క్రైస్తవుడగు రాబర్టు నొబిలితోయుక్తియుక్తముగ వాదించి సనాతన ధర్మమును పునఃప్రకాశిత మొనర్చినది.
ఏకవీర మరునాడు లేచుసరికి జ్ఞప్తికి వచ్చినది వీరభూపతి యాలింగనములోని మహానుభూతి. ఆయనుభూతి యింకను మాసిపోలేదు. సర్వామయములయందును జీవించియేయున్నది. ఏకవీరకు కుట్టాన్ ప్రేమయవసరము లేని సమయమున కుట్టాన్ పట్టలేనంత ప్రేమను అనుభవించుచు ఏకవీరకై దీర్ఘ రమణీయాష్టపదదామమునుపంపెను. ఆనగ, శరీరమును తగిలినంతమేర ఏకవీరకు విషలిప్తమైన సన్నని కత్తివాదర యంటుకొన్నట్లుయినది. ఆభావమునకామె తాళలేక పోయినది. నొబిలి తో వాదము చేయు సమయమున నామెయొక వీరావేశముతోనున్నది. నగ విషలిప్తమైనదనుట ఆమెధర్మమును గూర్చి యెంత భీతిచెందు చున్నదో గ్రాహ్యము. భర్తపంపిన నగ ధర్మమైనకానుక. ఉదయసూర్యుడు నిప్పులు గ్రక్కుటయు ఆభరణము విషలిప్తమైనట్లుండుటయు నామె భావన ననుసరించి జనించిన యూహలు. కుట్టాన్ ప్రేమతో నవ్వగా ఏకవీర మొగము విషణ్ణమైనది. వికృతమైనది.
వైగై నదికి వెడలు చుండగా ఏకవీరను కుట్టాన్ వెంబడించెను. దారిలో వీరభూపతి సన్యాసియై దర్శనమిచ్చెను. అమృతము చింపిరిజుట్టు దువ్వుకొని శుభ్రవస్త్రధారిణియైనది. ఏకవీర కూడ శాంతచిత్తురాలై నది.
ఏకవీర తనకును వీరభూపతికిని మధ్యనుగల గాధనంత చెప్పి తన దేహములో నున్న ప్రతియణువు వీరభూపతి స్పర్శము ననుభవించుచున్నదని చెప్పెను. అది యింకొక విజాతీయ స్పర్శకు తాళుకొనలేదు అనెను. ఏకవీర కుట్టానును ఇంకను నన్ను మీరు ప్రేమింతురా యని ప్రశ్నించినది. కుట్టాన్ ఏకవీరపై ప్రేమచే కదలిపోయెను. తమకముతో ఏకవీరను కౌగలించుకొనెను. ఆమెత్వగింద్రియము చైతన్యరహితమైనది.
శరీరము, మనస్సు, ధర్మము, ధర్మాచరణము ,అన్న వివేచనము చేసిచేసి యలిసి పోయినది యేకవీర. శరీరము తనవైపునకునుధర్మముతన వైపునకును మనస్సును సమబలముతో నాకర్షింప ప్రయత్నించినవి. ఇట్టి సంఘర్షణ సమయమున శరీరమున కొకింత మొగ్గుకల్గి త్వగింద్రియ జ్ఞానమను యపూర్వశక్తి కల్గినది. ఈ త్వగింద్రియ జ్ఞానముతోడిపని వీరభూపతి కౌగలింతతో సమాప్తముకాగా, కావలెనని తపించినది దొరికినది కాని కలుషితమైపోతినన్న భావము ప్రబలమైనది. ఆమహాఘమును వైగై యందు కడుగుకొనవలెనని తలచినది. కాని వైగైలో పడక మునుపే కుట్టాన్ కౌగిలింతలో నసువులను కోల్పోయినది. ఆమెశరీరము కోరినది వీరభూపతిని. తపించినది. వీరభూపతికై మహానుభూతిని పొందినది కూడ వీరభూపతి నుండియే. ఆశరీరము కుట్టాన్ ధర్మ ప్రేమను సహింపలేకపోయినది. లేదా అతని మనస్సులో మీనాక్షి యున్నదను విషయము ఏకవీరకు తెలియునుగదా. అందుచేత విరక్తి నందియుండవచ్చును. ఏకవీర శరీరము ఎన్నడు కుట్టాను స్పర్శను ఊహించి యుండలేదు. కనుకనే అతని కౌగిలి విజాతీయ స్పర్శయన్నది. ఏకవీర యొక్క ప్రాణశక్తి కుట్టాన్‌కౌగిలించినంతనే అదృశ్యమైనది. ధర్మచ్యుతి వలననే ఏకవీర మృతినందినదని ధ్వని కుట్టాన్ విజాతీయ స్పర్శవలనకాదు.
