నాల్గవ ప్రకరణము
యుద్ధవైశారద్యము
యుద్ధవైశారద్యము వలన రాజ్యములను విస్తరింపజేయుటయే గాక ప్రాణరక్షణమునకు కూడ నుపయోగపడునని మిహిరకులుడు లోని కళ్యాణవతి నిరూపించినది. రాజున రక్షించుటకు తవైశారద్యమును చూపిన సంజీవకరణి లోని దిల్హా, తిరుగుబాటున కుపయోగిపరచిన ఇదే నవలలోని కల్హారమాలిక ఇట విశ్లేషింపబడిరి.
వంచన
సాగిస్త్రీయైన వేదమరీచిని వంచించిన దూమరేఖలోని వంక జాబిల్లి పాత్ర చిత్రణ వైవిధ్యమిచట నిరూపించపబడినది. ప్రజలనేగాక తనను తాను వచించుకొని జీవితమును దుఃఖప్రాయము చేసికొనిన వసుంధర పాత్ర ఈ శీర్షికలో విశ్లేషింపబడినది.
రాజనీతి
అమృతవల్లి నవలలోని అమృతవల్లి తాను ప్రేమించిన వాసుదేవునకుతన చాతుర్యముతో రాజ్యమిప్పించినది. మహేశ్వరి రాజ్యమరాజకము గాకుండనట్లుగా ధూమమున తన రాజనీతిని చూపినది.
కళ్యాణవతి
విశ్వనాథవారి నవలలో పెక్కుమంది మహిళలు యుద్ధ విద్యయందు నిపుణురాండ్రై యుండిరి. వీరిలో కళ్యాణవతి తన యుద్ధ విద్యానైపుణ్యముతో రాజనీతితో అనేకమంది స్త్రీల ప్రాణములను రక్షించినది. వారి ప్రాణములు కాపాడుతరిని తన ప్రాణమును తృణప్రాయముగా నెంచినది. స్వార్థరాహిత్యములో నీమెకు పెద్ద పీట వేయవలెను. మిహిరకులుడు అను నవలలో మిహిరకులుని భార్య కళ్యాణవతి, గాంధారి రాజకుమారి వివేకముకలది సౌందర్యవతి ధీరురాలు. మిహిరకులుడను రాజకుమారుని శౌర్యగాధలను విని అతనిని ప్రేమించుట మొదలిడినది. తాను స్వయముగ వీరనారియగుటయెగాక శౌర్యవంతుని ప్రేమించుటకీమె హృదయకవాటములు తెరిచికొనియుండెనన్న నీమె హృదయమెంత శౌర్యభావ పరిపోషితమో తెలియుచున్నది. ఈమెలోని శౌర్యము దయాదాక్షిణ్యములతో కూడియుండుటతో నీమె ధైర్యము మరింత శోభాయమానమగుటయే గాక యుద్ధ విద్యను రాజ్యరక్షణము కొరకే గాని శిక్షించుటయన్న నెపముతో పౌరులను చంపుకొనుటకు కాదని తెలియజేయుచున్నది.
మిహిరకులుడు తన శౌర్యమును హింసాత్మక వ్యాపారముగ మార్చెను. ఇతని క్రూరకర్మలు దండ్రియైన వసుకులునకే హృదయవిదారకములైనవి. వసుకులుడు ప్రాయోపవేశము చేసి ప్రాణత్యాగమును చేసెను. మిహిరకులుడు కాశ్మీరు రాజగుటకు అర్హత లభించినది. కాని, బ్రాహ్మణులు, పండితులు వివాహమాడకుండ పట్టాభిషిక్తుడు కారాదని పట్టుబట్టిరి. అందువలన మిహిరకులుడనేక రాజ్యములపై దండెత్తెను. రాజులనోడించి తనకు నచ్చిన కన్యను పెండ్లియాడ దలంచినాడు. ఎన్ని రాజ్యములను జయించినను తనకు నచ్చిన రాజకుమర్తెలేదు.
