ఏకవీర
కాల్పనికోద్యమ ప్రభావమున జనించిన నవల ఏకవీర. రమణీయతను స్పృహణీయతను హృదయోద్వేగమును మాత్రమేగాక మనస్వి తనుకూడ కాల్పనిక సాహిత్యము ప్రధానము గావించుకొన్న సాహిత్యోద్యమము. ఏకవీర నవల సార్వకాలీనతను సాధించినది విమర్శకుల యభిప్రాయము. ఏకవీర యందనేక ప్రత్యేకతలను గమనింప వచ్చును. కథాకథనము పాత్రచిత్రణము సాంఘికాచార వ్యవహారములు రాజకీయ వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు..ఇట్టి విషయములను మించి పాత్రల అంతస్తత్వ పరిశీలనమున కీనవల ఖ్యాతినందినది.
మనోవిశ్లేషణాత్మక మయిన నవలలో ఏకవీర ప్రముఖమైనది. మనస్సులో అవ్యక్తమైన భాగం ఒకటి ఉంటుందనీ దానికీ వ్యక్తమైన భాగానికీ సంఘర్షణ ఉంటుందనీ గుర్తించి పాత్రపోషణ చేసిన మొదటి నవలా రచయిత విశ్వనాథ. శ్రీవిశ్వనాథలో నిత్యము సంప్రదాయమునకు ఆధునికనాగరికతకు మధ్య సంగ్రామము జరుగుచునే యుండును. సనాతన ధర్మానికీ ఆధునిక నాగరికతకూ ఆయన హృదయంలో నిత్యసంగ్రామం జరుగుతూవుంటుంది అని తుమ్మలపల్లివారు వ్రాసిరి. ఈ సంగ్రామము వల్లవారిలో నాత్మవిశ్వాసము పెరుగులయేగాక సనాతన మార్గాభిమానము సహితము సుస్థిరమైనిలచినది.
ఏకవీర లోని నాయికయగు ఏకవీర త్వగింద్రియ స్పర్శయనెడి నొక గుణము నతిశయముగ గల్గిన స్త్రీ. ఈ గుణమును రచయిత చిత్రించిన విధానమిచట పరిశీలింపబడినది.
ఏకవీర నవలయందు ముఖ్యమైన కథయిట్లుండెను. కుట్టాన్ వీర భూపతి యనువారు మిత్రులు. కుట్టాన్ రాజకుమారుడు వీరభూపతి సామాన్యమైన వీరుడు. రాజకుమార్తెయైన ఏకవీర వీరభూపతిని ప్రేమించినది. రాజకుమారుడైన కుట్టాన్ సామాన్యగృహస్థు కుమార్తెయైన మీనాక్షిని ప్రేమించును. ఈ జంట ప్రేమికులు. తమతమ ప్రియులనుగాక ఒండురుల ప్రియులను వివాహమాడవలసి వచ్చినది. ఆర్థిక వృత్యాసము వలన పెద్దలు వీరి వివాహముల కంగీకరింపనందున కుట్టాన్ వీరభూపతు లిరువురు నొకరి ప్రేయసి నొకరు వివాహమాడెదరు. ఇందు ఏకవీర పాత్రచిత్రణము ప్రధానమైనది. వీరి ప్రేమలెట్లు విఫలమాయెను. వివాహములెట్లు పరిణమించెను. ప్రేమించినవారు తమప్రియులనుగాక యొరులను పెండ్లియాడిన వారి జీవితము లెట్లుండును ? అన్న విషయము లీనవలయందు కూలంకషముగ చర్చింపబడినది. కథను అనుసరించి కుట్టాన్ ఏకవీర, వీరభూపతి మీనాక్షులకు సమప్రాధాన్యమీయ బడినది. కానియేకాగ్రతలో ఏకవీరది ప్రథమస్థానము.
