నువ్వింత కోపం తెచ్చుకోనక్కర్లేదు. ఆ సభలోని పురజనుల దుఃఖం ఆవంతైనా తగ్గకముందే నా భర్తలు పగతీరుస్తారు వారు యుద్ధ కళలో ఆరితేరిన వారు.
ద్రౌపది మాటలు వినేసరికి సుదేష్ణ ఆమె పరిచారికలు భయపడ్డారు. ద్రౌపదిని అనేక సాంత్వవచనాల ఓదార్చ ప్రయత్నించారు కాని ఆమె దుఃఖాన్నుండి తేరుకోలేదు. భోజనం చేయలేదు. నీళ్లు కూడా త్రాగలేదు. చేసేదేమీ లేక సుదేష్ణ నివ్వెరపోయింది. తక్కిన స్త్రీలు నీచ కీచకుడి చావు వాంఛించారు.
అయ్యా శ కీచకుడెవడు ? ఏ వంశంవాడు ? అని జనమేజయుడు అడిగాడు. వైశంపాయనుడు చెప్పసాగాడు.
క్షత్రియుడివల్ల బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వాణ్ణి సూతుడు అంటారు. ఎక్కువ కులం స్త్రీ కిన్నీ, తక్కువ కులం పురుషుడికిన్నీ కలిగినట్టి ప్రతిలోమ జాతుల్లో అద్విజుడైన సూతుడు క్షత్రియుడికంటే ఇంచుకంత తక్కువ, వైశ్యుడి కంటే ఎక్కువ. ప్రతిలోమ జాతులతో రాజు సంబంధాలు చేసుకొన అర్హుడు. అట్టి సూతవంశంలో సూతదేశాధిపతి కీచకుడు అనే వాడొకడు. రాజకన్యకను పుట్టినవాడు ఉండేవాడు. అతనికి మాళవి అనే స్త్రీ వల్ల నూట అరుగురు కీచకులు పుట్టారు. అందులో పెద్దవాడు, సింహబలుడు అనే కీచకుడు విరాట నగరంలో తమ తల్లి చెల్లిలి కూతురైన సుదేష్ణ కొలువులో చేరారు. వాడి తమ్ముళ్లు నూట అయిదుగురు ఉపకీచకులు తమ అన్నను అనుసరించి ఉంటున్నారు అని చెప్పాడు.
ద్రౌపది తన శయన ప్రదేశం చేరి ప్రక్కమీద మేనువాల్చింది. పరాభవాగ్నిలో ఆమె హృదయం మండుతోంది. కన్నీటి కాల్వలు చెవుల ప్రక్కగా ప్రవహిస్తున్నది. కర్తవ్యాన్ని గురించి ఆలోచించసాగింది. సింహబలుడు నిజంగా సింహబలుడే ! అతని నీచం అణచగలవాడు భీముడు ! పైగా భీముడి బాహుబలానికి దైవబలం కూడా తోడుకాగలదు. ఆలోచించి ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చింది. నెమ్మదిగా లేచింది. ఒంటినున్న ధూలి కడుగుకొన్నది. శుభ్రమైన తెల్ల చీర ధరించింది. వంట ఇంటివైపు నడిచింది. వంట ఇంట్లో సుఖంగా నిద్రపోతూ ఉన్న భీముణ్ణి కనుగొన్నది.
నన్ను పరాభవించి తన భవంతికి పోయి ఎప్పటిలాగే చీకూచింతా లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు కీచకుడు. నీకు నిద్ర ఎలా పడుతుందో మీ అన్న పరాక్రమం వద్దంటే దయ కూడా పోయిందా ? అంటూ నెమ్మదిగా తట్టి మేల్కొల్పినది.
భీముడు ఎవరు ఎవరు అంటూ తృళ్లిపడి లేచి కూర్చున్నాడు. కంఠస్వరాన్ని బట్టి ఆమెను గుర్తుపట్టి కీచకుణ్ణి చంపమని ప్రభోధం చేయడానికి వచ్చిందని ఊహించి అయినా ఆ మాట ఆమె నోటి వెంట రాగా వినాలని కూతూహలపడ్డాడు.
ఇంత ప్రొద్దుపోయాక ఇక్కడికి వచ్చావేమి ? ఎవరూ చూడలేదు కదా ? అన్నాడు నెమ్మదిగా.
