బయటికి వెళ్ళినచో నచట సైన్యముండును. వారిని వధింపగలదు. గాని నడివీధిలో నొక స్త్రీ యందునను రాజునకంగరక్షకురాలు యుద్ధము చేయుయెడల సమస్యలు పుట్టవచ్చును. అందున రాజు వ్యాధిగ్రస్తుడు. నిస్సంతు ఎప్పుడో జరుగవలసిన సింహాసనమునకై యుద్ధమప్పుడే జరుగవలసియుండును. అనియోచించి దిల్హా రాత్రి వరకచ్చటనే యుండిపొయినది.
కొంతకాలమునకు దిల్హాకొక ధర్మసందేహము కల్గినది. తాను రాజుపక్షమా సంధిమంతుని పక్షమాయని. ఈ సమస్యను తాను తేల్చుకొనలేక ఈశానయోగి నడిగినది. ఆ యడుగుట యతడు చెప్పుననుటకు కాదు. ఆత్మవిమర్శ చేసికొనుట మాత్రమే. ఆమె మనస్సు రాజు సంధిమంతుని సంధిమతిని పెట్టినహింసలకు క్షోభించెను. రాజు సంధిమతిని కొరకంచులతో కాల్పించి ఖండములుగ నరికించి హోమమున వ్రేల్పించుట తన కన్నులతో చూచి జుగుప్స చెంది యుండవచ్చును. అందుచేతనే దిల్హాకు తానెవరి పక్షము దాననన్న సందేహము కల్గినది. ఆ జుగుప్స కల్గుటకు కారణము కేవలము దిల్హాలోనున్న మానవత్వము, కరుణయే కారణము. రాజుచేయు ప్రతి పనిని సమర్థింపవలెనన్నచో నామె యంతరంగ మంగీకరింపగ పోవచ్చును. సేవాధర్మమును మానవ ధర్మమును విమర్శించి నిర్ణయించుకొన్నది దిల్హా.
జన్మచేత నేను సంధిమంతుని పక్షము దాననైనచో నేను వంచింపబడినాను అని భావించినది. సంధిమంతుడు ధర్మపక్షమువాడు. భగవంతుని పక్షమువాడు. తానును ధర్మపరాయణురాలే గాని శరీరవృత్తి వేత రాజునకంగ రక్షకురాలైనది. రాజును రక్షించుట యామెకు ముఖ్యకర్తవ్యము. అందుచేత నీమె ముఖ్య కర్తవ్యమునే పాలించుటకు సంసిద్థయైనది. నాచేత రాజు వధింపబడడు. వధింపబడడు సరికదా తద్వధవ్యసాయులు నాచేతిలో బ్రతుకరు. నాకు దివ్యశక్తులున్నవి.
ఇచట దిల్హా ధర్మసూక్ష్మమును సూక్ష్మముగా విచారించి గుర్తించినది. తధ్వధవ్యవసాయు లెవ్వరో దిల్హాకు తెలియును. ఆమెకు ఎదుటివారి మనసులను పసిగట్టగల నేర్పున్నది కదా ! చేతులార పెంచిన చెట్టును నరుకవలసివచ్చినచో నరుకుడు ననుటలో నర్థమిదియే. చేతులార పెంచినది కల్హారమాలిక ఖడ్గవిద్యను. ఖడ్గవిద్య వ్యూహనిర్మాణకౌశలము, ఇవి యన్నియు నామెకు దిల్హాయే నేర్పినది.
రాజు దిల్హా, కల్హారమాలిక మువ్వురు నొకే తండ్రికి వేర్వేరు తల్లులయందు పుట్టిరి. కల్హారమాలిక దిల్హాల తల్లులక్కచెల్లెండ్రు. దిల్హా పెంచిన ఖడ్గ విద్య ను క్షేత్రమున కాదని దిల్హాకు తెలియును. దుష్పలితములు రావచ్చునని యూహించుచునే యున్నది. కాని కల్హారమాలికలోనియొక యాకర్షణమున కామె భ్రాంతిచెంది విద్యనేర్పి గురుస్థానీయురాలైనది. అమెకు తనకు రక్తసంబంధ మున్నదని నవలాంతమునకు గాని తెలియని రహస్యము. ఇరువురును మంత్ర తంత్రములు నేర్చినవారు. ఇరువురును శక్తి సంపన్నులు. ఇరువురును యుధ్ధ విద్యనిపుణురాండ్రు. ఇరువురి దృష్టులను రాజు పైననే యున్నవి. ఒకరికి రాజును రక్షింపవలయుననియు మరియొకరికి రాజును నశింప చేయవలెననుటయే నవలలోని ముఖ్యగాథ, ఈ మువ్వురి నడుమ త్రికోణాకృతి ధరించినది. నాయకుడు సంధిమంతుడైనప్పటికిని అతని స్థానము త్రికోణమున నున్న బిందువు కేంద్రమైనది. ఈ స్థానము నా మువ్వురిలో నెవ్వరును తాకలేకపోయిరి.