ఏకవీర కుట్టానును వివాహమాడిన తరువాత ప్రియుని మరచి భర్తను సేవించుటకు నిశ్చయము చేసికొన్నది. కాని కుట్టాన్ తన ప్రేయసిని మరువలేక యేకవీరను దరికిరానీయలేదు. ఏకవీర ప్రేమను మరచి ధర్మము నాచరింప దలచినది కుట్టాన్ ప్రేమకు ప్రనుస్థానము ధర్మమునకు ద్వితీయ స్థానము నిచ్చెను. కుట్టాన్ ఏకవీరను కన్నెత్తి చూచుట కిచ్చగింపలేదు. ఏకవీర కుట్టాన్ నిరాదరణను ఓర్పుతో భరించినది. రాజకుమార్తెయయ్యు గొంకుపరచుకొని పండుకొనెడిది. కేవలిమార్థిక వ్యత్యాసము వలననే ప్రియుల కెడబాటు జరిగినది. నేనేసామాన్య కుటుంబములోనో పుట్టినచో నాకామె కెడబాటు జరిగినది. నేనేసామాన్య కుటుంబములోనో పుట్టినదో నాకామె యింతరూర మయ్యెడిదికాదు. అని కుట్టాన్ మీనాక్షిని వివాహమాడకుండుటకు కారణమును గురించి విచారించెను.
ఏకవీర కాపురమునకు వచ్చిమూడు నెలలయినను కుట్టాన్ సరసన నిలుచుటకు గలస్వతంత్రమును పొందలేకపొయినది. అతడుతనమౌనముతో నామె నల్లంత దూరమున నుండునట్లు చేసెను. ఒకరిపై ప్రేమను మరియొకరిపై ప్రసరింపజేయుట నదినిదారి మళ్ళించుటయే యని కుట్టాన్ భావించెను.
ఏకవీర యెంతటి సౌందర్యవతియో నంతకుమించిన సుకుమారి. ఆమె నిత్యము వారణాసి పట్టుచీరగట్టిపైన బంగారు అంచుగల కాళ్మీరు శాలువా కప్పికొనెడిది. ఒంటినిండ వెలలేనినగలను ధరించెడిది. తమమధ్యనగల రూరమామె పరిచారికులకు తెలియనీయలేదు. భర్త హృదయము మాత్రమామెదికాదు. అతని నిరాదరణకు మిక్కిలి వగచినది. మాట్లాడువారు లేరు. ఆమెహృదయ మసలే దెబ్బతగిలిన పక్షివలెనున్నది. భగ్న హృదయము. కుట్టానునే ముందుచూచిన నెంతబాగుండెడిదని తలచినది. కుట్టానునైన యకల్మష హృదయముతో సేవింపగలననుకొన్నది.
కుట్టాన్ అగ్నిసాక్షిగ వివాహమాడినను ప్రేమలేకున్నచో కనులతో నైన ఆమెను పత్నిని చూచినట్లు చూచుటయధర్మమని భావించెను. ఏకవీర హృదయమునింకొకరి కర్పించినను వివాహధర్మమునకు కట్టుబడి యుండదలచినది. ప్రేమకు ధర్మమున కనుసంధానము చేయుట కేకవీర ప్రయత్నించినది. కుట్టానందులకు దోడ్పడిన వాడుకాడు. జీవనసంఘర్షణమునందున్న పట్టువిడుపుల సర్దుబాటు మనస్తత్వము పురుషులకుండదనుటకు మీనాక్షియేకాక వీరలనుదహరింప వచ్చును. మనసులో నింకొకరికి కొలది మాత్రపు స్థానమిచ్చినను దాంపత్య ధర్మమునకు లోటురానీయ రాదను కొన్నది. యేకవీర. ఏకవీరతో సుఖించుట ప్రియురాలికి ద్రోహము చేయుట వంటిదని కుట్టాన్ తలచెను.
ఏకవీర సిగ్గును వలది కుట్టాన్ మెడను మల్లెపూదండతో నలంకరించినది. కుట్టాన్ రుద్రమూర్తియైనాడు. రెండుగద్రెంచి నేలమీదకు విసరికొట్టెను. ఏకవీరహృదయము నీరై విరుచుకొని పడిపోయినది. కుట్టాన్ కూడ దుఃఖించెను. వీరిరువురి మనస్సులు ఆనంతమైన సంఘర్షణమునకులోనైనవి. ఆమె భర్తను గెలువనందులకు అతడు ప్రియురాలిని మరువలేక భార్యను బాధపెట్టుచున్నందులకు చింతించిరి. ఆమెనిరాభరణగనున్నది. భర్త నిరాదరముతో మరలన నాభరణములను ధరిపంసాగినది. భర్త ప్రేమ లభించిన స్త్రీ యాభరణములను ధరించినను ధరింపకున్నను సంతోషము సంతృప్తి కలిగి శోభితమై యుండును. భర్త యనురాగమును పొందలేని యిల్లాలికి పై పై మెరుగులకాశించి రత్నమాణిక్యములుగల నగలను ధరించి తనలోకల్గిన లోపమును పూరింపదలచినది. ఏకవీర భర్తను గెలుచుటకై చేసిన యేకైక ప్రయత్నము వ్యర్థముకాగా శోకమున మునిగినది.