ఏకవీర యొక్క యంతరంగమును విశ్లేషించి చూచినచో నామె హృదయ సామ్రాజ్యమున వీరభూపతియే దర్శనమిచ్చును. కుట్టాన్ ప్రేమయిక లభింపదను నిరాశచెందు నీరసక్షణమున అంతవరకు నణిగియున్న వీరభూపతి తిరిగి ప్రత్యక్షమగుటయేగాక ఏకవీరలో విజృంభించి విహరింపసాగెను. ఏకవీర యతనినచటనే యుండనిచ్చినది. ఏకాంతములోనున్నప్పుడాతని భావనలలో సుఖానుభూతిని పొందుచు కాలముగడిపినది. ఈ సుఖము యథార్ధముకాదు భ్రాంతి యని యామెకు తెలియకపోలేదు.కాని తాను దాచుకొన్న ధనమును పరులకంట పడకుండ ననుభవించుటయను వ్యసనమునకామె బానిసయైనది.
ఆమె తనంత తాను అసువులు వీడగల్గినట్టి యోగినియైనదా లేక యామెయే యనినట్లుగ విజాతీయ స్పర్శకు తట్టుకొనలేక పోయినదా యని విచారించిన రెండు విషయములు స్ఫురణకు రాకమానవు. మొదటిది స్వేచ్ఛామరణమన్నది. మహాయోగులైన తపస్సంపన్నులకు మాత్రమే సాద్యము. ఏకవీర మానసికముగగాని శారీరకముగగాని యెట్టియభ్యాసమును చేసినట్లు కానుపింపదు. భక్తి భావము కూడనీమెలో నెక్కువగ వ్యక్తముకాలేదు. ఒక్కసారి మాత్రము నీకుకూడ మెహపాశము వదలలేదాయనినది. చివరకు పశ్చాత్తాపము వలన కల్గిన భక్తివ్యక్తమైనది. చివరిక్షణమున కల్గినను అచంచల భావముతో కల్గిన భక్తిగావున మిక్కుటముగనేకల్గినది.
రెండవది ఏకవీర విజాతీయ స్పర్శవలన మరణించినదని తలచినచో ప్రేమస్వరూపుడను ప్రేమతపస్వీయునగు కుట్టానును పరోక్షహంతకునిగ భావింపవలసియుండును. కుట్టాను కౌగిలించినందునే మరణించినదనినచో ఆమె మరణమునకు కారణభూతునిగ కుట్టాను నెంచవలయును. మూడవ కారణమేదైన నుండెనాయని భావించినచో నవలలో పొందుపరుపబడిన సాక్ష్యాధారములనుబట్టి ఏకవీర మనస్సుగాని శరీరముగాని ధృఢముగలేవనియు విపరీత మనస్సంఘర్షణల వలన జనించిన మహాకల్లోలమును తట్టుకొనలేక వివశయై విగతజీవియైనదనియు చెప్పవచ్చును. ఏకవీర చలాయశాంతి జీవితము గడిపినది. ప్రేమకు నాప్యాయతకు దూరమైవిలపించినది వాంఛా ప్రేరణమునకు దట్టుకొనలేక చన్నీట మునుగుటకూడ వర్ణితమైనది. ఆమెను హృదయపూర్వకముగ దగ్గరకు తీసిన ప్రాణిలేదు. తండ్రి ప్రేమ గాని భర్త ప్రేమగాని యెరుగదు. తనవారని భావింపగల వ్యక్తిలేదు. ఇట్టి పరిస్థితిలో ప్రేమానురాగముల కొరతను అనుభవించిన వారిలో పలురకములైన మనోవికారములు సంభవింపవచ్చునని మనస్తత్వజ్ఞులు చెప్పుచున్నారు. ఏకవీరసజాతీయస్పర్శయనిభావించిన వీరభూపతి కౌగిలిలోకూడ నిశ్చేతనురాలైనది. ఆమెలో ప్రాణమున్నట్లు లేదు. మూర్ఛపోయినదా గతించినదా యని వీరభూపతి భయపడెను. వీరభూపతి విషయములో నానందానుభూతి యతిశయించుటతో భరింప శక్యముగాక వివశయైనది. కుట్టాన్ కౌగిలో తన శరీరముపవిత్రమనియు కుట్టాన్ శరీరమును తాకుటకుదానికర్హతలేదన్న భావాతిశయము వల్లవివశయైనది.
