51
 

కోటి విద్య‌లూ....!

 

పాలుపోసే అన్న‌పూర్ణ తెల్లావు త‌ప్పిపోయింది. ఎటుపోయిందో ఎవ‌రైనా తోలుకుపోయి శ‌నివారం సంతో అమ్మేసుకున్నారో ?  వెంట‌నే అన్న‌పూర్ణ మిగ‌తా ఆవులసంగ‌తీ, గేదెల‌సంగ‌తీ పాలుపోయాల్సిన ఇళ్ళ‌సంగ‌తీ అన్నీ మ‌ర్చిపోయ రెండూళ్ళ‌క‌త‌లున్న‌గ్రామానికి ప‌డ‌వ‌లో ప్ర‌యాణం చేసి, న‌డిచీ, నానా అవ‌స్థ‌లూ ప‌డి వెళ్ళింది. ఆ ఊళ్ళో ఒక గ‌ణాచారికి నూకాల‌మ్మ దేవ‌త శ‌రీరం మీదకొస్తుందిట ! తిర‌నాళ్ళ‌కొచ్చిన‌ట్లుగా జ‌నం తండోప‌తండాలుగా వ‌స్తారుట ! ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం అక్క‌డ కాల‌వ‌కి వంతెనొక‌టి క‌ట్టి రోడ్డు కూడా వెయ్యాల‌ని ప్ర‌భుత్వంవారు ఆలోచిస్తున్నారు. కాలం క‌ల్సివ‌స్తే ఆ రోడ్డే ముందు ముందు నేష‌న‌ల్ హైవేకాక పోతుందా అనికొంద‌రు రోడ్డు ప‌క్క‌పొలాలు ఇళ్ళ‌స్థ‌లాల‌కీ షాపుల‌కీ ప‌నికివ‌స్తాయ‌నికొని ప‌డేస్తున్నార‌ట !

స‌రే మా అన్న‌పూర్ణ వంతు వ‌చ్చే స‌రికి మూడురోజులు ప‌ట్టింది. ఈ మూడు రోజులూ అది అర‌టిప‌ళ్ళూ, మేక‌పాల‌తో క‌డుపు నింపుకుంది. తొంద‌ర‌లో డ‌బ్బూ ప‌ట్టుకుపోలేదుట ! గ‌ణాచారి ముందుకీ వెన‌క్కి ఊగిందిట హా హు అని గ‌ర్జించిందిట‌. కుంక‌మా, వీభూతీ గుప్పెళ్ళ‌తో తీసి ఉఫ్ అని అన్న‌పూర్ణ‌మీద‌కు ఊదిందిట ! ఇలా అస్తమానం ఊద‌టం ఎవ‌రో అదృష్ట‌వంతుని ద‌గ్గ‌ర త‌ప్ప ! అన్న‌పూర్ణ అదృష్టానికి చుట్టుప‌క్క‌ల‌వారు అసూయ‌పడ్డారు.

