తను వీడి స్వేచ్ఛాప్రణయమును నమ్ముకొన్న మహిళ ఒక ప్రియుని మార్చుటతోడనే సంతృప్తి పడక అనేక కారణములచే ననేక ప్రియులను త్రోసిరాజనుచు, అగ్ని కాశించు శలభమువలెనగును. మరియు తాను కోరుకొన్న భావము, నేఖ్యము లభింపక యధోగతి పాలగునే గాని ఉత్తమమైన జీవన మార్గమున నడువలేదు. ఇందులకు సంఘముకాని పురుషులు గాని యామెకు చేయూతనీయరు.
రత్నావళికి రంగారావుపై మోజు తగ్గిన తరువాత కల్గిన భావము పశ్ఛాత్తాప భావమేగాని యాత్మన్యూనత భావముకాదు. తాను చేసినదానికి సిగ్గుపడలేదుసరికదా తప్పు చేసితననియు తప్పుసవరించుటకు ప్రయత్నించు చుంటిననియు ముకుందరావుతో స్థిరముగ చెప్పినది.
శారీరకానుభవ పరమైన వాంఛ ప్రకృతి సిద్ధమైనది. ప్రేమ అవ్యక్తము. అనిర్వచనీయమైనది. వివాహము సాంఘికమైనకట్టుబాటు, అని ఆమె గ్రహించి, ఈ మూడింటిని సమన్వయంచేసి ఏకవ్యక్తి పరంగా లగ్నం చెయ్యవలసిన అవసరాన్ని గుర్తించే సరికి ఆమె వెనుతిరిగి రాలేనంత దూరం వెళ్ళిపోయింది ఇట్లు రత్నావళిలోని పశ్చాతాప్తమునకు ప్రభావితుడైన రంగారావుకూడ పశ్చాత్తాప్తు డయ్యెను.
శాస్త్రీ, ముకుందరావులామెకు నామమాత్రపు గురవులు, ఆమె యంతరంగమే యామె గురువు. విద్యనభ్యసించిన కొలది జ్ఞానమార్జించిన మతము ప్రకారము వివాహము సంతానము కొరకుగాని భోగముకొరకుకాదు. వివాహోప్రజాయైనతు భోగాయైతి మహాత్మనోమతః మరియు సంప్రదాయ బద్ధముగ జరిగిన వివాహము వలన కల్గిన సంతానము మూడు పురుషాతరములను పవిత్రము చేయుదురు.
శీలపోషణావశ్యకత శరీరమునకు సంఘమునకు సరిసమానముగ నున్నది. మనుజులు వాంఛాతప్తులై విశృంఖల విహారము చేసి నందు వలన తాము రోగగ్రస్తులగుటయే గాక తమ సంతానమునకును రోగములను సంక్రమింప చేయుదురు. గుణశీలములు, నిగ్రహములేని వ్యక్తుల వలన జాతి దోషభూయిష్టమై నిర్వీర్యమగుటయు జరుగునని ధర్మజ్ఞులును శాస్త్రజ్ఞులు ప్రవచించియున్నారు. నిన్ద్యవివాహము వలన వర్ణసంకరములు కల్గునని మనువు మొదలగు శాస్త్రకారులు చెప్పియున్నారు. వర్ణమనగా బ్రాహ్మణ క్షత్రియ మొదలగు చాతుర్వర్ణములు గాక రక్త విష్ఠమయిన చాతుర్వర్గములని చెప్పుకొనవలెను. ఇంద్రియ నిగ్రహము నాలుగు వర్ణములు వారికి నుండవలెనని మనుస్మృతి. అహింసాసత్యమస్తేయం శౌచమిన్ద్రియ నిగ్రహః ఏతం సామాసికం ధర్మ చాతుర్వర్ణ్యే బ్రవీన్మనుః
మానువుడు సంఘశ్రేయస్సునకై సంప్రదాయమునకును సంఘమునకును కట్టుబడి యుండవలయును. అట్లుగాక స్వేచ్ఛా సంచారి యగుచో తానిహాపరములకు చెడినవాదేగాక సంఘమునుగూడ చెరచువాడగును. స్వేచ్ఛాప్రణయము భారతీయ సంప్రదాయమునకు సరిపడు నట్టి సిద్ధాంతముకాదు.
ఇచ్ఛధర్మబుద్ధితో గలసి స్త్రీ పరుషుల సంసారమునకు హేతువైనపుడు దానిని ప్రేమ యనవలెనని రత్నావళి గ్రహించుసరికి ఆమె జీవితము నాశనమై పోయినది. ఒక సత్యము బయల్వెడల వలెనన్న నొక జీవితము నశంపక తప్పదన వలెను.
