69
 

నీల‌

 

నీల పెండ్లి య‌న్న న‌వ‌ల‌లో నీల య‌ను యువ‌తి యొక్క వివాహ స‌మ‌స్య చ‌ర్చింప‌బ‌డిన‌ది. నీ వివాహము ధ‌నాభావ‌ము చేత జ‌రుగ‌లేద‌నిపించును. కాని ఆమె మేన‌కోడండ్రిద్ద‌రు కులాంత‌ర వివాహ‌ములు చేసికొనుట‌చే నీమె పెళ్ళి కాకుండ నుండిపోవ‌ల‌సి వ‌చ్చిన‌ది. నీల‌, ఉమాప‌తి య‌ను యువ‌కుడు, ఒక‌రినొక‌రు ప్రేమించుకొని కూడ త‌న ప్రేమ‌ను పండించుకొన‌క జీవితాంత‌ము అవివాహితులుగా నుండుట‌కు నిశ్చ‌యించుకొనుట ప్ర‌ధానాంశ‌ము. ఈ అంశ‌ము చుట్టును సాంఘిక ఆర్థిక మ‌త వ్య‌వ‌స్థ‌లు చుట్టుకొని సాలెగూటివ‌లె నొన‌రించిన‌వి.

నీల వివేక‌వ‌తి, సౌమ్యురాలు త‌ర్క‌జ్ఞాన‌ము క‌లది. విద్య‌వ‌ల‌న నామెలో నీ సుగుణ‌ము ల‌న్నియు మ‌రింత‌గ రాణించిన‌వి. నీల‌కు ధ‌న‌ము, సౌంద‌ర్య‌ము రెండును లేవు. ఈ రెండు గుణ‌ములును లేక‌పోవుట‌చే నీల పెండ్లి యొక స‌మ‌స్యయైన‌ది. వివాహ సమ‌స్య నాటికి నేటికి నొకే విధ‌ముగ నిత్య నూత‌న‌మై విరాజిల్లుచున్న‌ది. నీల‌కు మ‌రియొక స‌మ‌స్య త‌ల‌యెత్తిన‌ది. ఆమె య‌న్న గారి కూతుండ్రిద్ద‌రు చేసికొనిన కులాంత‌ర మ‌తాంత‌ర వివాహ‌ములు ఆమె నా జ‌న్మాంత‌ము క‌న్య‌గ నుంచుట‌కు దోహ‌ద‌ప‌ర‌చిన‌వి.

నీల యొక్క జ్యేష్ఠ సోద‌రుడు సుధాక‌రరావు నాస్థిక మ‌త‌మును ప్రోత్స‌హించుట‌కు కార‌ణ జ‌న్మ‌మెత్తిన‌వాడు. త‌ర‌త‌ర‌ముల నుండి వ‌చ్చు సంప్ర‌దాయ‌ముల‌ను శాస్త్ర పురాణాదుల‌ను హేతువాద‌ముల‌తో గ‌ర్హించి సాధ్య‌మైనంత జ‌న‌సంఖ్య‌ను త‌న మ‌తాభిమానులుగ జేయుట‌యే నీత‌ని ప‌ర‌మ ధ్యేయ‌ము. రెండ‌వ సోద‌రుడు పెద్ద‌సోద‌రుని మ‌తభావ‌ముల‌క‌నుకూల‌మైన‌వాడే కాని ప‌ర‌మ ఛాంద‌సులైన త‌ల్లిదండ్రులున్నంత‌వ‌ర‌కు సంప్ర‌దాయ‌పు గిరినుండి బ‌య‌ట‌కు వచ్చుట‌కు సిద్ధ‌ప‌డ‌డు.