మీ ఆవు తెల్లావో న‌ల్లావో ఏదో ఆందిట‌గానీ మొదటి అక్ష‌రం అన్న‌పూర్ణ‌కి విన్పించ‌లేదు. చిత్తం తెల్లావేన‌మ్మా అందిట‌. ఆ దాన్నే  ఓ దొంగ‌స‌న్నాసి విప్పుకుపోయాడు. పొట్టిగా స‌న్నగా వుంటాడు. చ‌ట్టిముక్కుతో వుంటాడు. తూర్పుదెస‌కు తోలుకుపోయాడు. ప్ర‌య‌త్నం చేస్తే దొర‌కుతుంది అంది గ‌ణాచారి. ఆ ఆన‌వాళ్ళ‌న్నీ అన్న‌పూర్ణ మ‌రిదికి స‌రిపోయాయ్‌. అంత‌కుముందే ఆ కొంప‌కీ ఈ కొంప‌కీ మ‌ధ్యన ఉన్న ప‌చ్చ‌గ‌డ్డిఅంతా భ‌గ్గున మాడిపోయింది. దీంతో మ‌రికొంత‌కావేషాలు పెరిగిపోయి దొమ్మి యుద్ధంవ‌ర‌కూ వ‌చ్చింది. అన్న‌పూర్ణ మొగుడికి కాలూ, మ‌రిదికి చెయ్యి లేకుండా పోయాక ఆస్ప‌త్రిలో తోటికోడ‌ళ్ళిద్ద‌రూ ఒక‌రినొక‌రు ఓదార్చుకొంటుండ‌గా త‌ప్పి పోయిన ఆవు దానంత‌ట‌దే వ‌చ్చి పాక‌లో ప‌డుకుంది.
అన్న‌పూర్ణ సంగ‌తి స‌రే. చ‌దువూ సంధ్యా లేనిది. కానీ ఎమ్‌.ఎ.పి.హెచ్‌డీ చ‌దివి ప్రొఫెస‌ర్‌గా ఉద్యోగం వెల‌గ‌బెడ్తూ హేతువాదాన్ని గురించి మూఢ‌భ‌క్తిని గురించి చెరిగిపోసే మా ఫ్రండ్‌కూడా ఈ మ‌ధ్య ర‌హ‌స్యంగా చోటుకివెళ్ళి వ‌చ్చింది. అక్క‌డొక ఆంజ‌నేయ ఉపాస‌కుడున్నాడ‌ట ! ఏ ప్ర‌శ్న‌కైనా ఆయ‌న జ‌వాబు చెప్తాడుట ! త‌న నోటితో చెప్ప‌డు. చేతిలో కాటుక పూసుకుంటే ఆ కాటుక‌లో స‌మాధానం సినిమా రీలులా క‌న్పిస్తుంది. ఒక చిన్న పిల్ల‌వాడో, పిల్లో అదిచూసి చెప్తారుట‌. మా ప్రొఫెస‌ర్‌కి పెళ్ళికాని చెల్లెలుంది ఇక రెండు మూడుళ్ళుపోతే న‌ల‌భ‌య్యో బ‌డిలో ప‌డ్తుంది. అందుకు వాళ్ళ వాళ్ళంతా ఆత్ర‌త ప‌డిపోతున్నారు. ఎప్పుడు పెళ్ళి అవుతుందో ప్ర‌శ్న ఆడ‌గడానికి వెళ్ళింది. సంగ‌తి ర‌హ‌స్యంగా వుంచాలి. లేక‌పోతే స్టూడెంట్స్ తాటాకులు క‌ట్ట‌రూ ?

ఆ అంజ‌నంలో గ‌ళ్ళ‌చొక్కా తొడుక్కున్న మీసాల‌వాడు క‌న్పించాట్ట‌. ఈ మ‌ధ్య మీసాల‌వాడెవ‌రైనా త‌ట‌స్థిస్తే ఆత్రంగా వివ‌రాల‌డుగుతోంది మాఫ్రండ్‌.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది మ‌హాఋషులు ఎన్నో సంవ‌త్స‌రాలు ఎండ‌న‌కా, వాన‌న‌కా కొండ గుహ‌ల్లోనూ అర‌ణ్యాల్లోనూ త‌ప‌స్సులు చేసినా ప్ర‌త్య‌క్షం కానిదేవుడు ఓ గ‌ణాచారికో, ఓ పెద్ద‌బొట్టు పూజారికో శ‌రీరం మీద‌కి వ‌చ్చి వాలి ఎవ‌రి ప‌శువు త‌ప్పి పోయిందో, ఎవ‌రికి పిల్లలెప్పుడు పుడ‌తారో, ఎవ‌రి పెళ్ళి ఎప్పుడౌతుందో, ఎవ‌రి జ‌బ్బు కుద‌ర్చ‌బానికి విభూతి ఇయ్యాలా ?  కుంకుమ ఇయ్యాలా ?  అనో ఆత్రంగా ఎదురుచూస్తూ కూర్చుంటాడా ?  అని ఒక్క‌క్ష‌ణం ఆలోచిస్తే ఇంట్లోనే స్థిమితంగా కూర్చుని స‌మ‌స్య‌కు స‌రైన ప‌రిష్కార‌మేమిటో తెలుసుకోగ‌ల్గుతారు. చేయ‌వ‌ల్సిన ప‌నేమిటో బుర్ర‌కు త‌ట్టించుకో గ‌ల్గుతారు. ఇలా ప్ర‌శ్న‌లూ శ‌కునాలూ మేము న‌మ్మ‌మంటే వింత‌గా చూడ‌క్క‌ర్లేదు.

