బాలతల్లికూడ గంగయ్యను గౌరవముగచూడలేదున. బాలతల్లియుకుడుత్తమయను వంటామెయను గంగూలీని గూర్చిబాల యెదుటనే హేళనముగా మాటాడెడివాడు. బాలయామాటలను ఖండింపక మౌనమును పాటించెడిది. విమర్శించువారే మౌనమును అంగీకారముగ భావించిమరికొంత విజృంభించెడివారు. బాలకూడ నెప్పుడైన నొకటి రెండు మాటలు విమర్శ పూర్వకముగననును. భర్తపైబాలకు పూర్తియనురాగము లేదనుటకి మౌనమే సాక్ష్యము.
బాలపతివ్రత. పాతివ్రత్యమొక మహావ్రతముగ సాగించుచున్నది. భీమశంకరము, ఈ వ్రతమును గూర్చియామెకు చిన్న తనముననే బోధచేసెను. అతడు పాతివ్రత్య మహిమను గూర్చియు పతివ్రతలను గూర్చియు బోధించెను. ఆమెకు ఆత్మవికాసమైనదనుట స్వతస్సిద్ధముగ, నవ్యాజముగ హృదంతరాళమున నంకురింపవలసిన భార్యాభర్తలమధ్యనుండు యనురాగ బీజము, చిలుకపలుకులవంటి పాతివ్రత్య ధర్మబోధనల మాటునమాడిపోయినదని చెప్పవలయును. తండ్రియెవనిని భర్తగ నిర్ణయించినచో వానిని దైవముగ భావింతునని యోచించినదేగాని తనహృదయమునకు నచ్చినదెవ్వరని చూడలేదు. సామన్యమానవుడైన గంగూలీకి కావలసినది పూజలకన్న దైవముగ చూచుటకన్న నతనినర్ధము చేసికొని లోటుపాట్లను మన్నింప కలుగుటయు, ప్రేమతో లోపములను మార్చుటకు ప్రయత్నము చేయుటయును మాత్రమే. పతివ్రతయైన బాలకు భర్తపై కోపము వచ్చినచో నతనితో మాటలాడుటమానును. కొడుకునుకూడ తండ్రితో మాటలాడనీయదు. పైకిపంపదు. బాలకుకోపమువచ్చును. ఆమెపైకిరాదు. కొడుకును రానీయదు. కొడుకునుచూడకుండ గంగూలీ పదినిముషములుండలేడు. బాలయెంతకఠినురాలో భర్తపై నెంత కోపమీమెకురాగలదో అతని హృదయము నెంతగాబాధ పెట్టగలదో నీమాటలవలన వ్యక్తమగుచున్నది.
ఆమె బావయైన రంగనాథము వచ్చినప్పుడామె వదనము కళకళలాడును. ఉత్సాహముగనుండును. అనిగంగూలీభావించెను. తనయందెందులకిట్లుండదని చింతించినాడు. తనబీదబంధులపట్లను కూడాబాల చక్కగ ప్రవర్తించి వారిని మన్ననగచూచెడిది. తననులాలించదు. దయగచూడదు వారినేలదయగ జూచుననుకొనెను. కావున బాల గంగూలీని దయతో ప్రేమతో చూచుటలేదనియు రంగనాథమును చూచినప్పటి హృదయ వికాసము భర్తను చూచినప్పుడు కలుగదనియు తెలియుచున్నది. ప్రేమయన్నది కామధర్మములను ఉద్దీపింపజేయునన్న రచయితమాటల నాధారముగజేసి కొనిచూచినచో బాలయొక్క పాతివ్రత్యము గంగూలీపై ప్రేమయన్న పునాదులపై నిర్మింపబడిన సౌధముకాదనియు కేవలమొక ఆదర్శము కొరకాచరింప బడుచున్నదనియు తెల్లముకాగలదు. గంగూలీ ప్రేమను బాలగ్రహింపలేదు. అతనికి ప్రేమను వ్యక్తముచేయుట తెలియదు. చాలామంది ప్రేమింతురు ఆప్రేమనావిష్కరింపజేయుట యెట్లోతెలియదు. అదియొకవిద్య. గంగూలీ యావిద్యయందు నిష్ణాతుడైనచో నీకథయే యుండెడిదికాదు. గంగూలీది నిగూఢమైనప్రేమ. భర్తపై ప్రేమలేకపోవుట యేగాక నొకవిధమైన నిరసనము వెగటును కూడబాలలో నున్నవని తెలియచున్నది. అతడాస్తి కొరకువచ్చెను. ఆస్తి యతనికి లభించినది. తన తరువాత మరియొకస్త్రీని వివాహమాడును. అతని మేనమామకూతురు గలదు. వివాహశ్చ వివాదశ్చ సమయోరేవశోభతే అనియు అదియే గంగూలీకి తగిన సంబంధమనియు భావించినది. గంగూలీకి తగినభార్య బీదరాలైన మేనకోడలేగాని తానుగాననుకొనుటలో వారిరువురినడుమనున్న యార్థికవ్యత్యాసము బాలచే భావింపబడినంతగ గంగూలీచే భావింపబడలేదు. బాలకు గంగూలీ తక్కువవాడను చులకనభావము. అతడు తనకుతగినవాడు కాడను నభిప్రాయము. ఆమెకుగల ధనాభిజాత్యము ఆధిక్యభావము వెల్లడియైనవి. కానిబాలపతివ్రత పతివ్రతయని యామెభావించుటయే గాకనొకగోసాయి కూడచెప్పెను.
