25
 

అవ‌స‌రాలు  -    ఆడంబ‌రాలు

 

మా అమ్మ‌కి నాన్న‌కి నేనంటే ఇష్టంలేదు. అందుకే ఎందుకూ ప‌నికిరాని సంబంధం చేశారు. మా అక్క‌కేమో క‌లెక్ట‌ర్ సంబంధం చేశారు. అంటూ బంధువులు అమ్మాయి ర‌మ ఎప్పుడూ త‌ల్లి తండ్రుల్ని స‌తాయిస్తుంది.

నిజానికి రావుగారు ఇద్ద‌రు కూతుళ్ళ‌నీ గ్రాడ్యుయేట్స్‌కే ఇచ్చి చేశాడు. ఇద్దరికీ కాస్తో కూస్తో ఆస్తికూడా వుంది. పెద్ద కూతురు ఉమ అదృష్టం బావుంది వాళ్ళ ఆస్తికి విలువ‌బాగా పెరిగింది. భ‌ర్త‌కూడా క‌ష్ట‌ప‌డి అయ్యేయ‌స్ పాస‌యి క‌లెక్ట‌ర్ అయ్యాడు. ర‌మ భ‌ర్త మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా ఎల్డీసీగానే ఉండిబండిలాగిస్తున్నాడు.