ఇక నీల య‌న్న‌గార్ల‌కు త‌గిన‌దికాదు. ఆమె భావ‌న‌యు మ‌న‌సును సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన చ‌రించునుగాని అంగుళ‌ము మేర‌యైన వ్య‌తిక్ర‌మించుట‌కు సంసిధ్ధ కాదు. వెంక‌ట రామ శాస్త్రియ‌ను పండితుని యుప‌న్యాస‌ముల వ‌ల‌న త‌న యూహ‌ల‌ను మ‌రింత ధృఢ‌త‌ర‌ముల‌నుచేసికొన్న‌ది. ఉమాప‌తియ‌ను యువ‌కుని చేత‌గ‌ణిత‌ము చెప్పించు కొని మేథ‌స్సును వృద్ధిపొందించుకొన్న‌ది. నీల‌కు తానున్న దెట్టి ప‌రిస్థితుల‌లోన‌స్థితిగ‌తులెట్టివియో తెలియును. గాలిలో మేడ‌లు గ‌ట్టుటగాని, యంద‌ని వాని కర్ర‌లు జాచుట‌గాని చేయ‌దు. నీల సెల‌వ‌ల‌లో అన్న‌యైన సుధాక‌ర‌రావు యింటికి వెళ్ళిన‌ది. అచ‌టి వారి య‌నాచార‌ముల‌కు మ‌న‌సును క‌ష్ట‌పెట్టుకొనిన‌ది. వారిని మార్చుట త‌న‌క‌శ‌క్య‌మ‌ని భావించిన‌ప్ప‌టికిని వారితో వాదించ‌క మిన్న‌కుండ‌లేక పోయిన‌ది. సుధాక‌ర‌రావు నీల వాద‌నా ప‌టిమ క‌చ్చెరువొంది, ఆమె వంటి తార్కిక శ‌క్తిగ‌ల‌వారు త‌న మ‌త‌మున నున్న‌చో నెంత బాగుగా నుండునోయ‌ని యూహించెను. ఆమెను వాద‌మున నోడించుట కుత్సాహ ప‌డెను గాని య‌త‌నికి సాధ్య‌ప‌డ‌లేదు. అందుచేత నొక క్రైస్త‌వ యువ‌కునిచే నీల‌కు ప్రేమ‌లేఖ వ్రాయించెను. అప్ప‌టి ప‌రిస్థితులా యువ‌కునికే య‌నుకూల‌ములుగాని నీల‌కు కావు. నీల‌యు లేఖ‌ను చూచి మిక్కిలి దుఃఖించిన‌ది. ఎంత‌గానో యోచించిన‌ది. ఎవ‌రికిని చెప్పి ప్ర‌యోజ‌న‌ము లేద‌ని గ్ర‌హించియా వ్రాసిన వానిముందే లేఖ‌ను మంట‌పెట్టి చ‌ర‌చ‌ర న‌డ‌చిపోయిన‌ది. అత‌డు చేయున‌దిలేక వెడలిపోయెను. ఈ విధ‌ముగా నీల చేయుట‌చే నా యూర‌నామెకు మిగుల ధైర్య‌స్థురాల‌ని నీతిమంతురాల‌నియు ఖ్యాతి ల‌భించిన‌ది.

నీల శాంత‌మూర్తి. చిన్న వ‌దిన‌యైన వెంక‌ట‌ల‌క్ష్మి యెన్ని మాట‌ల‌న్న‌ను నోరెత్త‌క త‌న ప‌నిని తాను చూచుగొనుట‌యే గాక త‌న‌కు త‌న త‌ల్లిదండ్రుల‌కు కూడా నామెయే గ‌తియ‌ని యెరిగి జాగ‌రూక‌త‌తో మ‌స‌లెడిది. ఈమెకు కీలెరిగి వాత పెట్టుట య‌న్న విద్య బాగుగ తెలియును. ఈ విద్య నీమె ముమ్మారు ప్ర‌యోగించిన‌ది. మొద‌ట‌నొక క్రైస్త‌వ యువ‌కుడు ప్రేమలేఖ వ్రాసిన తావున‌, అతినిని గురించి తెలుగు పండితునితో చెప్పెద‌న‌ని బెద‌రించిన‌ది. ఆ బెద‌రింపు అత‌డు ప్రేమ‌లేఖ వ్రాసినందుకు గాక విద్యార్ధినుల విశ్రాంతి గ‌దిలోనికి వ‌చ్చి త‌న పుస్త‌క‌ముల‌ను త‌న యంగీకార‌ము లేకుండా తెర‌చి చూచుట‌యన్న దోష‌ము జేసినందుల‌కు ! ఆ యువ‌కుడు బెద‌రిపోయెను. విద్యార్ధినుల గ‌దిలోని క‌త‌డు వ‌చ్చుట ప్ర‌త్య‌క్ష‌ముగ‌దోచు దోష‌ము. కాగా నా యాంధ్రా పండితుడు న్యాయ‌మున‌కై పోరాడి దోషిని శిక్షింప నెంచు ధ‌ర్మ ప‌రుడు. ఇట్టి వివేక‌ము నీ తావున నీల ప్ర‌ద‌ర్శించిన‌ది.

