4
 

ఎన్నిక‌లు  -  ఎల‌నాగ‌లూ

భార‌త‌దేశ రాజ్యాంగం ప్ర‌కారం (ఇండియ‌న్ కానిస్టిట్యూష‌న్‌) పార్ల‌మెంటు, అసెంబ్లీ, మునిపిపాలిటి, పంచాయ‌తీ వ‌గైరాల‌లోని స్థానాల‌కు, షెడ్యూల్డ్‌కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వంటి కొన్ని వెన‌క బ‌డ్డ కులాల వారితోపాటుగ పోటీచేయ‌డానికి స్త్రీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించుకొనే సౌకర్యం ఉన్న‌ది. రిజ‌ర్వేష‌న్ ఉన్న‌దీ అంటే వెనుక‌బ‌డి ఉన్నామ‌న్న మాటేగా !

సీట్ల‌లో రిజ‌ర్వేష‌న్‌ అంటే ఆయా కాన్ట్సిట్యుయెన్సీల్లో పోటీ చేయ‌డానికి స్త్రీలు మాత్ర‌మే అర్హులు. అంటే కేవ‌లం స్త్రీల‌లో స్త్రీల‌కే పోటీ అన్న‌మాట ! ఓట్లువేయ‌డం స్త్రీ పురుషులిద్ద‌రూ వేస్తారు.

జనాభాలో స‌గ‌భాగం ఉన్న స్త్రీల‌కు కొద్ది సీట్లు కేటాయించ‌డం హాస్యాస్పదంగానే అన్పిస్తుంది. ఖ‌చ్చితంగా ఈ స్థానంలో ఆడ‌వారే ఉండాలి అని నిర్ణ‌యంచేయ‌డంతో ఆ స్థానానికి ఆడ‌వారే పోటీ చేయ‌డం ఎవ‌రో ఒక ఎల‌నాగ ఎన్నిక‌కావ‌డం త‌ప్ప‌ని స‌రి.

ఇలారిజ‌ర్వేష‌న్ లేని ప‌క్షంలో ఈ మాత్ర‌పు ప్రాతినిధ్యంకూడా వ‌హించ‌డానికి స్త్రీలోకం సంసిధ్ధంగా లేదెందుచేత‌నో ఆలోచించాలి !  రిజ‌ర్వేష‌న్ స్థానాల‌లో కాక మిగిలిన స్థానాల‌లో కూడా మ‌గ‌వారితో పాటు ఆడ‌వారూ పోటీలో నిల‌వ‌వ‌చ్చు. కానీ స్త్రీలు అలా చేయ‌డానికి జంకుతూనే ఉన్నారు. అమ్మోవాళ్ళ‌తో మ‌న‌మెక్క‌డ నెగ్గ‌గ‌లం అనే ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్సు స్త్రీల‌ను వ‌ద‌ల‌కుండా ఉంది. మ‌నం వాళ్ళ‌క‌న్న ఎందులో తీసిపోయాం అనే విచికిత్స ఇంకా క‌ల‌గ‌డం మొద‌లుపెట్ట‌లేదు.

ఎన్నిక‌ల‌లో పోటీచేస్తున్న స్త్రీల‌లో మ‌గవారి లాగానే అనేక‌ర‌కాల‌వారున్నారు. చ‌దువుకున్న‌వారు, అక్ష‌ర‌గంధంలేనివారు. ధ‌న‌వంతులు, పేద‌లు, వివిధ పార్టీల‌కు చెందిన‌వారు ఇండిపెండెంట్లు , క‌ళాకారులు వ‌గైరా వ‌గైరా లిద్ద‌రిలోనూ స‌మాన‌మే. కాని ఒక్క‌టి మాత్రం స‌త్యం ! స్త్రీల‌లో స్మ‌గ్ల‌ర్సూ, గుండాలూ, గాంబ్ల‌ర్సూ హంత‌కులూ మొద‌లూన మాఫియాజాతికి చెందిన వారు మాత్రం ఖ‌చ్చితంగా లేర‌నే చెప్పాలి ! కేవ‌లం వీరిలో విధివంచితలూ పురుష‌వంచిత‌లూ ! స‌మాజోప‌మ‌తులూ మాత్ర‌మే వుంటారు. ఆత్మ‌స్థ‌యిర్యంలోనూ, దేశ‌భ‌క్తిలోనూ స్వ‌చ్ఛంద‌సేవాభావంలోనూ కార్య‌శూర‌తోనూ, బుద్ధినైశిత్యంలోనూ, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌లోనూ, నిర్మ‌ల స్వ‌భావంలోనూ, సుగుణ సౌశీల్యాదుల‌న్నిటిలోను స్త్రీలు పురుషుల‌కు తీసిపోనివారే ! అయిన‌ప్ప‌టికి ఎన్నిక‌ల్లో పాల్గొన్న అభ్య‌ర్థిని త‌న ఎత్తుకొని వీధిలో న‌డ‌వ‌లెనంత‌గా ఆమెకు అవ‌మానంక‌ల్గిస్తూ అస‌భ్య‌క‌ర‌మైన పాంప్టెట్సును పంచ‌డం అశ్లీల‌క‌ర‌మైన ప‌దజాలంతో గోడ‌ల‌మీద వ్రాయడం జ‌రుగుతోంది. ఎక్క‌డైనా పురుషుల‌తో పోటీ చేస్తే ఆ స్త్రీ గురించి బ‌హిరంగంగానే కారుకూత‌లు కూయ‌డానికి కొంద‌రువెర‌వ‌డం లేదు. ఈ విష‌యంలో మాత్రం అంటే అవ‌మానాల‌కు భ‌రించ‌వ‌ల‌సిరావ‌డంతో స్త్రీలు పురుషుల‌క‌న్న ఎంతో ఉన్న‌త స్థానంలోనే ఉన్నారు.