పండ‌గ‌ల‌కు ఇద్ద‌రు కూతుళ్ళూ ఒక‌సారి రారు. రావుగారు కూడా పిల‌వ‌రు. ఓ పండిక్కి పెద్ద కూతుర్ని ఓ పండ‌క్కి చిన్న కూతుర్నీ పిలుస్తారు. ఈ ప‌ద్ద‌తి ఇద్ద‌రికీ బాగానే ఉంది. ఉమ‌కి సుపీరియారిటీ కాంప్లెక్స్ లేక‌పోయినా ర‌మ‌కి మాత్రం ఇన్‌ఫిరియారిటీ ఉంది.
రెణ్ణెల్ల క్రితం చిన్న కూతురూ నెల‌క్రితం పెద్ద‌కూతురూ పుట్టింటికి వచ్చేశారు. మ‌ళ్ళీ అత్తారిళ్ళ‌కు వెళ్ళే ఛాయ‌లు లేవు. వెళ్ళ‌మని ఖ‌చ్చితంగా చెపుతున్నారుట కూడా !  పొరుగు వారి త‌గువు విన‌వేడుక అన్న‌ట్లుగా న‌లుగునూ నాల్గుర‌కాలుగా చెప్పుకుంటున్నారు. ఒక‌నాడు రావుగారి భార్య మాయింటికి వచ్చి మీ చెల్లెళ్ళ‌కి కాస్త బుద్ధి చెప్ప‌రాదుటే అని న‌న్ను స‌తాయించింది. ఆయ‌న‌కి బెంగ‌తో అన్నం కూడా స‌యించ‌డం లేదుట‌. ఇంత‌కీ ర‌మ ఏందుకు వ‌చ్చింది పిన్నీ. వీళ్ళాయ‌న దాన్ని విడిచి క్ష‌ణం ఉండడం క‌దా అని అడిగాను. మ‌న పిల్ల‌ల‌యితే మాత్రం చెప్పుకోడానికి సిగ్గుగా ఉందికాన ఇది రాకాసి క‌దే. ఆపిల్లాడ్ని కాల్చుకు తింటుంటే ఎన్నాళ్ళ‌ని, ప్రేమ‌లుంటాయే ర‌మ్మ‌ని ఉత్త‌ర‌మ్ముక్క కూడా రాయ‌లేదు అంది. అత‌ను వెళ్ళ‌మ‌న్నాడా ఇదే వ‌చ్చిసిందా ఇదే వచ్చేసింది.  క‌ల‌ర్ టి.వి. కొన‌మ‌ని గొడ‌వ‌చేసింద‌ట‌. బ్లాక్ ఎండ్ వైట్ ఉంది క‌దా స‌రి పెట్టుకుందాం అన్నాట్ట‌. వెధ‌వ నిక్కి పోర్ట‌బుల్  ఎవ‌డిక్కావాలి ఆ డాక్ట‌ర్ గారికి ఉందే చూడండి సోనీ అదికావాలి అందిట‌. ఫారెన్‌దా నాజీవిత‌మంతా చాకిరీ చేసినా అది నేను కొన‌గ‌లిగిన వ‌స్తువుకాదు అన్నాట్ట అత‌ను. ఇంత‌కీ వీళ్ళ బావ ఆ వూళ్ళో కాంప్‌కి వ‌స్తుంటే అక్క కూడా వ‌స్తాన‌ని రాసింద‌ట‌. అక్క గారి ముందు త‌క్కువ‌గా క‌న్పించ‌కూడ‌దుట‌. టి.వితో స‌రిపెట్టలేదు. సోఫాసెట్ కూడా కావాలంది. అక్క పిల్ల‌లు ఈ తుప్పుప‌ట్టిన ఫోల్డింగ్ చెయిర్స్ చూసి న‌వ్వుతారు. ఊళ్ళో ఉన్న పెద్ద మ‌నుషులు బావ‌కోసం త‌మ యింటికి వ‌స్తే కూర్చోబెట్ట‌టానికి సోఫాకావాలి అందిట‌. మీ అక్క‌య్య వ‌చ్చి నాల్గురోజులుంటానంటే ఇంత ఆర్భాట‌మా ?  మ‌న‌కున్న దాంతో మ‌ర్యాద‌గా చూసి పంపిద్దాం అంటే ర‌మ విన‌కుండా వాళ్ళ‌ది ఎంత పెద్ద బంగ‌ళానో చూశారుగా వీళ్ళ‌కుక్క‌కి కూడా ఒక సోఫా వుంది. కార్లు కాక‌ర్లు వాళ్ళు ఇలాటి కొంప‌లో కూర్చునేందుకు కూడా స‌రిగా లేక‌పోతే ఎలా ! అస‌లు వాళ్ళిక్క‌డ  దిగుతారో గెస్ట్‌హౌస్‌లో దిగుతారో ?  ఎక్క‌డ దిగినా ఉండ‌డం ఇక్క‌డే ఉంటారు. ఏమైనాస‌రే క‌ల‌ర్ టి.వి. సోఫాసెట్ కొనాల్సిందే న‌నేస‌రికి మూర్తి ఆలోచించాడు. టి.వి. ప‌దివేలు సోఫా మూడువేలు పైకర్చు రెండువేలు మొత్తం ప‌దిహేను వేలు. ఎలా ?  ఎక్క‌డ్నించి తేవ‌డం అని మ‌ధ‌న ప‌డిపోయాడు.

కొన‌క‌పోతే వాళ్ళ‌క్క‌య్య ముందు త‌ల ఎత్తుకోలేన‌ని ర‌మ‌గోల చేస్తోంది. ఇల్లు పీకిపందిరేస్తుంది. సాయంత్రానికి క‌ల‌ర్ టి.వి. సోఫాసెట్ ఇంటికొచ్చాయి. వాటిని చూసి ర‌మ ఏనుగెక్కినంత సంబ‌ర‌ప‌డిపోయింది. ఎంత‌కి కొన్నారు ఏ షాపులో కొన్నారు అందేగాని ఇంత‌డ‌బ్బు ఎక్క‌డ్నుంచి వ‌చ్చింది ఎలా తిప్ప‌లు ప‌డ్డారు అని ఆడ‌గ‌లేదు. మూర్తి మౌనంగా వెళ్ళిపోయాడు.