రత్నావళిలోని సత్య సంధత, నిర్భీకత, గరువైనముకుందుని దిగ్ర్భాంతుని చేసినది. తాను రంగారావును ప్రేమింపలేదు గాని కాపురము చేయుచుంటినని పల్కినది. ఉధ్ధృత వాంఛుడైన ముకుందుని శాంత వాంఛునిగ రత్నావళి చేసినది. రత్నావళిలో మనోవికాసము వలన నామె జీవితము వైరాగ్యముతో శాంతముతో గడచి పోసాగినది.
రత్నావళి పై చదువులు చదివిన తరువాత బాలికోన్నత పాఠశాలలో ఆంధ్రపండిత పదవిని చేపట్టినది.
రంగడు రత్నవళిని వివాహమాడుమని బలవంత పెట్టెను. ఆమె యంగీకరింపలేదు. తమమధ్యనున్నది ధర్మబద్ధమైన బంధము కాదనెను. వివాహమనగ విశేషముగ వహించుట యన్నది.
ఒక స్త్రీ భర్తను వీడి మరియొకరిని భర్తగా గ్రహించుటకామె మొదటిభర్త నపుంసకుడుగాని కుష్టవ్యాధి గతుడుగాని అయియుండ వలెను. లేకున్న నా స్త్రీకి భర్తను వీడుట కధికారము లేదని రత్నావళి భావించినది. రంగారావునకు తనకు సంతానము కల్గిన యెడల నది యధర్మ సంతానమగునే గాని కర్మలు చేయుట కాసంతాన మర్హము కాదనును.
రత్నావళిని పెండ్లియాడుటకు ఆందముగల ముగ్గురు యువకులను హరికిశోరరావును రంగారావు మిత్రడు తీసికొని వచ్చెను. రత్నావళి అందమునకుగాని ధనమునకుగాని లొంగలేదు. ఆమె హృదయ మొక స్థాయికి చేరుకొన్నది. ఆయౌన్నత్యమునందు కొనుట కధికార మెవరికిని కలుగలేదు. తుదకామె గురువైన ముకుందరావు కూడ నచ్చెరువందెను. ముకుందరావు రత్నావళి కధను పేర్లుమార్చి రచించెను. భర్తను వదలి వేరొకనితో కాపురము చేయుచున్న యొకానొక స్త్రీ, చేసిన పనికి దుఃఖించి తపస్వినియై, ఇరుగు పొరుగు వారికి మాటలకు క్రుంగి యాత్మహత్మ చేసికొనుట కథాసారంశము. ఈ కథ చదివిన రత్నావళి ప్రభావితయై కాషాయాంబరములను ధరింపమొదలిడెను. కథాంతమున రత్నావళి ముద్రాభి గమనమునకీ కథయే కారణము. ఆమెగురువు పరోక్షముగ నిష్కృతి చూపినట్లు రత్నావళి భావించినది.
ఒకనాడు సరస్వతి కుమారుడైన నీలాంబరుడు వచ్చెను. రత్నావళి సీతారామయ్య యొక్క క్షేమము నీలాంబరునిచోట వినిన గాని యాహారము ముట్టలేదు. సీతారామయ్య యందామె ప్రేమ పెరుగుట యిట గ్రాహ్యము.
రంగారావునకు పక్షవాతము వచ్చిన తరువాత కొన్నినాళ్ళు రత్నావళి యొక్క వైరాగ్యము వైముఖ్యమును తాత్కాలికముగ మరుగున పడినవి. అతని జబ్బునకు తానుచూపిన నిరాదరణమే కారణమని తలచినది. మానవత్వమున్న స్త్రీవలె కరుణతో నతనికి సేవలు చేసి స్వస్థుని గావించినది.
రంగడు తమకు పిల్లలైన గలుగ నందుకు చింతించెను. ఈ మాటతో రత్నావళి యందు మానినగాయము రేగినది. పరదారయందుకల్గిన పుత్రులను కుండగోలకు లందురనినది. తనపాపము తనతోనాగక తరతరములుగ వృద్ధిపొందరాదనినది పరదారేఘ జాయేతే ద్వేసుతే కుణ్డగోలకే పిల్లలే వర్ణము వారగుదురు ? వివాహము లెట్లగును. తనవలెనే జీవితము గడిపిన మరియొకరి సంతానమును వారు వివాహమాడవలెనా ? ఈ దోషమెన్ని తరములు వెంటాడవలెను. అని రత్నావళి సంతానము యొక్క స్వచ్ఛతకు తల్లిదండ్రులదే బాధ్యతయని భావించినది.
రంగారావు తమకు సంతానము కలిగినచో కౌరవ సాండవులవలె మహాపరాక్రమ వంతులగుదురని భావించెను. రత్నావళి కౌరవపాండవులవలె వారిలో వారు కొట్టుకుచత్తురన్నది. జాతికి కావలసినదొక్క పరాక్రమమేకాదు. శాంతి సౌభ్రాతృత్వములుకూడ. ఇచట విశ్వనాధకౌరవపాండవ జననమును విమర్శించు చున్నారు.
