ఏకవీరకాత్మీయులు లేరు. ప్రియుని ప్రేయోదృక్కులనే కొలది దినములనుభవించినదో వానినే భద్రముగ హృదయేగుహాయాం అన్నట్లుగ హృదయగుహలో దాచుకొన్నది. మధురప్రేమ ధనమయధార్ధము అనియు ధర్మ ప్రేమ నవలంభింపందలచినది కాని అదికూడ ఏకవీర యందయార్థమైనది. హృదయము ఏ ప్రేమకు సుస్థిరమైన స్థానము నీయవలెనో యామెకు తోచినదికాదు. తెలివికొలది రెండవదానిని మనస్సున నామెనిలుపును. తను దెలియకుండ మొదటిది తాను వచ్చి తన మనసావరించును. ఆయావృతి యామెకు దెలిపీ తెలియనట్లుండెను. ఇట్లు ఏకవీరలో ప్రేమకును ధర్మమునకును పోరాటము జరిగినది.
ఏకవీర భవంతికి దగ్గరలోనున్న గుఱ్ఱపువాళ్ళ పిల్ల అమృతమును బాలిక ఏకవీరను చూపులతో వెంటాడెడిది. ఆ పిల్ల చూపులకు ఏకవీర భయపడుచుండెడిది. ఆ అమృతము చదువు నేర్చుకొనుచు తాను నేర్చిన యొకటి రెండు పదములను పలుకుచుండెడిది. ఆ పదములలో నొకటి ఆరంజేవిరంబు యన్నది. ఈ పదము ఏకవీరలో నెప్పటినుండియోనినదించుచుండగా బాహిరముగ అమృతము పదే పదేయనుటచే నేకవీరలో నొకవిధమైన సంచలనము కల్గించినది. అందుచేత ఏకవీర అమృతమును తనలోనున్న
యధర్మమును హెచ్చరించు నంతరాత్మనుగ భావించెడిది. ధర్మమునుండి చ్యుతిచెందుటయే మృతి. ధర్మమునాచరించుట యమృతము. అమృతమును చూచినంతనే ఏకవీరయందొక విధమగు చైతన్యము గల్గుచుండెడిది. ధర్మమంతయు నొకరూపముకాగా నామె యేయమృతము. తానేమైన యధర్మ ప్రవర్తనము చేయుటకు ప్రయత్నించునో ఊహలలో వీరభూపతి కదలాడిన సమయమున అమృతము ప్రత్యక్షమగుచుండెడిది. ఆమె ఆరంజేవిరుంబు అని చదువుచుండుట. గోడలపై వ్రాయుట తనను హెచ్చరించుటయే యని ఏకవీర యులికిపడెడిది.
ఇది యొకానొక మానసికోద్వేగము. తాము చేయువని ధర్మము కాదని భావించినవారిట్లే భ్రమపడుదురు. లోకము తమనుగూర్చియే యపహసించుచున్నదనియు, ఎవరేమి మాట్లాడుకొనినది తమనుగూర్చియే తలపోయుట కద్దు. దీనిని మనస్తత్వ పరిభాషలో గిల్టీ కాంషన్స్ తప్పుచేసిన భావము అని యందురు. ఇట్టి భావము ఆత్మ న్యూనతయును. ఆత్మ విశ్వాసము కోల్పోయినవారిలో బలహీనులలో కలుగుచుండుట పరిపాటి.
తనకు ఉపయోగపడని ధర్మమును శిక్షింపవలెనని ఏకవీర చూచెడిది. ధర్మమామెకందెడిదికాదు కుట్టాన్‌ను ప్రేమించుట ధర్మముకాని యతని నిర్లప్తత వలన నామె మనసులోనుండె కుట్టాను ప్రయత్నముగ జారిపోయెడివాడు.
ఏకవీరయందొక యసాధారణ శక్తి కలదు. అదియే యతిశయ త్వగింద్రియ స్పర్శజ్ఞానము. ఆమె తీరికగ శయనించి స్పర్శను పరిశీలించెడిది.