అతిధులు వ‌చ్చారు స‌ర‌దాగా నాల్గురోజులు గడిపి వెళ్ళిపోయారు. ర‌మ‌స్నానం చేసి వ‌చ్చేస‌రికి ముందుగ‌దిలో సోఫాలేదు. మ‌ధ్య‌గ‌దిలో టి.వి లేదు. వీధిలోకి చూసింది. టి.వి , సోఫా రెక్క‌లొచ్చి ఎగిరి పోతున్నాయే. అదేమిటి ?  ఎందుకు ?  ఎక్కడికి ?  అని ర‌మ పూర్తిగా మాట్లాడ లేక‌పోయింది. అవి ఎక్క‌డ్నుంచి వ‌చ్చాయో అక్క‌డికే వెడ్తున్నాయి అన్నాడు మూర్తి. అంటే ?  అంటేనా అవి మా ఫ్రెండ్‌వి ముష్టెత్తి నాల్గురోజులుంచుకుంటాన‌ని తెచ్చాను. ముష్టెత్తితే మ‌న‌కే ఉంటాయిగా అంది. ఏడ్చింది రాగాలు పెట్టింది. ఇంతోటు దానికి పెళ్ళెందుకు చేసుకోడం అంది. అస‌మ‌ర్థుడంది ద‌రిద్రుడంది నానా మాట‌లూ తిట్లో తిట్టి లేచిచ‌క్కా వ‌చ్చింది. అయ్యో టి.వి. కోసం సంసారం పాడు చేసుకుందా ర‌మ అన్నాను. అత‌గాడు వ‌చ్చి బ‌తిమాలి తీసుకువెళ్తాడ‌నుకుంది. అత‌ని ఆపేక్ష‌ని గ‌య్యాళిత‌నంతో కాల‌రాస‌కుంది పిచ్చిది. ఎవ‌రు చెప్పినా విన‌దు.

మరి ఉమ సంత‌గేమిటి ?  ఏం చెప్ప‌నమ్మాయ్ ఎంత చెట్టుకు అంత‌గాలి అన్న‌ట్లు దీనికి ఫారిన్ వెళ్ళాల‌నే పిచ్చ !  సింగ‌పూర్ వెడ‌దాం హంగ్‌కాంగ్ వెడ‌దాం అంటుందిట‌. కౌలాలంపూర్‌లో అది కొందాం జంషెడ్‌పూర్‌లో ఇది కొందాం అంటుందిట‌. జంషెడ్ పూర్ ఇండియాలోనే ఉంది పిన్నీ ఏదోలే విసుగుద‌ల‌తో ఒక‌టికొక‌టి అన్నాను. దీనికి త‌గ్గ‌ట్టే అల్లుణ్ణి అక్క‌డ సంవ‌త్స‌రం ఏదో స్ట‌డీ చెయ్య‌డానికి ర‌మ్మ‌నారుట అమెరికాకు ?  ఊ అమెరికాకి త‌ను కూడా వ‌స్తానంటుందిట‌. సంవ‌త్స‌రం నువ్వు అక్క‌డ ఉండ కూడ‌దంటే ఊరికే స్టేట్స్ చూసేసి తిరిగి వ‌స్తానందిట ఆమ్మో ముప్పై న‌ల‌భైవేలవుతాయి అన్నాట్ట‌. న‌ల‌భై వేల‌కే అంత బాధ‌ప‌డి పోతారేమిటి అంటే నాద‌గ్గ‌ర అంత‌డ‌బ్బు ఎక్క‌డుంది అని అత‌ని వాద‌న ఇది విన్పించుకోలేదు. క‌లెక్ట‌ర‌యినా గ‌వ‌ర్న‌ర‌యినా నెలాఖ‌రు వచ్చేస‌రికి జేబులుఖాళీ అయిపోతాయి ఇక వేల‌కి వేలు నిల‌వ‌చెయ్య‌డం ఎలా అంటే గ‌య్యిమందిట‌. ఇద్ద‌రూ మాటామాటా అనుకున్నారు. పిల్ల‌ల్ని అక్క‌డే వ‌దిలేసి వ‌చ్చింది. పిల్ల‌ల‌కి చదువుపోతుందని అత‌ను విదేశాల‌కి వెళ్ళ‌డం కాన్సిల్ చేసుకున్నాడు.