కుట్టాన్ మిత్రుడైన వీరభూపతి కుట్టానునకు ధర్మోపదేశము చేసెను. శరీరముపై గలహక్కు తనదొక్కనిదేగాక తల్లిదండ్రులది భార్యది కూడననెను. ధర్మపత్నిని సమాదరించుట ధర్మమని బోధచేసెను. భార్యను ప్రేమింతునన్న వాగ్దానము, కుట్టాన్ వీరభూపతికి చేసెను. కాని కాలము పట్టుననెను.
ఏకవీరకును తానామెను ప్రేమించుటకు కాలము పట్టునని కుట్టాన్ చెప్పెను. ఎంతకాలము పట్టునో యిరువురకును తెలియదు. అంతకాలము వేచియుండుట యేకవీరకు సాధ్యమాయని కుట్టాన్ యోచించలేదు.
ఏకవీర శరీరము నిర్లక్ష్యము చేయుట మొదలిడినది. భోజనమును క్రమక్రమముగ తగ్గించినది. శారీరకముగ క్షీణించుచున్నను హృదయ గాంభీర్యము తగ్గలేదు. ఏకవీరయొక దురదృష్టవంతురాలు. చిన్నతనమున తండ్రి ప్రేమ యెరుగదు. పెండ్లియాడి భర్త ప్రేమ యెరుగదు. ఆమె చదివిన చదువులు మనసు పరిపక్వ మగుటకు దోడ్పడినది. సుకుమార భావములకామె హృదయము పుట్టినిల్లు.
అవ్యయ్యార్ రచించిన అతిచ్చూడి యనుచిన్నపుస్తకము తీసినది. అందులో ఆరంజేవిరంబు అనియున్నది. ఆమాటకర్థము ధర్మమనాచరింపుమని. ఈమాట యామెహృదిలో మ్రోగుచుండెను. ఆరంజేవిరుంబు యన్న మాట పదేపదే స్ఫురించుచున్నందు వలన నామెలో సంఘర్షణము మొదలైనదానికి సూచన. అధర్మముచేయ బూనినప్పుడే యంతరంగము ధర్మము చేయమని హెచ్చరించుట జరుగును. ఈ రకమైన ప్రతిధ్వనులకు కారణము కుట్టాన్ నిరాకరించిన యామెహృది ప్రక్కదారుల పట్టుదలచినంతలో నంతరంగము హెచ్చరికలు చేయుచున్నదవనవలెను. ఆమె శరీర తాపమును వశమింప చేసికొనుటకు జాలశయమున పూర్తిగ శిరస్సును ముంచినది. తడి వస్త్రములను విప్పకుండనే నేలమీద కూలబడి యెదురుగా గోడమీద మీనాక్షి దేవి వస్త్రము శ్రీసుందరేశ్వరుడ పహరించుచున్నట్లుగా జెక్కబడిన విగ్రహములను చూచినది. యోగీశ్వరుడగు సుందరేశ్వరునకుకూడ మోహపాశము వదల లేదనుకొన్నది. తనమోహము సుందరేశ్వరుని మ్రోర విన్నమించుకొన్నట్లుగ నీకుకూడామోహము వదలలేదా యని ప్రశ్నించినది. కాయజాది షడ్రిపుల జయించుట మహాత్ములకు గాని సాధ్యముకాని పని. మరల నేకవీరయే మనుష్యుడు తనసంతోషమునకు సుందరేశ్వరునట్లు చిత్రించెనని తలచినది. ఆమెమనస్సు తిరుగుబాటుచేయుచున్నది. ధర్మములు దైవములుకూడ మనుష్యులు సృష్టించు కొన్నవే. పరిస్థితుల ననుసరించి యేలమార్చికొనరాదు అని ఏకవీర ఆరంజేవిరంబు అని ప్రతిధ్వనిని చేయునంతరంగమును ప్రశ్నించినట్లుయినది. ఏది న్యాయము యేది ధర్మము అన్నది యామెకు బోధపడలేదు. తాళికట్టిన వాడాదరించు వరకు వేచి యుండుటయా హృదిలోని వీరభూపతిని మదిలోనికి తెచ్చుకొని యూహా సంతోషము నందుటయా ? ఏకవీర యిట్టి సంఘర్షణమున పడినది.