దిల్హాకుగల కఠిన ప్రవృత్తియు, వృత్తియు సడలునట్లుగా నీమెకు గల పంచమి తోడి స్నేహమొక మార్దవరేఖను గీచినది. పంచమిదిక్కు లేనిదైన్పటికిని పలుకరించి ఆమె చెంత తన కాఠిన్యమును తొలగించుకొని తనతో మాటాడుట కాపిల్ల బెరుకు చెందకుండ చేసికొన్నది. పంచమి యెడల దిల్హా చూపినది స్నేహభావము కన్న మించినదే యనవలెను. పంచమిలో కలుగుచున్న మనోవికాసమాలిక రాజును చంపుటకు వచ్చునప్పుడు రాజును రక్షింపగల సామర్ధ్యమున్నదొక్క దిల్హాకే. దిల్హా రాజభవనము చెంత రాత్రుల యందుండును గాని పగటి సమయములందుండదు. కావున రాజు దిల్హాను పగటి సమయమున చెంతనుంచుకొనుట శ్రేష్ఠమని రాజునకు సంధిమంతుడు కబురంపెను.
దిల్హా చిన్నతనమున పరమసౌందర్యవతి. ఆమె తల్లి మేఘవల్లరి. కల్హారమాలికతల్లి ఆనందకలిక. వీరిద్దరును తుంజిక యను బ్రాహ్మణ స్త్రీకి జనించినవారు. రాజైన జయేంద్రుని సోదరీమణులు. ఆనంద కలికచే వెడలగొట్టబడిన మేఘవల్లరి తమ పూర్వికులైన కిరాత వంశము వారినాశ్రయించి బ్రతికినది. అందుచేత దిల్హా పర్వతములలో పెరిగి జంతువుల కూతల ననుసరించుట పర్వత సంచారము చేయుట కొండల నెక్కుటలోయలను దాటుట మొదలైన విద్యలను నేర్చుకొనినది. కిరాతు లామెను రాణిగా చేసుకొనవలెనని తలంచుచుండగా నీమెనొక సన్యాసి యపహరించెను. అతడు మాంత్రికుడు దిల్హాకు కూడ మంత్రములు నేర్పెను. మంత్రతంత్రములు నేర్పిన బ్రాహ్మణ కన్యను సౌందర్యవతియైనదానిని బలియీయవలెనని యా మంత్రికుడు తలచుచుండెను. వీరయోగి సింహుడను యక్షుడు దిలహరికి ప్రత్యక్షమయ్యెను అతడికి దిల్హా యన్నచో నభిమానము. అందుచే సన్యాసి యొక్క రహస్యమును చెప్పెను. అపుడు యోగికిని దిల్హాకును యుద్ధమైనది. యోగి పక్షమున నొక రాక్షసుడును దిల్హా పక్షమున వీరసింహుడు. అతని నాశ్రయించిన పిశాచము నుండిరి. యోగి దిల్హాను హోమకుండములోనికి త్రోసెను. ఆ క్షణమునే దిల్హా యోగిని సంహరించినది. హోమకుండములోని మంటలలో నామె శరీరము కాలిపోయి వికృతాకృతి నొందినది. అంత దిల్హా బాలశశిశేఖరుడన్న జ్యోతిష పండితుని పంచన జేరినది. అతడామెను రాజునకంగ రక్షకురాలినిగ జేర్చెను. ఇట్లీమె హెగ్గెడికత్తెయైనది. పగలెవరికిని తెలియకుండ గుహలలో నవిసించుట రాత్రులందు భవన రక్ష చేయుట. ఇట్లామె కాలము గడుపుచున్నది.
