కల్హారమాలిక
కాశ్మీర రాజవంశ చరిత్రము నాధారముగా చేసికొని రచించిన నవల సంజీవకరణి. రాజ్యము కొరకు పలువురు ప్రయత్నించుటయును, ఒకరికి తెలియకుండ నొకరు పైయెత్తులు వేయుటయు నిందలి ముఖ్యాంశములు. సంధిమంతుడను మంత్రికి అతని భార్య సంధిమతికిని భావి రాజ్యయోగము సూచింపబడుట కల్హారమాలికకు రుచింపదు. ఆమె రాజ్యమును తానపహరింప జూచి యందుల కనేక ప్రయత్నములు చేయును. కల్హారమాలికకు నిజముగ రాజ్యము నేలగలశక్తియున్నది. కాని ఆమె యొక్క దుర్గుణమును కుయుక్తులకు తగిన ఫలముగ తుదికి తన జీవితమునే కోలుపోవలపి వచ్చినది. ఇందు కల్హారమాలిక యొక్క ఖడ్గ విద్యానైపుణ్య మధికముగ వర్ణితమైనది.
కల్హారమాలిక బప్పట మంత్రియొక్క భార్య. దురాశచేత నీమె జీవితమును కడగండ్లపాలు చేసికొననది. యుద్ధనీతి నేర్చినది రాజనీతి నేర్చినది వ్యూహ నిర్మాణమును క్షుణ్ణముగా నాకలింపు జేసికొన్నది. ఆమె గుఱ్ఱమునెక్కి కత్తిని చేబూనినచో వందమంది వీరులు కూడ నిలువలేదు. కల్హారమాలిక యొక్క సర్వకార్యములును స్వార్థపూరితములగుటచేత నీమెను ప్రతినాయిక యనవలెను.
సంధిమంతుడను మంత్రి యోగివంటివాడు. తాంత్రికమును గూడ నవలంబించి యొక హోమమును సంధిమంతుడును,అతని భార్య సంధిమతియును చేయుచుండిరి. ఈ హోమమునకు సంతసించిన మంత్రపురుషుడు సంధిమతి భావిలో రాజ్యాధికారము చేపట్టునని వరము నిచ్చెను. ఈ మాటలు విన్న కల్హారమాలిక రాజ్యము తనకు దక్కవలెనని వ్యూహములు పన్నసాగినది. కల్హారమాలికకు సంధిమతిపై మరియొక కోపము కూడ కలదు. ఆమె చిన్నతనుము నుండి సంధిమంతుని మోహించినది. అతని పొందుకై పలుప్రయత్నములు చేసి విఫలురాలైనప్పటికి నామె కతనిపై మోహము తగ్గకపోగా నామోహమునకు కక్ష కూడ తోడై నిలచినది.
కల్హారమాలిక కూడ తాంత్రికురాలే. ఆమెకు కూడ కొన్ని శక్తులున్నవి. బప్పటుడను వానిని పెండ్లి యాడినది. అతడు మంత్రి. చటకయను నొక స్త్రీని కూడగట్టుకొని రాజ్యము వశము చేసికొనవలెనని తలంచినది. చటక రాజునకుంపుడు గత్తె. ఆమెకూడ రాజునకపకారము చేసి తానే రాణి కావలెనని కల్హారమాలికతో చేతులు కలిపినది.
సంధిమంతుని అతని భార్య సంధిమతిని చెరసాలలో వేయించినది కల్హారమాలిక. వారి ధనమంతయు స్వాధీనమును చేసికొని వారు ముష్టికూడ ఎత్తుకొనుటకు వీలులేకుండజేసి పరమదరిద్ర మనుభవింపజేసినది. చెఱసాలలో కూడ వారి చేతులు వారి కాళ్ళు వారి కధీనములో లేకుండునట్లు బంధింపజేసినది.
కొంతకాలమునకు రాజు సంధిమతిని ముక్కుల ముక్కలు గ నరికి హోమముచేసినాడు. ఆమె బ్రతికియున్నచో రాజ్యాధికారమామెకు వచ్చునని యట్లుచేసినాడు.
