మంగళ సూత్రం
మంగళ సూత్రమ్ము నెంతమంది నమ్మినదో అని పోతన్నగారు సర్వమంగళమైన పార్వతీదేవి ధైర్యాన్ని గురించి ఆశ్చర్యపోయారు. ఎంత ధైర్యం లేకపోతే భర్త విషం పుచ్చుకునేందుకు అంగీకరిస్తుంది.
ఈనాటి మహిళలు ఆ సర్వమంగళ కన్నా మరింత ధైర్యస్తులే. ఎందుకంటే ఎన్నో వేలు, లక్షలు ఖర్చుపెట్టి పిల్లమెళ్ళో మూడు ముళ్ళు పడితే చాలని ఏ గంతకు తగ్గ బొంతనో తెచ్చి ఆ పెళ్ళి తంతుకాస్తా జరిపిస్తే, పదహారురోజుల పండగన్నా అవక ముందే ఆ మంగళ సూత్రాన్ని గూట్లో పడేస్తున్నారు. కొంతమందికి రాత్రిళ్ళు మెళ్ళో సూత్రాలు ఉంటే గుచ్చుకుంటూ చికాకుగా ఉంటుందట. ఏడు మల్లెల ఎత్తుసుకుమారులు కదా ! మరి అందుకని సూత్రం గొలుసు తీసి దిండుకింద పెట్టేసి మర్నాడు ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు మెళ్ళో వేసుకుంటారు. ఇలాంటి ఒక ఇల్లాలి అలవాటుకు గమనించిన పనిమనిషి ఇల్లు ఊడుస్తూ దిండుకిందనించి గొలుసు తీసుకుని బొడ్లోపెట్టుకుని పట్టుకుచక్కాపోయిందట. ఆ ఇల్లాలికి రెండు రోజులకి గాని తన మంగళ సూత్రాలు పోయాయిని తెలియనేలేదు.
ముక్కోపి అయిన ముకుందరావు ? వొళ్ళు మండి నేను కట్టిన తాళిమీదే గౌరవం లేకపోతే ఇంక నామీద ఏం ఏడుస్తుంది అన్నాడట. ఇప్పుడు ఏడవకుండా ఉంటుందని మీరనుకుంటున్నారా ! మగవాళ్ళు తాళికడితే ఈ ఆడవాళ్ళు తలవంచి కట్టించుకోడమా నాస్సెన్స్ అందట ముకుందం భార్య విరజాక్షి. ఆమె గొప్ప స్వతంత్ర భావాలు కల నారీమణి లెండి ! దాంతో ఇద్దరికీ మాటలు పెరిగాయి. సూత్రం గొలుసుతీసి మొగుడి మొహాన్నే పారేసింది అయ్యొయ్యో ఆశుభం, అమంగళం అని ఎంతమొత్తుకున్నా అత్తగారి మాటలెక్క చెయ్యకపోతే విరజాక్షికి విడాకులిచ్చేశాడు ముకుందం. విరజాక్షి తల్లిదండ్రులను ఆడకత్తెరలో పోకచెక్క గతి పట్టింది. మళ్ళీ పెళ్ళి చెయ్యాలంటే మాటలా ; అసలింకోడు దొరుకుతాడా దొరికితే ఎంత ఖర్చుపెట్టాలో అని దుఃఖంలో కొట్టుకుపోయారు.
సూత్రం అంటే దారంతో పేనినతాడు. ఒక రకమైన దారప్పోగులను దండగా చేసి జంధ్యం అని మగవాళ్ళు వేసికొంటారు. ఈ జంద్యం అన్ని కులాల వాళ్ళూ ధరించరు. కాని మంగళసూత్రం మాత్రం అన్ని వర్ణాల వారికీ ఉంది. ఈ పేనిన దారపు తాడుకి రెండు బంగరు బిళ్ళలను కడతారు. ఒక బిళ్ళ అమ్మవైపు వారు చేయించేది ఒక బిళ్ళ అత్తగారి వైపువారు చేయించేది. ఓపిక ఉన్నంతలో కొందరు చిన్నవీ కొందరు పెద్దవీ చేయించుకుంటారు. కొందరికి ఒక్కొక్క బిళ్ళా ఒక్కొక్క కాసు ఉండాలనే నియమం కూడా ఉంటుంది. ఈ బంగారు బిళ్ళమీద మిరియాలలా గుండ్రని బుడిపెలు కొన్ని వైపుల వారు పెట్టించుకుంటే డిజైన్ల వంటి చిల్లులతో కొన్ని వైపుల వారు ధరిస్తారు. దీనినే శతమానం అని కూడా అంటారు.భార్య దీనిని ధరిస్తే భర్తకు దీర్ఘాయుష్షు అనే నమ్మకం అన్ని వర్ణాలవారికీ ఉంది.
అన్నట్లు మంగళసూత్రం అంటే గుర్తుకొచ్చింది మొన్న భద్రాచల సీతారామ చంద్రుల కళ్యాణోత్సవాన్ని టీవిలో చూస్తున్నప్పుడు మా మరిది ఒకటేనవ్వు. చూడు ఆబొజ్జబ్రాహ్మణుల వారి చేత సీతమ్మ తాళికట్టించుకొంది అని ఛీ ఛీ తప్పు తప్పు కళ్ళుపోతాయి. అలాటి మాటలనకండి అని మా చెల్లాయి చెంపలు తనే వేసుకుందే కాక ఆయనకు కూడా వేసింది. అవును మరి ఆయనంత ఆయన వేసుకోరు ఏం బావను అనివాపోయింది కూడా ! ఆయన ఊరుకున్నాడా . ఊరుకోక ఆ జగజ్జనని మెళ్ళో పూజారులా తాళి కట్టేది ? ఈ వ్యాఖ్యతలేమో ఆహా ఓహో అంటూ ఆ రామచంద్రమూర్తే దిగివచ్చి సీతమ్మ మెళ్ళో తాళి కడుతున్నట్లుగా పద్యాలు చదివేస్తున్నారు అన్నాడు. అతడోహేతువాది. అతనికి నచ్చచెప్పడం మాతరం కాదు. అని ఊర్కొన్నాను. కాని నామనసులోనూ ఏదో చివుక్కుమన్న బాధ.
ఏది ఏమైనా చిన్న మంగళసూత్రాలను ధరించే ఓర్పును అలవరచు కోడమే మంచిది. రాత్రిళ్ళు తీయడం మళ్ళీ వేసుకోడం మహాపాతకం అని చెప్పనుగాని సాంప్రదాయాన్ని పాటించడంలో లభించే ఆనందం గొప్పదని మాత్రం చెప్పగలను. మంగళసూత్రాన్ని పరమపవిత్రంగా భావించడం వరకే గాక వాటిని ధరించిన వారికీ గౌరవాన్నీయడం మనకు మన పెద్దలు నేర్పారు.
బహుశా బంగారం గుండెల దగ్గర శరీరానికి తాకుతూ ఉండడం ఆరోగ్యహేతువేమెనని భావిస్తే మరి ఆ ఆరోగ్యం విధవలైన స్త్రీలకు అక్కర లేదా అనే అనుమానమూ కలగక మానదు.
స్త్రీ కోరే కోరికల్లోకల్లా అతిప్రధానమైనది తాను సుమంగళిగా దీర్ఘకాలం జీవించాలనే పసుపు కుంకుమ పూలు పళ్లు మరింకా అనేక మంగళ ద్రవ్యాలు శుభకార్యాలకు ఉపయోగిస్తారు. అన్నిటికన్న మంగళప్రదమైనది మంగళసూత్రం.
|