ఆమె బావయగు రంగనాథమునకు బాలపై ప్రేమగలదు. ఆమె తనకు చెందవలసినదే యనియతని యుద్దేశ్యము. గంగూలీకి తానందగాడిని కాననియు విద్యావంతుడినికాననియు నొకభావమున్నది. నేనందగాడనుకాను. సత్కులప్రసూతుడనుగాను, మీభీమశంకరముగారివలె విద్యావంతుడనుగాను నీవునన్నెందుకు ప్రేమింతువు అనెను. ఇది గంగూలీయూహ. అదియబద్దమనిగానిఅట్లు భావింపరాదనిగాని అతనిది కేవలమనుమానముని గానిబాలచెప్పలేదు.
ఆమెతన పాతివ్రత్యమును నిరూపించుటకన్నట్లుగ ఉపవాసములు చేసినది. తనఉపవాసముల ప్రభావముతో నతనిని భయభ్రాంతునిచేయుట కంటె తనలోని శీలము నతడర్థము చేసికొనవలెనని భావించినదనవలెను. కాని గంగూలీ మోటువాడు లాలిత్యమెరుగనివాడు. అన్నముమానుటయను నాయుధము ధనికులను భయపెట్టినంతగ దరిద్రులను భయపెట్టదు. అందువలన గంగూలీ బాలయొక్క నిరశనవ్రతమునకు లొంగుబాటునకు రాకపోవుసరికి భీమశంకరము ప్రోత్సాహముతో దైవప్రసాదములయిన పులిహొర చక్రపొంగలులారగించి వ్రతవిరమణము గావించినది. గంగూలీ కేవలముతనలోని యుక్రోషమును వెల్లడించెనేగాని యతనిలో భార్యపై నిజముగ ననుమానములేదు.
ఒకనాడు రంగనాథము బాలపెట్టిలో చీరెలయడుగున నొకయసభ్యవర్ణచిత్రముల పుస్తకమును పెట్టెను. ఆపుస్తకమును బాలయును గంగూలీయును నొకేమారుచూచుట తటస్థించినది. గంగూలీ పెనుదుఃఖముతో నూగిపోయెను. సాధారణదుఃఖమునకతడు చలింపని మోటువాడు. కాని యుతడీసమయమున యేడ్చుటచూచిన బాలకు అతనికి తనపైనున్న దెంత ప్రేమయో తెలిసినది. గంగూలీయొక్క వేదనను చూచినతరువాత అతని సర్వస్వము తానేయని తెలిసికొని తరువాత తానెంత చిక్కుసమస్యలోపడినదో తెలిసికొని పైకివచ్చమార్గము కానరాని సమయమున బాలకు భర్తయన్నచో ననురాగము పెల్లుబికినది. అతడు తనమీద అనుమానముతో నిరాశతో నాత్మహత్యచేసికొనునేమో యనిరేయింబవళ్ళు భర్తను కనిపెట్టియున్నది.
ఒకనాడు రంగనాథమువచ్చి తనభార్యకు జబ్బుచేసిన దనియు నాజబ్బునకు కారణము తానొక పతివ్రత జీవితములో నిప్పులుపోయుటకు సిద్ధపడుటయేననియు చెప్పెనని గంగూలీతో చెప్పెను. బాలాసమయమునకు తీవ్రవ్రతములు చేయుచు కృశించియున్నది. ఇచట బాలమరణించినచో నచట రంగనాథముభార్య మరణించునట. ఇట్లుతాను బాల జీవితమును నాశనము చేయమోయితిననియు బాలపతివ్రత యనియు రంగనాథము గంగూలీకి చెప్పెను. బాలయొక్క ప్రాతివ్రత్యమిట్లు గోసాయివలన నిరూపింపబడినది. గంగూలీకి భార్యయొక్క పాతివ్రత్యము తెలిసినది కాని హృదయము తెలిసిరాలేదు. గంగూలీ వాంఛించినది బాలహృదయమే.