ఇట్టి శక్తి వలన కలుగు లాభనష్టముల నిదమిధ్థమని చెప్పజాలము. ప్రతి వ్యక్తియందును ఏదియోనొక యుండుట, కొందరికి కొన్ని శక్తులతిశయించియుండుట కొన్ని యెడల జరుగుచుండును. అవసరమునుబట్టి శక్తి సామర్ధ్యములు వెలికి వచ్చును. సాధన వలన శక్తులినుమడింపవచ్చును. అంధులకు శ్రవణ శక్తులధికముగనుండుట సామాన్యము. వారు అడుగుల శబ్దమునుబట్టి వచ్చునది యెవ్వరో చెప్పగల్గుచుందురు. అందులకే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు మా చెవులకు కళ్ళున్నాయ్ మా చేతులు చూస్తాయ్ అని అంధులనుద్దేశించి రచించిన గేయమున పలికిరి రోజాకులే యను జాత్యంధురాలికి తన చేతితో తడిమి కాగితములమీదనున్న రంగులను చెప్పగల శక్తి గలదు. శాస్త్రవేత్త లీమెశక్తిని పరీక్షలు చేసి ధృవపరచిరి. స్పర్శజ్ఞానముతో రంగులను గుర్తుపట్టవచ్చునని రష్యన్ శాస్త్రజ్ఞుడు లయోన్ ట్వివ్ కనిపెట్టి కొందరిచేత యభ్యాసము చేయించెను. అని ఎక్కిరాల వేదవ్యాస్ గారు తెలిపియున్నారు. అరచేతులతో స్పర్శద్వారా రంగులను గుర్తుపట్టే విధానం వెల్లడయ్యింది. స్పర్శవలన రంగులను తెలిసికొను శక్తియున్నట్లే ఏకవీరలో నీ స్పర్శశక్తి యధికముగ నుండెననుట యాక్షేపణీయముకాదు.
ఏకవీరకు వానజల్లునకు తన్మయత్వము చెందెడు స్వభావమున్నది. ఆ స్వభావము క్రమముగా పంచేంద్రియములు స్పర్శ గుణత్వమును పొందునంత వృద్ధిచెందినది. ఆమె త్వగింద్రియ శక్తియే యెందులకతిశయింపవలెను. అనినచో నామెలో ప్రకృతి సహజమైన కామముపశమింపబడలేదు. శరీరధర్మము తెలిసిన స్త్రీ. సుందరేశ్వరునకుకూడ మోహవాంఛయా యని భావించినది. ఆమెలోని త్వగింద్రియ మొకానొక యార్తిచేత దహింపబడుచుండెను.
ఆమె త్వగింద్రియము యొక్క వాంఛను ఊహలలోననుభవించుట కలవాటుపడినది. ఆ భావన నిజమను భ్రమపడుటవలన ఏకవీరకొకరకమైన తృప్తి కల్గుచుండెడిది. సాత్విక భావములనుభవించుచు ఒడలెల్ల పులకింప యాసుఖము తన రక్తమాంసములలోనికి గూడ జొచ్చిపోవునట్లు భావించి యనుటవలన నామె భావన మతిశయించుటతో స్పర్శ శక్తికూడ నతిశయించినదనవలె. ఈ భావమున కాలంబమయినవాడు వీరభూపతియే. అమృతము తనయంత స్సౌఖ్యము నెక్కడ గమనించునోయని భీతిచెందుటవలన ఏకవీర తపన కుట్టాన్‌నకై కాదనియు, నాతనిపై యాశలువీడినదనయు తెలియచున్నది. వద్దన్నను ప్రవేశించెడి మనోవిభుని యాగమనమునకై భ్రాంతి ప్రపంచమున మునిగిన ఏకవీర బాహ్యముగ కూడ నాతనిరాకకై ఒడలంత కన్నులుచేసికొని చూచుచుండెడిది. ప్రియాగమనమునకు ఏకవీర యెంత యెదురుతెన్నులు చూచినదో నామె స్పర్శాతి శయశక్తివలన నిరూపితమగుచుండెను. ప్రతిచిన్న యలికిడియును ప్రతి చిన్న కదలికకును ప్రియాగమనముగ భ్రమించునంతటి విరహావస్థలో ఏకవీర మునిగిపోయియుండెను. ఏకవీరలో స్పందనయే అతిశయ స్పర్శగ మారియుండవచ్చును.
ఏకవీర ప్రియునికై మనోకవాటములు తెరచియుంచుట గాక శరీరముకూడ నొకవిధమైన తపముచేయుచున్నది. శరీరతాపమామెకు తపస్సుకాగా త్వగింద్రియ జ్ఞానమతిశాయియై యోగించినది.