స్త్రీ పురుషులిర్వురును సవర్ణులయ్యును వారియందు ధర్మబద్ధమైన సంబంధముండవలయును. రంగారావునకు రత్నావళి యన్నభార్య మాతృసమాన. రత్నావళికి రండు పుత్రసమానుడు. ఇట్టి వారికి కల్గిన సంతానము సంఘమేరీతిని స్వీకరించును. అని రంగారావునకు ధర్మోపదేశము చేసినది. రంగారావు రత్నావళిని అమ్మా యని సంబోధించెను. రంగారావునకామె బ్రహ్మచర్యము పాటింపుమని చెప్పినది. బ్రహ్మచర్యము కూడ తపస్సు వంటిది అనినది.
రంగని సంబోధనమా యిరువురి పాపమును పరిహరింపక పోయినను ప్రక్షాళన కార్యక్రమ నూతన పథమునకు మార్గదర్శక మైనది. నాటినుండియు నామె వదినయు నాతడు మరిదియు ఆమె తల్లియు నాతడు బిడ్డయునైరి. ఈ మార్గమున వారనేక కంటకములన పెరకి వైచుకొనుచు సాగిపోయిరి.
రత్నావళి యొకనాడు రైలులో సీతారామయ్య మూడవభార్యను కుమారుని చూచినది. ఆ బిడ్డడు తన బిడ్డయే యనిభావించినది. తనధనమంతయు బ్యాంకు నందువైచి ఆధనమును సీతారామయ్యకును అతని మూడవ భార్య రాజేశ్వరికిని పిల్లవానిని హక్కుదారునిగ నియమించినది. తాను ప్రతిష్ఠాపురము బయలు దేరినది. ఏ ప్రతిష్ఠాపురమునుండి తన ప్రతిష్ఠను కుటుంబ ప్రతిష్ఠను మంటగలుపు కొనుచు లేచివచ్చినదో తిరిగి యా ప్రతిష్టాపురుమునకు కోల్పోయిన తన ప్రతిష్టను పునఃప్రతిష్టించు కొనుటకు బయలు దేరినది.
రత్నవళి ప్రయాణము ప్రారంభించినది. మొదలు ఈలోకమున లేదు. ఆమెమనస్సు ఏనాడో తాను చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసికొనుట ప్రారంభించినది. పెనుతుఫాను వచ్చుచున్నను ఆమె గ్రహింపలేదు. నిశ్చల బుద్ధితో తదేక నిష్ఠతో తపోమగ్నమైనదామె మనస్సు. తమ యూరికి వెళ్ళి భర్తను క్షమాభిక్ష వేడుటయే కోరినది. అదినెరవేరినచో నామె తపస్సు ఫలించినట్లే. ఉప్పెన వచ్చుచున్నందు వలన ప్రతిష్టాపుర వాసులు గ్రామమును వీడిపోవుచున్నారు. సీతారామయ్యయును కుటుంబముతో ప్రయాణమగు సమయమునకు రత్నావళి యచటకువచ్చి సీతారామయ్య పాదములపైబడినది. తనకొక వాగ్దాన మిచ్చినకాని వలదనన్నది. అతనికి తెలియకుండ నాతని పాదములను హృదయమునకు హత్తుకొన్నది. అతడు వాగ్దానము చేసినాడు కోరిక తెలియకనే మాటయిచ్చుటలో నాతని యౌన్నత్యము వ్యక్తమగుచున్నది. రత్నవళియు ప్రగాఢ పశ్చాత్తాపముననుభవించినది. సీతారామయ్య కుమారునితో తన కాబ్టీకములు పెట్టింపుమన్నది. రెండువేలరూపాయలు బ్యాంకు లోవైచితినన్నది. ధనము లేకుండగానే యొక యనాథజీవికి తనబిడ్డ పరలోకగతులను కల్పించునని అతడు వాగ్దానము చేసెను. సీతారామయ్య రత్నావళిని గుర్తించిన తరువాత మనస్ఫూర్తిగ క్షమించి తనతోజీవింపు మనెను. లోకమునకు వెరువననెను. కాని రత్నావళి యంగీకరింపదు. బుద్ధిపూర్వకంగా ఒక స్త్రీ తన శరీరం ధర్మాచరణ జరపటానికి అనర్హంగా చేసుకుంటే ఆశరీరం ఉండి ఏంలాభం ఆ స్త్రీ యింకా ఎందుకు బ్రతకాలి అని భర్తకు తనమీతనకు గల యేహ్యతను వెల్లడించినది.
|