సంధిమంతునిపై నామె కక్షవహించుటకు కారణమాతనిపై నామెకున్న మెహమే. సంధిమతి మరణించిన తరువాత నొకనాడు కల్హారమాలిక చెరసాలకు వెళ్ళి యతనిని తన వాంఛాతృప్తిని గావించుమని యడిగినది. అతడు తనకరువదియేండ్లు వృద్ధుడనని పలుకగా నరువది యేండ్లు వార్థక్యముకాదని వాదించినది. ఆమెకు కూడ నేబదియేండ్లుండగా వ్యాయాముచే కఠినీకృతదేహయై పోషణములచేత శరీర సౌందర్యమును కాపాడుకొనుచున్నది. బప్పటునకు నామెకు వివాహమైనదే గాని వివాహ బంధయుక్తమైన సంసారములేదు. ఇట్టి నిబంధన మామె చేసినది. ఆమె లౌక్యమునకును, కుటిల నీతికిని సౌందర్యమునకు వశ్యుడైన బప్పటు డామె యెట్లు చేయుమనినచో నట్లు చేయును. వారిరువురిది నామమాత్రపు పెండ్లి.
ఆమెకు సంధిమంతుని పైనున్న వాంఛ చాలేదు. స్త్రీ రూపమెత్తిన కీచకునివలె సంధిమంతుని బహు భంగుల బాధించుటయే గాక వివస్త్రుని చేసి యతడు శిఖండియని గ్రహించి నివ్వెరపోయినది. ఇచట సంధిమంతుని పేరులోనున్న యోచిత్యమును విచారింపవలయునున.
సంస్కృతమున నున్న రాజతరంగిణి లోని గాథనాధారముగా జేసికొని యల్లబడిన నవల సంజీవకరణి సంజీవము మరణించినవానిని మరల బ్రతికుంచునట్లు చేయునది. రాజతరంగిణిలో సంధిమత్ శబ్దము లింగములోనే యున్నప్పటికిని ఆంగ్ల భాషాంతరీ కరణమున నొకతావున స్త్రీ లింగ శబ్దము, మరియొక తావున పుంలింగ శబ్దము ప్రయోగింప బడినది అని విశ్వనాథవారు తెలియజేసియున్నారు. సంస్కృత రాజ తరంగిణిలో సంధిమచ్ఛబ్దము నిస్సంశయముగా పుంలింగములోనే యున్నది. ఆంగ్లేయ భాషాంతరీకరణములో సంధిమతియన్న స్త్రీ లింగమొకచోట వాడబడి పుంలింగమొకచోట వాడబడి కల్హాణుని కథలో పండిట్ కథ కొంత మార్పు తెచ్చినది. సంధిమంతుడు స్త్రీయైనను పురుషుడైనను విశ్వనాథవారు మిక్కిలి చమత్కారముగ నతనికి శిఖండి తనము నాపాదించుట సమంజసముగా నున్నది. సంధింపబడుట అన్న క్రియ యీ పేరులో నిమిడియుండి యర్ధవంతమైనది. జరాసంధుడు అనగా జరయను దానిచేత సంధింపబడినవాడు. ఇచట సంధిమంతునకు జరిగిన దసయవసంధి, మరియు సంధి సంధ్య రెండు మార్గముల నడిమి కూటమి యన్న భావము కూడ నగును. అనగా స్త్రీయును పురుషుడును గాని సందిగ్థ స్థితి మూలమున లేకున్నను తెలుగున పేర్కొనబడి పేరును సార్థకము చేయుటయైనది సంధిమంతుడు పూర్ణపురుషత్వమును కోరియే యజ్ఞయాగాదులు చేసి యుండవలెను. ఆధునిక వైజ్ఞానిక వైద్యరంగమున కూడ నిట్టి విచిత్రములప్పుడప్పుడు జరుగుచుండుట సర్వ విదితము. చివరకు సంధిమతీ సంధిమంతులిరువురైనను ఏకత్వము నొందిరి. ఒకరిది శరీరము ఒకరిది ఆత్మ.