ఈ న‌మ్మ‌కాలు ర‌క‌ర‌కాలుగా ఉంటాయి. కాకాహోట‌ల్ ద‌గ్గ‌ర్నుండి త్రీస్టార్ సెవెన్ స్టార్ హోట‌ల్స్ వ‌ర‌కూ అంత‌కుమించిన ల‌క్జూరియ‌స్ హోట‌ల్స్ వ‌ర‌కూ ఉన్న‌ట్లుగా ఈ ప్ర‌శ్న‌లు చెప్పేవాళ్ళ స్థాయికూడా అంచెలంచెలుగా వుంటుంది.

చేట‌లో పావుకిలో బియ్యం పోయించుకుని సోదిచెప్తుంది ఒక అమ్మి. కొండ‌దొర కోర‌మీసాల‌తో ఎర్ర త‌ల‌పాగాతో బీక‌రంగా కొండ‌దేవ‌త‌ల‌ను పిలిచి మ‌న‌ల‌ను భ‌య‌ప‌ర‌చి మ‌న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను మ‌న‌మొహాలోనే చ‌దివి మ‌న‌కే చెబుతాడు. వీళ్ళ‌కి ఫేస్‌రీడింగ్ ధాట్‌రీడింగ్ వంటి మ‌నస్త‌త్వ‌శాస్త్రం బాగా తెలుసు. అంత‌కుముందే చుట్టుప‌క్క‌ల యిళ్ళ‌ల్లో ఎంతోమంది పిల్ల‌లో ముఖ్య విష‌యాలేమిటో రీసెంట్‌గా పెళ్ళిళ్లుగానీ మ‌ర‌ణాలుగానీ సంభ‌వించాయో ? వంటి విషయాల‌ను వాళ్ళ తాలూకు వాళ్ళ‌నిపంపి వాక‌బు చేయిస్తాడు. వాళ్ళ పిల్ల‌ల‌కికూడా మంచి ట్రైనింగ్ అది, మ‌న విష‌యాల‌ని మ‌న‌కే చెబ్తుంటే నోరు తెరుచుకుని వింటాం !

ఇక జాత‌క‌రత్న‌, దైవ‌జ్ఞ శిరోమ‌ణి మొద‌లైన భ‌విష్య‌త్ ప్ర‌వ‌క్త‌లు మ‌న‌ల్ని సంస్కృతంలో బోల్తా కొట్టిస్తారు. గురుడు ఇంటిని శుక్రుడు చూస్తున్నాడు. ర‌విలోకి రాహువు వ‌క్రంగా చూస్తున్నాడు. అంటూ ఏవేవో శ్లోకాలు చ‌దివి హ‌డలు కొడ‌తాడు. ఇక ప‌త్రిక‌వ‌స్తే చాలామంది ముందు చూసేది వార‌ఫలాలూ, దిన‌ఫలాలూ మాస‌ఫ‌లాలును ఓ ప్ర‌ఖ్యాత మాస‌ప‌త్రిక‌లో ఒకనెల మ‌క‌ర‌రాసి వారికి మాన‌భంగం అయ్యే ప్ర‌మాదం ఉంది. అని వ్రాశాడో దైవ‌జ్ఞుడు అది అయిపోయాక చూశాడు మా స్నేహితురాలి మొగుడు. దానికి మ‌క‌రరాసి. నీక మాన‌భంగం కాలేద‌ని న‌మ్మేదెలాగ అని అనుమానంగా చూసే మొగుడి చూపుల‌కు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నిపించింది దానికి. అదైవ‌జ్ఞుడి మీద మూడు ల‌క్ష‌ల‌కు దావా వేయ‌మ‌న్నాను. కోర్టు రూల్స్ తెలీవ‌నుకోండి అది వేరే విష‌యం.

