67
 

ఇరువురి జీవిత‌ములు నొక‌టి యైన‌వి. విలాస‌ముగ కాల‌ము గ‌డుపుచుండ‌గా ఏకోన్ముఖ‌ముగ కాల‌ము గ‌డుచుచున్న‌ది. ఒక‌నాడు తండ్రి వ‌చ్చున‌ని బ‌ద్ద‌న్న‌కు తెలిసిన‌ది. ఇరువురును పేర్లు మార్చుకొని దుర్జ‌య‌మందుని క‌లిసికొనుట‌కు పోయిరి. ఏడురోజులు ప్ర‌యాణ‌ము చేసి నాదెండ్ల‌కు చేరుకొనిరి.

కొన్ని దిన‌ములైన త‌రువాత బాద‌మ్మ‌కు ప్ర‌పంచ‌ము క‌నిపించుట మొదలిడిన‌ది. మార‌పేరు పెట్టుకొని బ్ర‌తుకుట బాద‌మ్మ యిచ్చ‌గించ‌లేక‌పోయిన‌ది. అంద‌రిక‌ని య‌థార్ధ‌ము చెప్పిన‌చో మంచిద‌ని బాద‌మ్మ భావ‌ము. గంగ‌చోడుడ‌న్న వీరుడు బ‌ద్ధన్న‌తో స్నేహ‌ముగ నుండ‌గా  త‌మ విష‌య‌ము తెలిసిన పిద‌ప కూడ న‌త‌డు స్నేహ‌ము చూపునాయ‌ని బ‌ద్ద‌న్న న‌డిగిన‌ది. నీకు యుద్ధ‌విష‌య‌ములందున్న యాలోచ‌న మ‌రొక విష‌య‌మున లేదు. నీవ‌నిన‌చో గంగ‌చోడుడు స్నేహ‌ము చూపించు చున్నాడు. నేను నీ భార్య‌ను కాన‌ని న‌న్ను లేవ‌దీసికొని వ‌చ్చితివ‌ని తెలిసిన‌చో నాయ‌న‌కు నీ యందున్న గౌర‌వ‌ము స్నేహ‌ము చెడిపోవ‌చ్చును అని బాద‌మ్మ గ్ర‌హించిన‌ది. ముందు ముందు బ‌ద్ద‌న్న‌పై య‌గౌర‌వ‌ము కొంద‌రికి క‌లుగ వ‌చ్చున‌ని కూడా బాద‌మ్మ  యూహించిన‌ది.

సేనాధ్య‌క్షుడైన అంబ‌య్య బ‌ద్ద‌న్న‌ను తిర‌స్క‌రించెను. ఆ తిర‌స్కారున క‌తఃకార‌ణ‌ము బ‌ద్ద‌న్న శౌర్య‌ము. త‌న నోడించిన క‌ల‌వాల‌భైర‌వుని బ‌ద్ద‌న్న ఖండించెన‌న్న ఈర్ష్య‌. త‌న‌ను మించిన శౌర్య‌ముతో పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకొన్న అసూయ‌. సేనాధ్య‌క్షునిక‌న్న నొక సామాన్య యువ‌కుడు బ‌ల‌వంతుడ‌గుట‌చే త‌న క‌వ‌మాన‌ము. ఇన్ని కార‌ణ‌ముల చేత  బ‌ద్ద‌న్న‌కు అంబ‌య్య తిర‌స్క‌రించినాడు. బ‌హిష్కార‌ణ‌ము మాత్ర‌ము బాద‌మ్మ బ‌ద్ద‌న్న‌ల ప్ర‌ణ‌య‌ము స్నేహితుడ‌గు మంద‌య్య చెప్పిన‌ను న‌మ్మిన బంటు అన్య‌కుడు చెప్పిన ఒప్పుకొన‌క బ‌ద్ద‌న్న‌ను తిర‌స్క‌రించెను.