సంధిమతికి రాజ్యాధికారము లభింప బోవుచున్న దన్న వార్త కల్హారమాలికలో మాత్సర్యమును రేపినది. తనకు లభింపని సంధిమంతుడు సంధిమతికి లభించుయేగాక తాను కలలుగన్న రాజ్యాధికారము సైతము సంధిమతికే లభించు నన్నమాట యామెలోని మానవత్వమును కరుణను నిర్మూలించినది. వేయివిధములుగ వారిని బాధించి సంధిమతి నిలలో కూడ నిలువకుండ జేసినది.
కల్హారమాలిక దిల్హాయన్న స్త్రీ వద్ద ఖడ్గ విద్యనభ్యసించి గురువుతో సమాన ప్రతిభను గడించినది. ఆమె దుర్గుణ మెట్టిదనిన గురువును సహితము వధింప తల పెట్టినది. దిల్హా ఆమె భావమును గ్రహించి తన ప్రాణమున కాపదరాకుండా కాపాడుకొన గల్గినది. కల్హారమాలిక ఈ ఖడ్గ విద్యనొక రహస్య స్థానమును నేర్చెడిది. బప్పట మంత్రితో సంసారము చేయక పోయినను పురుషుల నెరుగకుండ లేదు. ఈమె వ్యభిచారమును గురువు తేలికగ గుర్తుపట్టెడిది.ఇదిగో కడచిన రాత్రి నీవు పురుష సంపర్కము చేసితివి అనెడిది.
పంచమియన్న పంచముల బాలిక సంధిమతి యస్థికలు తేగా కల్హారమాలిక వానిని కొన్నది. వారి ద్వారా సంధిమతి యాత్మను తాను వశము చేసికొనదలచినది. పంచమితో గూడి స్మశానమునకు వెళ్ళియచట నొక యోగిని కలిసి కొనినది. ఆ రాత్రంతయును మరునాడు సగము కాలమును నామెకు యింటికి వచ్చటకు వీలుగాక పోయినది. బప్పటున కది తెలిసి యామెను నిగ్గదీసెను. శ్మశానమున కెందుకు బికారివలె వెళ్ళితివనెను. సంధిమంతునితో నామె తన కోర్కె వెల్లడించుట విన్న బప్పటున కామెపై నాగ్రహము కలిగినది. కల్హారమాలికకు పట్టరానంత కోపమువచ్చి యామె శయ్యక్రింద నెప్పుడును దాచుకొను ఖడ్గముతో నాతని తల నరకవలెనని తలచినది. కాని యింతలో దుఃఖమువచ్చి యేడ్చినది. ఈమె మిక్కిలి శ్రమపడుచుండెడిది. రాజ్యముకొరకు శ్రమ పడుట యట్లుండుగ సంధిమతి సంధిమతులను హింస పెట్టుటకు కూడ మిక్కిలి శ్రమపడి పన్నాగములను పన్నవలసి వచ్చెడిది. ఆమెకు సాయపడు వారుగాని మెచ్చుకొనువారుగాని సానుభూతని చూపెడివారు గాని లేరు. శ్రమయు ఫలించుటలేదని యామెకు దుఃఖము వచ్చినది. తనను చూచి తానే జాలిపడు స్థితికి వచ్చినది. భార్యతో సంసారముతో చేయుట సంతానమును గని వంశమును నిలబెట్టుకొనుటవంటి ధర్మమునుండి తననామె బాహిరించెనని బప్పటుడు దూషించెను.