ప్రియునికై ఎదురుచూపు చూచుటలోనే ఏకవీర గాలినికూడ పసిగట్టగల్గి కొలవగల్గినంత యుద్వేగ పూరితమై సున్నితమై యున్నదని చెప్పవచ్చును.
ఏకవీరకును మీనాక్షికిని స్నేహము కలిసినది. ఒకనాడు సాయంత్రము మీనాక్షీ ఏకవీరను కూచిపూడి భాగవతము చూచుటకు తమయింటికి తీసికొని వెళ్ళినది. ఇరువురును భాగవతము చూచుచు నాకందిచుచుండిరి. ఏకవీర యెట్టి విరహావస్థలోనున్నదో రంగస్థలిపైనున్న సత్యభామకూడ నట్టి యవస్థలోనేయున్నది. శృంగార రస సర్వస్వమున కాలంబన విభావమగు సత్యభామ కృష్ణునికై విరహమభినయించు చున్నది. విప్రలంభావస్థలు పదియు నారంభించి యెనిమిదవస్థల నభినయించినది.
ఏకవీర మనసా తానే సత్యభామయైనది. తనలోనున్న మధురవేదన ఎదురుగా సుందరముగ నభినయింపబడుచుండుట చూచితాళలేకపోయినది. ఏకవీర ప్రాణములు పూర్వములైన యెనిమిదవస్థలు మానసికముగా ననుభవించినది. జడతావస్థాభి నయవేళ నాగీతమునకు తాళమునకు దించుకుపొయినవి. ఏకవీర యచట నిలువలేక మీనాక్షి గృహాంతర్భాగమునకు వెళ్ళితాళలేక మంచము మీద శయనించినది. బయటి కూచిపూడి వారి వాద్యములోనికి వినిపించుచున్నది. జడత్వము కల్గించు రాగము తాళము సన్నగా విన్పించుచున్నది. ఏకవీరనుకూడ ఆజడత్వమక్రమించినది. మరల సంతోష భావముల చెలరేగు రాగము విన్పించినది. ఏకవీర యొక్క విషాదముకూడ సన్నగిల్లినది. అటునిటుతిరుగుచు వీరభూపతి పటమున్న గదిలోనకి పోయినది. రంగస్థలము మీది నాయిక వాసక సజ్జికయై నాయకుని కొరకెదురు చూచుచున్నది. ఏకవీర తానుకూడనదే భావములోనున్నది. తాను వాసక సజ్జిక. ఇదే యూమయామెకు. అప్పుడామె స్థితిలోని ప్రతియణువునకు రసజగత్తునుదాటిన యునికిలేదు. ఆమెకు మీనాక్షి గాని కుట్టాన్ గాని వైవాహిక ధర్మముగాని స్ఫురణకు రాలేదు. వీరభూపతి పటము చూచిన యేకవీర నిలువున చలించిపోయినది. కలాపమలో కృష్ణుడు ప్రవేశించుటయు వీరభూపతి ఏకవీరయున్న గదిలోనికి ప్రవేశించుటయు నొకేమారుజరిగినది.
వారిరువురు కాలము స్తభించినది. మనసులు ఆరేండ్లు వెనుకకు వెళ్లినవి మధ్యకాలము మరుగున పడినది. వారి తొలిచూపులు వారి ప్రణయైక దృక్కులు మరల ప్రస్తుత సంయోగము. ఇదియేవారి మనస్థ్సితిని వీరభూపతి పరిష్వంగము కొరకై దగ్గరకు వచ్చెను. ఏకవీర చేతులు చాచుకొని యాహ్వానించినది. అతడామె చేతులను తనచేతులతో తాకగానే ఆమెదేహము మీదికొక విద్యుత్ర్పవాహము ప్రవహించెను. యొడలంతయు గదలిపోయెను. ఆమెత్వగింద్రియము యెదరుచూచిచూచి యలసిపోయిన క్షణమున లభ్యమైన మహాసుఖమునకామె