అతడు గాంధార రాజ్యముపై దండెత్తను శిబిరములో నుండగా సైనికులొక యువకుని బందించి తెచ్చిరి క్రూర స్వభావుడైన మిహిరకులునకు బంధించి తెచ్చిన యా పురుషుని చూచుటతోడనే మధుర భావము కల్గినది. సైనికులు పంపివైచి యా యువకుని కవచ శిరస్త్రాణములను స్వయముగ తొలగించెను. అతడు పురుషుడు కాడనయు స్త్రీయనియు తెలిసికొనెను. అంతటితో నతనిలోనున్న మృధుభావము మధుర భావముమైనది.
మిహిరకులని పలు ప్రశ్నలకు కళ్యాణవతి ధైర్యముగ సమాధానములను చెప్పినది. తాను వరుని కోసమట్లు వచ్చితినన్నది. మిహరకులుడు నవ్వుచు వరులకోసమట్లువత్తురా యనెను. ఆమె వధువులకొరకు మాత్రమట్లు వత్తురాయని ప్రతి ప్రశ్న వైచినది. అతడు వధువుకొరకెన్నియో రాజ్యములపై దండెత్తి జన నష్టము చేసిన దానినామె యెత్తి చూపినది. ఇట్లతని నెదరించి పలికి బ్రతికినజీవిని మిహీరకులుడెరుగడు. వానికి ప్రాణహరణమొక కేళి. ఆమె బ్రతికి బయటపడుట కాతని మధుర భావమే గాక మరియొక కారణము కూడ నున్నది. అతడొక మంత్రమును జపించును.
అతనికి యముడు భేతాళుడు మిధ్యా ప్రజ్ఞుడను పురుషుడును కలలోనికి వత్తరు. విశ్వనాథవారి నవలలో పలు పాత్రలు కలల కనుగుణముగ నడచుట పరిపాటి. అట్టి సన్నివేశములు వారి విశ్వాసమునకు ప్రబల నిదర్శనాలు. కళ్యాణవతి కూడా తాను కన్నకలనాధారముగ చేసుకొని మిహీరకులుని శిబిరమునకు వచ్చినది.
మిధ్యా ప్రజ్ఞుడన్న మిహీరకులుని గురువు కళ్యాణవతి స్వప్నమున కానుపించి యామెను మిహిరకులుని కడకు వెళ్ళుమనెను. కళ్యాణవతి స్వప్న వృత్తాంతమును విన్న మిహీరకులుడు ఆనంద భరితుడయ్యెను. తన మనసునకు నచ్చిన కన్య గురువుచేత కూడా నంగీకృతయని తెలిసికొనెను.
కళ్యాణవతి మిహిరకులుల వివాహము జరిగినది. ఆమెకు కాలము గడచినకొలది భర్త యలవాట్లను స్వభావమును తెలియజొచ్చినవి. నిష్కంటకుడన్న రాజభక్తి పరాయణుని మహాబలవంతుని విశ్వాస్యుని మిహిరకులుడతి దారుణముగ జంపించెనన్న విన్న కళ్యాణవతి మిక్కిలి వగచినది. భర్త స్వభావమామెకు భయంకరముగ దోచినది. బాల్యమునుండి భక్తి విశ్వాసములతో సేవించు నిష్కంటకుని వధింపగలిగిన యతని క్రూరస్వభావము తనను మాత్రము విడిచి పుచ్చునాయని శంకించినది.