తెలుసండీ నన్నడగడమెందుకు ? ఇంతట్లోనే అంతమరుపైతే మళ్లీ చెప్పి మాత్రం ఏం లాభం ? అలాగ కాక నేను చెప్పగా వినలని ఇష్టమైతే మంచిదే మొదటినుంచి జరిగినదంతా చెపుతా విను. రాజు బావమరిది సింహబలుడు తన అప్పను మ్రొక్కడానికి వచ్చాడు. నన్ను మోహంతో చూచాడు. తన మోహం ఒలకబోస్తూ అనేక విధాల మాట్లాడాడు. నాకు పరమరోత పుట్టింది. వాణ్ణి మందలించి పొమ్మాన్నాను. వాడు వెళ్లక మదపిచ్చితో నన్నుకోరాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఓరి దుష్టుడా ! కావరంతో కళ్లు మూసుకుపోయి కారుకూతలు కూయకు ! గర్వాంధుల్ని చీల్చి చెండాడేశక్తి సామర్థ్యాలుగల వారు నా భర్తలు అయిదుగురు గంధర్వులున్నారు జాగ్రత్త ! నీ రూపం, నా మానం, ప్రాణం కూడా పుచ్చుకుంటారు అని గర్జించాను. అయినా వాడు ప్రెలాపన మానలేదు. నేను వాణ్ణి ధిక్కరించాను. చివరకు వెళ్లిపోయాడు. తరువాత సుదేష్ణ పాపాత్మురాలు తనకు కల్లు తెచ్చిపెట్టడానికి నన్ను కీచకుడి ఇంటికి వెళ్లమంది. నేను వెళ్లనుగాక వెళ్లనన్నాను. నేను ఎన్నిచెపుతే అన్నింటికి అన్నీ చెప్పి నిర్భంధించింది. ఆమెతో పెద్దగా పెనుగులాడి ప్రయోజనం లేదనిపించింది. మీ బలం తల్చుకొని నన్ను ఏవరేం చేయగలరు అనే ధీమాతో కీచకుడి ఇంటికి కల్లు కోసం వెళ్ళాను. కొన్ని పెడమాటలాడుతూ నన్ను పట్టుకోబోయాడు. వాణ్ణి త్రోసేసి పారిపోయి వస్తుంటే నన్ను తరముకు వచ్చాడు. నేను మీరు ఉన్న దెసకు పరుగెత్తుకు వచ్చాను. ఆ దుర్మార్గుడు కోపంతో నన్న వెంటాడాడు.
ఆ తరువాత సంగతంతా నువ్వే చూశావు. మీ అన్నయ్య పెద్దరికాన్ని నేనూ చూశాను. ఇంకేం చెప్పను ? ఆనాడు ఆ సభలో దుశ్శాసనుడు అలాగ చేశాడు. అప్పుడూ మీ శౌర్యం, బలం దండుగే అయాయి. పిమ్మట సైంధవుడు అనుచితంగా చేసినా చెల్లిపోయింది. ఈనాడు నిండు సభలో ఇలాగ అయింది. నగవు నాకు కొత్త కాదు. అలవాటే అయింది. అయ్యయ్యో ! ఎంతటి కొత్తవారైనప్పటికీ, వారి ఆడువారికిగాని, ఆవులకు అపాయం కలిగినపుడు తక్షణం కలుగచేసుకొని రక్షణ కల్పించాలన ధర్మసన్నాలు చెప్పే ధర్మరాజు నన్ను కీచకుడు తన్నుతూ వుంటే చూస్తూ ఎలాగ ఊరుకోగలిగాడు ? అని ప్రశ్నించింది.
కీచకుడు అలాగ కళ్ళు మూసుకుపోయి నిన్ను పరాభిస్తుంటే నాకు ఒళ్ళు తెలియని ఆగ్రహం వచ్చింది. అన్నయ్యకి హిమాలయం అంత ధయిర్యం ఉంది కనుక నన్ను వారించాడు కాబట్టి సరిపోయింది గాని లేకపోతే నేను ఆ కీచకుణ్ణి విరాటరాజునీ కలిపి చంపేస్తే ఏమయ్యేది ? మన అజ్ఞాతవాసం భగ్నం అయి మనం బైటపడిపోయి వుండేవాళ్ళం. అప్పుడు మళ్ళీ అరణ్యవాసం చేయవద్దా ? అది నువ్వూ నేనూ కలిసి తెచ్చిన ముప్పు అని నిన్నూ నన్నూ నిందించరా ? కనుక అన్నయ్యని మెచ్చుకోవాలి గాని ఆడిపోసుకోకూడదు... అది అలా వుంచు. నిన్ను అవమానించిన కీచకుణ్ణి చంపకుండా వదిలేశానునేనా నీ దుఃఖం అంతాను ? కొంచెం ఓర్పు వహిస్తే నీ మనస్సును సంతోష పెడతాను. మనల్ని ఎవరూ ఎరుగకుండా ఉండే ఉపాయం ఏమిటో ఆలోచించాలి గాని, శత్రువుని చంపటం ఎంత పని ? అన్నాడతడు.
