భట్టిదేవి రెండవమారు గర్భము ధరించిన తరువాతనామె హృదయకర్కశత్వము తొలిగినది. ఈగర్భధారణా రంభమునుండి నా మనస్సులో నీఉ భార్యగానుంటిని. ఈ గర్భమునానుండి వెలికివచ్చిన తరువాత మరల దొల్లిటివలెనగుదునో నీ తేజమునకు నేనింతయనుకూలమైన క్షేత్రమును అనగా భట్టిదేవికి తాను భర్తను ప్రేమించుటలేదని తెలియుననుటయే. రాజుతనకోపము ఆమెమీదకాదనియు మిగిలిన నలుగురు భార్యలను త్యజింపగలనుగాని భట్టిని త్యజింపలేననియుచెప్పెను. భట్టి స్త్రీ శిశువును ప్రసరింపజేసినది. భట్టిదేవి కన్నకూతురు అతనికొకరకమైన సేదదీర్చినది. ఆపిల్లనేజూచినచోనితని యూహలొకరకముగ మారసాగినవి. భట్టిదేవి విరహాగ్ని చేత నిన్ను దహింపనీయను. ఈయగ్ని చేత పరులను దహింపుము. నిన్ను భట్టిదేవి నిరాదరించెను. ఆ నిరాదరము నా తిరస్కారము నీవునన్నా ధారము చేసికొని పెడద్రొక్కుము అనియాపసికందు చెప్పినట్లుండెను. కూతునుచూడగానే రాజునకుకొంత ఉపశమనముకల్గినది. ఏవర్ణమునాధారముగజేసికొని భట్టితనను నిరాదరణము చేయుచుండెనో యావర్ణమన్న దానిని నాశనము చేయుటకు కంకబద్ధుడయ్యెను. వర్ణవివక్షలేని బౌద్ధమత మీ భావనకు ప్రోద్భలమునిచ్చినది. వర్ణములుకితవకల్పితములని భదంతాచార్యుని ప్రవచన ప్రభావమునపడెను. కుమర్తెకు బౌద్ధభిక్షుకియగు కొడబలిపేరు పెట్టెను. భట్టిదేవి తనతల్లిపేరు పెట్టవలెనని బారసాల వేడుకలు చేయవలెననికోరినది. ఈ రెండుకోరికలను రాజునిరాదించెను. చక్రవర్తి తనలోనున్న ప్రేమాభిమానములను కక్షలరూపమున శిక్షల రూపమున బయల్వెడలగ్రక్కెను. ఇదియొక ప్రత్యేక మనస్తత్వము. నాయనా యని కోశాధికారి భద్రుడు వీరపురుషుని పిలచుటతో భద్రుని పై రాజుకున్న ప్రేమ వందరెట్లెక్కువయైనది. భద్రుడు నాగభట్టను బ్రాహ్మణు నిశిక్షింపవలదనికోరెను. అతనికోరిక తీర్చుటకు బదులుగా నాగభట్టును శిక్షింపవలెనన్న కోపము వంరెట్లెక్కువైనదట. ప్రేమాభిమానములకలుగులయ రాజు వానిని ప్రకటించుటకు బదులుగా పగయును ద్వేషమును శిక్షయును ప్రకటించుట జరుగుచుండెను.