తట్టుకొనలేకపోయినది. ఎండి బీటలు వారిన భూమికి తొలకరిచినుకులుగాక వరదవెల్లువ లభించినట్లైనది. గాలిని కొలుచు యంత్రమువంటి యామెశరీరమునకు పెనుగాలిత్రాకినట్లైనది. వీరభూపతి చేతులలో ఏకవీరస్పృహతప్పినది. ఇచ్చట విశ్వనాథ రచన ధ్వనినాశ్రయించినదనియు కుండలిని విశుద్ధచక్రమును త్రాకినదినియు శ్రీ సుదర్శనంగారు వ్యాఖ్యానించిరి. కుండలిని మేల్కొని ఊర్ధ్వముఖి యైనదనిధ్వని...హృదయమునుండి ధ్వనిరీతి వచ్చిన గాలి కంఠమందు స్తంభించిపోయెను. కుండలిని అనాహత చక్రందాటి విశుద్ధ చక్రాన్ని తాకినదనుట ఇదిసమాధ్యవస్థా లక్షణము. ఏకవీర ప్రేమతపస్సు యీలాఫలించింది. ఏకవీర ప్రేమ యోగమై భాసించినదనుట నిచటి భావము. భావము సుందరముగ నున్నది. ఏకవీర చేసిన తపస్సు కుట్టానునకైగాదు. ఆమె వాసక సజ్జికయైనదియును, ఆమె నిర్ణిద్రవాంఛయును వీరభూపతి కొరకుగాని కుట్టాన్ కొరకుకాదు. ఆమె సత్యభామయైనచో కృష్ణుడు కుట్టాన్‌కాదు. వీరభూపతియే. ఆమె తపస్సు ధర్మబద్ధమైనది కానప్పుడు యోగము కానేరదు. మరియు కుండలిని యుద్భుద్ధము కావలెనన్నచో నంతరుపాధియేగాని బాహ్యోపాధి యొక్క యవసరములేదు. అనగా కుండిలిని యూర్థ్వముఖియగుటకు వీరభూపతి యొక్క కౌగిలియనవసరము. మరియు నామె వివశత్వము కూడ సమాధికానేరదు. కంఠము నందు స్తంభించిన గాని వీరభూపతి యొక్క కౌగిలి యందున్న గాఢతను దానివలన యోమెపొందిన యుద్వేగమును సూచించుచున్నదేకాని కుండలిని అనాహతమునుదాటి విశుద్ధచక్రాన్ని దాటి నందువలనకాదు. ఒకవిధముగ దోషము ఏకవీరయందులేక పోయినను మానసికముగనైన ధర్మమతిక్రమించినది. శరీరము వివాహబంధమునకు కాదనక పోయినను మనుసునకెట్టి బంధమును వేయలేకపోయినది. ఈ స్పర్శవలన మహాసుఖము ననుభవించినది. వీరభూపతీ యేకవీరల సంయోగమున సంప్రాప్తించినదింతవరకే ఆమెత్వగింద్రియ స్పర్శజ్ఞానమీ కలయికతో పరాకాష్టదశకు చేరుకొన్నది. త్వగింద్రియ స్పర్శయొక క్రమపద్ధతిలో వర్ణింపబడినది.
ప్రధమ దశగ ఏకవీరకు ఒకతడిగుడ్డ వేసితీసినట్లున్నది ఆమె త్వగింద్రియము మీద మెరపు మెరసి నంతకాలములో నొకతడిగుడ్డ వేసితీసినట్లుతోచినది. ఈ దశలో స్పర్శజ్ఞానము చర్మావధిగ నున్నది. మరికొంత కాలమునకీ స్పర్శగుణము చర్మము దాటి రక్తప్రవాహమునుదాటి శల్యపర్యంతమైనది. అనగాభావనా గాఢత్వము గంభీరమైనదిని ధ్వని కడకామె వాయువు యొక్క శైత్యోష్ణతలను కొలుచు యంత్రమువంటిదయినది. ఏకవీర యొక్క స్పర్శజ్ఞానము వాయువును కొలుచు యంత్రమేలకావలెనన్నచో నిట్లు చెప్పవలెను. పంచభూతముల యొక్క