9
 

 

 

నీ త‌మ్ముడు అవ‌స‌ర‌మైతే హ‌రితో అయినా పోరాడ‌గ‌ల మేటి అనీ, ఇంద్రుడి అర్థాస‌నానికి అర్హుడ‌నీ, మృత్యువు నోట‌బ‌డ్డ క్షుద్ర‌జంతువునైనా ర‌క్షింప‌గ‌ల రాచ‌వాడ‌నీ, త‌న‌ను వ‌చ్చిన ఉర్వ‌శియందుకూడా లోల‌త్వం లేని మేలి గుణం క‌ల‌వాడ‌నీ అనిపించుకొన్న అర్జునుడు, ఆప‌ద‌ల‌కు త‌లొగ్గి, మానాభిమాన‌లు పోవాడి, నాట్య‌రంగంలో నిల‌బ‌డి ఆడ‌పిల్ల‌ల‌ను ఆర‌గ‌రుపుతూ ఉండ‌టం అతి దీనం కాదా ?  దీనిని గురించి నేను కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నాను. దేవేంద్రుడి కొడుకంత‌వాడు. క‌డుపు క‌క్కుర్తికి ఈ నీచ‌వేషంలో అలాటి వృత్తిచేయ‌వ‌ల‌సి వ‌చ్చింది.  దైవం ఎంత‌ప‌ని చేసాడు. మ‌గాజాతిలో మేటి అయిన అర్జునుణ్ణి నువ్వు పేడి చేయ‌వ‌చ్చునా అని బ్ర‌హ్మ‌దేవుణ్ణి తిట్ట‌ని గ‌డియ లేద‌నుకో ! భ‌రించ‌రాని ఈ బాధ‌ను త‌ల్చుకున్న‌ప్పుడ‌ల్లా గుండెకోసుకుపోతోంది. ఈ దుర‌వ‌స్థ ఎప్ప‌టికి త‌ప్పుతుందో అని ఎప్పుడూ మ‌న‌స్సు కించ‌బ‌డుతోంది ఏం చేయ‌ను ?

ఎన్నిసార్లు చూచినా త‌న‌ని  తీర‌ని స్థుర‌ద్రూపి, మునులు కూడా వ‌ర‌వ‌డి పెట్టుకోవ‌ల‌సినంత స‌త్ర్ర్ప‌వ‌ర్త‌న‌, శత్రువులు కూడా పొగ‌డేటంత ప‌రాక్ర‌మ‌శాలి, క‌ల్ప‌కృక్షం అయినా ప్ర‌శంసించే దాత‌, న‌కులుడు ఒక‌రి కొలువులో అశ్వ‌శిక్ష‌కుడా ? అత‌ని దుస్థితికి అనుదిన‌మూ క‌న్నీరు కారుస్తున్నాను. గ‌డ‌ప‌రాని దైవ‌ఘ‌ట‌న‌కు చిత్తం త‌ల్ల‌డిల్లిపోతోంది.

మాద్రి పిన్న‌కొడుకు, అతి సుకుమారుడు, గోపాల‌క వృత్తి చేస్తూ అడ‌వుల్లో తిరుగుతూంటే, నాకేకాదు ప‌గ‌వారికి కూడా గుండె బ్ర‌ద్ద‌ల‌వుతుంది. నేనూ, మీరూ అడ‌వుల్లోకి బ‌య‌లుదేరేట‌ప్పుడు, కుంతి, స‌హ‌దేవుణ్ణి నాకు అప్ప‌గింత‌పెడుతూ అమ్మా, నిన్ను న‌మ్మి,  విష‌మం అయిన వ‌న‌వాసం ఈత‌డు చేయ‌టానికి ఒప్పుకొన్నాను అని ఎంతో దీనంగా చెప్పి బ్యారుమ‌ని ఏడ్చింది. కోడ‌లా ?  వీడు మిక్కిలి ప‌సిబిడ్డ‌కు. ఏది కావాలో ఏది అక్క‌ర‌లేదో ఎరుగ‌డు. ఇదివ‌ర‌కెప్పుడూ ఎట్టి క‌ష్టాలూ ప‌డ్డ‌వాడు కాదు. బ‌హుమెత్త‌ని మ‌న‌స్సు, ఎప్పుడూ నేను పిలిచి భోజనం పెట్ట‌వ‌ల‌సిందేగాని త‌న‌కు గ‌ల ఆక‌లి ప్రొద్దెర‌గ‌డు. ఈ కొడుకు ఇలాగ వెడుతూంటే నా మ‌ది కృంగిపోతోంది. నిన్నుచూసి ఊర‌డిల్లుతూంది. అత‌నికి ఎప్పుడు, ఎక్క‌డ, ఏది కావాలో అన్నీ తెలుసుకొని జాగ్ర‌త్త‌గా కాపాడు. ఎంత క‌ష్టానికైనా ఓర్చి, ఏమ‌ర‌క అత‌నిని సంర‌క్షించి నా హృద‌య‌పూర్వ‌క దీవ‌న‌లు అందుకో అమ్మా అని అత్త‌య్య అత‌నిని నాకు అప్ప‌గించింది. నేను కూడా మ‌న వ‌న‌వాస‌కాలంలో, నాకు చేత‌నైనంత మ‌ట్టుకు, మీ కంద‌ర‌కూ గారాబ‌మైన మీ త‌మ్ముణ్ణి కాపాడుకుంటూ వ‌చ్చాను. కాని ఇప్పుడు అజ్ఞాత‌వాసంలో ఉన్న అత‌ణ్ణి నాకు స‌రిగా చూడ్డానికే వీల్లేక‌పోతోంది, ఏమీ చేయ‌లేక‌పోతున్నాన‌ని ఏడుస్తున్నాను.