రెండ‌వ ప‌ర్యాయ‌ము నీల సుధాక‌ర‌రావు క‌డ‌కు బంట‌రిగ ప్ర‌యాణ‌ము చేయ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది. చిన్న‌న్న‌యైన నాగేశ్వ‌రావామెను ప‌రిచ‌య‌స్థుడైన నొక తోటి ప్ర‌యాణీకున క‌ప్ప‌జెప్పి పోయెను. అర్థ‌రాత్రి స‌మ‌య‌మున రైలు మార‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది. అప్పుడాత‌డామె న‌నేక ర‌క‌ములుగ వేధించెను. చ‌మ‌త్కార‌ముగా నామె చేతివ్రేళ్ళు ప‌ట్టుకొని లాగును, ఆమె చెంప‌మీద చిన్న చిన్న దెబ్బ‌లు కొట్టును. ఆమె త‌ల నిమురును. ఇట్లత‌డు చేయు స‌మ‌య‌మున నామె నిర్విణ్ణురాలై చేయున‌ది లేక యూరుకొన్న‌ది. దూర‌ప్ర‌యాణ‌ము. అంధ‌కార‌ము. తెలిసిన‌వారులేరు. అప్ప‌టి ప‌రిస్థితుల న‌న్నిటిని చూచుచు మిన్న‌కున్న‌ది.కాని కొన్ని మాస‌ములు అన్న‌గారి యింటివ‌ద్ద గ‌డిపి కొంత నాగ‌రిక‌త కొంత మాన‌వ మ‌న‌స్త‌త్వ‌ము గ్ర‌హించుకొన్న‌దైన త‌రువాత తిరుగు ప్ర‌యాణ‌ము చేయుచున్న‌ప్పుడా పురుషుడే మ‌ర‌ల త‌ట‌స్థించెను. అత‌డు నీల‌ను తాను కూర్చొనిన పెట్టెలో కూర్చుండమ‌నెను. నీల య‌త‌నికి సంతాన మెంత‌మందియ‌ని ప్ర‌శ్నించి త‌న యీడుగ‌ల కుమార్తె క‌ల‌ద‌ని విని ఆ కుమార్తెకు కట్న‌మీయ‌న‌వ‌స‌ర‌ము లేక సుల‌భముగ పెండ్లియ‌గున‌ట్లుపాయ‌ము చెప్పిన‌ది. నావ‌లెనే దీర్ఘ‌ప్రయాణ‌ము మీద బంపించుడు. మీవంటివాడెవ‌డో క‌నిపించును. వాడామె వెంట‌దారాడును. వానికి నీ యీడు కూతురున్న‌ను స‌రే వాడు నిన్ను గోరిన‌చో పెండ్లియాడెద‌వా య‌ని య‌డిగె పెండ్లి చేసికొనిర‌మ్ము అని త‌న కూతురికి స‌ల‌హా యిమ్మ‌ని నీల య‌త‌నితో చెప్ప‌న‌ది. అత‌డు మెత్త‌ని చెప్పుదెబ్బ‌తిన్న వానివ‌లె మాటాడ‌కుండ నిష్క్ర‌మించెను.