గుణములలో నాకాశమునకు శబ్ధము భూమికి గంధము వలెనేవాయువు స్పర్శచేతమాత్రమే తెలియబడునట్టిది. అందుచేత నామెలో కల్గిన త్వగింద్రియాపేక్ష వీరభూపతికొరకైనప్పటికి నామె యెదురుతెన్నులు చూచుటలో మరియొక ఫలితముకూడ కల్గినది. పరిశోధనలు చేయువారికి వారుకోరినదేగాక కోరనిది అనగా యూహించని ఫలితము సైతము కలుగుచుండును. అట్లేయేకవీరలోని స్పర్శజ్ఞానమతిశయించినది. అతని కౌగిలింతలోని చల్లదనమామెలో నరనరమున వ్యాపించినది. ఆమె హృదయములోని సర్వనాళములు నామహాస్పర్శసుఖము ననుభవించినది. ఒక విధముగ వీరభూపతికొరకు ఏకవీర త్వగింద్రియముతోడ చేసిన తపస్సునకు ప్రతిఫలముదక్కినిది. భవభూతి మహాకవి ఈ స్పర్శ గుణమును ఉత్తర రామచరితమునందు ప్రయోగించెను. అచట రామునకు సీత యొక్క స్పర్శ పరిచితమైనది. పరిపరి సమయముల యందును భూతమైనది. పరిచయమైన స్పర్శను గుర్తించుటలోగాని దానికై యార్తి గాని విశేషముకాదు. ఏకవీరకు వీరభూపతి స్పర్శమున్నెరగినదికాదు. కానియామె మనసా తత్స్పర్శను యూహించు కొన్నది. అతడు కౌగలించుకొన్నపుడు సర్వనాళములతో నాసౌఖ్యము ననుభవించినది. ఏకవీరలో నున్నదొక స్పర్శ గుణమేనా యన్నచో నదికాక మరియొక విశేషమున్నదన వలెను. అదియే ఆమెయంతరంగము. ఏకవీర యంతరంగము ధర్మకామి. శరీరముప్రియకామి శరీరకామము తీరగనే ధర్మము ముందునకు వచ్చినది. ఆమెలోనున్న ధర్మభీతి యంతరంగపు పొరలోనుండి ఆమెనెప్పటి కప్పుడు భయపెట్టుచునే యున్నది. అమృతమును చూచి యామెబెదురుటయిందులకే. ఆమెలోని ధర్మచింతనము వీరభూపతి కౌగిలింతతో మేల్కాంచినది. తనలోనొక మహాఘమున్నదని కుట్టానుతోనన్నది. ఆమెయేవీరభూపతియొక్క కౌగిలిని మహాఘమని తలచినప్పుడు ఆమె మనస్సంఘర్షణ పరాకాష్ఠ దశకు చేరుకొనగా స్పృహను కోల్పోయిన సమయమును సమాధియనిచెప్పుట ఔ్యచితమనిపించు కొనదు.
ధర్మబద్ధమైన ప్రేమకు పట్టముగట్టు విశ్వనాధవారిట్టి యుధర్మసంయోగ ఫలితముగ కల్గిన పారవశ్యమును సమాధిదశకు తీసుకొని వెళ్ళిరనుట హాస్యాస్పదము.
ఆమెకు హృదయమందు మాత్రమే స్థితి సర్వాణువులయందు ప్రళయముగలదు. అనగా ప్రాణమొక్క స్థానముచే యాడుచున్నది. ప్రాణయనగానిచట ధర్మము. ఆమెకు ధర్మము ప్రాణముకన్న మిన్న.
మనసుకుగల శక్తి యెంతటిదో యేకవీర పాత్రవలన వ్యక్తమగుచున్నది. ప్రళయమును సృష్టించుటకు గాని ప్రశాంతత నిచ్చుటకు గాని మనస్సే ప్రధానము. మనస్సనెడి గుఱ్ఱమునకు కళ్ళెము వేయలేక స్వాధీనమును కోల్పోయిన అదృష్టహీనులెంత వ్యధచెందుదురో ఏకవీర చెప్పక చెప్పుచున్నది.
