5
 

 

మ‌న వేమ‌న‌

ఆంధ్ర భాష‌లోని నుడికార‌పు సొంపును హ‌స్త‌గ‌తం చేసికొని అతి భార‌తి కంఠాన్న‌లంక‌రించిన ధ‌న్యుడు వేమ‌న‌. వేమ‌న‌ది సూక్తి ముక్తావ‌ళి కాదు సూక్తి పుష్పావ‌ళి. ముక్తావ‌ళి సామాన్యుల‌కందుబాటులో వుండ‌దు. పుష్పావ‌ళి  స‌ర్వ‌జ‌నుల‌కూ సుల‌భంగా ల‌భ్య‌మ‌య్యేది. ఈ పుష్పాలు వాడేవికావు. దేవ పారిజాతాలు క‌విహృద‌య పారిజాతాలు. వేమ‌న ప‌ద్యాల‌న్నీ శ‌త‌కంగానే సాధార‌ణంగా చెలామ‌ణి అవుతున్నాయి. కాని వేమ‌న ప‌ద్యాలు వంద‌కు ప‌రిమితం కాలేదు. ఒక్క మ‌కుటం విష‌యంలోనే అత‌ని ప‌ద్యాలు శ‌త‌క‌మ‌నిపిస్తాయి. కాని వేమ‌న ప‌నిక‌ట్టుకుని వంద ప‌ద్య‌ములు ర‌చించాల‌ని గాని, ఒక వెయ్యి ర‌చించాల‌ని గాని ల‌క్ష్యంతో ప‌ద్య‌ర‌చ‌న చెయ్య‌లేదు. మ‌న‌సు ద్ర‌వించిన‌ప్పుడొక ప‌ద్యం. ఆత్మ ఆక్రోశించిన‌ప్పుడొక ప‌ద్యం. గుండె గుబ‌గుబ‌లాడిన‌ప్పుడోక ప‌ద్యం హృద‌యం వ్య‌ధ‌చెందిన‌ప్పుడొక ప‌ద్యం ఇలా రాసుకుంటూపోయాడు. అందుచేత‌నే వేమ‌న ప‌ద్యాల్లో సంద‌ర్బ‌శుద్ధి, చిత్త‌శుద్ధి, స‌త్యాన్వేష‌ణ‌, ఆత్మాశ్ర‌య‌త్వం తేట తేల్లంగా క‌న్పిస్తూంటాయి. క‌ఠిన ప‌దాడంబ‌రత్వ‌ముగాని, అలంకార శృంఖ‌ల‌త్వంగాని వేమ‌న ప‌ద్యాల‌లో క‌నుపించ‌వు. తాను హృద‌య పూర్వ‌కంగా భావించి నమ్మిన స‌త్యాన్నే ఆల‌తి ప‌ద‌ముల‌లో, ఆగ వెల‌దుల‌లో, ఆల‌వోక‌గా ఆట‌లాడుతున్న‌ట్లే చెప్పినాడు. వేమ‌న ప‌ద్యం చ‌దువుతుంటే అన్వ‌యం చూసుకోన‌క్క‌ర‌లేదు. నిఘంటువు అవ‌స‌రంలేదు. అమ్మో ప‌ద్యం ! అనిపించ‌దు. ఆత్మీయుడైన మిత్రుడు హాస్యంగా మంద‌లిస్తూ విమ‌ర్శిస్తున్న‌ట్లే వుంటుంది. జ‌డ మ‌తికైనా నా రెండు మూడు సార్లు చ‌దివితే జీవితాంతం హృద‌యంలోనే వుంటుంది. చెప్పే విష‌యం ఎంతటి బ్ర‌హ్మాండ‌మైన‌దైనా (బ్ర‌హ్మ స్వ‌రూపం) చెప్ప‌డంలో ఒక సున్నిత‌త్త్వం, సునిశితత్త్వం,నిర్భ‌య‌త్వం, నిష్క‌ర్ష‌త్వం, వెల్ల‌డి చెయ్య‌డంలో వేమ‌న‌గి అందె వేసిన చెయ్యి.