ఇక నా క‌థ విను. మా నాన్న న‌న్ను త‌న కొడుకుకంటే మిన్న‌గా, గారాబంగా పెంచాడు. కుంతీదేవి కోడ‌ళ్ళ‌లో క‌ల్లా గొప్ప‌పేరు తెచ్చుకొన్నాను. మీరు ప్రాణంలో ప్రాణంలాగ ఎంచుకొని ఎంతో ప్రేమ‌తో చూస్తున్నారు. ప్ర‌జ‌ల్లో నాయందు త‌ల్లిదండ్ర‌లయందు క‌న్నా ఎక్కువ భ‌క్తిక‌లిగి ఉంటున్నారు. రూపానికీ, ప‌రాక్ర‌మానికీ పేరుప‌డ్డ పుత్రులను క‌ని, త‌ల్లిన‌యాను. భ‌ర‌త‌వంశంలో నా ఇల్లే ఇల్లు అని బంధువుల‌ల్ల పొగ‌డ్త‌లు పొందాను. ఆ నాడు రాజ‌సూయ‌యాగంలో బ్రాహ్మ‌ణ కోటినంత‌నూ తృప్తిప‌ర్చి ఆశీర్వాదాలు పొందాను. మీ మ‌న్న‌ల‌వ‌ల్ల‌, పుణ్య‌వ‌ర్త‌న‌కు పాండురాజు కొడ‌లివే చెప్పుకోవాలి అని రాచ‌స్త్రీలంద‌రూ పొగ‌డ‌గా విన్నాను.

ఈనాడు మ‌న‌స్సు చెడి, సంతోషంపోగా, నీచాతినీచ‌మైన వృత్తిలోచేరి, నికృష్ట‌నై, దీవ‌త‌పొంది, ఉద‌ర‌పోష‌ణ కొర‌కు ఈ విధంగా సుదేష్ణ క‌నుస‌న్న‌ల‌లో మెల‌గుతూ, హైన్యం అనుభ‌విస్తుంటే మీకు విచార‌మ‌న్నా లేదు ! ఏం చేయ‌ను ? ఒక‌రికి ప‌ని చెప్ప‌డ‌మే గాని, ఒక‌రికి ప‌ని చేయ‌డం ఎర‌గ‌ను. అత్త‌య్య‌కూడా నాకు ప‌ని చెప్ప‌డానికి జంకి, ప‌ని నేర్పుతున్న‌ట్లు ఆగ‌ప‌డేట్లుగా ప‌ని చెప్పేది, జ్ఞాప‌కముందా ?

