68
 

బ‌ద్ద‌న్న‌, బాద‌మ్మ ప్రేమ‌మాట‌యే మ‌ర‌చి కొప్పాక‌లో క‌ష్ట‌ప‌డుట‌, తినుట‌గా జీవిత‌మును సాగించుచుండిరి. బ‌ద్ద‌న్న‌లో యుద్ధ‌నీతియు రాజ‌తంత్ర‌ము కూడ న‌ట్లే మ‌రుగున ప‌డిన‌వి.

బాద‌మ్మ బ‌ద్ద‌న్న‌లు త‌న పేరుల‌ను కూడా మ‌ర‌చిన‌ట్లేయుండిరి. తాము ప్రేమించుకొని లేచి వ‌చ్చితిమ‌ని కూడా మ‌ర‌చి యంత్ర‌మువ‌లె కాల‌ము గ‌డుపుచుండ‌గా ప‌రిష‌త్తు పంపున నాగ‌న్న య‌నువాడు బ‌ద్ద‌న్న‌కై కొప్పాక‌కు వ‌చ్చెను. బ‌ద్ద‌న్న దిగులు ప‌డెను. బాద‌మ్మ‌కుత్సాహ‌ము క‌లిగెను. నాగ‌న్న వ‌చ్చి తాను తిప్ప‌న్న భార్య‌న‌నియు బ‌ద్ద‌న్న ను ప్రేమించి వ‌చ్చిత‌నిన‌నియు గుర్తున‌కు తెచ్చెను. ప్రేమ గుర్తుకువ‌చ్చినంత‌నే మ‌ర‌ల వారిరువురును శృంగార సార‌ధి దేవ‌త‌లైనారు. కొప్పాక నుండి వేంగికి వేంగి నుండి రాజ‌ధానికి వెళ్ళిరి. మ‌హారాజు స‌భ‌లో బ‌ద్ద‌న్న దోష‌మును సేనాధ్య‌క్షుడైన యంబ‌య్య ప్ర‌స్తావించ‌గా నాగ‌య్య సాక్ష్య‌ముండెను.

బ‌ద్ద‌న్న ప‌క్ష‌మున సామంత‌రాజులు సేనానాయ‌కులు మ‌హామ‌హులు చాల‌మంది యుండిరి. త్రిపురాంత‌కుడు, విష్ణువ‌ర్మ‌, మంద‌య్య‌, చంద్ర‌గౌడు గంగ‌చోడుడు న‌న్న‌య్య మొద‌లైన వీరులంద‌రును బ‌ద్ద‌న్న బ్ర‌తుక‌వ‌లెన‌ని కోరిరి. ఒక సేనానిపై చేయున‌ట్టి అభియోగ‌ము మ‌రియొక సేనానిచేత చేయ‌బ‌డినప్పుడా యిరువురును ద్వంద్వ‌యుద్ధ‌ము చేయ‌వ‌లెన‌న్న‌ది న్యాయ‌సూత్ర‌ము. సేనాధ్య‌క్షుడ‌గు నంబ‌య్య బ‌ద్ద‌న్న‌తో యుద్ధ‌మున‌కు దిగెను. బ‌ద్ద‌న్న గొప్ప రాజ‌భ‌క్తుడు. బాల్యమునుండియు అంబ‌య్య‌ను ఆద‌ర్శ‌ముగ హృద‌య‌మున నుంచుకొనినాడు. అందుచేత త‌న కాద‌ర్శ‌యోధుడైన అంబ‌య్య‌ను క్ష‌ణ‌ములో న‌ర‌కుట‌కు శ‌క్తిగ‌ల‌వాడ‌య్యు, చేత‌గాని వానివ‌లె న‌టించి తాను అంబ‌య్య చేతిలో చనిపోయెను. కాని అంబ‌య్య వ్రేళ్ళ‌ను న‌రికి యాత‌నిని సేనానాయ‌కునిగ ప‌నికిరాకుండ చేసెను.