అంబ‌య్య తిర‌స్కార‌ము బ‌ద్ద‌య్య హృద‌య‌పు లోతుల‌ను తాకిన‌ది. అంత‌వ‌ర‌కంద‌రు న‌త‌నిని పొగిడిన‌వారే. అతిన నీతిని మెచ్చుకొనినివారే. బాదమ్మ మీద ప్ర‌ణ‌య‌పు పొంగు చ‌ల్లార్చుట మొద‌లిడిన ద‌గ్గ‌ర‌నుండి బ‌ద్ద‌న్న‌లో ధ‌ర్మము, న్యాయ‌ము, పాప‌ము అను విష‌య‌ములు గుర్తున‌కు వ‌చ్చు చుండిన‌వి. ఇది యొక ప‌శ్చాత్తాప‌ము. లోప‌ల‌నే స్వ‌రూప‌ము పొడ కట్టించ కుండా నున్న‌ది. అంబ‌య్య తిర‌స్కార‌ము దీనికి సాయ‌ప‌డిన‌ది. ప‌శ్చాత్తాప‌మును తిర‌స్కార‌మును మ‌భ్య‌పెట్టుట‌కు బ‌ద్ద‌న్న బాద‌మ్మ‌నుప‌యోగించుకొనెను. కోప‌మును, ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించుట‌లో విశ్వ‌నాథ‌వారు క్రొత్త పంథా త్తొక్కియున్నారు. ధ‌ర్మ‌చ‌క్ర‌మునందు వీర పురుష‌ద‌త్తుడు ప్రేమ‌ను ప‌గ‌రూప‌మున ప్ర‌ద‌ర్శించినాడు. ఒక‌రిపై ప్రేమ మ‌రియొక‌రిమీద ప‌గ‌యైన‌ది. ఇచ‌ట బ‌ద్ద‌న్న‌కు అంబ‌య్య తిర‌స్కార‌ము బాద‌మ్మ మీద ప్రేమ‌ను అధిక‌ము చేసిన‌ది. ఈ ప్రాతికూల్య‌ము భాసించిన నాటినుండియు బ‌ద్ద‌న్న‌కు బ‌ట్టుద‌ల యొక్కువ‌య్యెను. బాద‌మ్మ మీద న‌నురాగ‌మెక్కువ‌య్యెను. బాద‌మ్మ క‌డ‌చిన నెల‌నాళ్ళెరుగ‌ని సుఖ‌ము న‌నుభ‌వించుచుండెను. కాని బ‌ద్ద‌న్న మ‌న‌సు వేరు యోచ‌న‌ను చేయుచుండ‌గా శ‌రీర‌ము మాత్ర‌ము బాద‌మ్మ‌తో నున్న‌ది. చాలా రోజులూహింప‌గా నూహింప‌గా నొక‌నాటి తెల్ల‌వారుక‌డ నొక మార్గ‌ము స్ఫురించిన‌ది. అప్పుడు బాద‌మ్మ పక్క‌నే యున్న‌ది. అత‌డు లేచిన వేగ‌మున కామెకు మెల‌కువ వ‌చ్చిన‌ది. అప్ప‌టికే బ‌ద్ద‌న్న కొంత దవ్వేగినాడు. బాద‌మ్మ ఏమి అని అడిగిన‌ది. బ‌ద్ద‌న్న నేను వేంగికిపోవు చున్నాను. అని పోవుచుండెను. బాద‌మ్మ కేమియు తోచిన‌దికాదు. నీవు కొప్పాక‌కు పొమ్ము నేను కొన్ని దిన‌ముల‌లో క‌ల‌సికొందును అనెను. బాద‌మ్మ ఏడ్వ‌నారంభించిన‌ది. అర్ధ‌రాత్ర‌మున చీర‌చించుకొనిపోయిన న‌లునివ‌లె బ‌ద్ద‌న్న ప్ర‌వ‌ర్తించ‌గా ద‌మ‌యంతివ‌లె దుఃఖించుట బాద‌మ్మ వంతైన‌ది.