నీల ప‌ల్లెలో పెరిగినందున అన్న కుటుంబములోని ప‌ట్న‌వాస‌పు పోక‌డ‌ల కామె త‌ట్టుకొన‌లేక‌పోయిన‌ది. వారి బ‌ల్ల భోజ‌న‌ములు కాఫీలు అంటు సొంటులేని య‌థేచ్ఛావిధాన‌ము నామె భ‌రింప‌లేక‌పోయిన‌ది. వివిధ కుల‌ముల వారు భోజ‌న‌ము చేయ‌గా మిగిలిన తినుట‌కామె మ‌న‌స్సొప్పెడిదికాదు. నాస్తికుడైన సుధాక‌ర‌రావుతో వాద‌న‌చేసి వానిని నోరెత్త‌కుండ చేయ‌గ‌ల్గిన‌ది. మేన‌కోడ‌లైన ఝాన్సీ నాథ‌ను అను క్రైస్త‌వ యువ‌కునితో స్నేహ‌ము చేయుచుండ‌గా త‌ల్లిదండ్రులు మంద‌లించ‌రు. స్త్రీ పురుషుల‌లో వ‌య‌సు వ‌చ్చిన త‌రువాత స్నేహ‌ము కామ‌ములోనికి దింపున‌ని అన్న‌కు బోదించిన‌ది. స్త్రీ పురుష సంబంధ‌ము నంద‌లి కామ‌మంకురించుటకు జ్ఞాన‌మక్క‌ర‌లేదు. వారు జ్ఞాన‌ము కల్గిన‌పుడు కాని కామ‌మును నియ‌మించ‌లేదు. జ్ఞాన‌ము క‌లుగుక‌మున్నే కామ‌ము మేల్కొనుచున్న‌ది. అందుచేత త‌ల్లిదండ్రులు త‌మ బిడ్డ‌ల యొక్క కామోద‌య‌వేళ‌ను ర‌క్షింప‌వ‌ల‌యును అని వ‌య‌సులోనున్న బిడ్డ‌ల‌ను పెడ‌దారులు త్రొక్క‌కుండ నుండ‌వ‌ల‌సిన బాధ్య‌త‌ను అన్న‌గారికి బోధించిన‌ది. ఇట్లు ప‌లుకుట ప‌దునారేండ్ల ముగ్థ బాలిక‌కు త‌గిన‌ట్లుగ‌లేదు. కాని ఇట్లు తెగించి ప‌లుకుట‌కు గ‌ల కార‌ణ‌మంత‌యు విశ్వ‌నాథ‌వారు నీల‌కు సిధ్ధ‌ప‌ర‌చియుండిరి. సుధాక‌ర రావు యొక్క నాస్తిక సిద్ధాంత ప్ర‌భంజ‌న‌ములో వారి కుటుంబ‌ము కొట్టుకొని పోవుచేత ఝాన్సీ యొక్క ప్ర‌వ‌ర్త‌న‌ము నీల‌లో నావేశ‌ము ర‌గిల్చిన‌ది. యుక్తి యుక్త‌ముగా మాట్లాడ‌గ‌ల యామె వివేక‌మునకు వెంక‌ట‌రామశాస్త్రి గారి భాష్య ప్ర‌వ‌చ‌న‌ములు నిక‌షోప‌ల‌మైన‌వి. ఇట్టి ప‌రిస్థితిలో నీల వ‌య‌స్సున‌కు మించి మాట‌లాడుట యుక్త‌ముగాక పోయిన‌ను పాత్ర‌పోష‌ణ‌మున‌కు లోటు వాటిల్ల‌దు. ఏమే ఝాన్నీ ! ఆనాథ‌న‌న్న‌వాడు నిన్ను గౌర‌వించుకొనెనా లేదా ?  య‌నియు నిన్ను ముద్దు పెట్టుకొనెనా లేదా అనియు నిగ్గ‌తీయుట‌లో నెంత సిగ్గులేని త‌న‌ము వ్య‌క్త‌మైన‌ను, అన్న‌గారి కుటుంబ‌ము దిగ‌జార‌కుండా ప‌ట్టుకొన‌వ‌లెనన్న యార్తి యావేశ‌ము ద్యోత‌క మ‌గుచున్న‌వి. నీల వంటి సుశీల‌లో ప్రేమాను రాగ‌ములు అప్యాయానుబంధ‌ములు నిచ్చోట సువ్య‌క్త‌ములైన‌వి.

