యవనుడైన కటకటయోగి నిమిషధారి సమాయమున వేదవతిని తస్కరించుకొని వచ్చెను. అతడు నిమిషధారితో నిట్లనెను. నాకు వేదముతో విరోధము. బహుజన్మలెత్తితిని అన్ని జన్మలయందు వేదమతముతోడి విరోధము సాగించితిని. కాదు యుగాంతము సాధింతును అనెను. నిమిషధారి ఖండకాలమునందలి పరమకనిష్ఠ ఖండస్వరూపుడు అతడు నిముషములను ప్రోగుజేసికొని జీవించును. వేదవతి నాదమయమూర్తి అఖండ గానానంద రసస్వరూపిణి. అఖండప్రణవరూప శబ్దబ్రహ్మము, కావున ఖండస్వరూపుడగు నిమిషధారికిని యఖండమూర్తి యగువేదవతికిని సహజ భిన్న స్వరూపములు.
తాత్కాలకోద్రేక పూరితమైన యసభ్యాసంబద్ధ సంగీతమున కామె హృదయము క్షోభిల్లి శరీరము క్షీణించుట జరిగినది. దృశాద్రఘీయశ్యా యను సౌందర్యలమరీస్తోత్రము టికటిక గానము చేయుచుండగా నామె కార్శ్యముపశమిల్లెను. ఆమెముఖసరోజాతమున శరద్వేళా ప్రాతఃకాల తరుణాదిత్యమృదుకర కిరణములు నిమిరినట్లతి శయించెను. పరమూడేండ్లు దుష్ట సంగీతమును వినివిని మరణోన్ముఖియైన వేదవతిని మధుగుంజయను గాయకురాలి మృదుసంగీతముచేత పురరాశ కల్పించుచు కటకట యోగి తన కఠిన హృదయమును వెల్లడించుకొనెను.
వేదవతి జాగ్రదవస్థలో నుండగా టికటిక శంకచార్యకృత స్తోత్రములను గానము చేసెను. అంతవేదవతి లోనెంతయోమార్పు వచ్చెను. గ్రీష్మర్తువున శుష్కించి పోయిన మహానది కొండలలో మహావర్షములు కురిసి ఉపనదులు శాఖానదులలో నుండి జలముపోసికొని కెరళ్ళుకెరళ్ళు తరగలు తరగలుగా బుడగలు బుడగలుగా గోధుమ పసిత్రాచులు ప్రాకినట్లు కుటుంబములు నడచినట్లు గరుడిపిల్ల లెగిరినట్లు మహాభుజంగములు పూత్కారము చేసినట్లు రసాల మహావృక్షమున రెమ్మరెమ్మను పూవుగుత్తులు చిక్కగా వెదికి వచ్చినట్లు స్నిగ్ధమగుచుండెను. వేదవతి సంగీతమునకింత ప్రభావితమైనది. ఆమె హృదయమింతయు త్ఫుల్లమైనది.
వేదవతి వరాహమిహిరుని సూర్యోపాసన ఫలముగ నవగ్రహోపాసన ఫలముగ కలిగిన తపశ్శక్తి వలన జనించినది. అందుచేతనే వరాహమిహిరుని సర్వవిజ్ఞానమునకు ప్రతీకగవేదవతి యుదయించినది.
చక్రవర్తి విక్రమాదిత్యుడు సర్వయవన నాశనము చేసి దేశము శత్రువిరహితము చేసి వరాహమిహిరాచార్యునితో కలసి వేదవతి యున్న గుహకడకు వచ్చెను. వేదవతి సంభ్రముగా తనతండ్రి వంకజూచెను. పదమూడెండ్ల యెడబాటామె హృదయములో నొక్కక్షణమాత్రమున కదలాడినది. సూర్యకిరణము సూటిగా వ్రాలినట్లు దక్షిణదిశగా వ్రాలినట్లు మిక్కిలి దక్షిణముగ పోయినట్లు మరల వెనుదిరిగి వచ్చినట్లు ప్రాతఃకాలమైనటు, రెండుజాములైనట్లు చంద్రోపరాగము కలిగినట్లు అధికమాసము వచ్చినట్లు క్షయమాసము వచ్చినట్లు వేదవతి తండ్రి వంకజూచుచు నిలుచుండెను. ఇట్లు తండ్రినెడబాసిచాలకాలమునకు చూచిన వేదవతీ ముఖములోని భావ పరంపరఖగోళ శాస్త్రోచితమై యుత్తరాయణ దక్షిణాయనాది సూర్య గ్రహచలనమును, క్షయ అధికమాసాది కాలనిర్ణయమును సర్వమును రచయిత గోచరింపజేసెను. ఈ యుపమానము పాత్రకు తగినట్లు సమయోగితగనుండి యానందదాయియైనది. విక్రమాదిత్యునిలోని యాదిత్య శబ్దము వరాహమిహిరునిలోని మిహిరశబ్దము గాయత్రీ స్వరూపయైన వేదవతియును సర్వము సౌరసంబంధమయముకాగా నవల యాద్యంతము ఖగోళాంతర్గతమైన సూర్యసంచారమయమై విశ్వనాధవారి సవిత్రోపాసనకు పరమోదాహారణి మైనిలచినది.
వేదవతిలోని దేవతా తత్త్వమును గ్రహించిన చక్రవర్తి యామె రాజసభలోనికి రాగా సింహాసనమునుండి దిగియామెకు నమస్కరించెను. పండితులు త్రయీపాఠములు చదువగా కాళిదాసు యాసృష్టిస్స్రష్టురాద్యాయన్న శ్లోకమును పఠించెను.
వరామిహిరుడు చక్రవర్తి కాలస్వరూపుడనియు వేదవతి బీజగణిత మూలగణిత స్వరూపమనియుననెను. ఈమె మేరుపర్వతో పరిభాగమున స్థాపింపబడిన సర్వగణితమునకు మూలస్థానమైన శంకువు. ఈమె కన్నులను కాంతులు పదమూడు శలాకలు అనంతాకాశమును పండ్రెండురాసులుగా విభజించుకాంతి యీమె నేత్రములందున్నది అని చెప్పెను. వేదవతి యొక్క జాతకము వేదధ్వనితోడి ముడివడియున్నది. అనంతధ్వని వికారయైన బ్రహ్మపదార్ధము ఓంకారరూపమైన శబ్ధమయాత్మగా వికారమెట్లు పొందినదో పాంచభౌతకమైన ఈమె శరీరముగానీ వికారము నందినది అని వరాహమిహిరుడు సర్వప్రపంచమును ఓంకారము నుండి యే జనించినదనియునట్టి ఓంకారమే స్త్రీ రూపమునంది వేదవతి యైనదనియు చెప్పెను.
ఇట్లు వేదవతి భారతీయ తత్త్వశాస్త్రమంతయు నొక యాకృతియైనట్లుగ రూపొందినది. ఖగోళమునకు ప్రతికృతి. సంగీత మయాకృతి వేదఘోష ప్రణవాకృతి, సర్వశాస్త్రములను తనలోలీనము గావించుకొన్న పరాశక్తి. కారణజన్మురాలు, అందుచేతనే చక్రవర్తి సహితమీమెను గౌరవించెను. ఏశాస్త్రము నాధారముగాని విమర్శించినదో నాశాస్త్రమ యాకృతియే వేదవతి యన్నట్లుగ పాత్రపోషణ గావించుటతో విశ్వనాథ వారికి గల శాస్త్రవైదుష్యము వెల్లడియగు చున్నది. |