కాల్పనిక సాహిత్యమున నాయికల సౌకుమార్యములు అతిశయోక్తిగ కూడ వర్ణింపబడుచుండెడివి. అట్లేఏకవీరకూడ చాలాసుకుమారి. మరియు కుట్టాన్ నిర్లక్ష్యమువలన మానసికా శాంతికిలోనై యాహారముకూడ తగ్గించినది. ఏకవీర భోజనము క్రమక్రమముగా తగ్గిపోవుచున్నది. ఆమె శారీరముగ రోజురోజుకు క్షీణించి పోవుచుండెను...నేత్రములు గుంటలుపడినవి...వదనము తేనెపట్టూడి పోయిన వృక్షశాఖవలె శోభాహీనమైనది. ఇందువలన నేకవీరలో రక్తము క్షీణించి స్వచ్ఛదేహయగుటయు కనులరమూతలు పడుటయు శారీరక క్షైణ్యమును సూచించుచున్నివి. ఆమె ధర్మమునాచిరంపవలెనని భావించినదేకాని కుట్టానును ప్రేమింపలేనని తలంపలేదు తనహృదయమింకొకరి కర్పితమైనదనియు స్వచ్ఛమైనది కాదనికూడ నొకయాత్మన్యూనత యామెలో నున్నది. కుట్టాను ఆమెతో తాను పరిశుద్ధమైన మనస్సుతో వచ్చుదననియు అచ్చమైనప్రేమ కోరదగిన దానవియుననగా హృదయములోనామెకు ఆరంజేవిరుంబు ఆరంజేవిరుంబు యన్నధ్వని మార్మ్రోగగా శోకించినది. భర్త స్వచ్ఛమైన ప్రేమకోరదాగిన దానవగా తాను స్వచ్ఛప్రేమను పొందుట కనర్హనని భావించినది.
ఒక దుర్మార్గుని మంచివాడవని ఉన్నతుడవని పొగడినచో నాతడంత రంగమున సంతసింపకపోగా తాజేసిన దుష్క్రత్యములతని ముందుజేరి భయపెట్టును. అంందుచేతనే ఆమె హృదయము ఆరంజేవిరుంబు అని మార్మ్రోగినది. రచయిత ఏకవీర యొక్క మనస్థ్సితి నింతచక్కగా వర్ణించిరి. ఆమెస్థితి మిక్కిలి దయనీయముగ భాసించినది.
అంతరంగ యుద్ధము వలన నలసిన యేకవీర మరణము కుట్టాన్ చేతులలో సంభవించుట కేవలము కాకతాళీయము. మమతలు లేకపోయినను విధివిధానమును బట్టియేర్పడిన భౌతిక వైవాహిక బంధమునకది చరమ సత్పరిణామముగ భాసించును.
చివరికి సుందరేశ్వరుడామెలో ప్రేవేశించెను. అనగానచ్చట శూన్యస్థానమున్నది. కుట్టాన్ వీరభూపతులు నిష్క్రమించిరి. హృదయమున శాంతినెలకొన్నది. ద్వైధీబావములు లేవు. సదాయమృతమునకు భయపడు చుండెడిది. తుది క్షణమున మాత్రము ఏకవీర అమృతము వైపుతేరిపారజూచిన అమృతమే భయపడి పారిపోయినది.
అన్ని ధర్మములకు మించిన ధర్ము ఏకవీరకు లభించినది. సర్వధర్మాన్ పరిత్యజ్యమామేకం శరణంవ్రజ యన్నగీతావాక్యమును యధార్ధముగ జేసికొని తనను తాను చొక్కదాధుని చేతులలో పెట్టకొన్నది.
ఏకవీర యనగా నొకరకమైన వేణువు అనునర్ధము కలదు. ఏకవీర యనగా నొకవేణువు. నోటిద్వారమునకును మొదటి స్వరద్వారమునకును ఒక అంగుళము గలిగిన (దూరము) వేణువుకుపేరు.1-7 రంధ్రములు ప్రాణవేణువును చివరకు కుట్టాన్ శృతి చేయదలచెను కానియేవేణువు స్వరరహితమైనది. స్వరమనగా ప్రాణము. ఈ ఏకవీర మూగబోయినది.
|