వీరభూపతిని కలిసిన తరువాత ఉదయభానుడు ఏకవీరకు నిప్పులు గ్రక్కునట్లు కనుపించెను. భయమై కనులుమూసికొన్నది. ఎదురుగా అమృతము నిలబడ్డది. ఆమెకనులుకూడ నెఱ్ఱగనేయున్నవి. తూర్పు తీరాలదోచిన సూర్యబింబ మీ పిల్లగా దనదగ్గరకు వచ్చినట్లున్నదామెకు ఉదయభానుడు సహజముగ నెఱ్ఱనివాడు. అతనిని చూచి యేకవీరకు భయమైనది. ఎందులకనగా ప్రత్యక్షదైవము తనయందు కుపితుడయ్యెనను భావము తనలో కల్గినందువలను. ధర్మ వ్యతిరేక ప్రవర్తనమను దోషము తన యందు గలదని యంతరాత్మ హెచ్చరించుచుండగా సూర్యుని సర్వసాక్షిగ ఆమె చదివిన చదువులవలన తెలిసికొన్నది. దోషము చేసినవారి మనస్థ్సితి యిట్లేయుండును. పాపము చేసినవాడనుభవింపక తప్పదను హిందూ ధర్మ సిద్ధాంతము. ఇదియే కర్మసిద్ధాంతము. గుఱ్ఱపువాళ్ళపిల్ల అమృతము రాత్రంతయు నిదురమాని కలాపము చూచినందువలన ఆమె కనులుకూడ నెఱ్ఱగ నుండి యుండవచ్చును. ఏకవీరకు మొదటి నుండియు నా పిల్లయన్నచో భయము కోపము. ఆ పిల్ల సహజాసక్తితో కులీనయైన ఏకవీర సౌందర్యమును అలంకారమును కనులు పెద్దవిచేసికొని యాశ్చర్యముతో చూచుచుండ వచ్చును. అమృతములోని యమాయకత ఆమె చూచుటలో వెల్లడియగుచున్నది. ఏకవీర వంకతేఱి పాఱచూడగల ప్రాణియాయంతఃపురమునలేడు.
చిన్నది గావున యమృతము నిర్భితితో చూచియుండవలను. ఆమెబాల్య చాపల్యముతో తాను నేర్చుకొను పదములనేకమార్లు ఉచ్చరించుట గోడల పై వ్రాయుటకూడ పిల్లలకు సహజమైన విషయము. తనలోని యులికిపాటును అమృతము గ్రహించునేమోయని ఏకవీర భ్రమపడచుండెడిది. ఆ చూపున కొక ప్రత్యేకతనిచ్చి బెదరిపోయినది. సూర్యడు ఏకవీర ఉల్లంఘించిన ధర్మానికీ అమృతము ఆ ధర్మాన్ని ప్రభోధించేసే ఆమె అంతరాత్మకూ ప్రతీకలు.
సూర్యుడు, అమృతముకూడ తమపనులను తాము చేసికొని పోయెడి వారే. కాని ఏకవీర వారినిచూచి
భ్రాంతిచెందిని. భీతిచెందినది తన నీడను చూచి తానే భయపడుస్థితిలో యేకవీరయున్నది. అంతరాత్మవలె అమృతము పలుకు ఆరంజేవిరుంబు ఏకవీర కెట్టివిధముగ నుపయోగపడలేదు. అంతియేగాక అంత స్సంఘర్షణము పుట్టించి కల్లోలమును సృష్టించినది. ధర్మప్రబోధ శ్రవణము చేయునంత మనోవికాసము ఏకవీరలో కొరవడినది.
ఏకవీరలోనున్న సంకల్ప వికల్పములు సుందరేశ్వరునకు ఉపయోగపడినవి. కలతచెందినదై అన్యధా శరణం నాస్తి యను భావమును సుందరేశ్వరునిపై మనసును దృష్టియును కేంద్రీకరించినది. వీరభూపతిపైనున్న తన ఏకాగ్రతను సుందరేశ్వరుని పైకి మరలించినది స్వామియాచూపువెంట నామెలో ప్రవేశించినాడు. అనగా నామె తన కనులనుండి స్వామిని హృదయమున ప్రతిష్టించుకొన్నది. ఏకవీర మూర్ఛపోయినది. ఇప్పటికామె హృదయములోని వేదన చల్లారినది. మనస్సు శాంతించినది. ప్రశాంతురాలై యంతరంగ ప్రభోధమును వినగల్గినది. కుట్టానా వీరభూపతియా ? ఎవనిని హృదయ సింహాసనమున ప్రతిష్టింపవలెనన్న సందిగ్ధత తొలగిపోయెను. సుందరేశ్వరుడు తనంత తానుగవచ్చి హృదయావిష్ణుడైనాడు. వ్యక్తకి మనశ్శాంతి నిచ్చునది భగవంతునిపై ప్రేమయేగాని వ్యక్తులపై ప్రేమకాదు. వ్యక్తులనారాధించి నన్నినాళ్ళు వేదనలపాలైనది. మనసు ప్రశాంతతనందగనే సౌకుమార్యము లాలిత్యము తమదారి తాము చూచుకొన్నవి. గాంభీర్యము శక్తి సామర్ధ్యములకు తావిచ్చినది. గంభీరముగ వాదింపగల్గినది. నిద్రలేని కన్నులతో కష్టములకోర్చినది.
|