పదిసంవత్సరములు భట్టిదేవికిని చక్రవర్తికిని సంబంధములేకుండనుండెను. తల్లికిని బిడ్డలకును సంబంధములేకుండజేసెను. అందరును బౌద్ధమతస్థులైరి కాని భట్టిదేవి మాత్రము కాలేదు. రాజునకు భట్టిదేవి బౌద్ధరాలు కాలేదన్న యదనపు కోపము వచ్చి కలిసినది. ఆసంగతి గుర్తునకు వచ్చినప్పుడెల్ల రాజొక శివాలయమును పడగొట్టించెడివాడు. ఈ విషయమున చారిత్రకాధారముగలదు. నాగార్జునుని కొండవద్ద నున్న కొన్ని బౌద్ధశిల్పములలో వీరపురుషుడు, రాణులు వారించుచుండగా వినక బుద్ధుని చెంతకు పోవుచున్నట్లు చెక్కినశిల్పములు కలవు. ఒక చిత్రములో రాజు తనకాలితో శివలింగాన్ని త్రోసివేస్తూఉంటాడు. శివలింగంచుట్టూ బ్రహ్మాండమైన నాగబాముఉంటుంది. వీరపురుషుడు శివాలయముల నిర్మూలించిన ప్రతిసారి భట్టిదేవికావార్తనుభటులచేత తెలియజేసెడివాడు. బ్రహ్మణవధలు బాధలు నిరంతరముగ సాగిపోవుచుండెను.
భట్టీదేవికి బ్రాహ్మణావమానమును చూచుట మహాకష్టమైపోయినది. ఆమెయంతఃపురగ వాక్షమునుండి కనిపించు రాజమార్గములో బంధితులైన బ్రాహ్మణలును హింసించుచు తీసి కొనిపోయేడివారు. గవాక్షములు తెరువబడవలయును. భట్టిదేవిచే నా హింసలు చూడబడవలయును. ఇది రాజాజ్ఞ బ్రాహ్మణులహింస భట్టిదేవికి మానసిక హింసయైనది.
వీరపురుషుడొకమారు బౌద్ధమత మహావిజృంభణోత్సవమును చేయతలపెట్టెను. ఈ ఉత్సవమునకు రాణికూడ యాహ్వానితురాలు ఛదంతాచార్యుడు రాజునకు హింసపనికిరాదనియునది బౌద్ధమతమునకే విరుద్ధమనియు చెప్పెను. ఈ హింసపనికిరాదు. ఇదిబౌద్ధమతముకాదు. ఇదియేదో మీ హృదయాంతరములనున్న యతృప్తి బౌద్ధమతాభిమానముగా బరిణమించెను అనెను. రాజుభదంతాచార్యుని మాటలను వినుటకు సిద్ధముగలేడు. ఒక మహాచైత్యమును నిర్మించి, శివలింగమును చుట్టుకొనునట్లుగానొక సర్పఫణా మండలము నమర్చి యొకమహాలింగాకృతిని అచ్చట పెట్టిరి. ఆ లింగమును వీరపురుషుడు పాదముతో తాడించవలయును. ఈపాదతాడన మహోత్సవమునకు మహారాణి భట్టిదేవి యాహ్వానితయయ్యు రాలేదు. రాజు మహోగ్రభరితుడైనాడు. శివుడీ ఘెరకృత్యములకు మూడుకన్నులతో శోకించినాడు. శ్రీశైలస్వామి యయ్యాంధ్రభృత్యులైన యిక్ష్వాకుల చేత గడగండ్లుపడి మ్రగ్గవలసిన తనస్థితిని తలంచుకొని భయముచేత మూడు కన్నుల వెంట నీరుకార్చెను. ఇట్లు వీరపురుషుడు మానసికముగ నొక హింసాప్రవృత్తికి లోనయి ప్రజలను బాధించుచుండగా భట్టిదేవి నిరాభరణయై కేశములకు తైలసంస్కారాదులను మాని యాహారనియమములను పాటించి వ్రతమును పాటించు దానివలె నుండి కృశించిపోయినది. వీరపురుషుని యాగ్రహము, కడకు భట్టిదేవి ప్రాణములపైకి కూడవచ్చునని భావించినది. భట్టిదేవిమీద కోపము చేతనే రాజిట్లుచేయు చుండెనని గ్రహించినది. ఒకనాడు శాంతిశ్రీ మాఠరీదేవి విగ్రహముతో తనబాధను వెల్లడించుకొనినది. ఈజగద్విప్లవము నోర్వలేకున్నాము పట్టమహిషియైన భట్టిదేవి దినదిన మురికంబమున కెదురుగా బోవుచున్నది. ఆమెనతడు హింసించి చంపినను నామె చనిపోయినను మరునాడు నాతమ్ముడు బ్రతకలేడు అని దుఃఖించినది. వీరపురుషునకు జన్మనిచ్చిన తల్లి కాళింది కనుపించిన నాటినుండి హృదయముకొంత శాంతించినది.
