మహావిద్య
యావద్భారతమూ వివేకానంద స్వామి పుట్టిన రోజుని జనవరి 12 న ఎంతో ఘనంగా సముచింతగా ఉత్సాహంగా జరుపుతుంది. వ్యాసరచనపోటీలు పాటలు పద్యాలు ఉపన్యాసాలు ఉపదేశాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ! వివేకానంద ఉద్భోధించిన మహా విషయాలనెన్నింటినో మరొక్కమారు మననం చేసుకోడం మనందరి కర్తవ్యం. హిందూ మతానికి జగద్గురువులు శంకరాచార్యులూ , వివేకానందులూ సూర్యచంద్రుల్లాంటి వారు.
జన్మించిన ఉత్తరాదినీ ఆత్మ సాక్షాత్కారంకోసం తపస్సు చేసిన కన్యాకుమారి అగ్రాన్నీ తన వాగమృతధారలతో విదేశాల్నీ ఏకసూత్రంతో బంధించిన మహోన్నతుడూ అయిన వివేకానందుని హృదయం స్త్రీ పట్ల ఎలా స్పందించిందో తెలుసుకోవాల్సిన ఆగత్యం మనకెంతో వుంది ! ఈయన స్త్రీ జనోద్ధరణుడు ఒకే ఒక్క మార్గం వుందని ఘంటాపథంగా చెప్పారు. అదే విద్య. విద్య అనగానే డిగ్రీలనే అర్థం కాదు.హృదయపుటల్లో సంస్కార సూత్రాలను విప్పిచేప్పగలిగే గొప్ప గురువే విద్య అనేది వివేకానందుని విశ్వాసం ! ఈ చదువువల్ల మేధస్సు సునిశితమౌతుంది. మంచిచెడ్డలు తెలుస్తాయి ! విద్య మనిషిని సంపూర్ణత్వానికి చేరువ చేయగలుగుతుంది. మీరు విద్యను నేర్వండి అది మీకు జీవితమంటే ఏమిటొ నేర్పుతుంది. స్త్రీలకి విద్యగరపితే వారి సమస్యలను వారే పరిష్కరించుకుంటారు. మీ సమస్యలనూ పరిష్కరిస్తారు. దేశసమస్యల్ని పరిష్కరిస్తారు. వారి సంగతివారు చూసుకుంటారు, మీ సంగతి చేస్తారు. దేశం సంగతీ చేస్తారు. అంటారు. ఎన్నో శృంఖాలాలను ఖండించగలిగే గొడ్డలి వంటిది చదువు ! ఇంతటి మహా ఆయుధాన్ని స్త్రీలకు మాత్రం ఎందుకు అందిచంకూడదూ కుంటుంబం ఒక పక్షి వంటిది. స్త్రీ పరుషులిద్దరూ రెండు రెక్కలవంటివారు. ఒక రెక్కకి ఎగరడం నేర్పి రెండోరెక్కని ఆశ్రధ్ద చేయడం ఏంభావ్యం ? వివేకానందుడు అనాడు ఆశించినట్లుగా ఈనాడు స్త్రీలు విద్యావంతులౌతూనే ఉన్నారు. ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్టులు అవుతూనే ఉన్నారు. ఈ పురోభివృద్ది అందరికి ముదావహంగానే వుంది ! ఈయన కోరిన విద్య ఇట్టిదేనా ? వివేకానందుడు చేసిన కొన్ని ప్రసంగాలను ఆధారంగా చేసికొని చూస్తే పూర్తిగా ఇదే కాదని తెలియక మానను ! ప్రతి స్త్రీ గార్గి, మైత్రేయి ఆపాలవంటి విదుషీయణులులే కాక పోయినా అందరికీ ఆత్మజ్ఞానం అవసరమే అంటారు. ఆత్మకి స్త్రీత్వం పురుషత్వం అనే విషయభేదం లేదు. పరమాత్మ అనే మహాసముద్రానికి ఈ స్త్రీ పురుషులు ఊర్మికలు !
వివేకానందుడు తన గురుదేవులైన రామకృష్ణపరమహంసల బోధామృతాన్ని కంఠదఘ్నంగా గ్రోలి విశ్వమంతా పంచిపెట్టారు. తన గురుదేవుల ప్రాభవాన్నీ వైశిష్టాన్నీ చాటేలా ఒక మిషన్ స్థాపించాలని అది అన్ని మతాలవారికీ ఆమోద యోగ్యంగా ఉండాలనీ భావించారు. అలాగే గురుపత్ని, తన దివ్యమాత అయిన శారదాదేవి పేరిట స్త్రీ జనోద్దరణకొరకు మరొక స్త్రీలమఠాన్ని స్థాపించాలనీ అనుకున్నారు. గంగకి ఇరువైపులా ఇటు రామకృష్ణమఠం అటు దక్షిణేశ్వరం వద్ద శారదామాయి మఠం నిర్మించాలని ఇక్కడ మహిళల ఆధ్యాత్మికాభివృద్ధికి తగినట్లుగా తీర్చిదిద్ధాలని నిర్ణయించుకున్నారు.