కల్హారమాలికకు రాజు సోదరుడని సంధిమంతుడు బప్పటు నకుచెప్పెను. ప్రస్తుతము రాజైన వాన తండ్రి విజయేశ్వరుడు. అతనికి ఆనందకలిక యను స్త్రీవలన పుట్టినది కల్హారమాలిక. ఆమె రాజ్యమును కోరుచున్నది. సంధిమతి రాణియగునని దివ్యవాక్కు గనుక నామె బదులు నామె యస్థుల ప్రభావము వలన తానే రాజ్యాధికారిని కావచ్చునని కల్హారమాలిక భావించుచుండెను. కాని కల్హారమాలికకు సంధిమతి యొక్క శిర్యోస్థి లభ్యుముకాలేదు. కావున శిర్యోస్థి యున్న వారికే మిగిలిన యస్థులున్న వారికే చెరిసగముగ బలముండునని సంధిమంతుడు చెప్పెను.
కల్హారమాలిక రాజ్యము నల్లకల్లోలము చేయదలపెట్టినది. సైన్యాధిపతులను తన వైపునకు త్రిప్పుకొనినది. దుర్గప్రవేశమునకు వీలుగా వ్యూహమల్లినది. అంతఃపుర స్త్రీలను వేరుగ, రాజును వేరుగ సంహరించుటకు సైన్యముచేత వారి భవంతులను చుట్టుముట్టించినది. రాజు కల్హారమాలిక యొక్క దుర్బుద్ధిని గ్రహించి యామెను బంధింపుమని యాజ్ఞాపించెను. ఆమె రాజ భటులకు చిక్కకుండ తప్పించుకుపోయినది.
సంధిమంతుని కూడ అతని భార్యను చంపినట్లు ఖండింతురని కల్హారమాలిక శ్మశానమునకు వెళ్ళి చెట్టుచాటున దాగుండి గాంచుచున్నది. అచట సంధిమంతుని శరీరాంగమున్నియు దేవతల యొక్క నూతనాంగములచే సంధింపబడినవి. అతని సౌందర్యమును తేజస్సును పౌరుషమును చూచి కల్హారమాలిక యోర్చుకొనలేక కెవ్వుమని కేకపెట్టినది. ఆమె కేకతో దేవలంతర్థానమైరి. కల్హారమాలిక అదృశ్యముగా నంతఃపురుమునకు వెళ్ళినది.
ఎంత ప్రయత్నించిన నామెకు సందిమతి యొక్క శిర్యోస్థి లభింపలేదు. అంతఃపురమున బయట కూడ విప్లవ జ్వాలలను రేకెత్తించినది. రాజ్యకాంక్ష యుచ్ఛనీచముల నాలోచింప నీయలేదు. ఈమె ఖడ్గవిద్యా నైపుణ్యమునకే సైన్యాధిపతులు వశులగుట జరిగినది.
సంధిమంతుడు కల్హారమాలికకు సంధిమతి శిర్యోస్థి దొరకినచో సంధిమతి యొక్క జీవుడు కల్హారమాలికలో ప్రవేసించును. లేదా యామె జీవుని ప్రేతముగా మార్చి తన యధీనము నందుంచుకొనును అని భావించెను. కల్హారమాలిక యొక్క క్షుద్రోపాసనల వలన నామె కదృశ్య శక్తి లభించినది. వీరయోగ సింహుడను యక్షుడదృశ్యముగా నున్నను కల్హారమాలికకు కనుపించెను.
కల్హారమాలికకు రాజు తనకు సోదరుడని తెలియును. ఈమె రాజును, గురవును,భర్తను, కూడ చంపనెంచి, రాజద్రోహి గురుద్రోహి భర్తృ ద్రోహియైనది. పిశాచముకన్న నెక్కువగా తాను కామించిన వానిని నాశనము చేయబోయినది.
శ్మశానములో తెల్లవారు వరకు నది యీది వచ్చునపుడు దుస్తులన్నియు తడిసిపోగా పంచముని కుమర్తెను దుప్పటికైకోరుట లోని నైచ్యమిమె గుణములను బుద్ధులకు తగియున్నది.
అదృశ్యముగ వచ్చి రాజును చంపబోవుచున్న సమయమున కల్హారమాలిక నామె గురువు సోదరియునైన దిల్హా సంహరించినది. ఇట్లు కల్హారమాలిక యాశలకు జీవితమునకు సమాధి గట్టబడినది.
|