బాద‌మ్మ స్థితి యేగ‌మున‌ని బ‌ద్ద‌న్న యేచింప‌లేదు. ధ‌నికుడైన తెప్ప‌న్న ద‌గ్గ‌ర నుండి వెడ‌లి వ‌చ్చుట‌కు తానైయై యున్నాడు. ఆమెను ఆర్థిక స్థిర‌త్వ‌ము నుండి సాంఘిక స్థిర‌త్వ‌ము నుండి చ్యుతినొందించినాడు. క‌డ‌కూరుగాని యూరిలో నా యనువారు లేని తావున విడిచి కొప్పాక‌కు పొమ్మ‌న్న యొక్క మాట‌తో బాద‌మ్మ వ‌ద్ద‌నుండి నిష్క్ర‌మించినాడు. బాద‌మ్మ యేడ్పు బ‌ద్ద‌న్న‌కు ప‌ట్టలేదు. ప‌ట్ట‌దు. కొప్పాక‌లో నీమె యెన్ని అవ‌మాన‌ముల‌కు గురికావ‌ల‌సి వ‌చ్చునో బ‌ద్ద‌న్న కక్క‌ర‌లేదు. అత‌నికి యుద్ధ‌ము దేశ‌ము ప్ర‌ధాన‌ములు.

ప్ర‌ణ‌య‌మున‌కు రెండ‌వ స్థాన‌ము. బాద‌మ్మ యేడ్చుట త‌ప్ప మ‌రేమి చేయ‌గ‌ల‌దు ! స్వ‌యంకృతాప రాధ‌ము. మొదటిరోజు సంకేత‌మిచ్చి రాక‌పొయిన‌వాడే బ‌ద్ద‌న్న హృద‌య‌ము గ్ర‌హింప‌వ‌ల‌సిన‌ది. బాద‌మ్మ కొప్పాక‌కు చేరి యాహార‌ము తిన‌క శుష్కించి పోయిన‌ది. న‌లుబ‌దియైదు రోజుల త‌రువాత త్రిపురాంత‌కుడు బ‌ద్ద‌న్న‌ను విజ‌య‌వాటాధిపునిగ చేసెను. బ‌ద్ద‌న్న మంద‌య్య‌తో బాద‌మ్మ‌ను లేవ‌తీసికొని వ‌చ్చుట త‌ప్ప‌ని త‌న‌కు తెలియ‌ద‌నెను. అది వ్య‌భిచార‌మ‌ని కూడా న‌త‌నికి తెలియ‌ద‌ట‌. ఇది నిజ‌ము. తిప్ప‌న్న తానువ‌ల‌చిన స్త్రీని పెండ్లి యాడ‌వ‌చ్చును. ప్రేముడి లేని బాద‌మ్మ య‌త‌నికేల యింధ‌న‌ము క‌వాల‌మ‌యుననెను. లోక‌ములో న‌ధ‌ర్మ‌ము చేయ‌ద‌ల‌చిన ప్ర‌తి వ్య‌క్తియు నిట్లే వాదింప‌వ‌చ్చును. త‌మ యిష్ట‌ము వ‌చ్చిన వారితో సంంచించుట‌కీ వాద‌మును ప్రోద్బ‌ల‌ముగ జేసికొన వ‌చ్చును. అట్లైన‌చో వివామ‌వ్య‌వ‌స్థ‌, ద‌ర్మ‌రూప‌ము చెద‌రిపోవును. స‌మాజ‌మున స్త్రీల‌కు ర‌క్ష‌ణ లోపింప వ‌చ్చును. త‌మ‌ను ప్రాణ‌ము క‌న్న నెక్కువ ప్రేమించుచుంటిమ‌ను స‌రికి బాద‌మ్మ‌వ‌లె మోస‌పోవుదురు. మోజు తీరిన త‌రువాత బ‌ద్ద‌న్న వ‌లెనే నీవే లేచివ‌చ్చితివి. నీకు ధ‌ర్మ‌మ‌క్క‌ర‌లేద‌ని యెత్తి పొడుతురు. బ‌ద్ద‌న్న‌కు బాద‌మ్మ‌మీద ప్రేమ లేక ఇట్ల‌న‌లేదు కాని య‌తాడామెను బాధ్య‌తాయుత‌ముగ ర‌క్షింప‌లేక న‌ట్ల‌నినాడు. అతనికి కావ‌లిన‌ది దేశ క్షేమ‌ము. ఇందుచేత బ‌ద్ద‌న్న గొప్ప వీరునిగ రాణించి నంతంగ ప్రేమికునిగ రాణింప లేక‌పోయినాడు.