స్త్రీల‌ను అవ‌మానం చేస్తూ దుష్ప్ర‌చారం చేస్తూ పైశాచికానందాన్ని అనుభ‌వించే వారికి ప్ర‌భుత్వం, న్యాయ‌స్థానాలు ఏంశిక్ష‌లు విధిస్తున్నారు. ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు ! స్త్రీలు నాల్గుగోడ‌ల‌మ‌ధ్య‌నే ఉండి పోవ‌డానికి కార‌ణం ఇలాంటి అవ‌మానాల‌ను భ‌రించ‌లేక‌నే స‌హ‌జంగా స్త్రీ సున్నిత‌మూర్తి ! ఎవ‌రేమి దూషించినా తుడిచేసుకుని తిరిగే బండ‌త‌నం ఆమెకు త‌క్కువ !

ఓట్ల‌కోసం ఇంట్లోనుండి బ‌య‌టికివచ్చిన మ‌హిళ‌ను మిగిలిన‌వారు వింత‌గా చూడ‌డం గాని వారు త‌న‌ని వింత‌గా చూడ‌క‌పోయినా చూస్తున్నారేమోన‌న్న భావం ఆమెకి గాని రాకుండా మాన‌డంగాని ఇలాంటి వాతార‌ణంలో క‌ష్ట‌మే. పూర్వంలో నాట‌కాల‌లో వేషాల‌నువేసేస్త్రీల‌ను ఎలాచూసేవారో ఇప్పుడు రాజ‌కీయాల‌లో పాల్గొనే స్త్రీలన‌లానే చూస్తున్నారేమోన‌నిపిస్తుంది.

గ‌వ‌ర్న‌ర్ల‌, మినిస్ట‌ర్ల‌, పార్ల‌మెంటు అసెంబ్లీ మెంబ‌ర్ల‌, స్థానాల‌లో ఉన్న స్త్రీల‌ను చూసుకుంటూ స్త్రీలు పురోగ‌మిస్తున్నారని వెన్ను విరుచుకోన‌క్క‌ర‌లేదు. ఈ మినిస్ట‌ర్లూ గ‌వ‌ర్న‌ర్లూ వేళ్ల‌మీద లెక్కించ‌గ‌లంత త‌క్కువ‌సంఖ్య‌లో ఉన్నారు. కోట్లాది జ‌నాభాలో చేజిక్కించుకున్న స్థానాలు బ‌హుకొద్ది విస్మ‌ర‌ణీయం !

అందుచేత రాజ‌కీయ భూమిక‌లో ర‌మ‌ణీమ‌ణులింకా వెన‌క బ‌డే ఉన్నార‌న‌డం ఏ రాస్తారోకో ఉద్య‌మంలోనో ధ‌ర‌లు త‌గ్గించండి అన్న నినాదాలు చేయ‌డానికో ఖాళీబిందెల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికో పిల్ల‌ల‌ను చంక‌నేసుకుని అతి కొద్దిమంది బ‌య‌టికి  రాగ‌ల్గుతున్నారు.

అస‌లామాట కొస్తే నిత్యం దిన‌ప‌త్రికను చ‌దివి దేశ‌ప‌రిస్థితులు తెలుసుకోవాల‌నుకొనే మ‌హిళామ‌ణులెంత‌మంది ?  ఎన్ని  సంవ‌త్స‌రాల‌కో ఒక‌సారి వ‌చ్చే ఎన్నిక‌ల‌లో క‌నీసం ఓటువేసి ఓపికెంత మందికుంది ?  ఆ ! నేనొక్క‌దాన్ని ఓటు వెయ్య‌క‌పోతే కొంప‌లంటుకుపోవులే అనుకొని ప్ర‌భుత్వం వారిచ్చిన సెల‌వుదినాన్ని సినిమాచూడ్డంలో వినియోగించుకొనే దెంత మంది ?  ఒక్కసారి ఆలోచించండి ! ఈ విష‌యంలో మాత్రం విద్యావంతులూ విద్యావిహీనులూ కూడ ఒకే ర‌కంగా ప్ర‌వ‌ర్తిస్తారు. స‌ర్వ‌సాధారంణంగా ?   నాకిన్పిస్తుంది. మ‌హిళ‌ల‌కు రాజ‌కీయ ప‌రిజ్ఞానాన్ని కొంచెమైనా క‌లుగ‌జేయాలంటే ప్ర‌త్యేకంగా మ‌రింత కృషిచేయాల్సిఉందేమోన‌ని !