వేమ‌న ఏకాల‌నికి చెందిన‌వాడు? ఏ ప్రాంతానికి చెందిన‌వాడు అన్న విష‌యం సంశ‌యాస్ప‌దంగానే వున్న‌ది. వేమ‌న‌ని వెలుగులోన‌కి తీసుకువ‌చ్చిన సి.పి. బ్రౌన్ వేమ‌న 18వ శ‌తాబ్దం వాడ‌ని ప్ర‌ధ‌మ ముద్ర‌ణ‌లో 17వ శ‌తాబ్దం వాడ‌ని ద్వితీయ ముద్ర‌ణ‌లో ఇంకా నాల్గువంద‌ల యేళ్ళ‌నాటి వాడ‌ని మూడ‌వ ముద్ర‌ణ‌లోని పీఠిక‌లో పేర్కొన్నాడు. రాజ‌కీయ సాంఘిక ప‌రిస్థితుల‌ను ప‌ద్యాల‌లో అక్క‌డ‌క్క‌డా వెల్ల‌డి అయిన‌దాన్ని బ‌ట్టి కాలనిర్ణ‌యం చేయ‌వ‌చ్చును. కాని మేవ‌న‌వ‌ని చెప్ప‌బ‌డి ముద్ర‌ణా భాగ్యం పొందిన ప‌ద్యాల‌న్నీ వేమ‌న‌వేన‌న‌డం  సాహ‌స‌మే అవుతుంది. ఉత్సాహ‌ము అభిరుచి క‌ల్గి ప‌ద్యము రాయ‌క‌ల్గిన ఏ క‌వియైనా వేమ‌న అనుక‌రించి ఉండ‌వ‌చ్చును. ఇందుచేత గూడా వేమ‌న కాల‌నిర్ణ‌య‌ము క‌ఠిన‌ము గావ‌చ్చును. అయిన‌ను యేకాల‌పు వాడు యే ప్రాంత‌పువాడు అన్న ప్ర‌శ్న పండితుల‌న ప‌రిశోధ‌కుల‌ను శిఖ‌పట్లు ప‌ట్టిస్తోంది. గాని, ర‌స‌స్వీకార‌మున‌కు విష‌య స్వీకార‌మున‌కు ఆ ప్ర‌శ్న అప్ర‌స్తుత‌ము, అన‌వ‌స‌ర‌ము. చ‌దివిన ప్ర‌తివానికి వేమ‌న మ‌న‌వాడు అనిపిస్తుంది. అలా అనిపింప చేయ‌గ‌ల్గిందే వేమ‌ల‌న ప‌ద్య‌మ‌ని పోల్చుకోవ‌చ్చును. ప్ర‌త్యేకంగా నీతిబోధ చెయ్య‌డానికన్న‌ట్లుగ రచించిన ప‌ద్యం వేమ‌న‌ది కాదు అని ఘంటాప‌ధంగా చెప్ప‌వ‌చ్చు. వేమ‌న యెగి వెల‌సె లోక‌ములోన పూజ‌లిడ‌డు పుణ్య‌పురుషులార ఇది బ్రౌన్ సంక‌ల‌నంలో మొద‌టి ప‌ద్యం. ఇది వేమ‌న‌ప‌ద్యం అయివుండ‌ద‌ని నా అభిప్రాయం వేమ‌న‌లో ప‌రుల‌నుండి పూజలందు కోవాల‌నే ఆశ‌లేదు. పూజ‌చేస్తే పుణ్యం వ‌స్తుంద‌నే భావం వేమ‌న‌కు లేదు. (భ‌క్తి లేనిపూజ  ప‌త్రిచేట‌న్న భావం వేమ‌న‌ది )  అహం లేదు. వేమ‌న‌యందు గ‌ల భ‌క్తి చేత అత‌ని శిష్యులెవ‌రో యీ ప‌ద్యాన్ని ర‌చించియుండ‌వచ్చు. వేమ‌న మ‌న‌స్సు క్ర‌మ ప‌రిణామ ద‌శ‌లో విక‌సిత‌సుమ‌మై శివ‌పాద‌ముల క‌ర్పిత‌మైన‌దిగాని స‌ద్యోజాతునివ‌లె యోగియై వెల‌సె న‌నుట నిజ‌ము కాదు. వేమ‌న‌ను గూర్చి మ‌రియొక బేధాభిప్రాయ‌ము క‌ల‌దు. అది, వేమ‌న సాధార‌ణ శైవుడా, వీర‌శైవుడా, ద్వైతియా ?  అద్వైతియా, శుద్ధ‌ద్వైతియా ?  అని ఈ మీ మాంస కూడా వృధాప్ర‌యాస‌. కంఠ‌శోష అనియే చెప్ప‌వ‌చ్చును. ఏమి చెప్పాడ‌న్న‌ది ప్ర‌స్తుత‌ముగాని, ఎవరు చెప్పార‌న్న‌ది కాదు క‌దా ?  చెప్పిన‌వారిని గౌర‌వించుట మ‌న విధిక‌దా అందురేమో ?  వేమ‌న య‌ని గౌర‌వింప‌వ‌లెను. అట్లుగాక శైవుడ‌న్న‌చో శివ‌మ‌తాభిమానులే అభిమానించుట‌యు. అద్వైతియ‌న‌గా మ‌ర‌ల అద్వైత మ‌తాను యాయులే గౌర‌వించుట‌యు జ‌రుగ‌వ‌చ్చును. అట్లుగాక  వేమ‌న మ‌న‌వాడు అనుకొనిన‌చో అందరి పూజ‌లు  అత‌నికే వ‌శ‌మ‌గును. నిజ‌మున‌కు వేమ‌న అన్ని మ‌త‌ముల‌కు సంబంధించిన‌వాడు. విశ్వ‌మ‌త‌స్థుడు. విశ్వ‌మాన‌వ‌శ్రేయ‌స్సును కోరిన హృద‌యుడు. మ‌కుటంలోనే ఆయ‌న మ‌తం వెల్ల‌డౌతోంది. ఏ కోదండ‌రాముడో, సీతామనోభిరాముడో కాక విశ్వ‌దాభిరాముడినే ఎన్నుకొన్నాడు. వేమ‌న విశ్వ‌మెరిగిన వాడు. చీమ ద‌గ్గ‌ర‌నుండి సింగ‌పుపిల్ల స్వ‌భావ‌ముదాకా తెల్సిన‌వాడు. వ‌ల‌సినంత త‌త్త్వాజ్ఞాన‌ము స‌ర్వ‌మ‌త సార‌మును ఎరిగిన వేమ‌న‌ను విశ్వ‌క‌వి య‌న‌వ‌లెను గాని శివ‌క‌వి య‌నుట స‌రికాదు.