బ‌ద్ద‌న్న మ‌ర‌ణ‌మును చూచిన బాద‌మ్మ కత్తితో గుండెల‌లో పొడుచుకొని బ‌ద్ద‌న్న పైబ‌డి మ‌ర‌ణించుచు మ‌హారాజు ఏనుగువంటి సేనానిని కోల్పోయెన‌న్న‌ది. వంద ఏగ‌నుగుల‌వంటి వీరుడు బ‌ద్ద‌న్న మేక‌వంటివాడు అంబ‌య్య అనిన‌ది. అత‌డు జారుడుకాడు తాను జారిణినికాదు త‌మ ప్రేమ‌కు లోక‌సూత్ర‌ములు ప‌ట్ట‌వ‌న్న‌ది. త‌మ‌ది లింగాజ్ఞానాతీత‌మైన ప్రేమ అని వెల్ల‌డించి మ‌ర‌ణించిన‌ది. బాద‌మ్మ‌కు బ‌ద్ద‌న్న‌పై గ‌ల ప్రేమ యీ సంఘ‌ట‌న‌ము వ‌ల‌న సువ్య‌క్త‌మ‌గు చున్న‌ది. బాదమ్మ క‌త‌నిపై నున్న ప్రేమేత్కృష్ట‌మును వెల్ల‌డియైనంత మాత్ర‌ముచేత వారిద్ద‌రి మ‌ధ్య‌నున్న బంధ‌మును ధ‌ర్మబంధ‌మ‌న‌రాదు. ఆ విష‌య‌మా యిరువురికి తెలిసియేయున్న‌ది. బ‌ద్ద‌న్న మ‌రింత గ్ర‌హించి ధ్వంధ‌యుద్ధ స‌మ‌యమున నిష్క్రియుడై మ‌ర‌ణించెను. బాద‌మ్మ‌కు కూడ మ‌ర‌ణ‌ము త‌ప్ప గ‌త్యంత‌ర‌ము లేదు. ఆమెకు బ‌ద్ద‌న్న వినా ప్ర‌పంచ‌ము లేదు. అక్క‌ర‌లేదు.

బాద‌మ్మ ప‌లికిన‌ట్లుగ వారిది లింగ‌జ్ఞానాతీత‌మైన ప్రేమ‌యా ?  కాదా య‌ను నంశ‌ము విమ‌ర్శింప‌వ‌ల‌సి యున్న‌ది. బాద‌మ్మ‌వివాహిత‌యై కూడ త‌న‌క‌న్న చిన్న‌వాడ‌నిని ప్రేమించి యత‌నితో జీవిత‌మును పంచుకొనిన‌ది. బాద‌మ్మ బ‌ద్ద‌న్న‌ను ప్రేమించుట యెటు చూచిన‌ను స‌మ‌ర్థ‌నీయ‌ముకాదు. చెలియ‌లిక‌ట్ట లో వారేమి నిరూపింప‌ద‌ల‌చికొనిరో బద్ద‌న్న సేనాని లోవారే కాద‌నిపించుట జరిగిన‌ది. స్త్రీలు పురుషుల‌ను మార్చుచు పోరాదు. అంద‌మైన వాడ‌నియో, ధ‌న‌వంతుడ‌నియో, మ‌రియొక గుణ‌మేదైన నున్న‌ద‌నియో, భ‌ర్త‌ను కాద‌ని మ‌రియొక‌నిని చేప‌ట్ట‌రాద‌నిరి. బాద‌మ్మ తిప్ప‌న్న‌ను కాద‌ని బ‌ద్ద‌న్న వెంట‌ప‌డిన‌ది. బ‌ద్దన్న వ‌చ్చువ‌ర‌కు తిప్ప‌న్న‌లోని లోప‌మేమియు బాద‌మ్మ‌కు కాన‌రాలేదు. వేయిప‌గ‌డ‌లు లోని మంగ‌మ్మ వెల‌గాని చెలియ‌లిక‌ట్ట లోని ర‌త్నావ‌ళి వ‌లెగాని బాద‌మ్మ‌కు పశ్చాత్తాప‌ము క‌లుగ‌మి చేవారిరువుర‌కు పాఠ‌కుల మ‌న‌సునందు ల‌భించిన సానుభూతి యీమెకు ల‌భింప‌దు. త‌న ప్ర‌వర్త‌న‌ను స‌మ‌ర్థించుకొను స‌మ‌య‌మున బాద‌మ్మ త‌న ప్రేమ‌కు లింగ‌జ్ఞానీతీత‌మ‌ని పేరు పెట్టిన‌ది. బాద‌మ్మ ప్రేమ లింగ‌జ్ఞానాతీత‌మైన‌ద‌నుట యెట్లు పొస‌గును ?  వారి శృంగార‌మున ప్ర‌థ‌మ ఘ‌ట్ట‌మైన క‌ల‌యిక లింగ‌జ్ఞాన‌ముచేత‌నే సాధ్య‌మైన‌ది. బాద‌మ్మ‌ను తిప్ప‌న్న యొడ‌లు హున‌మ‌గున‌ట్లు కొట్టి పంపిన‌ప్పుడు బద్ద‌న్న ఆమె శ‌రీర‌మున‌కు వేడినీటి కాపు పెట్టెను. అప్పుడ‌త‌ని కామె శ‌రీర‌ము శృంగార‌పురుషుడైన మ‌న్మ‌ధుని మహార‌ధ‌వ‌లె కానుపించి యొక విచిత్రానుభూతిని రేకెత్తించిన‌ది. ఆ య‌నుభూతి విశేష‌ములో గ‌ర‌వాల‌భైర‌వుని తాను సంహరించి పొందిన ప్ర‌తిష్టాసౌఖ్య‌ముగాని గ‌డించిన శౌర్య రేఖా ప్రాచుర్యాను భూతిగాని ల‌భించిన సేనానాయ‌క‌త్వ మ‌ర్యాద‌గాని  య‌నుస‌రించుచున్న వేలాది జ‌న‌ములు చూపు గౌర‌వ‌ము యొక్క సుఖ‌ముగాని శ‌తాంశ‌మున‌కు రాలేదు.