సుధాక‌ర‌రావుతో నీల చేసిన వాద‌మెల్ల వెంక‌ట‌రామ శాస్త్రిగారి ప్ర‌వ‌చ‌న‌ముల ప్ర‌భావ‌మే. ఈమె వాద‌న‌ల క‌త‌డు ప్ర‌త్యుత్త‌ర‌మీయ‌లేకుండుట చూచి ఆమె వ‌దిన యంత‌రంగ‌ములో గుప్త‌ముగా నున్న యాస్తిక‌త పెల్లుబికి వ‌చ్చుట మొద‌లు పెట్టిన‌ది. నీల వాద‌న‌ల వ‌ల‌న తాను కోల్పోయిన మ‌తము యొక్క విలువ‌లు నాంచారున‌కు బాగుగ గ్ర‌హింపైన‌ది. పిల్ల‌ల‌నైన బాగుచేసికొన‌వ‌లె న‌న్న ప‌ట్టుద‌ల యామెలో పెరిగిన‌ది. నీల నాంచారులో నున్న నాస్తిక‌వాద వ్య‌తిరేక భావ‌మును జాగృతిమొన‌ర్చిన‌ది.

నీల త‌న‌కు గ‌ణిత‌ము చెప్పిన ఉమాప‌తి య‌న్న యువకుని గూర్చి యోచించిన‌ది. అత‌డు త‌న‌క‌నేక విధ‌ముల సాయ‌ప‌డెను. నిత్య‌ము రెండు గంట‌లు త‌న స‌మ‌క్ష‌మున నుండెడివాడు. అత‌డు త‌న‌ను ప్రేమించుట లేదుగ‌దా య‌న్న య‌నుమాన‌ము నీల‌లో క‌లిగిన‌ది. తాన‌త‌నిని ప్రేమించుట లేద‌నుకొన్న‌ది. కానీ నీల హృద‌య‌మున ఉమాప‌తి కొక సుస్థాన‌మున్న‌ది. సత్పురుషుడైన ఉమాప‌తి ఆమె మ‌న‌సులో చోటు చేసికొనుట య‌న్న‌ది ఆమెకే తెలియ‌ని ర‌హ‌స్య‌ము త‌న క‌త‌ని యందు గోరిక గ‌ల‌దా ?  ఉన్న‌దో లేదో ?  అత‌నికి ద‌న‌యందు గోరిక లేద‌ని యెట్లు చెప్ప‌వ‌ల‌యును ?  కోరిక వెల‌యించుట‌కు న‌ది సాఫ‌ల్య‌మ‌గుట‌కు బ‌రిస్థితులు లేవు. అని నీల  ఆత్మ ప‌రీక్ష చేసికొన్న‌ది. ఇరువురి హృద‌య‌ములోన‌ను ఉన్న‌దో లేదో య‌న్న‌ట్లు అంకుర ప్రాయ‌ముగ ప‌ర‌స్ప‌రాభిమాన‌మున్న‌ద‌ని తేలిన‌ది. ఈ కార‌ణ‌ము చేత‌నే త‌న‌ను చూచుట‌కు వచ్చిన పెండ్లి కుమారుల‌ను నిర్ల‌ప్త భావ‌ముతో గ‌మ‌నించెడిది. నీల అన్న నాగేశ్వ‌ర‌రావు నీల‌లో గ‌ల యీ నిరుత్సాహ‌మును ప‌సి గ‌ట్టియు నూర‌కుండెను. పెండ్లి కుమారుల‌ను త‌న వాగ్వైభ‌వ‌ముతో న‌డ‌లు కొట్టించి వారిని ప‌లాయానాయ‌త్త చిత్తుల‌ను గావించెడిది. ఆమె యంత‌రంగ‌మున ఉమాప‌తి యుండుట‌చేత‌నే య‌ట్లు చేసెడిది.