శారదాదేవి సాక్షాజ్జగజననియే అని వివేకానందుల నిశ్చితాభిప్రాయం. రామకృష్ణులు స్వయంగా ఆమెకు షోడశోపచారములతో అర్చన చేశారు. శారదా దేవికి తమతమ భేదాలు లేవు. కులీన స్త్రీని కూలి స్త్రీని సమానంగా ఆదరించగల పెద్దబుద్ధి. ఒకనాడు తమ నివాసానికి సమీపంగా ఉండే ఓ ఇంటిని చూసి జాలిపడింది. అతడు కూలినాలి చేసుకుని జీవించే కష్టజీవి. పెళ్ళి చేసుకోకుండా ఒక స్త్రీని తీసుకువచ్చి కాపురం పెట్టాడు. ఇంతలో ఆ స్త్రీకి జబ్బుచేసింది. అతను కుడి ఎడమ అని లేకుండా ఆమెకు ఎంతో సేవచేశాడు. ఈ సంగతి తెలిసిన వారందరూ వారిద్దరినీ ఈసడించుకున్నారు. కానీ శారదామాయి మాత్రం కరుణతో చూసింది. పైపెచ్చు అతనిసేవా తత్త్వాన్ని మెచ్చుకుంది కూడా.
ఆమె దృష్టిలో సేవకూడా భగవత్స్వరూపమే ! శారదాంబ మంత్రోపదేశం చేసేటప్పుడు కూడా ఎవ్వరి పట్టా భేదభావం ప్రదర్శించేది కాదు. చంద్రుడు వెన్నెలని సర్వేసర్వత్రా ప్రసరింపజేసినట్లే అమ్మ ప్రేమ అందరికీ లభ్యమయ్యేది. ఫలాపేక్షలేని దివ్యప్రేమ. భక్తులను తలలో నాలుకవలె ఎంతో నమ్రతచూపేది. వారంటే ఆమెకు ఆత్మీయత అభిమానం . ఇట్టి నారీరత్నాన్ని దర్శించి సేవించిన వివేకానందునిలో స్త్రీల పట్ల ఎంతో విశ్వాసం చోటుచేసుకోడంలో ఆశ్చర్యం లేదు.
వివేకానందుల కోరిక 1954లో తీరింది. శారదాదేవి పేరుతో శారదారామకృష్ణమఠం దక్షిణేశ్వరం, గంగా తీరంలో సంపూర్ణాకృతి దాల్చింది. బ్రహ్మవిద్యనుకోరే, ఆత్మను తెలుసుకొనే బ్రహ్మచారిణులకిది అపురూపమైనతావు. సరళాదేవిగారు ప్రథమంగా అధ్యక్ష స్థానం అలంకరించారు. దాదాపు నూటయాబైమంది సన్యాసినులు నివసించేందుకు ఇందులో అవకాశం వుంది.
సౌశీల్యాన్ని సంరక్షించుకోటం ఉన్న సుగుణాలను మరింతగా పెంపొందించుకోటం ప్రాణులందరిలో ఉన్న పరమాత్మను పరికిచటం సుఖదుఃఖాలకు చలించక దృఢంగా వుండగలగడం అదే ఈ ఆధ్యాత్మజ్ఞానం వల్ల లభించే గొప్పవరాలు. ఇదే నిజమైన చదువు అని వివేకానందుల నిశ్చితాభిప్రాయం. శారదా దేవి చదివింది ఇట్టి చదువే. రామకృష్ణులు చదివిందీ ఈ చదువే ! గురువును గౌరవంగా చూడడం సాటి వారిని ప్రేమగా చూడటం ఆపదలో ఉన్నవారిని ఆదుకోడం కష్టాల్లో ఉన్న వారిని కనికరంగా చూడడం ఎదుటి వారిలో ఉన్న దోషగుణాలను సహన భావంతో ఓర్చుకోడం సంప్రదాయాన్ని సాటించడం, ఈ విషయాలు క్రమ క్రమంగా ఆధ్యాత్మ విద్యవిధానంలోకి దింపుతాయి ! కడుపునిండే చదువులు కొన్ని అయితే ఆర్తిని చూపేవి ఆధ్యాత్మ విద్యలు. ఇందుచేతే ఇది మహా విద్య కాగలిగింది.
|