విరాట‌రాజు రాణీల‌కు ఎవ‌రు చంద‌నం రాచినా ప‌నికిరాదుట ! ఒళ్ళు చెమ‌ట‌లు పోసేటంత‌గా శ్ర‌మ‌ప‌డి, నిల‌బ‌డి అతి మార్ద‌వంతో, ఆ చంద‌నం మీ అమ్మ‌కే భ‌క్తితో రాచిన‌ట్లు, వాళ్ళ‌కు, బ్ర‌హ్మ‌ను తిట్టుకుంటూ, అద్దుతున్నాను. న‌లుగులు నూరినూరి, చంద‌నం రాచి, క్రొత్త క్రొత్త ప‌రిమ‌ళ ద్ర‌వ్యాలు క‌లిపి క‌లిపి, ఆ సుదేష్ణ క‌నుస‌న్న‌ల్లో మెలిగి ప‌నులు చేసి చేసి నా చేతులు ఎలా  కాయ‌లు కాచిన‌వో చూడు ! అంటూ త‌ల ఆత‌ని వ‌క్ష‌వానికి ఆనిచి భోరుమ‌ని ఏడ్చింది ద్రౌప‌ది. భీముడి హృద‌యం ద్ర‌వించింది. క‌న్నీరు కార్చాడు.

కొంత‌సేపటికి భీముడు త‌న‌ను తానే ఓదార్చుకొన్నాడు. ఆమె మొగ‌ము నెమ్మ‌దిగా తుడిచి శిర‌స్సు త‌డిమి ఆమె అర‌చేతులు త‌న ముఖానికి అద్దుకొని వేడి నిట్టూర్పులు విడిచాడు. ఆమె కొంచెం ఊర‌డిల్లింది.

ఇంద‌ర‌మూ, ఇన్ని విధాల, ఇన్ని పాట్లు మీ అన్న‌య్య మూల‌మున ప‌డ‌వ‌ల‌సి వచ్చింది.

దాయాదులోడ్డిన మాయాజూద‌పు ఉరుల్లోబ‌డి అత‌డు కులానికి ఈ పాటు తెచ్చాడు. మోస‌పోయి ఆడియాస‌లై పాల్ప‌డి, ఇంకా చావ‌కుండా ఉన్నాను ! దురంత‌మైన మ‌హాబాధ‌ల్లో మునిగిపోతున్న నేను, ఈ దుఃఖ స‌ముద్రాన్ని ఎలా ఈద‌గ‌ల‌ను ?  మీరంతా బ్ర‌తికి ఉండాగానే నిండు స‌భ‌లో ఒక మూర్కుడిచే అవ‌మానింప‌బ‌డ్డాను. దైవానుకూలం లేక‌పోతే మీరు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు ?  శుభాశుభాలు, స‌రిసారుల‌కు, వాటివాటి ద‌ళల్లో వ‌స్తుంటాయి. ఏది వ‌చ్చిన‌ప్పుడు అది అనుభ‌వించ‌క త‌ప్ప‌దు క‌దా ! ఎన్న‌టికైనా మీరు అభ్యుద‌య‌మూ, గౌర‌వ‌మూ పొందాల‌ని, మ‌న‌స్పూర్తిగా కాంక్షిస్తూ, ఆప‌ద‌ల‌ను ఎలాగో ఒక లాగ ఓర్చుకుంటాను. దానికేం గాని, కండ‌క‌వ‌ర‌మెక్కిన కీచుకుడు కామాంధుడై, న‌న్ను త్రోవ‌కాసి ప‌ట్టుకుంటాడేమోన‌నే భ‌యం బాధిస్తోంది. అందుకే ఇంత‌గా దుఃఖిస్తున్నాను. వాణ్ణి క‌నుక నువ్వు చంప‌క‌పోతే, నీ ఎదుట‌నే ఉరిపోసుకునో, నీటిలో ప‌డో, నిప్పు అంటించుకునో, విషం పుచ్చుకునో చ‌చ్చిపోతాను. నీ మీద ఒట్టేసి చెపుతున్నాను అన్న‌దామె.

భీముడు చిరునువ్వు న‌వ్వి-

వెర్రిదానా, కీచ‌కుణ్ణి చంప‌మ‌ని చెప్ప‌డాన‌కి ఒట్టు పెట్టుకోవాలా?  వాడు నా క‌ళ్ళ‌ముంద‌రే నిన్ను అవ‌మానించి, ఇంకా ఈ ప్ర‌పంచంలో ఉండ‌గ‌లిగితే, ఒక ఆడ‌వాళ్ళ‌ను ప‌రాభ‌వించ‌లేని వాడెవ‌డు ! నా బాహుబ‌లం అప్పుడే చూప‌ని తప్పు చాలదా ?  వాడు ఎక్క‌డ దాగున్నా, ఆధ‌ర్మరాజు తాన స్వ‌యంగా వ‌చ్చి అడ్డుప‌డినా, నువ్వే కాపాడినా, కీచ‌కుడు రేపు నాచేతిలో చావ‌డం త‌థ్యం ! వాణ్ణి గురించి ఆవంతైనా విచారం వద్దు. ఈ మాట‌లు విడిచి పెట్టు అని ఊర‌డించాడామెను. ఆమె త‌న దుర్ద‌శ‌ల‌ను త‌ల్చుకొని ప‌డుతూన్న దుఃఖాన్ని కూడా ఉప‌శ‌మింప‌జేయ ప్ర‌య‌త్నించాడు.