ఉమాప‌తికి నీల‌య‌న్న గాఢానురాగ‌మున్న‌ది. సంసార‌భారముచేత దాని న‌త‌డు ర‌హ‌స్య‌ముగ నుంచి ఉన్న‌త విద్య‌ల నెప‌మున ప‌ట్న‌మున క‌రిగినాడు. దూర‌మున నుండ‌గా నీల‌ను మ‌ర‌చుట‌కు వీలగున‌ని భావించెనేకాని య‌త‌ని కామెపైగ‌ల ప్రేమ విస్ప‌ష్ట‌మై దృఢ రూప‌మును దాల్చెను. త‌ల్లి యొక‌నాడు నీల‌ను జొగ‌డుచున్న స‌మ‌య‌మున పెండ్లియాడ‌వ‌లెన‌న్న నీల‌వంటి క‌న్య‌నే పెండ్లియాడ‌వ‌లెన‌ని ప‌లికినాడు, ఉమాప‌తి త‌ల్లికూమారుని మ‌దిలోని భావ‌మున‌త‌ని క‌న్న‌ముందు గ్ర‌హించిన‌ది. కుమారుడామెను పెండ్లియాడ‌కుండ చూడ‌వ‌లెన‌ను కొనిన‌ది. ఆమెకు కుమారుని సుఖ‌సంతోష‌ముల క‌న్న కుల‌మున‌కు చెడుపేరు రాకుండ చూచుకొనుట ముఖ్య‌ము. నీల అన్న కుమార్తెలు ఒక‌రు హ‌రిజ‌నుని, ఒక‌రు శూద్రుని పెండ్లియాడిరి. ఉమాప‌తి నీల‌ను పెండ్లియాడిన‌చో మేన‌త్త‌యైన నీల‌ను చూచుటకు మేన‌కోడ‌ళ్ళు వ‌చ్చిన‌చో వెంట‌వారి భ‌ర్త‌లు గూడా వచ్చెద‌రు. త‌న యాచార‌ము భ్ర‌ష్ట‌మ‌గును అని ఉమాప‌తి త‌ల్లి యోచించిన‌ది. ఉమాప‌తి నీల‌ను పెండ్లి యాడ‌కుండ న‌త‌నితో వాగ్థాన‌ము చేయించుకొన్న‌ది. అత‌డు కూడ త‌ల్లి చేత త‌న‌నింకొర్తెను పెండ్లి యాడుమ‌ని బ‌ల‌వంత పెట్ట‌రాద‌ని ప్ర‌తివాగ్ధాన‌మును చేయించుకొనెను. ఈ వాగ్ధాన‌ముల వ‌ల‌న ఉమాప‌తి బ్ర‌హ్మ‌చారిగ నుండుట‌కు నిశ్చ‌యించుకొనెను.

కాల‌మిట్లు గ‌డ‌చి పోవుచున్న‌ది. నీల యుద్యోగ‌ము చేసికొనుచున్న‌ది. ఉమాప‌తి క‌నిపించిన‌పుడ‌త‌నికి న‌మ‌స్కార‌ము చేయును. ఒక విధ‌మైన సిగ్గామెకు తెలియ‌కుండ నామె మోము నాక్ర‌మించును ఆమె క‌నుల‌లో నెచ‌ట‌నో దూర‌ముగా నొక కొర్కె క‌నిపించును. ఆ కోర్కె యూమాప‌తి క‌నుల‌లో బ‌య‌టి కుబ‌కి క‌నుపించుచుండును. ఇట్లే యిరువురి ప్రేమ‌వ్యాఖ్యాన‌ములూ మేన హృద‌య‌ముక‌లే గ్రాహ్య‌ములు. వాచ్య‌ముగ వెల్ల‌డించు కొనిన‌దిలేదు. వీరిద్ద‌రి దొక వ్రాయ‌బ‌డిన ప్రేమ‌గీతి ఆల‌పించ‌ని మ‌ధుర రాగ‌ము. కాని చివ‌రికి మేఘ‌ము వ‌ర్షించిన‌ది. ఉత్కంఠ య‌పు కొన‌లేని యుమాప‌తి యొక నిశీధ స‌మ‌య‌మున నాట‌క‌ము చూచి వెంట న‌డ‌చుచు వ‌చ్చుచున్న నీల చెంత కన్నీరు పెట్టుకొనెను. మ‌ధ్య మ‌ధ్య చిన్న స‌వ్వ‌డి నీల‌కు వినిపించిన‌ది. ఉమాప‌తి శోకించుట‌చూచి నీల య‌తని చేయి ప‌ట్టుకొనిలాగి కార‌ణ‌మ‌డిగిన‌ది. ఈ చేయిప‌ట్టుకొనుట‌లోన‌నే నీల‌కుమాప‌తిపై గ‌ల గాఢానురాగ‌ము ప్ర‌ద‌ర్శిత‌మైన‌ది. ఉచితానుచిత‌జ్ఞ‌యైన నీల యానిశీథ స‌మ‌య‌మున ప‌ర‌పురుషుడైన ఉమాప‌తి కేలును అసంక‌ల్పితముగ ప‌ట్టుకొనుట‌లో నామె యంత‌రంగ‌ములో సుప్త‌మైన ప్రేమ ఉమాప‌తి దుఃఖ‌మును చూచినంత‌నే కార‌ణ మ‌ర‌య వ‌ల‌యున‌నియు ఓదార్చ‌వ‌లెన‌నియు భావించిన‌ది కావున‌నే నామె ప్రేమ బ‌హిర్గ‌త‌మైన‌ది. నీల పెండ్లియ‌న్న న‌వ‌ల‌కిదియే ప‌రాకాష్ట‌స్థితి య‌న‌ద‌గు సంఘ‌ట‌న‌. ఉమాప‌తి తానొక స్త్రీని ప్రేమించిత‌న‌నియు కాని త‌ల్లికా క‌న్య‌ను వివాహ మాడ‌న‌ని వాగ్థాన‌ము చేసినందువ‌ల‌న జీవితాంత మ‌ట్లే యుందున‌నియు చెప్పెను. నీల వివేక‌ముతో నా స్త్రీ యెవ్వ‌రో గ్ర‌హించుకొనిన‌ది.