బాద‌మ్మ ప‌రిస్థితి యట్టిదికాదు. ఆమెకు బ‌ద్ద‌న్న‌పైగ‌ల ప్రేమ‌యే నొక ప్ర‌త్యేక‌మైన స్థాయి క‌ల‌ది !  బ‌ద్ద‌న్న‌ముందు ఆమెకు ధ‌న‌ము, సాంఘిక భ‌ద్ర‌త స‌మాజ‌ము, కీర్తి ధ‌ర్మ‌ము మొద‌లైన‌వ‌న్నియు దిగ‌దుడుపులు. ఆమె యంత‌టి యుద్వేగ‌ప్ర‌ణ‌యిని ! త‌న‌ను బ‌ద్ద‌న్న నిరాధార‌నుగ‌జేసి దేశ‌ము కాని దేశ‌మున విడిచి వెళ్ళిన‌ను కోప‌గించ లేక‌పోయిన‌ది.

చాళుక్యుల నుండి దేశ‌మును స్వ‌తంత్ర‌మును చేయుట‌కు బ‌ద్ద‌న్న సాటిలేని శౌర్య‌మును చూపి ప‌దినెల‌ల త‌రువాత త‌మ స్వ‌గ్రామ‌మైన గోశాల గ్రామ‌మున బాద‌మ్మ‌తో కాపుర‌ము పెట్టెను. బ‌ద్ద‌న్న చేసిన మ‌హా ఘ‌న‌కార్య‌మున‌కు ప్ర‌తిఫ‌ల‌ము రాలేదు. త‌న చేత‌ను ప్ర‌కృతులు పొందిన రాజులు త‌న‌ను నిర్ల‌క్ష్య‌ము చేయుట‌చే బ‌ద్ద‌న్న కృంగిపోయెను. ఈ నిరాద‌ర‌ణ‌ముతో బ‌ద్ద‌న్న ముప్రొద్దులు బాద‌మ్మ తొడ‌నే యుండ సాగెను. బాద‌మ్మ‌యే మ‌హారాజు. ఆమెను సేవింతున‌నెను. బాద‌మ్మ బ‌ద్ద‌న్న బాధ న‌ర్థ‌ము చేసుకొని ప్ర‌తిప‌లాపేక్ష‌తో చేయ‌రాద‌ని హిత‌వు ప‌లికెడిది. అతని యంత‌రంగ‌మున త్ర‌వ్వి య‌త‌ని భావ‌ముల‌త‌నికి విప్పి చెప్పెడిది. బాద‌మ్మ‌కు వైష్ణ‌వ మ‌త‌ములోని ర‌హ‌స్య‌ముల‌న్నియు తెలియును. అయిన‌ను కామ‌ము జయింప‌రానిద‌ని బ‌ద్ద‌న్న‌తో చెప్పిన‌ది. లేకున్న‌చో న‌త‌నితో లేచివ‌చ్చి యుండెడిదాన‌ను కాన‌ని కూడా ప‌లికిన‌ది.