ఉమ ఎంత తెలివి త‌క్కువ‌స‌ని చేసింది. అత‌నికి బంగారంలాంటి ఛాన్స్ పోగొట్టింది. అత‌ను వెడితే త‌రువాత మెల్ల‌గా తీసుకువెళ్ళేవాడేమో.

ఇక్క‌డే పుట్టి పెరిగినా ద‌ర్జాగా బంగ‌ళాల్లో తిర‌గ‌డం అల‌వాట‌య్యాక ఇది ద‌రిద్ర‌పు కొంప‌గా ఉందిట‌. చీటిమాటికీ ఒక‌టే విసుగు. ఎందుకొచ్చిన బాధ వెళ్ళిపోదామ‌నుకుంటే నా వ్యూచ‌ర్ పాడుచేసి న‌న్ను కాద‌ని పోయావుగా అక్క‌డే ఉండు రావ‌ద్ద‌ని అత‌ను ! ఈ మొండిఘ‌టాల‌తో ఎలా వేగాలో ఏమిటో అని ఆ త‌ల్లిబాధ ! ఆవిడ చాద‌స్తం గాని ఇప్పుడు వీళ్ళ‌కి చెప్పాల్సింది లేదు. పిల‌వ‌క‌పోయినా వెళ్ళెందుకు సిద్ధంగానే ఉన్నారు. కాని భ‌ర్త‌లే వీళ్ళ ప్ర‌వ‌ర్త‌న‌ల‌తో విసిగిపోయి ప్రేమ‌ను మ‌మ‌కారాన్నీ కూడా అణ‌చి వేసుకుంటున్నారు. ఉమ పిల్ల‌ల‌కోసం ఇప్పుడు ప‌డే తాప‌త్ర‌య‌మే వచ్చేముందు ఒక్క క్ష‌ణం ఆలోచించాల్సింది.

ఉమా ర‌మాల్లాంటి వారే చిన్న చిన్న వాటికోసం సంసారాల‌ని పాడుచేసుకున్న వారున్నారు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటే ఇలాంటి చికాకులు వ‌చ్చేవి కావు. వాళ్ళ‌ను చూసి వీళ్ళూ వీళ్ళ‌ని చూసి వాళ్ళూ పులిని చూసి వాత‌లు పెట్టుకున్న న‌క్క‌ల్లాగా ప్ర‌వ‌ర్తించి అర్థంలేని ఆడంబ‌రాల‌కూ అత్యాశ‌ల‌కూ పోయి ఉన్న‌దాన్ని కూడా పోగొట్టుకోబోతున్నారు. ఈ కోరిక కోరాం అది అవ‌స‌ర‌మా అని ఆలోచించాలి. ఆడంబ‌రాల వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమైనా ఉందా అని గ‌మ‌నించి తెల్సుకోవాలి. మ‌న ఎదుట ఆహా ఓహో అన్న వాళ్ళే మ‌న వెనుక నిష్కార‌ణంగా ఈస‌డిస్తారు. ఇది లేక‌పోతే మ‌న‌కు గ‌డ‌వ‌దు జీవితం దుష్క‌రం అవుతుంది అనిపిస్తే అది అవ‌స‌రం, దీన్ని కొన్నా మ‌న జీవ‌క‌కు ఇబ్బంది లేదు అని అనుకొన్న‌ప్పుడే ఆ వ‌స్తువును కొనాలి. అంతేగాని బ‌య‌టి వారిచేత భేష్ అనిపించుకోవాల‌నుకుంటే ఒక‌ప్పుడు బేర్ మనాల్సి వ‌స్తుంది. అవ‌స‌రానికి ఆడంబ‌రానికి గ‌ల తేడాను దృష్టిలో వుంచుకుని మార్కెట్‌కి వెళ్ళండి.