నీల యాయూర‌నున్న కాళీకాదేవాల‌య‌మున‌కు త‌నను ఉమాప‌తిని ర‌క్షింపుమ‌ని కోరిన‌ది. జీవితాంత‌ము క‌న్య‌గ నుండున‌ట్లు క‌టాక్షింపుమ‌ని వేడిన‌ది.

ఉమాప‌తి నీల‌ల ప్రేమ కావ్య‌మైన ఈ న‌వ‌ల‌లో నాయ‌కానాయ‌కుల ప్రేమ‌రాగ‌మును ర‌చ‌యిత బ‌హిర్గ‌త‌ముగ గాన‌ము చేయ‌లేదు. వారి ప్రేమ‌య‌న్న కేంద్ర బిందువు చుట్టును, సంఘ‌ము, మ‌త‌ము, ఆచార వ్య‌వ‌హార‌ములు నాస్థిక వాద‌ములు న‌ను పొర‌ల‌చే న‌ల్లివేయ‌బ‌డిన‌ది. ఒక‌రిని విడిచి ఒక‌రు మ‌రి వేరొక‌రిని పెండ్లియాడ‌మ‌న్న భీష్మ‌ప్ర‌తిజ్ఞ‌లు చేసికొనునంత గాఢ‌మైన ప్రేమ వారి న‌డుమ‌నున్న‌ప్ప‌టికిని ఒక క్రీగంటి చూపుగాని వాంఛ‌పూరిత దృక్కులుగాని ప‌ర‌స్ప‌ర హాస్యోక్తులుగాని లేని వీరి ప్రేమ‌, మౌన‌గీత య‌ని య‌న‌వ‌లెను. ఇంత‌టి ప్రేమ‌యు విఫ‌ల‌మ‌గుట‌కు కార‌ణ‌ము సుధాక‌ర‌రావు కుమార్తెల కులాంత‌ర వివాహ‌ములు. కులాంత‌ర వివాహ‌ము వ‌ల‌న క‌లుగు లాభ‌న‌ష్ట‌ము లావ్య‌క్తుల‌కేగాక స‌మీప బంధువుల‌కు కూడ సంబంధించున‌న్న మేలిక భావ‌మీ న‌వ‌ల‌లో నీల పెండ్లికాని పిల్ల‌గ నుండి పోవ‌ల‌సి వ‌చ్చుట‌లో వ్య‌క్త‌మైన‌ది.