తరతరములనుండి వచ్చుచున్న సంప్రదాయము ధర్మమైనదా లేక ధర్మమే సంప్రదాయమగుచున్నదా ? ఇట్టి ధర్మము మనుజుల సృష్టియని త్యజించుటయే దైవదత్తమని శిరోధార్యము చేయుటయాయని యేకవీరలో జంఝూమారుతములు చెలరేగినవి. ఆసంఘర్షణమునకు తట్టుకొనలేక బాహ్యాలంకరణమున మునిగిపోయినది. ఏకవీర రోదించుచు నిదురబోయినది. ఏడ్పుటకు రెండుకారణములు. ఒకటి ప్రేమోమూర్తియగు వీరభూపతి గుర్తునకు వచ్చుట రెండు కుట్టాన్ నిరాదరణమునకు మనసు క్షోభించుట కేవలము కుట్టాన్ నిరాదరణమునకైనచో నామెలోనున్న దానిని సంఘర్షణ మనరాదు. శోకమనవలెను. అట్టితరి ఆరంజేవిరుంబు యన్నమాట నినదించుటకు కారణములేదు. ఏదియోనొక భావము మరియెక భావముతోనే కీభవించని తావు సేయంతస్సంఘర్షణ మనవవలెను.
ఏకవీర ఆసమయమున కావలసినది ప్రేమపూర్వకమైన సమాశ్వాసము. నీవునాదానవనెడి చిన్న యూరడింపు. ఆమెయొవరికిని కాలేని యేకాకి జీవితము గడుపుచుంటినని బెగ్గటిల్లిపోవుచుండెను. ధీరస్వభావురాలు కావుననే పై కెట్టి భావమును ప్రకటింపక అంతరంగముననే వ్యథచెందినది.
కుట్టాన్ పరమేశ్వర సముద్రము వెళ్ళివచ్చెను. అంతఃపురమునకు వచ్చినవెంటనే ఏకవీర హేమపాత్రతో నుంచిన నీటితో కుట్టాన్ పాదములను కడిగి బంగరు పువ్వులతో తళతళలాడు తనపైటచెంగుతో తుడిచినది. ఆమెకు భర్తపైనున్న భక్తి గౌరములిబ్బడిముబ్బడిగ ప్రదర్శించినది. కుట్టాన్ ఆమె భక్తికి కదలి ఏకవీరా ! యని సంభోధించెను. వివాహమైన నాల్గునెలలకు తొలిసారిగ పిలిచిన పిలుపు విన్నంతనే మేఘగర్జనమును విన్న రాజహంసివలె బెదరి నేలపైబడిపోయినది. రాజహంసికిని మేఘగర్జనమునకును వైరుధ్యమున్నది. ఏకవీరను రాజహంసి యనుటలో నామెతనకు తెలియకనే ఆపిలుపులో నొకానొక యనిష్టభావమునను భవించినది. అదియే నెమలివలె నన్నచో నామెభావమునింకొక విధముగ చెప్పవలసి వచ్చును. గర్జనమునకు భీతిచెంది మరల నుత్పులక యైనది. భీతిచెందుటయు నుత్పులకయగుటయు ఏకవీర యొత్కద్వైధీ భావమును వెల్లడించుచుండెను. పులకితయగుచునే ప్రచండవాయువునకు కదలిపోవు కదళియైనది.
కుట్టాన్ ఏకవీరను లేవనెత్తి హృదయమునకు హత్తుకొనెను. ఆమె మహానంద సముద్రములో దేలిపోయినది. వీరభూపతి నిష్క్రమించిన తదుపరి యేకవీర మరిమూగపోయి యేయున్నది. నాటికినేడు ఏకవీరాయన్న పిలుపు. ఆమె విరుధ్ధభావ ప్రకటనమునసంకల్పితముగ జేసినది.