రాజు సంధిమంతుని వధింపతలచెను. సంధిమంతుడు తనను శూళారోపణ చేయింపుమనెను. రాజు దిల్హాను సంధిమంతుని శూలారోపణము చేయుటకై శ్శశానమునకు పంపెను. ఇట్లు శూలము శరీరమున దిగవేయుటో శరీరము ఖండములుగాదు దిల్హాకట్టి యాంతరంగిక వ్యవహారమునకధికారములేదు. కాని రాజు యొక్క సౌహార్థమునకు పాత్రురాలైనది. రాజిట్లనెను దిల్హా ! నాకు నలుగురు అంగరక్షకురాండ్రు కలరు. ఇప్పుడేకాదు తొలుతటి నుండియు నీయందే నాకెక్కువ యభిమానము అని చెప్పెను. రాజునకీ కారణము తెలియని యభిమానము వారి రక్తసంబంధములో నున్నది. కల్హార మాలికలోనున్న మాత్సర్యమామెకున్న దాయాది లక్షణము రాజు తన రాజ్యభారమంతయు దిల్హాపైన వైచెను. తన మరణము నిక్కమని యెఱింగి సంధిమతి యస్థికలను శిర్యోస్థితో కలిపి గంగ యందు సమంత్రముగ నిమజ్జనము చేయమనెను. రాజ్యము చటకకుగాని కల్హారమాలికకు గాని వశము కానీయరాదని చెప్పెను. సంధిమతి యొక్క జీవుడు సంధిమంతునితో జేరి రాజ్యపాలనార్హతను సంపాదించుకొనును గాన రాజ్యమును సురక్షితముగ సంధిమంతుని కప్పగించుమనెను.
దిల్హా యందు రాజునకున్న విశ్వాసమంతయు నిరాధారము కాదు. ఆమె యంతటి కుశలయే. ఇకనామెకు ఉద్యోగధర్మములేదు. విధులుగాని యాంక్షలుగాని లేవు వీరయోగి సింహుని రాజ్యవ్యవహారము పూర్తియగునంతవరకు తనవెంట నుండుమని కోరినది.
దిల్హా శ్శశానమునుండి వచ్చుసరికి రాజ్యమంత కుమ్ముపెట్టినట్లున్నది. రాజుగాని రాణులుగాని భవనము వీడి వచ్చుటకు లేదు. దిల్హా రహస్యమార్గమున కోటలోనికి వెళ్ళి మిగిలిన హెగ్గెడి కత్తెలను హెచ్చరించినది. చటకయును, కల్హారమాలికయును కలిసి కుట్రపన్ని యెకేసారి రాజ్యమును ముట్టడించుటకు ఏర్పాటు గావించుకొనిరని గ్రహించినది. సేనానాయకుడు ఖాగీరధి శర్మను రాజువద్దకు పిలిపించి యతనిని రాజుయెదుటనే వధించినది. ఆ శవమును సైన్యము నెదుట పరావేయించినది. కొంతమందిని మార్గమధ్యమున సంహరించి తిరుగుబాటుదారుల ముందు వడవైచినది. వారీ ఘోరమును చూచి భయముతో నిర్వీర్యులైరి. సైనికులలో నహంకారము చెలరేగునట్లుగ ప్రసంగించి కొందరిని యుద్ధమునకాహ్వానించినది. అయిదు నిముషాలలో తేజలాదీనచేత పదిమంది మహావీరులను వధింప చేసినది. మితగ సైన్యమునకు నాయకుడు లేకపోగా నామె వశము చేసికొన్నది. ఇది దిల్హా యొక్క బుద్ధి కౌశల్యము పరాక్రమము నిరూపించు ఘట్టము.