మిహిరకులుడు సభలో కొలువు తీర్చియుండగా కళ్యాణవతి పురుషవేషమున కవచధారియై వెళ్ళినది. ఆమె యొక్క పురుషవేషము రాజునకు పరిచితమే. అతడామెను గుర్తించి పరాభవముచేసి పంపవలెనని భావించెను. భార్యను కూడ శిక్షింపదలచిన యతని క్రౌర్యమెంతయో వెల్లడియగుచుండెను. కాగా అతడు శిక్షించుట యన్నచో జీవిగాలిలో కలియుటయే గాని యంతకు తక్కువ శిక్ష యుండదు. భార్యపైగల ప్రేమ యీ మాత్రమపు శిక్షకే యొప్పుకొన్నది. అతడు క్రుద్ధుడై ఆమె వంకకు చూసెను. ఆమె చలింపలేదు. రాజు కొంత సేపటికి తేరుకొని యేమికావలయునో కోరుకొనుమనెను. రాజుతో కత్తియుద్ధము చేయవలెనన్న కోరిక నామె వెల్లడించినది. రాజు ప్రక్కనున్న నొకడు వృథగా నశించిపోయెదవని మారువేషమున నున్న రాణిని హెచ్చరించెను. కనుమూసి తెలుచునంతో వాని మొండెము శిరము వేరైనవి. కళ్యాణవతి నిశ్చలముగ నుండిపోయినది. ఆమె ధైర్యమునకు రాజు మెప్పుదలతో చూచి కత్తి యుద్ధ మెందుకు చేయదలచితివి, ఉద్యోగముకొరకా, వీరుడనిపించుటకొరకా లేక అధికారము కొరకా యనెను. ప్రభువులనకు ప్రభువులే యన్యాయము చేయదలచుకొనినారు. అది వారించుటకు వచ్చితినని యామె పలికినది. రాజు ఆత్మవంటివాడు. ప్రజలు శరీరమువంటివారు. పరస్పరము వీరిద్దరు రక్షార్చనలచేత నన్యోన్య విరాజితులై యుండవలెను. నేను ప్రజ. ప్రజారూపమును. అని పురుష రూపముననున్న కళ్యాణవతి పలికినది. కళ్యాణవతి తనకును నిష్కంటకునకును, లేదా మరియొక సామాన్య పౌరునకును యభిన్న తను సూచించినది. రాణి తనకుగల బాధ్యతను కన్నతల్లివలె యభిమానమును వ్యక్తపరచినది. కళ్యాణవతి పరాక్రమము నభిమానించును గాన హింసకు సమ్మతింపదు.
నిష్కంటకుడు మచ్చలేని రాజభక్తుడు. అతడు వసుకులుడు రాజుగా నున్నపుడు రాజాజ్ఞను పాటించెను. ఆ పాటించుట కూడ స్వపర భేదములేక పక్షపాత రహితముగ నిర్భయముగ పాటించెను వసుకులుడు ప్రాయోపవేశము చేయుచున్నప్పుడు తన దగ్గర కెవ్వరిని రానీయవద్దని యాజ్ఞాపించెను. ప్రత్యేకముగా మిహీరకులుని చూచుట కతడంగీకరింపక కుమారుని ప్రవేశమును నిషేధించెను. నిష్కంటకుడు పరమ బలశాలి కావున మిహీరకులుని ప్రవేశమితడే యాపగలడని వసుకులుడు భావించెను. మిహీరకులుడా గ్రహము వహించి కత్తిదూయగా నిష్కంటకుడు కేవలమాత్మ రక్షణార్థమై యువరాజు కత్తిని ముక్కలు చేసెను. మిహీరకులుడా కోపమును హృదయుమున పెట్టుకొనెను. వివాహము కొరకు దండయాత్రలు చేయు సమయమున నిష్కంటకుని నగరపాలకుని గావించి వివాహానంతరము వచ్చిన తక్షణముననే యాతనిని వధింపించెను.
కళ్యాణవతికీవధ యంగీకారము కాకపోయినది. వీరుడైన రాజు నిష్కంటకుని నిరాయుధునిచేసి మడియించుట కంటె వీరోచితముగ ద్వంద్వ యుద్ధమున ఖండించి యుండిన మేలుగ నుండెడిదని తలచినది. తన భర్తలో నుండవలసినది ధర్మ వీర లక్షణమునే గాని కసాయితనము నామె యూహీంపలేకపోయినది. మహావీరుడైన నిష్కంటకుని వంటి నమ్మిన బంటు యొక్క ప్రాణములకే విలువలేనప్పుడు అబలయైన తన ప్రాణమునకు మాత్రము విలువ యుండునా యని తలచినది. రాజులు వేయు శిక్షలు నీతి పరిధిలో గాని ధర్మ పరిధిలో గాని లేనప్పుడు ప్రజలు మాన ప్రాణములకు రక్ష యుండదనుకొనినది. తన భర్తను తాను సన్మార్గమున నడుపు స్త్రీవలె గాక మొత్తము రాజ్యమునందలి ప్రజలకు ప్రాతినిధ్యము వహించి తానే ప్రజారూపమునని మిహీరకులుని యెదుట నిలువ గల కళ్యాణవతిని ప్రజారూపమున నున్న ధర్మస్వరూపముగ భావింపవలెను.