ఇందువ‌ల‌న వ్య‌క్త‌మైనదేమ‌న‌గా బ‌ద్ద‌న్న‌కు బాద‌మ్మ శ‌రీర‌ము ముందు, ప్ర‌తిష్ఠ‌, శౌర్య‌ము, మ‌ర్యాద‌, అధికార‌ము, యివి యేవియును లెక్క‌కురాలేద‌నుట‌. ఇది బ‌ద్ద‌న్న య‌నుభ‌వ‌ము బాద‌మ్మ‌కు కూడ నిట్టి య‌నుభూతి విశేష‌ము క‌లుగ‌క మాన‌లేదు. ఆమె బాధ‌నుండి యొక సౌఖ్య‌మును బ్ర‌క‌టించిన‌ది. వారిరువుర‌కు బాహ్య‌ప్ర‌పంచ‌ము మ‌రపున‌కు వ‌చ్చిన‌ది. బ‌ద్ద‌న్న బాద‌మ్మ‌ల‌కు బ‌య‌ట సూర్యుడు కాల‌మున పొడ‌చుచున్నాడ‌ని, యెండ‌లు ముదిరి గుత్తులు స‌డ‌లి విర‌విర‌పోయి చెద‌రి చ‌ల్ల‌బ‌డి రాత్రి వ‌చ్చి యాకాశ‌వీధులు శిశిర‌ములై బ‌య‌ట చ‌లివేసి యేమో యేమో మారుచున్న‌ద‌ని తెలియ‌దు ఇరువుర‌కును నిద్ర‌పోతిమ‌నిగాని మేల్కొంటిమ‌నిగాని విచ‌క్ష‌ణ క‌లుగ‌లేదు. అదియొక మ‌హాస‌ముద్ర‌ము. ఆ శృంగార ప‌యోధినిరువురును క‌లసియే త‌రించిరి. ఆ త‌రించుట‌లో బాద‌మ్మ చుక్కానియైన‌ది. కావున దోష‌ము బాద‌మ్మ యందే గాఢ‌మైయున్న‌ది. బ‌ద్ద‌న్న పురుషుడును, యువ‌కుడును. ఉడుకు ర‌క్త‌ము క‌ల‌వాడ‌ను న‌గుట‌చే పాలింప‌వ‌ల‌సిన బాద‌మ్మ ప్రోత్స‌హించుట విశ్వ‌నాథ‌వారి న‌వ‌ల‌లో కెల్ల మ‌చ్చ‌వ‌లె నిల‌చిపోవును. త‌న క‌న్న చిన్న‌వాడైన బ‌ద్ద‌న్న‌ను చూచినప్పుడు బాద‌మ్మ‌లో క‌లుగ‌వ‌ల‌సిన‌ది మాతృభావ‌ము. ఇది భార‌తీయ సంస్కార విష‌య‌ము. హృద‌య‌ము సంయ‌మింప బ‌డ‌వ‌లెను. కావున న‌ది హృద‌య సంస్కార విష‌య‌ము. మ‌న‌సులో సంక‌ల్ప విక‌ల్ప‌ములు గ‌లుగుచునే యుండును గాని ధ‌ర్మ వ్య‌తిక్ర‌మ‌ణ‌మును చేయుట‌కు మ‌న‌స్సు ప్ర‌య‌త్న‌ము చేయుచున్న‌ప్పుడు దాని నడంచ ప్ర‌య‌త్నించుట బుద్ధి సంస్కార విష‌య‌ము. బాద‌మ్మ‌లో నీ మూడును లోపించిన‌వి. కానీ ఆ యాలోపించుట‌ను స‌మ‌ర్థించుచు త‌న ప్ర‌ణ‌య‌మున కొక పెద్ద పేరుపెట్టిన‌ది. ఇది భ‌గ‌వంతుడు చేసిన‌ప‌ని. నీవును నేనును చేయ‌లేదు. దీనికి లోక‌ము మ‌నల‌ను నిందించిన‌చో భ‌గ‌వంతుని యొక్క యుద్దేశ్య‌ము తెలియ‌క‌పోవుట య‌గును. అని బ‌ద్ద‌న్న‌తో త‌మ ప్రేమ‌ను స‌మ‌ర్థించుచు చెప్పిన‌ది. అత‌నికి స్త్రీ వాంఛ ప్రారంభ‌మైన నాటి నుండి బాద‌మ్మ‌నే ప్రేమించుట మొద‌లిడినాడ‌ట‌. నాలో స్త్రీ వాంఛ యన్న‌ది ప్రారంభ‌మయి నప్ప‌టి నుండి నేను నిన్నే ప్రేమించితిని అని బ‌ద్ద‌న్న బాద‌మ్మ‌తో చెప్పినాడు. కాని ఇంత‌టి ప్ర‌ణ‌య స్వ‌రూపుడ‌యిన బ‌ద్ద‌న్న క‌ష్ట‌ము వ‌చ్చిన‌పుడు నిన్ను నేను లేవ‌దీసుకొని రాలేదు నీవే వ‌చ్చితివి అని యెత్తి పొడిచినాడు. కామ‌ము లేకుండ ప్రేమ యుండ‌ద‌ని బాద‌మ్మ‌యే అంగీక‌రించిన‌ది. పూవుకు వాస‌న యెటువంటిదో ప్రేమ‌కు కామ‌ము అటువంటిది. కొంద‌రు కామ‌మే పుష్ప‌ము. ప్రేమ‌యే వాస‌న యందురామో నేన‌ది యంగీక‌రించ‌ను. కామ‌ము లేకుండా ప్రేమ‌య‌ట్లే యుండ‌దు అనిన‌ది. కావున బాద‌మ్మ చెప్పిన లింగ‌జ్ఞానాతీత‌మైన ప్రేమ య‌న్న సిద్ధాంత‌మును ఆమె మాటలే ఖండించుచున్న‌వి.