కుట్టాన్ తానొక కన్యను వలచితననియు నామె పేరు మీనాక్షి యనియు చెప్పి యామెను ఏకవీరాయనుట తనకు శక్యము కాదనెను. ఏకవీరలోని బులకిత భావమంతరించినది. దుఃఖము కల్గినది. కుట్టాన్ ఆమెను ప్రేమింతుననియు ఆ ప్రయత్న మెన్నినాళ్ళు పట్టునోయనెను నెలదాటకుండగనే ప్రేమింపవచ్చు ననగా ఏకవీర యిప్పుడే ప్రేమింపుమని యేడ్చినది. అనగా నామె హృదయము ప్రేమరాహిత్యముతో వ్రయ్యలయ్యెనని యూహింపనగును. ఇదివరకెవ్వనియెడనైన నీ ప్రేమ ప్రవహించెనయేని యీ మన వివాహము నీకెంత కష్టముగానుండును ? నా స్థితి యట్లే యనుకొనుము అని కుట్టాను అనగా నేకవీర నిలువలేకపోయినది. ఆమె హృదయమున మానుచున్న గాయము రేగినది. విల విల లాడినదామె మనసు. ఏకవీర తన పూర్వప్రణయమును అణచివైచి కుట్టానును ప్రేమింపదలచినది. కుట్టాన్ ఆమె ప్రేమను తనకు తెలియకనే గుర్తుచేసెను. కుట్టాన్ ప్రేమ ఆమెకు తుదివరకు లభ్యముకాలేదు. లభ్యమైనను స్వీకరించుటకామె హృదయమంగీకరించెడిది కాదు.
ఏకవీర క్రమముగ క్షీణించుచున్నది. శరీరమునుండి యొక్కొక్క నగను విసర్జించుచున్నది. బలహీనురాలగుచున్నది. ఆమె హృదయమున దుఃఖము వైరాగ్యము సరిసమముగ పెరుగుచున్నవని తెలియుచున్నది. సంతోషరహితముగ గడచిన ప్రతి మాసమునకొక గుర్తుగ గోడమీద నల్ల చుక్క పెట్టెడిది. కుట్టాన్‌నకు గాలి వీర భూపతికి గాని ఏకవీరా మీరాక్షులకున్న మనోదార్ద్యము లేదు. వారిరవురను సమయము చిక్కినప్పుడెల్ల హృదయములోని వ్యధలను తోడుకొనుటయు వెళ్ళబోసుకొనుటయు విలపించుటయు సర్వ సామాన్యముగ జరుగు సంఘటనములు వీరభూపతి సహజ ధైర్యమును వీడి వలవల యేడ్చినాడు..కుట్టాన్‌కు దుఃఖ మాగలేదు. ఏకవీర తన దుస్థితిని పరిచారకులకుకూడ తెలియనీకుండ గుంభనముగ నుంచుకొన్నది.
కుట్టాన్ వాగ్దానముచేసి రెండు సంవత్సరములైనవి అతడు తనను హృదయ పూర్వకముగ స్వీకరించునన్న నమ్మకము తొలగిపోయినది. మనసును శూన్యమావరించినది. ఆ శూన్య గృహములోనికి ప్రవేశించుటకై పూర్వ ప్రణయమూర్తియైన వీరభూపతి తొంగి చూచుచుండెను. కుట్టాన్‌ను ప్రయత్న పూర్వకముగ హృదయమున ప్రతిష్టించుటకై చేసినపని నిష్పనమగుటతోడనే వీరభూపతి యొక్క దురాక్రమణమునకు తొందర యెక్కువైనది.
ఏకవీర వైవాహిత ధర్మమును అనుసరింపవలెనని తలచినది. కాని కుట్టాన్ దానికవకాశమీకుండుటచే వీరభూపతి యామెకు తెలియకుండగనే ఏకవీర తలపులలో ఆమె తెలిపట్టు చీరలపై మక్కువ పెంచుకొనుటయు జరిగినది. ఇట్టి సమయమునే ఆత్మ స్థయిర్యము జితేంద్రియత్వము బయల్పడవలయును, కాని ఏకవీర ధర్మము ననుసరింపవలెనని చేసిన ప్రయత్నము విఫలమైనది. ఏకవీర యొక్క ఆంతరమగు గుహ్యస్థానము నుండి వీరభూపతి నిష్క్రమించినది లేదనుటయే సహేతుకము. ముడుచుకొని పండుకొన్న సర్వము మరల పడగయెత్తి నట్లుగ మరల వీరభూపతి తనయెత్తెను. అది యామెకు సర్వలోకము నుండి తాను గుప్తపరుచుకొన్న ధనము అనగా గుప్తధనమును వలయునప్పుడు వెలికిదీసి యుపయోగించుకొనవచ్చును. గాన నామె మదిలో గుప్తముగ వీరభూపతి నివసించియే యుండెను. అంతేగాని పునఃప్రవేశము చేయలేదు.
|