ఒకనాడు వీరపురుషుడు పది సంవత్సరముల తరువాత భట్టిదేవి యంతఃపురమున కాలు పెట్టినాడు. ఆమె భర్త వచ్చిని వెంటనే యాసనము చూపికూర్చుండ బెట్టినది. భర్త యాజ్ఞ నిర్వర్తించుటకు సిద్ధముగ నుంటినని తెలిపినది. రాజునకాగ్రహము కలిగినది. అతనికి కావలసినది వినయ విధేయతలుకావు. రాజు భట్టిదేవిపై గల కోపము నామె పుట్టింటివారిమీద తీర్చుకొననెంచి, పురుషునివలె పెంచబడిన కొడబలిని భట్టిదేవి యన్న కుమారుని కిచ్చి వివాహము చేసెను. అతనితో కొడబలి సంసారము చేయదని రాజునకు తెలిసియు భట్టిపైగల కక్ష నీవిధముగ తీర్చుకొన నెంచెను.
కాళిందిపై రాజున కవ్యాజమైన ప్రేమకలిగి యామెను గౌరవించసాగెను. ఒకనాడు కాళింది వీరపురుషుని హృదయ శల్యమైన జన్మవృత్తాంతమును వెల్లడించినది. కాళిందికిని గోముఖ శాతకర్ణియను క్షత్రియునకును జన్మించినవాడు వీరపురుషుని తెలిపినది. నీది నీచ జన్మకాదు నీభార్య భట్టిదేవి జన్మకన్నా నీజన్మయుత్తమమైనది అని భట్టిదేవియు, శాంతిశ్రీయు, రాజును కలిసి కూర్చుండిన సమయమున చెప్పినది. భట్టిదేవి యాతని జన్మను గురించిన సందేహము తనకు లేదనియు తనకుండెనని రాజు భావించుననియు పలికినది.
భట్టిదేవికి కూడ రాజునకు దగ్గరగ రాకపోవుటకు కారణమాతని యందు వైమనస్యము కారణమని చెప్పరాదు. అతడు తనంతతాను దగ్గరగా రావలెనని కోరియుండవచ్చును. వీరపురుషుడామె స్వతంత్రించి తన నోదార్చ వలయునని హృదయమున కోరియుండవచ్చును. కులప్రసక్తిని త్యజించి తననాహ్వానించ వలయునని యతడాశపడెను.
వీరపురుషుని యాత్మన్యూనతా భావమునకు అతని పుట్టుకపైనున్న ప్రజల సందేహములే కారణమలు. మాఠరీదేవి తన తల్లి కాదేమోనను యనుమానము కన్నతల్లి ప్రేమకు పాత్రుడను కానైతినన్న వేదన, చిన్న తనముననే యతని మనసును గాయపరచినది. చిన్నతనమున కలిగిన మనోవ్యధలచే న్యూనతా భావములు కలుగునని మనస్తత్వ శాస్త్రజ్ఞుల యభిప్రాయము. చిన్నతనమున హృదయమును గాయపరచు కొన్ని విషయములు తనను తాను తక్కువ పరచుకొనుచు ఆత్మన్యూనతా భావములను రేకెత్తించుచుండునని డా.విన్సెంట్ పీల్ భావించెను.