నేను కుంతికి అంతగా నెరవను. మీకూ అంతగా నెరవను. దేవుడికి కూడా అంతగా నెరవను. కాని ఆ కలుషాత్మురాలు సుదేష్ణకు పనులు చేసేటప్పుడు మాత్రం మిక్కిలి భయపడతాను. నేను ఇతరుల కోపానికి గురి అయి, నేను పడ్డ పాట్లన్నీ వమ్మైపోయి, చిట్టచివరకు, ఇలాగ ఒకానొక మూర్కుని మూలాన అభిమానం పోగొట్టుకున్నాను కదా అనే నగవు నా గుండెల్ని తినేస్తూ వుంటే, ధయిర్యం చెడి, అలాగ నిష్టూరంగా మాట్లాడాను కాని నాకు మంచి చెడ్డలు తెలియక కాదు.
మీ అన్నయ్యను నిజంగా నిందించే ఉద్దేశం నాకు ఎన్నడూ లేదు. ధర్మరాజు నిత్యధర్మ నిరతివల్లనే కదా మనం బ్రతుకుతున్నాము ? అతని నిర్మల సత్కర్మలవల్లనే కదా జగత్తంతా బ్రతుకుతున్నది ? అజాత శత్రుడు అనిపించుకొనేది దిగ్విజయాలు చేసి, రాజసూయ మహాయాగం చేసి, ధర్మపరుడు, నిత్య సత్యవ్రతుడు, ధయిర్యశాలి, కరుణామూర్తి, ఉపకారి, దేవతామూర్తి అని పొగడ్తలు గన్న కుంతి పెద్దకొడుకు, ఈనాడు ఒకణ్ణి ఆశ్రయించి, కూటికీ గుడ్డకీ కొలువు చేస్తూ, పేరూ ప్రతిష్టా మాపుకొని నానా ఆగచాట్లు అనుభవిస్తూ ఉంటే, నాకు ధయిర్యం సడలిపోకుండా, మతి చెడిపోకుండా ఎలాగ ఉంటుందీ ?
నీ తేజం, బలం సామాన్యం కావు కదా ! నీకు కోపం వచ్చిందంటే శత్రువుకీ ఆయువు మూడిందన్నమాటే కదా ! బక, హిడింబ, కిమ్మీరుల బాహుబలం, జరాసంధురడి దర్పం అన్నీ నీ బాహుబలానికి దాసోహం కాలేదా ? అటువంటి నువ్వు వంట కట్టెలమీద బాహుబలం చూపిస్తోంటే సహించలేక ఏడుస్తోంటాను. నీవు మల్లులతోనూ, దున్నపోతులతోనూ, బెబ్బులులతోనూ, కేవలం ఆ నిర్దయ ప్రభువు వినోదార్థం పోరాడుతుంటే, మహనీయమైన, జగన్నాన్యమైన నీ శరీరాన్ని ఈ విధంగా నీచమైన దుష్టజీవనం వల్ల పోషించుకోవలసిన దుర్గతి పట్టింది కదా అని కుమిలి పోతుంటాను.
వివేకహీనుడైన విరాటుడు నీ చేత పోరాటం చేయిస్తున్నప్పుడు వినోదం చూద్దామని సుదేష్ణ మున్నగు అంతఃపుర కాంతలతోపాటు, నేను కూడా వచ్చి చూసేదాన్న. పోరు నీకు భారం అయినపుడు విచారం, నీది గెలుపు అయినపుడు సంతోషం నాకు కలుగుతూండడం సుదేష్ణా, తదితర స్త్రీలు గమనించేవారు. వలలుని దెప మాలిని చూసే చూపులో హృదయంలోని ప్రేమ ప్రస్ఫుటిస్తోంది ? వీళ్ళు వచ్చిన సమయం కూడా ఒక్కటే ! ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది ! అని గుసగుసలాడేవారు. ఉంది, లేదు అని వాగ్వాదాలు చేసేవారు. ఒక్కొక్కసారి నేను ఒళ్ళు మరిచిపోయి కళ్ళూ మనస్సూ నీకే అప్పగించి చూస్తూండేదాన్ని. తరువాత వాళ్ళ విషయం చటుక్కున జ్ఞాపకం వచ్చి వాళ్ళవైపు చూస్తే వాళ్ళు నా సంగతంతా తెలుసుకున్నారనే అనిపించేది. దానికి తగినట్లుగా ఇప్పుడు నాకు జరిగిన అవమానానికి నువ్వు విజృంభిస్తే, మనల్ని ఇట్టే కని పెట్టేస్తారు. కనుక నీకు తోచిన విధంగా, రహస్య భంగం కాకుండా శత్రువుని సంహరించు.
|