బ‌ద్ద‌న్న బాదమ్మ లిరువురున‌కు త‌న త‌ప్పులు తెలిసిన‌వి. ఎవ‌రికి వారే త‌ప్పు  త‌మ‌దేయ‌నుకొన‌సాగిరి. బ‌ద్ద‌న్న బాద‌మ్మ‌ను భ‌ర్త ఇంటి నుండి తీసికొన‌వ‌చ్చి ర‌క్ష‌ణ‌లేకుండ జేస‌తిన‌నెను. అధ‌ర్మ‌మైన స్త్రీ పురుష సంగ‌మ‌మునందు పురుషుడధిక శిక్షార్హుడ‌ని బ‌ద్ద‌న్న ప‌లుక‌గా ఒక్కొక్క‌ప్పుడు పురుషుని క‌న్న స్త్రీయంద‌ధిక దోష‌ముండున‌ని బాద‌మ్మ య‌నిన‌ది. ప‌రిష‌త్తు వారికి విధింప‌బోవు శిక్ష‌ను త‌ప్పించుకొనుట‌కై కొప్పాక వెళ్ళిరి. బాద‌మ్మ బ‌ద్ద‌న్న‌ను ఓదార్చ‌గ నావ‌ల‌న ద‌ప్పేమియు లేదా య‌ని బ‌ద్ద‌న్న య‌మాయ‌క‌ముగ న‌డిగెను. నేను నీ యంద‌లి ప్రేమ‌చేత లేదందును. కాని లోక‌ము ఉన్న‌ద‌న‌ను బాద‌మ్మ ధ‌ర్మా ధ‌ర్మా విచ‌క్ష‌ణ యుక్తాయుక్త నిర్ణ‌య‌ము పాప‌పుణ్య‌ముల ప్ర‌స‌క్తి చేయ‌గ‌ల‌దు. బాద‌మ్మ‌కున్నంత లొక‌జ్ఞాన‌ము బ‌ద్ద‌న్న‌కు లేదు. ఖ‌డ్గ విష‌య‌మున వ‌లెనే శృంగార విష‌య‌మున కూడ నీమె బ‌ద్ద‌న‌కు గురుత్వ‌ము వ‌హించిన‌ది. ఇన్ని తెలిసిన బాద‌మ్మ య‌ధ‌ర్మ వ‌ర్త‌న‌మేల చేసిన‌ది ?  అన‌గా నామెలో బ‌ద్ద‌న్న పై గ‌ల ప్ర‌ణ‌యాధిక్య‌ము మిగిలిన వాటిన‌న్నిటిని త్రోసివేయ గ‌ల్గిన‌ది. శ‌రీర‌సుఖ‌ము కొర‌కు కూడ వ‌చ్చితిన‌ని బాద‌మ్మ యంగీక‌రించిన‌ది.

