24
 

ప్ర‌జాప్ర‌భుత్వం  -  మ‌న క‌ర్త‌వ్యం

ప్ర‌జా ప్ర‌భుత్వం సంభ‌వించే బాగోగుల‌కు ప్ర‌జ‌ల‌దే బాధ్య‌త స‌రేలే ఇలాంటి మాట‌ల్ని సిద్దాంతాలంటారు. పుస్త‌కాల్లో రాసుకోటానికే ప‌నికొస్తాయి గానీ ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌టానికి ప‌దిశాతం కూడా ప‌నికిరావు. న‌న్ను మాట్లాడ‌నీకుండా మా మిత్ర‌లు అడ్డం కొట్టింది. మ‌న‌దేశాన్ని మ‌న‌మే ప‌రిపాలించుకుంటున్నాం క‌దే ?   ఆ ! స‌రేలే ?  ఓటు వేసే వ‌ర‌కే మ‌న బాధ్య‌త ఆ త‌రువాత మ‌న మొహం వాళ్ళు చూడ‌రు. వాళ్ళేం చేస్తున్నారో మ‌నం ప‌ట్టించుకోం ! స‌రోజా నీలాంటి వాళ్ళుండ బ‌ట్టే మ‌నం ఇంత అధ్వాన్నంగా ఉన్నాం . పేరుకి మ‌న‌ది ఎంతో పురాత‌న నాగ‌రిక‌త గ‌ల దేశం ! కానీ మొన్న‌మొన్న క‌ళ్ళు తెరిచిన దేశాలు ఎంతో ఎదిగిపోయాయి. ఆర్థికంగా వైజ్ఞానికంగా విద్య‌విష‌యికంగా ఎంతో అభివృద్ధి సాధించి ఆద‌ర్శ‌వంతంగా ఉంటుంటే మ‌నం మా వేదాల్లో అన్నీ వున్నాయి ! విమానాలున్నాయి టి.వి. లున్నాయి. అంటూ మ‌న‌ల్ని మ‌నం జోకొట్టుకున్నాం. అయితే ఎంచెయ్యాలంటావే ?  స‌రోజ ప్ర‌శ్న‌కి ఏం స‌మాధానం చెప్పాలా అని ఆలోచిస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. బిల‌బిల‌మంటూ ఓ ప‌దిమంది స్త్రీలు  లోప‌లికి వ‌చ్చారు. నవ్వు మోహంతో, వీళ్ళెవ‌రు ?  మ‌న చుట్టూ స్నేహితులూ కాదే అని ఆశ్చర్య‌పోలేదు. ఎందుకంటే వాళ్ళు అతి విన‌యంగా న‌మ‌స్క‌రిస్తున్నారు. ఇదేదో ఎల‌క్ష‌న్ గోల‌లేవ‌వే అంది మా ఫ్రెండ్‌. నా చెవులు కొరుకుతూ వాళ్ళ‌మాట‌లు జాగ్ర‌త్త‌గా విన్నా అందులో ఒకావిడ భ‌ర్త ఎస్సెంబ్లీ సీటుకోసం పోటీ చేస్తున్నాట్ట‌. గ‌త‌మూడుసార్లుగా ఆ స్థానం ఆయ‌న‌దేన‌ట ! ఈ సారి కూడా గెలిపించండి అని ఆవిడ విన్న‌పం !  ఈసారి మీరు నిల‌బ‌డ‌క పోయారూ ?  అంది మా స‌రోజ ! నాకా ! నాకెవ‌రు వేస్తారండీ  ఓటు ?  ఇంకా అక్క‌డ ఉంటే ఏం ప్ర‌శ్న‌లు వేస్తారో అని గ‌బ‌గ‌బా వెళ్ళిపోయారు. ఈవిడ మొగుడు దేశాన్ని ఉద్ధ‌రించేస్తున్నాడ‌ని అంద‌రూ మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఎన్నుకుంటున్నారుట !  ఆపాటి  ఈవిడ చెయ్య‌లేదుట ?  అని స‌రోజ న‌వ్వింది. స‌రూ నిజంగా ఈవిడ‌న‌ల‌బ‌డితే ఆవిడ మొగుడు కూడా ఓటు వెయ్య‌డే అన్నాను. ఏం ఎందుచేత ?