చటకను పట్టి బంధించి యీడ్చుకొనివచ్చి యంతఃపురమున నొకగదిలో పడవైచినది. పదిమంతి మహామంత్రులు మాత్రమే చేయగల కార్యము నీమె పది నిముషములలో ముగింపగల్గినది. కుట్ర భేదింపబడినది. విప్లవ కారిణియగు కల్హారమాలిక యాశలడుగంటినవి. ఇన్ని కార్యముల నడుమ దిల్హా రాజు గదిలోనికివెళ్ళి పదే పదే రాజును చూచి వచ్చుచునే యున్నది. ఆమెకదియే ప్రథమకర్తవ్యము. దిల్హాకు రాజును రక్షించుటయే కావలసినది. ఇట్లు ఏమరుపాటు లేకుండా రాజును చూచుచున్న దిల్హాను చూచి రాజు దిల్హానేను రాజును కానా యనెను. రాజగుట కేవలము భోగముల ననుభవించుటయేనా కడకాత్మ రక్షణమైన చేసికొనలేని యసమర్థుడనని భావించుచుంటివాయని నీమాటకు భావము. మొదట రాజు యొక్క పరాక్రమము తెలిసికొనగోరి తేజలాదీనతోయుద్ధము చేయమనినది. తేజలాదీన యంతకుముందే పదిమంది వీరులను క్షణములలో హతమార్చినది. అట్టిది రాజుకత్తికి తాళలేక యాతనిని కత్తితో స్పృశింపలేక పోయినది దిల్హాతాను రాజుతో యుద్ధము చేసి యతని మేన నెత్తురొలికించినది. అట్లు చేయుటతో రాజునకున్న కీడు తొలగునని దిల్హా భావము. వీరురాలైన దిల్హా అట్లు సామన్య స్త్రీవలె బేలగా నూహించుటయామెలోని కర్కశత్వముమాటునున్న కారుణ్యరేఖ తళుక్కు మనుటయే గాక సోదర ప్రేమ ప్రవహించుచున్న దనిపించును.
కల్హారమాలిక రహస్య మందిరమునకు వెళ్ళి యచటి సేనానాయకులను తన నీతిచే గెలిచినది. భాగీరధి శర్మ వధింపబడుట చటకను బంధించుట సైన్యము వశమగుట చెప్పి వారి గుండెలను నీరు చేసినది. వారిని తనతో యుద్ధము చేయుచున్నది. వారి కత్తుల నెగురకొట్టి కాళ్ళు చేతులు బంధించి చెరసాలలో పడవేయించినది. వారు రాజునకు మొగము చూపింపజాలము వధింపుమని యామెను కోరిరి.
దిల్హా శ్మశానమునకు వెళ్ళినది. అచట కల్హారమాలిక శిర్యోస్థికొరకు పంచమిని బంధించునేమోయని భావించినది ఆ సమయమున శ్మశానమున సంధితుని శరీరము శూలమునుండి దింపబడి దేవతల చేత సర్వాంగములు సంధింపబడుచున్నవి. సౌందర్యముతో సంధిమంతుని శరీరము కళకళ లాడుచున్నది. కల్హారమాలిక, ఈశానుడు, పంచమిలతో బాటుగ దిల్హాకూడ చెట్టు చాటునుండి యాయద్భుతమును చూచుచున్నది. ఆశ్చర్యముతో కల్హారమాలిక పెట్టిన కేకతో దేవతలు వెడలిపోయిరి. ఈశానునిచేత దిల్హా సంధిమతి యస్థికలను గంగలో నిమజ్జనము చేయించినది. రాజుకొరకు భవంతికి వెళ్ళగా కల్హారమాలిక యదృశ్య శక్తితో నెవరికి కనుపింపకుండ వచ్చి రాజును వధించినది. ఈశానుని యోగశక్తి వలన నదృశ్యురాలై యున్న కల్హారమాలిక దిల్హా వధింపదలచలేదు. అదృశ్య శక్తి నుపసంహరించు కొనమని చెప్పిన తరువాత నామె కంఠముత్తరించినది.
కల్హారమాలికను చంపుటలో సోదరీ వధాపాపము చుట్టుకొనినదని బప్పటు భావించెను. రాజును రక్షింపవలసిన ధర్మము దిల్హాకున్నది. కాన రాజును హత్యచేసిన కల్హారమాలికను నిర్యుద్ధముగ చంపక వీరోచితముగ ద్వంద్వ యుద్ధమున చంపినది. కల్హారమాలికను చంపిన తరువాత నామె కొరకు దిల్హా వ్యధ చెందుటలో నీమె మార్దవము వెల్లడియగును.
ఎత్తుకు పై ఎత్తు వేయుటలో దిల్హా, కల్హారమాలికలు చాణక్య, రాక్షసులను జ్ఞప్తికి తెచ్చుచుందురు.
|