బాల గావించిన పాతవ్రత్యమెట్టిది? భర్తను దైవసమునిగనెంచి యాత్మార్పణముగ నెన్నడైన ప్రవర్తించినదా ? అతని సుఖసంతోషములకామె చేసినదేదైననున్నదా ? ఏకారణముచేత గోసాయియొక్క అంతర్దృష్టికి బాల పతివ్రతగ తోచినదో యనిన ప్రశ్నలకు నవలలో సమాధానములు మృగ్యము. పాతివ్రత్యమనగా పరపురుషుని ఆశించకుండటయేనా లేక మరేదైన కలదాయన్నప్రశ్న బాలప్రవర్తన వలన చదువరులకు కలుగగలదు. తల్లియు వంటమనిషియును భర్తపై గూఢచారులను నియమించి వారతని చర్యలను గర్హించుచు విమర్శించుచు నిరాదరణము చేయు సమయమున కూడబాల సాక్షీభూతురాలిగ నున్నదేగాని పల్లెత్తుమాట పలుకదు.
ఇట్టి విషయమును సామాన్యగృహిణే కూడ సహింపనేరదు. కానిపతివ్రతయగు బాలసహించుటయేగాక పరోక్షముగ ప్రోత్సహమిచ్చనది. బాల మనోద్వారమాతనికై తెరచికొనకపోవుటకాతని లోభగుణము పగ మరికొన్ని కుచ్ఛితబుద్ధులు కారణములు. అతనిలోనున్న యీ దుర్గుణములకు కారణము బాలమనోద్వారమతనికై తెరచియుంచకపోవుటయే కారణము. ఇట్లీపరస్పర సంఘర్షణకారణ తంతువులు కాలముగడచినకొలది దృఢతరములగుటయేగాక విప్పరానంతగ చిక్కుపడినవి ఇరువురకును తమతమ దోషములు తెలిసియే యుండెనుగాని రాజీపడుటకే యొక్కరును హృదయ పూర్వముకగ ప్రయత్నింపలేదు.
బాలకేలోపము రానీయరాదని నరహరి గంగూలీని కోరెను. అతనికి గంగూలీపై పరిపూర్ణమైన ప్రేమ. బాలయందగత్తె. బాల సంస్కృతాంధ్రములను కూలంకషముగ చదివినది. గంగూలీదికొద్దిపాటి చదువు. గంగూలీ యనాకారి, బాలధనవతి గంగూలీ బికారి. పూటకు ఠికానా లేనివాడు. వీరిరువురిస్వభావములకు పొందిక కుదరలేదు.
బాలమేనమామ కూమారునకు జబ్బుగానుండెనని భర్త మేడపైనుండి దిగిరాలేదని చెప్పకుండ నాయూరు వెళ్ళినెలరోజులుండి వచ్చినది. అన్ని నాళ్ళక్కడ నుండుటకామె బాధపడుచునేయున్నది. మేడదిగి రానందున చెప్పకుండ వెళ్ళుటయేల తానుపైకిపోయి చెప్పిపోకూడదాయని భర్త భావించెను. గురువైన భీమశంకరమునకిచ్చినంత గౌరవము భర్తకీయలేదు. అందుచేతనే భీమశంకరముపై గంగూలీకి కోపము. తనను గౌరవించని స్త్రీ యతనిని గౌరవింపనేల యనిగంగూలీ యూహించును.
గంగూలీకున్న దుర్భద్ధులన్నియు వివాహమైన తరువాతవచ్చినవే. పెండ్లికిముందతడెంతయో సజ్జనుడు. నరహరివ్యాపారమున సొంతకుమారుని కన్ననెక్కువ సాయముచేసెను. బాలభవిష్యత్తుకొరకు నరహరిమరణానంతరము వ్యాపారము లేకుండునట్లు వ్యాపారములన్నియు నమ్మివేసి ధనరూపమున బ్యాంకులో పొందుపరచెను. ఆసమయమున నాతడెన్ని వేలు దాచికొన్నను దాచుకొనగలడు కానియట్లు చేయలేదు.
యాచించి చదువుకొను గంగూలీకి చదువుపై నెంతయో మోహము. నరహరికి సాయపడుటతో నతని చదువు వెనుకబట్టినది. తానుచేసినదానికి నరహరి మరణశాసనమున పాతికవేలిచ్చినచో బాలని భావింపగల వామాన్యమైన ఆశగలవాడేగాని నరహరియాస్తి నన్యాయముగా దోచుకొనవలెనను దురాశలేనివాడు.
గంగూలీయొక పత్రికను నడిపించుచు సనాతనభావ పరులమీద ధ్వజమెత్తించెను. గురుదూషణ చేయించెను. భీమశంకరమునకు తక్కువ జీతమిచ్చి అతనిరచనల నింకొక పత్రికలకు పంపనీయక అతని రచనలను గుత్తగకొని అదియే పగసాధించుట యనిభావించెను.
వివాహము కామ ధర్మ ప్రేమల నడుమనున్న వ్యవహారముగా భాసించుచున్నది. కామము మూలవస్తవు. ధర్మము సంప్రదాయముచేత పూర్వఋషులేర్పరచిన మతాభిప్రాయములచేత దానియందారోపింపబడిన వస్తవు.
|