ఇంకోర‌కం బడాబ‌డా వేరే వాళ్ళుంటారు. వాళ్ళు మంత్రుల‌కి, సామంతుల‌కి త‌ప్ప భ‌విష్య‌త్తును చెప్ప‌రు. ఒక నాయ‌కుడి బ‌ల‌హీన‌త‌ను ఇంకొక నాయ‌కుడికిచెప్పి అనేక ప‌లుకుబ‌ళ్ళ‌నూ, ఇళ్ళ‌నూ పెంచుకొంటారు. ఇది మ‌రో ప్ర‌మాదం. ఏ పోష్‌హోట‌ల్లోనో దిగుతారు. మూడు రోజుల ముందు పేరు న‌మోదు చేయించుకోవాలి. దేవ‌ర‌వారు చిత్త‌మొచ్చిన‌ప్పుడు ఇంట‌ర్వ్యూ ఇస్తారు. అంత‌వ‌ర‌కూ ప‌డిగాపులు ప‌డ‌క త‌ప్ప‌దుమ‌రి. భ‌విష్య‌త్తు తెలుసుకోవాలంటే మాటల‌తోప‌నా ?  ఆయ‌నో ఆవిడో మ‌నం అడిగిన ప్ర‌శ్న‌కు, అవున‌నో, కాద‌నో, ఏదో ఒక‌టి చెప్తారు. ప్ర‌తిప్ర‌శ్న‌కూ ఎస్సో నో నో ఏదో ఎబ‌టి ఉండ‌క త‌ప్ప‌దుక‌దా ! ఖ‌ర్మంజాల‌క నిజ‌మైతే అవ‌నూవ‌చ్చు. కాక పోతే కాక‌పోనూవ‌చ్చు. చిక్కాడురా మిడ‌తంబొట్లు అన్న‌ట్లుగా అన్న‌ట్లు ప్ర‌శ్న‌కు వందో అయిదొంద‌లో ఫీజు ఉంటుంది. జ్యోతిష‌శాస్త్రం వేరు. ఆర్థిక శాస్త్ర వేరు. శాస్త్రాన్ని అమ్ముకోడంలో ఎన్నో మోసాలూ కోటివిద్య‌లూ కూటికోస‌మేన‌న్న‌ట్లుగా క‌డుపు నింపుకోడానికికో ఆస‌రా ! కాక‌పోతే సోదిమ‌నిషి త‌న‌కూ, పిల్ల‌ల‌కూ ఓ పూట అన్నం పెట్టుకోగ‌ల్గితే హోట‌ల్స్‌లో మ‌కాం చెయ్య‌గ‌లిగే పెద్ద‌లు ఇళ్లు, వాకిళ్లూ బ్యాంక్ బ్యాలెన్స్‌లూ ఫారెన్ కారులూ పెంచుకోగ‌లుగుతారు. ఇదీ తేడా !

 ఇలాటి మోసాల్లో ప‌డ‌నివాళ్ళు వీళ్ళ‌ని న‌మ్మ‌నివాళ్ళు నాస్తికులుకారు. భ‌క్తి వేరూ, ఇదివేరూను. మన భ‌విష్య‌త్తు మ‌న‌క‌న్న ఇంకొళ్ళ‌కి ఎక్కువ తెలుస్తుంద‌నుకోడం తెలివిత‌క్కువ ! మ‌న శ‌క్తి సామార్థ్యాలేమిటో కొంచెం లోతుగాపోయి నిస్ఫ‌క్ష‌పాతంగా ఆలోచిస్తే తెలుసుకోలేక‌పోం. ఎవ‌రేది చెబితే అది చేయాల‌నిపిస్తుంది క్లిష్ట‌ప‌రిస్థితుల్లో. అప్పుడే కొంచెం వివేకం అవ‌స‌రం. గాలిప‌టానికి కొట్టుకుపోయేంత బ‌ల‌హీనులం కారాదు.