వీరపురుషుడు తాను కన్నతల్లి ప్రేమను కోల్పోయితినన్న భావము చేతనుక్షత్రియుడను కానేమోయన్న వర్ణన్యూనతా భావముచే తనునొకరకమైన సంకుచిత మనస్తత్వములో గిరిగీచికొని యుండుట యలవరచుకొన్నాడు. ఈ భావమును తొలగించుటకు తల్లియైన మాఠరీదేవిగాని భార్య భట్టిదేవిగాని సాయపడలేదు. కాకపోగా వారి శక్త్యనుసారమా భావమును సుపోషితము చేసిరనియే చెప్పవలెను. భట్టిదేవి ఆత్మీయతా సూచకముగ నొక్క చిరునవ్వుతో నైన భర్త నాశ్వాసించిన నతడంత మారణకాండ చేసి యుండడు భట్టిదేవిలోని యాధిక్య భావమునకామె వర్ణాధిక్యమేకారణము. వీరపురుషుని వివాహమాడుటకు నిరాకరించుటకు కారణమతడు సుక్షత్రియుడు కాడను ననుమానము చేతనే, ఈ యాధిక్యభావమాయె భర్తకు చేరువకు రానీయలేదు. ఆమెయెన్నియో ఉపవాసములు చేసి శారీరకముగ కృశించినను ఆధిక్యభావము నశింపలేదు. ఆమె పెదవి బిగింపులోనీ విషయము వెల్లడియగుచుండెడిది. అందుచేతనే వీరపురుషుడు ప్రయత్నించి కూడ నామె ముభావమునకు అంత దూరమున నుండి పోవలసి వచ్చినదని యాక్రోశించినాడు.
ఒక స్త్రీ తనకు వివాహమగుట లేదనియు అందులకు తనలోనున్న లోపములేవియో తెలిసికొనగోరి మనస్తత్వ శాస్త్రజ్ఞుడు మతాధికారియైన డా.విన్సెంట్ పీల్ దగ్గరకు వెళ్ళినది. అతడామెను చూచిన తరువాతనిట్లనినాడు. పురుషుడు స్త్రీల యాధిక్యమును గాని ముభావమును గాని సహింపలేడని విన్సెంట్ పీల్ అభిప్రాయము. భట్టిదేవిలో నీరెండునుండుట చేత వీరపురుషుడశాంతిపాలై కక్షమార్గము నవలంబించి తన ప్రేమకు స్థానమైన భార్యనేమియు చేయలేక భార్యయొక్క యభిమాన స్థానములైన వానిపై తన పగను తీర్చుకొనదలచినాడు. హింసచేసినకొలది పగయణగుటకు బదులుగ రెట్టింపుకాసాగినది. ఆహింసా ప్రవృత్తికి ఔషధము వంటిది భట్టిదేవి యొక్క ఆదర పూర్వకమైన చిరునవ్వు. చిట్టచివరికు గాని వీరపురుషునకది లభింపలేదు.
వీరపురుషుడు క్షత్రియులమీద బ్రాహ్మణుల మీద నెందుకింత కోపము ? ఈ కోపమునకు కారణమెవ్వరు ? భట్టిదేవి...వీరపురుషుని జీవితములో విషమొలికించిన దెవరు ? భట్టిదేవి...జీవితమంతనొక విరహా వస్థాఘట్టము జేసినదెవరు ? భట్టిదేవి అని వీరపురుషుడు తన పగకు కారణమంత భట్టిదేవియే యనినాడు.
ఇరువది సంవత్సరముల తరువాత తల్లి కాళింది బౌద్ధమతాచార్యుని వాదమున నోడింపగా రాజు మహానందభరితుడై రాణి సౌధమునకువచ్చి మనసార భట్టీ యని పిలిచినాడు. ఇరువురి మనసులలోనున్న దూరము నాపిలుపు తొలగింప గలిగినది. వసంతకాలము వారి మనః పుష్పవనమున సయ్యాట లాడినది. ఇరువురి న్యూనతాధిక్యభావములు సమసిపోయినవి.
|