బాద‌మ్మ బ‌ద్ద‌న్న‌ల ప్ర‌ణ‌యాసూత్ర‌మాధార‌ముగగొని య‌ల్ల‌బ‌డిన బ‌ద్ద‌న్న సేనాని న‌వ‌ల క‌రుణ ర‌సాత్మ‌క‌మైన‌ది. వారిరువురు ప‌డిన క‌ష్ట‌ములు ఏనుగు వంటి బ‌ద్ద‌న్న పిల్లివ‌లె నిష్క్రియుడై మ‌ర‌ణింప‌వ‌ల‌సి వ‌చ్చుట ర‌స‌పూర‌ముగ చిత్రింప‌బ‌డిన‌ది. ర‌స‌ము నాధార‌ముగ జేసికొని నిర్ణ‌యింప‌వ‌ల‌సి వ‌చ్చిన‌చో ఏకోర‌సః క‌రుణ‌యేవ అన్న సూత్ర‌మువ‌ల‌న బ‌ద్ద‌న్న సేనాని కి ప్ర‌ధ‌మ తాంబూల మీయ‌వ‌లెను. ప్ర‌ణ‌య‌ము నాధార‌ముగ చేసికొన్న‌చో స‌మాజ‌మును ధ‌న‌మును, ప‌రువు మ‌ర్యాద‌ల‌ను ధ‌ర్మ‌మును క‌డ‌కు ప్రాణ‌మును కూడా తాను ప్రేమించిన వానికై వెచ్చించిన బాద‌మ్మ‌ను ప్ర‌ణ‌య‌ప‌యోధి య‌న‌వ‌లెను. ధ‌ర్మ‌మును, సంప్ర‌దాయ‌మును కాద‌ని తిరుగుబాటు చేసిన బ‌ద్ద‌న్న బాద‌మ్మ‌లు బ‌ల‌మ‌న్మ‌ర‌ణ‌ము పాలు కావ‌ల‌సి వ‌చ్చిన‌ది. తిరుగుబాటు దారుల‌కీ విష‌య‌మొక హెచ్చ‌రిక !