అన్ని మ‌త‌ముల నాద‌రించిన శివ అన్న‌ప‌ద‌మ ఎక్కువ‌మార్లుప‌గించెను గాన శైవ‌మందే అత‌నికి అభిమాన‌ము మెండ‌ని వాదింతురు. శివ ప‌ద‌ము నూటికి ఎన‌భై ప‌ద్య‌ముల‌లో ఉప‌యోగించెనుట స‌త్య‌ము. కాని రామ ప‌ద‌ము నూటికి నూరు ప‌ద్య‌ములందునా ఉప‌యోగించెను. ఆ రాముడు విశ్వ‌దాహిరాముడు. కొంద‌రు అభిరామ‌య్య అను పేరుతో ఒక వ్య‌క్తిని సృష్టించి అత‌ని యందు కృత‌జ్ఞ‌త‌తో ప్ర‌తి ప‌ద్య‌మున అత‌నిని స్మ‌రించెనందురు. అభిరామ అన్న ప‌ద‌మున‌కు అందమైన అను అర్ధ‌ముకూడ క‌ల‌దు. వేమ‌న చెప్పిన నీతులు అన్నీ ఎవ‌రికో చెప్పుకోలేదు. త‌న‌కు తానే చెప్పుకొన్నాడు. అందుచేత‌నే వినుర వేమా ఓ వేమా ! విను ! అని . మూర్ఖంగా ఏ ఒక్క మ‌తాన్నీ కొండెక్కించ‌లేదు. త‌ప్పు క‌న్పించిన‌చోట‌ల్లా విమ‌ర్శించ‌టానికి వెర‌వ లేదు. విమ‌ర్శ‌లో స్వ‌ప‌ర‌భేదం చూపలేదు.

వేమ‌న ప‌ద్య‌ములు అత‌ని మాన‌సిక వికాసాన్ని ఒక క్ర‌మంలో వెల్ల‌డిస్తున్న‌ట్లుంటాయి. ఇందుకు అనువుగా  కొన్నిభాగాలుగా ప‌ద్యాల‌ని విడ‌దీయ‌వ‌చ్చు. ఏ వ్య‌క్తి అయినా అత‌డెట్టి మ‌హామ‌నీషి అయినా ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపాన్ని ఒక్క మాటుగా క‌న‌లేడు ఆ ప‌ర‌మ‌సోపానాన్ని ఒక్కొక్క మెట్టే ఎక్కి గ‌మ్యాన్ని చేరుకోవాలి. వేమ‌న ప‌ద్యాల‌నే క్ర‌మంగా విడ‌దీయ‌వ‌చ్చును. 1) ధ‌ర్మ‌ము  2) స‌త్య‌ము  3) శౌచ‌ము  4) కుల‌ము  5) మ‌త‌ము  6) క‌ర్మ‌ము  7) క‌ర్తృత్వ‌ము  8)  బ్ర‌హ్మ‌జ్ఞాన‌ము  9)  ఏకేశ్వ‌రోపాస‌న‌

మాన‌వుడు శీల‌సంప‌న్నుడై ద‌యా స‌త్య శౌచాది గుణ‌ములు క‌ల్గిన‌ప్పుడే నిజ‌మైన భ‌క్తి మార్గ‌ము నందాత‌ని మ‌న‌స్సు పోనుక‌ర‌లు వేస్తుంది. అంతేగాని వృధా పూజ‌లు ఫ‌ల‌ర‌హిత‌ముల‌ని వేమ‌న శ‌త‌ధా బోధించాడు. తోటి మాన‌వుని ఆక‌లిని గాని దీన‌త‌నుగాని క‌న‌లేని మ‌నిషి త‌న అంత‌రాంత‌రాల‌లో నిక్షిప్తుడైన ఈశ్వ‌రునేమి క‌ల‌గ‌ల‌డు ?  బ్ర‌హ్మ‌ప‌థ‌మెట్లు చేర‌గ‌ల‌డు ?