బాద‌మ్మ బ‌ద్ద‌న్నలు సాధార‌ణ రైతుల‌వ‌లె పొల‌ము పనులు చేసికొనుచు కాల‌ము గ‌డుపు చుండ‌గా మూడు సంవ‌త్స‌ర‌ముల త‌రువాత బాద‌మ్మ భ‌ర్త తిప్ప‌న్న ప‌రిష‌త్తులో న‌బియోగ‌ము తెచ్చి వారికి శిక్ష వేయింప‌ద‌ల‌చెను. బద్ద‌న్న‌కు పౌరుష‌మువ‌చ్చి ప‌రిష‌త్తున‌కు రాన‌నియు, ఎదురొచ్చిన వారి త‌ల‌ల‌ను తెగ‌న‌రికెద‌న‌నియు ప‌లికి దేశ‌మును రెండు ముక్క‌ల‌ను చేతున‌నెను. బాద‌మ్మ వివేక‌ముతో న‌త‌ని యావేశ‌ము న‌డంచిన‌ది. నీ వివేక‌మువ‌ల‌న నీ నీతివ‌ల‌న నీ శౌర్య‌మువ‌ల‌న నీ బాహుబ‌ల‌ము వ‌ల‌న నాంధ్ర‌దేశ‌ము స్వ‌తంత్ర‌మైన‌ది. ఒక్క గొడుగు క్రింద నిల‌చిన‌ది అనున‌ది మ‌ర‌ల దానిని ముక్క‌లు చేయ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికిన‌ది. ఇప్పుడు బ‌ద్ద‌న్న సైన్య‌మును కూట‌గ‌ట్టుట స్వార్థ‌ముచేత న‌యినందున ప్ర‌జ‌లు సాయ‌ప‌డ‌ర‌ని వివేక‌ముగ ప‌ల్కిన‌ది. పంచమురాలైన బాద‌మ్మ చూపినంత వివేక‌ము క్ష‌త్రియ స్త్రీయైన భ‌ట్టిదేవి చూప‌క‌పోవుట‌చే ధ‌ర్మ‌చ‌క్ర‌ములోని వీర‌పురుషుడు దేశ‌ములోన రాజ‌క‌ము పుట్టించెను. బాద‌మ్మ బ‌ద్ద‌న్న కోప‌పుపొంగుపై నీరుజ‌ల్ల‌నిచో బ‌ద్ద‌న్న ప్ర‌జామార‌ణ‌హోమ‌ము చేసి యుండెడివాడు. బ‌ద్ద‌న్న రోదించు చుండ‌గా బాద‌మ్మ హృద‌య‌ము త‌రుగుకొనిపోయిన‌ది. అంత‌టి ప్ర‌తిభావంతుడు త‌న కార‌ణ‌మున దోషిగ నిలువ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది. ఏ ప‌రిష‌త్తున‌కు తానొక మ‌హారాజుగ నుండెనో ఆ పరిష‌త్తుముందు త‌ల‌వాల్చ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది. అత‌డెంత కుముల‌చున్నాడోయ‌ని బాద‌మ్మ వ్య‌ధ చెందిన‌ది. అత‌నిలో నేమిచూచి యాక‌ర్షితు రాల‌నైతినాయ‌ని విమ‌ర్శించుకొనిన‌ది. అత‌డంద‌గాడు కాడు. విద్యచేత నాక‌ర్షింప‌బ‌డిన‌దా?  అదియును కాదు కొంత య‌త‌ని ప్ర‌తిభ కొంత య‌త‌ని మ‌త‌ము త‌మ ప‌త‌న‌ముల‌కు కార‌ణ‌ముల‌ని నిర్ణ‌యించు కొనిన‌ది. తాను వైష్ణ‌వ మ‌త‌స్తురాలు. అత‌డు శైవుడు. అంత‌టి వీరుడు వైష్ణ‌వుడైన‌చో నెంత బాగుండున‌ని బాద‌మ్మ చాలాసార్లు యోచించెను. చాలా దిన‌ములుగా బ‌ద్ద‌న్న యంతటివాడు శైవుడై యుండుట కామె మ‌నస్సంగీక‌రింప‌లేదు. అత‌డు వైష్ణ‌వుడైన‌చో నెంత బాగుండున‌ని ఆమె చాలా సార్లూహించెను. ఆమె యాలోచించ‌గా నాలోచించ‌గాన‌ది ప్ర‌ధాన కార‌ణ‌ము,త‌క్కిన‌వి యుప‌కార‌ణ‌ముగా నామె బుద్ధికి దోచెను. కాని బ‌ద్ద‌న్న తో బ్ర‌తుకుట మొద‌లైన నాటి నుండియు బ‌ద్ద‌న్న శైవుడ‌ని గాని తాను వైష్ణ‌వి న‌ని గాని భేద‌భావ‌మే క‌లుగ‌లేదు. ఆమెకు మ‌త‌ము జీవిత‌ము బ‌ద్ద‌న్న‌యే అయినాడు.