సంయాతి మ‌హారాజు కూతురు సుక‌న్య చ్య‌నునుడి కోరిక ప్ర‌కారం అడ‌విలో అష్ట‌క‌ష్టాలు అనుభించ‌లేదా ? జ‌న‌క‌మ‌హారాజు కుమార్తె సీతారాముడితో అర‌ణ్య‌వాసం చేసి ఆప‌ల‌పాలు కాలేదా ?  ఆగ‌స్త్యుడి కొర‌కు లోపాముద్ర ఘోరాట‌వుల‌లో అవ‌స్థ‌లుప‌డ‌లేదా ?  న‌లుడి వెంట అడ‌వుల‌కు పోయి ద‌మ‌యంతి మాన‌వులు ప‌డ‌లేని అగ‌చాటు ప‌డిందికాదా ?  వారు దుర్భ‌ర‌మైన నిరంత‌ర దుఃఖ‌భారాన్ని ఓర్పుతో భ‌రించి తుద‌కు సౌఖ్య‌ప‌డ‌లేదా ?   అలాగే నువ్వూ ఆప‌ద‌ల‌కోర్చి సుఖ‌సంప‌ద‌లు అనుభ‌వించు.

దుర్యోధ‌న‌, దుశ్శాస‌న‌, క‌ర్ణ‌, శ‌కుని, సైంధవ ప్ర‌ముఖులుగ‌ల దుష్ట‌లోకాన్ని ఆథోలోకంలోకి పంపేవ‌రకూ నా హృద‌యాంత‌రాళంలో చింత, అవ‌మానం, కోపం ఉంటాయి. ధార్త‌రాష్ట్రుల‌కు కాలం చెల్లిపోవ‌చ్చిన‌ట్లు మ‌న నియ‌య‌కాలం చెల్లిపోవ‌చ్చింది. మ‌నం అజ్ఞాత‌వాసం ఆరంభించి ప‌ద‌కొండు నెల‌లు అయాయి. ఇప్పుడు ప‌న్నెండో నెల జ‌రుగుతోంది. దీని కొర‌త తీరాక నీ దుఃఖం తీరుతుంది. కాస్త ఓపిక‌ప‌ట్టు. సింహ‌బ‌లుడు మ‌దోన్మాదంలో ఉన్నాడు కనుక వాణ్ణి రేపే చంప‌వ‌చ్చు. నువ్వు నెమ్మ‌దినెమ్మ‌దిగా ఒప్పుకున్నట్లు న‌టించు. వాడికి న‌ర్త‌న‌శాల సంకేత ప్ర‌దేశంగా చెప్పు. ఒంట‌రిగా రావాల‌ని నియ‌మించు. పిమ్మ‌ట వాణ్ణి చంపి, శవాన్ని నీకు చూపించి, నీ మెప్పు పొందుతాను. ఈ మాట నిశ్చ‌యం. ఇక తెల్ల‌వారుతోంది. అంతా మేలుకొంటారు. మ‌న‌ల్ని ఎవ‌రైనా చూశారంటే యుక్తి బైట‌ప‌డి వ్య‌వ‌హారం పాడ‌వుతుంది. కీచ‌కవ‌ధ‌ను నా మ‌న‌స్సు కోరుతోంది. నా కోరికి నెర‌వేర్చుకోవాలి. నీ శ‌య‌న స్థానానికి వెళ్ళు అని భీముడు ఆమెను కొంచెం దూరం సాగ‌నంపి తిరిగి వచ్చి ప‌డుకున్నాడు. ద్రౌప‌ది త‌న‌ప‌డ‌క‌పై చేరింది. నిద్ర‌రాక ఊర‌క క‌ళ్ళు మూసుకుని ప‌డుకొన్న‌ది.