కళ్యాణవతి యంతఃపురమునుండి బయటకు వచ్చెనన్న విషయమే మిహీరకులుని చకితునిజేసినది. అంతఃపురమును వీడిన కళ్యాణవతి యవసరము వచ్చినచో మరలపుర ప్రవేశము చేయజాలక పొయినను ఆశ్చర్యము లేదు. మిహీరకులుడు మూర్ఖుడు, ధూర్తుడు, క్రూరుడు, ఆవేశములో కళ్యాణవతి శిరస్సును ఖండించినను ఆశ్చర్య ముండదు. కళ్యాణవతి నిష్కంటకుని ఖండించి నట్లు తన శిరస్సును మాత్రము రాజు ఖండింపడను నిశ్చయమునకు రాలేకపోయినది. ఆ సంగతియే ప్రభువుతో మనవి చేసినది. తాను కూడ నిష్కంటకుని వలెనే ప్రభు భక్తి పరాయణత్వము కలిగి యుంటిననుచు నిట్లనెను. నేను కూడా ప్రభువుల యందట్టి భక్తి భావము కల వ్యక్తినే. నా భక్తి యందుప్పుడే వ్యతిక్రమము కలుగునో నాకు తెలియదు. ఇది రాచబంటి యొక్క ధర్మమని మేము చేయుదుము. ప్రభువులనకు గోపము వచ్చును. మా భక్తి యన్న ఖడ్గము బూని మమ్మేవధింతురు. అట్టి నిష్క్రియమైన చావుకంటే దమరితో యుధ్దము చేసి మరణించుటకు వచ్చితిని రాజునకు ఆమె భావములు కల్లోలములు రేకెత్తించినవి.
కళ్యాణవతికి వివాహమైన కొత్తరోజులవి. రాజు స్వభావమింకనామెకు పూర్తిగా నవగతముకాలేదు. అయినప్పటికిని న్యాయాతిక్రమరణమునామె నహింపలేని స్థితిలో నున్నది. రాజుతో ద్వంద్వ యుద్ధము చేసినచో రాజుకాని తానుగాని మరణించుట తథ్యము. తాను రాజు నోడింప గలదన్న ధైర్యము తనకు గలదు. రాజే తన నొడించినను భార్య వియెగ దుఃఖముచేత రాజు తన శిరస్సును తానే ఖండించుకొనునని కూడ కళ్యాణవతికి తెలియును. మిహీరకులుని కామెపై నెంత ప్రేమయో రాణి గ్రహించినది. కావున యుద్ధముజరిగినచో కాశ్మీరవాసులకు ప్రభువు కరవగునని భావించి మొదట హితోక్తులను పలికినది. రాజునకామె పురుషవేషముతో సభా ప్రవేశము చేయుటయు ధర్మ పన్నములు బోధించుటయు ద్వంద్వ యుద్ధమునకాహ్వానించుటయు నొక హేలగా దోచినది. తన ప్రియ సఖినట్లు చూచుటవలన రాజునకొక మధురానుభూతి కలిగినది. హృదయముననొక విలాసము కలిగినది. జీవితము అతని మొగము నొచుకొనని యొక మందహాస తరంగ మప్రయత్నముగ వెలికి వచ్చినది. ఆ మందహాసమును తిలకించిన అధికారులు ప్రజలును అత్యాశ్చర్యమనుభవించి యా నూత్నపురుషుని మహిమను గూర్చి భావింపదొడగిరి.
|