ఆడ‌ది అనే చుల‌క‌న భావం మ‌గ‌వారిలో ఉందాలేదా అన్న‌ది నేను చ‌ర్చించను గాని ఆడ‌వాళ్ళల్లో నుంచి మాత్రం తొల‌గిపోలేద‌నే నాభావం. ఏంటే నీ పిచ్చిక‌బుర్లు ఆడ‌వాళ్ళు మాత్రం రాజ‌కీయాల్లో లేరా అంది స‌రోజ‌. అయితే ఎంత‌మంది ఆడ‌వాళ్ళు ఓటుహ‌క్కు గ‌ల‌వారు ఉన్నారు?  ఎస్సెంబ్లీల‌కిగాని పార్ల‌మెంటులకిగాని ఎన్ని సీట్లు ఉన్నాయి ?  ఎంత‌మంది స్త్రీలు పోటీ చేస్తున్నారు ?  నామాట విని వెంట‌నే పేప‌ర్లు తీసి తిర‌గేసింది. ఎంతో సేప‌టికి త‌న‌కి కావ‌ల్సిన మేట‌ర్ దొరికింది. స‌రోజ‌లో ఏదో ఆవేశం పెల్లుబికింది. కేర‌ళ‌లో రెండు వంద‌ల పంతొమ్మిది సీట్ల‌కి ఆడ‌వాళ్ళు ఎనిమిది మందా ?  బీహార్లో ఇదివ‌ర‌కు ప‌ద‌హారుమంది స్త్రీలుంటే ఇప్ప‌డింకా ఆ సంఖ్య త‌గ్గిపోయిందా ?  ఒరిస్సాలో నాలుగు త‌మిళ‌నాడులో ఎనిమ‌ది...ఇంక ఈ అంకెల సంగ‌తి అలావుంచు.... ఇలా ఎందుకు జ‌రుగుతోందో ఆలోచించు అన్నాను. అవునే వాళ్ళు మ‌నికి సీట్లు ఇవ్వ‌డం లేదా ?  మ ఆడ‌వాళ్ళే పోటీ చెయ్య‌డానికి ముందుకు రావ‌డం లేదా ?  ఈ రెండు కార‌ణాలేగాక మ‌న‌లో రాజకీయ చైత‌న్యం కొర‌వ‌డిందే అన్నాను. స‌రోజ నిజ‌మేన‌న్న‌ట్లు చూసి అంది. అంతెందుకే చెప్పుకుంటే సిగ్గుచేటు మావారికి నేను పొద్దున్నే పేప‌ర్ చూస్తే వ‌ళ్ళుమండిపోతుందే. ఏమిటి పెద్ద వార్త‌లంటే అంత ఇంట్ర‌స్టు దేశాన్ని ఉద్ద‌రిస్తావా !  ఎందుకు నీకా ఆస‌క్తి అని త‌ల‌వాచేలా చివాట్లు పెడ‌తారే !  అస‌లే పొద్దున్నే పిల్లల్ని స్కూలుకి త‌యారు చెయ్య‌డం వంట టిఫ‌ను స్నానాలు ఇన్ని ప‌నులు ఉంటాయా ?  ఇంక పేప‌రు చ‌దువుతూ ద‌ర్జాగా కూర్చోడానికి టైముండ‌దుగ‌దా ఏదో హెడ్డింగ్స్ చూద్దామ‌ని ఇలా ప‌ట్టుకుంటానో లేదో తిట్లు మొద‌లు పెడ‌తారు స‌రోజ‌ని ఓదార్చాను. ఇంకా కొంద‌రు ప్ర‌బుద్ధులు ఉంటారు మ‌గ‌వాళ్ళు మాట్లాడుకోంటే ఆడ‌వాళ్ళు. ఆ మాట‌ల్లో జోక్యం క‌ల్గించుకోకూడ‌దు. నువ్వు లోప‌లికి న‌డు  అంటారు. ఆడ‌దాని స్థానం ఇంట్లోనే అన్న‌ట్లుగా ఇంట గెలిచి ర‌చ్చ‌గెలు అనే సామ‌త ఆడ‌వాళ్ళ‌కే బాగా అన్వ‌యించుకోవాలి సరూ ఇప్పుడు రాజ‌కీయాలు చాలా క‌లుషితం అయి పోయాయి. గూండాల‌కూ రౌడీల‌కూ ఆల‌వాల‌మ‌యిపోతోంది అలాంటి చోట్ల సుకుమారుల‌యిన స్త్రీలు రాణించాలంటే చాలా క‌ష్టం ! అలా అని మ‌నం ఊరుకోకూడ‌దు. జ‌నాభాలో స‌గం స్త్రీలు ఉన్న‌పుడు దేశ భ‌విష‌త్తు తీర్చిదిద్దే అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌లో స్త్రీలు కూడా పాలు పంచుకోవాలి !  ఇంతే కాదు. పురుషుల‌క‌న్నా స్త్రీలు శాంతిప్రియులు !  సౌమ్యులు, ధ‌ర్మాచ‌ర‌ణ ప్రియ‌లు. పాపభీర‌వులు ! పుణ్య‌కాములు ఇందువ‌ల్ల కూడా మ‌న‌కి ప్రాతినిధ్యం ఎక్కువ వుంటే దేశం మ‌రింత బాగుప‌డుతుంద‌నే ఆశ నాకు క‌లుగుతూ ఉంటుంది. అంతెందుకు ఆక్వినో, థాచ‌ర్ ఇందిరా గాంధీ  వీరంతా దేశాన్ని ఏల‌గ‌ల‌మ‌ని నిరూపించారు అవ‌కాశం వ‌స్తే ఎవ‌రైనా ఆ స్థాయికి ఎద‌గ గ‌ల‌రు దేశంలో ఇన్ని పార్టీలున్నాయి.  అన్నింటికీ మ‌హిళా విభాగాలున్నాయి. సాంస్కృతిక సంఘాలు స్త్రీల స‌మాజిక వ్య‌వ‌స్థ‌లు సాంఘిక సంక్షేమ వ్య‌వ‌స్థ‌లూ ఇన్ని ఉన్నాయి. అయినా రేపు అసెంబ్లీలోనూ పార్ల‌మెంటు లోనూ ఆసీనుల‌య్యే మ‌హిళ‌లు చాలా త‌క్కువ‌. క‌నీసం స్త్రీ జ‌నాభ్యుద‌యానికి పాటుప‌డే సంఘ సేవిక‌ల‌కైనా కొన్ని సీట్లు కేటాయించి ప్ర‌భుత్వంతో చోటు క‌ల్పిస్తే బాగుండేది. నా ఉప‌న్యాసం ముగిసేలోగా స‌రోజ లేచి నుంచుంది. ఇంత‌కీ నువ్వు ఓట‌న్నా వేస్తావాలేదా ?  అన్నాను. ఆ ! నేను వేస్తే ఎంత వెయ్య‌క‌పోతే ఎంత ?  అంది. నీలా అంద‌రూ అనుకుంటే పోటీ చేసేవారు పాపం బాధ‌ప‌తారు.

 

నెక్ట్స్‌టైమ్ నీచేత నామినేష‌న్ వేయిస్తా అంటూ వెళ్ళింది స‌రోజ‌.